రేవంత్‌కు మద్దెలదరువు!
- DV RAMANA

- Oct 17, 2025
- 2 min read

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి, రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించి దాదాపు రెండేళ్లవుతోంది. అంతర్గత ప్రజాస్వామ్యం పాలు కాస్త ఎక్కువగా ఉండే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ వంటి ఒక యువనేత ఎటువంటి అవాంతరాలు లేకుండా నడపడం పెద్ద విశేషమే. ఎందుకంటే పదవుల పోటీలో సీఎం పీఠాలను కదిలించడం కాంగ్రెస్ పార్టీలో సర్వసాధారణం. ఇటువంటి పరిస్థితులు పెద్దగా లేకపోవడం రేవంత్ అదృష్టమే. మొత్తానికి సాఫీగా సాగిపోతున్న తెలంగాణ కాంగ్రెస్ సర్కారుకు.. ముఖ్యంగా సారధి రేవంత్‌రెడ్డికి ఒకేసారి రెండు దెబ్బలు తగిలాయి. వీటిలో మొదటి దెబ్బ తన కేబినెట్ సహచరురాలి నుంచే తగలడం, సీఎంనే తృణీకరించేలా ఆమె వ్యవహరించడం దుమారం రేపింది. తెలంగాణ దేవదాయ, అటవీ శాఖల మంత్రి కొండా సురేఖకు వివాదాలు కొత్త కాదు. ఇప్పుడూ అటువంటి వివాదానికే ఆమె కేంద్ర బిందువుగా మారారు. ఆమె వద్ద ఓఎస్డీగా ఉన్న సుమంత్ ఒక సిమెంటు ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని మామూళ్ల కోసం తుపాకీతో బెదిరించినట్లు ఫిర్యాదు రావడంతో అతని ఆ పదవి నుంచి తప్పించడంతోపాటు అరెస్టుకు ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే సదరు సుమంత్‌ను మంత్రి సురేఖ తన నివాసంలోనే ఆశ్రయం కల్పించారు. ఆ విషయం తెలుసుకుని అక్కడి వచ్చిన మఫ్టీ పోలీసులను మంత్రి కుమార్తె సుస్మిత అడ్డుకుని బీసీ వర్గానికి చెందిన తన తల్లిపై ముఖ్యమంత్రి కుట్ర పన్ని కక్ష సాధింపులకు దిగుతున్నారని ఆరోపించడం కలకలం రేపింది. ఇదే సమయంలో ఓఎస్డీ సుమంత్‌ను స్వయంగా సురేఖ తన కారులో తీసుకుని బయటకు వెళ్లిపోవడం కాంగ్రెస్‌లో ప్రకంపనలు సృష్టించింది. దాంతో పార్టీ అధిష్టానం తరఫున రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ కొండా సురేఖను పిలిపించుకుని సర్దుబాటు చేసేందుకు ప్రయత్నించారు. ఈ వివాదానికి ఇక్కడితో ఫుల్‌స్టాప్ పెట్టాలని ఆదేశించారు. అయితే తన ఓఎస్డీని తొలగించాలనుకున్నప్పుడు తనకు మాటమాత్రంగానైనా చెప్పకపోవడానికి సురేఖ తప్పుపడుతున్నారు. కానీ ఆ కారణంతో ముఖ్యమంత్రి తనపై కుట్ర చేస్తున్నారని ఆయన కేబినెట్‌లోని మంత్రే ఆరోపించడం చిన్న విషయం కాదు. ఇది అక్కడితో ఆగేదీ కాదు. ఓ మంత్రిపై సీఎం విశ్వాసం కోల్పోయినా.. ఆ మంత్రి సీఎంపై నమ్మకం కోల్పోయినా మంత్రి వర్గంలో ఉండలేరు. ఇప్పుడు అదే జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ పరిణామాలు కాంగ్రెస్‌లో రేవంత్‌రెడ్డిపై అసంతృప్తితో ఉన్నవారిని ఉత్ప్రేరకంలా పని చేసి భవిష్యత్తు ఇబ్బందులు సృష్టించే ప్రమాదం లేకపోలేదు. పార్టీపరంగా రేవంత్‌రెడ్డికి ఈ ఘటనలు ఇరకాటంలోకి నెడితే.. ప్రభుత్వపరంగానూ తొలిసారి ఆయనకు మరో గట్టి దెబ్బ తగిలింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వర్తింపజేసి బీసీ చాంపియన్ అన్న నినాదంతో స్థానిక ఎన్నికలకు వెళ్లి కాంగ్రెస్‌ను విజయపథంలో నడిపించాలనుకున్న రేవంత్ రాజకీయ వ్యూహాన్ని న్యాయస్థానాలు తుత్తునీయలు చేశాయి. