రిమ్స్‌లో ప్రిస్క్రిప్షన్.. దొరికేది మందుల షాపులో!
- BAGADI NARAYANARAO

- 5 hours ago
- 3 min read
సరఫరా నిలిచిపోవడంతో పెరిగిన ఆర్థిక భారం
మందుల కొరతతో విలవిలలాడుతున్న రిమ్స్
ఫీడ్‌బ్యాక్‌లో అసంతృప్తి.. రోగుల్లో ఆందోళన

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
రిమ్స్‌లో రోగులకు అందుతున్న సేవలపై రోజుకు 20 నుంచి 30 మంది రోగుల నుంచి ప్రభుత్వం ఫీడ్‌బ్యాక్ తీసుకుంటుంది. రోగులంతా మందుల కొరతపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నారు. దీనిపై ప్రభుత్వం రిమ్స్ అధికారుల నుంచి వివరణ కోరుతోంది. అయినా మందుల సరఫరా జరగడం లేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బోధనా ఆసుపత్రులలో సుమారు 500 నుంచి 600 పైగా వివిధ రకాల అత్యవసర, సాధారణ మందులను రోగులకు ఉచితంగా అందించాల్సి ఉంటుంది. ఇందులో యాంటిబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, బీపీ, షుగర్, గ్యాస్ట్రిక్, ఐవి ఫ్లూయిడ్స్ (సెలైన్లు), మత్తు మందులు ప్రధానమైనవి. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్)లో మాత్రం మందుల కొరత ఏడాది కాలం నుంచి వేధిస్తోంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు ఉచితంగా సరఫరా చేసే మందుల వార్షిక బడ్జెట్‌ను రూ.350 కోట్ల నుంచి రూ.150 కోట్లకు తగ్గించింది. గడిచిన కొన్ని త్రైమాసికాలుగా నిధుల విడుదల సకాలంలో జరగకపోవడం వల్లే క్షేత్రస్థాయిలో ఈ మందుల సంక్షోభం ఏర్పడింది. రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్ ఐడీసీ) ద్వారా సెంట్రల్ డ్రగ్ స్టోర్‌కు మందుల సరఫరా జరుగుతుంది. కంపెనీలకు సకాలంలో బకాయిలు చెల్లించకపోవడం, బడ్జెట్ కేటాయింపులలో ఆలస్యం కావడం వల్ల సప్లై చైన్ దెబ్బతిని మందుల కొరత ఏర్పడుతోందని అధికారులు చెబుతున్నారు. ఆసుపత్రి అత్యవసర నిధుల ద్వారా స్థానికంగా మందులు కొనుగోలు చేయడానికి కొన్ని పరిమితులు ఉండటం, లేదా స్థానిక ఏజెన్సీలకు పాత బకాయిలు పేరుకుపోవడం వల్ల వారు కూడా సకాలంలో మందులు అందించలేకపోతున్నారు. దీంతో డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా జరగడం లేదు. రిమ్స్‌కి వచ్చే రోగులకు సాధారణంగా సుమారు 300 నుంచి 500 రకాల అత్యవసర, సాధారణ మందులు అవసరమవుతాయి. నిత్యం రోగులకు అవసరమయ్యే మందుల సరఫరా నిలిచిపోయినా వైద్యులు మాత్రం రోగులకు అవే మందులను సూచిస్తున్నారు. వీటిని తీసుకోవడానికి రిమ్స్‌లోని మెడికల్ స్టోర్‌కి వెళ్తే, వైద్యుడు సూచించిన మందుకు బదులుగా వేరొక మందులను ఫార్మాసిస్టులు ఇస్తున్నారు. దీనిపై వైద్యులకు రోగులు ఫిర్యాదులు చేస్తున్నారు. వైద్యులే ప్రత్యామ్నాయ (ఆల్టర్నేటివ్) మందులు ఇవ్వాలని సిబ్బందికి సూచిస్తున్నారు. లేదంటే రోగులకు చీటీ ఇచ్చి బయట కొనుగోలు చేసుకోవాలని చెప్పి పంపిస్తున్నారు. శస్త్రచికిత్సలు చేయించుకునే రోగులను ప్రైవేట్ మెడికల్ షాపుల నుంచి సర్జికల్ వస్తువులను సొంత ఖర్చులతో కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు.
ప్రైవేట్ మెడికల్ షాపుల్లో..
లైఫ్ సేవింగ్ మెడిసిన్ అయిన యాంటి-స్నేక్ వెనమ్ (పాము కాటు మందు), యాంటి-రేబిస్ వ్యాక్సిన్ (కుక్క కాటు మందు), ఇన్సులిన్ ఇంజెక్షన్లు, అత్యవసర గుండెజబ్బుల మందులు అందుబాటులో ఉండాలి. వీటితో పాటు సాధారణ మందులైన జ్వరం, ఒంటి నొప్పులకు వాడే పారాసిటమాల్, యాంటిబయాటిక్స్, దగ్గు సిరప్‌లు, అలర్జీ నివారణ మందులు, దీర్ఘకాలిక వ్యాధులైన రక్తపోటు (బీపీ), మధుమేహం, కిడ్నీ, కాలేయ సంబంధిత వ్యాధుల నియంత్రణ మాత్రలు, సెలైన్ బాటిళ్లు, అనస్థీషియా మందులు అందుబాటులో ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రీజినల్, జిల్లా కేంద్ర డ్రగ్ స్టోర్లలో సుమారు 298 నుంచి 400 పైగా అవసరమైన మందుల జాబితా నిల్వ ఉండాలి. ప్రస్తుతం సెంట్రల్ డ్రగ్ స్టోర్‌లో కేవలం 40 నుంచి 50 శాతం లోపు రకాల మందులు మాత్రమే నిల్వ ఉంటున్నాయి. రోగులకు ప్రాథమికంగా అవసరమయ్యే పారాసిటమాల్, కొన్ని రకాల ఐవి ఫ్లూయిడ్స్ మినహాయిస్తే, కీలకమైన యాంటిబయాటిక్స్, గైనకాలజీ మందులు, కొన్ని రకాల సిరప్‌లు, ఇంజెక్షన్ల కొరత తరచూ ఏర్పడుతోంది. ఈ సమయాల్లో వైద్యులు రోగులను బయట ప్రైవేట్ మెడికల్ షాపుల్లో కొనుగోలు చేయాల్సిందిగా చీటీలు రాస్తున్నారు.
డిమాండ్ మేరకు సరఫరా లేదు
రాష్ట్రస్థాయిలో ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ టెండర్ల ద్వారా మందులను కొనుగోలు చేసి జిల్లాల్లోని సెంట్రల్ డ్రగ్ స్టోర్లకు పంపుతుంది. స్థానిక రిమ్స్ అధికారులు నేరుగా మందులను కొనుగోలు చేయడానికి వీలుండదు. నేరుగా పెద్ద మొత్తంలో కొనుగోళ్లు చేసే పూర్తి స్వేచ్ఛ లేదా నిధులు వారికి ఉండవు. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రి పరిధిలోని ‘హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ’ నిధులతో స్థానికంగా 10 నుంచి 20 శాతం లోపు మాత్రమే మందులు కొనే వెసులుబాటు ఉంటుంది. కానీ, నిధుల కొరత వల్ల ఆ కొనుగోళ్లు కూడా సక్రమంగా సాగడం లేదు. ఆసుపత్రి వర్గాలు ఆర్డర్ పెట్టిన (ఇండెంట్) పరిమాణం కంటే చాలా తక్కువ పరిమాణంలో మందుల సరఫరా జరుగుతోంది. 10 వేల మాత్రలు అవసరమైతే కేంద్రీయ స్టోర్ నుంచి కేవలం 2 వేలు మాత్రమే వస్తున్నాయి. దీంతో అవి కొన్ని రోజుల్లోనే అయిపోవడం వల్ల, పర్చేజింగ్ చేసినా మందులు లేవనే పరిస్థితి కనిపిస్తుంది.
సర్జికల్ ఐటమ్స్ స్థితి
సిరంజీలు, కాటన్ (దూది), బ్యాండేజ్ క్లాత్స్, గ్లోవ్స్ (చేతి తొడుగులు), క్యాథెటర్లు, కుట్లు వేసే దారాలు వంటి ప్రాథమిక సర్జికల్ వస్తువులకు తరచుగా కొరత ఏర్పడుతోంది. కారణం మందుల మాదిరిగానే సర్జికల్ ఐటమ్స్‌ను కూడా ఏపీఎంఎసఐడీసీ సరఫరా చేయాలి. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లకు ప్రభుత్వం నుంచి బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో వారు సర్జికల్ స్టాక్‌ను నిలిపివేస్తున్నారు. దీనివల్ల ఆపరేషన్లు చేయించుకునే రోగులు కనీస వస్తువులను కూడా బయట నుంచే కొనుగోలు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి వేల కోట్లు కేటాయిస్తున్నట్టు చెబుతున్నా వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రి మందులు, సర్జికల్స్ కోసం ఏడాదికి సుమారు రూ.8కోట్ల నుంచి రూ.12కోట్ల వరకు బడ్జెట్ కేటాయింపులు చేస్తున్నారు. దీనితో పాటు నేషనల్ హెల్త్ మిషన్, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా అదనపు నిధులు అందుతున్నాయి. అయితే, ఈ నిధుల కేటాయింపులు కాగితాలకే పరిమితం అవుతున్నాయి. క్షేత్రస్థాయిలో డ్రగ్ కార్పొరేషన్‌కు సకాలంలో నగదు విడుదల కాకపోవడమే ఈ సంక్షోభానికి మూలకారణం.
సరఫరా నిలిచిపోయిన మందులు
గుండె, రక్తపోటు సంబంధిత (బీపీ) నియంత్రణ కోసం ఉపయోగించే అటెన్లాల్ (50 మి.గ్రా), అమ్లోడిపైన్ (5 మి.గ్రా) మందుల సరఫరా ఏడాది నుంచి నిలిచిపోయింది. గుండె సంబంధిత సమస్యల కోసం ఉపయోగించే ఔషధం క్లోపిడోగ్రెల్ (75 మి.గ్రా) 2 నెలలుగా అందుబాటులో లేదు. చర్మ వ్యాధులు, దద్దుర్లు, కాలిన గాయాలతో వచ్చే రోగుల చర్మ శస్త్రచికిత్స తర్వాత ఉపయోగించే ఔషధం క్లిండామైసిన్ జెల్ 6 నెలలుగా సరఫరా చేయడం లేదు. చర్మ వ్యాధుల చికిత్సకు ఉపయోగించే క్లోబెటాసోల్ 3 నెలలు, బెటామెథాసోన్ రెండు నెలలు, ఫ్యూసిడిక్ యాసిడ్ క్రీమ్ 8 నెలల నుంచి సరఫరా నిలిచిపోయింది. చర్మంపై దురద/దద్దుర్లు (ఎగ్జిమా) చికిత్సకు ఉపయోగించే మందు కాలమైన్ లోషన్, పర్మెత్రిన్ క్రీమ్ 6 నెలలుగా అందుబాటులో లేవు. కాలిన గాయాల చికిత్సకు ఉపయోగించే సిల్వరెక్స్ ఆయింట్‌మెంట్ 6 నెలలుగా సప్లై నిలిచిపోయింది.
మూత్ర, కాలేయ, జీర్ణాశయ సంబంధిత మూత్రనాళ చికిత్సకు ఉపయోగించే నైట్రోఫ్యూరాంటోయిన్ మందును మూడు నెలలుగా రోగులు బయట కొనుగోలు చేసుకుంటున్నారు. నెల రోజుల నుంచి నార్‌ఫ్లాక్సాసిన్ మాత్రలు లేవు. మూత్ర విసర్జన సమస్యల (ప్రోస్టేట్ లేదా మూత్ర ప్రవాహ సమస్యలు) కోసం ఉపయోగించే టామ్సులోసిన్ నెల రోజులుగా అందుబాటులో లేదు. కాలేయ వ్యాధుల చికిత్సకు ఉపయోగించే ఔషధం ఉర్సోడీ ఆక్సీకోలిక్ యాసిడ్ నాలుగు నెలలుగా సరఫరా నిలిచిపోయింది.
నాడీ వ్యవస్థ, మానసిక ఆరోగ్య సంబంధిత మూర్ఛ నియంత్రణ కోసం ఉపయోగించే ఔషధం క్లోబాజామ్ రెండు నెలలుగా సరఫరా చేయడం లేదు. అల్జీమర్స్ వ్యాధి చికిత్సకు ఉపయోగించే డోనెపెజిల్ సుమారు రెండు సంవత్సరాల నుంచి పూర్తిగా సరఫరా నిలిపేశారు. మానసిక ఆందోళన తగ్గించేందుకు ఉపయోగించే క్లోర్డియాజెపాక్సైడ్ రెండు నెలలుగా అందుబాటులో లేదు. హార్మోన్లు, రోగనిరోధక వ్యవస్థ, అలెర్జీ సంబంధిత మందుల్లో ప్రధానమైన, మహిళల్లో రుతుక్రమ సమస్యల చికిత్సకు ఉపయోగించే నోరెథిస్టెరోన్ ఏడాది కాలం నుంచి రోగులకు అందించడం లేదు. అలెర్జీ లక్షణాలను తగ్గించేందుకు ఉపయోగించే సెటిరిజిన్ ఆరు నెలలుగా సరఫరా నిలిచిపోయింది.






Comments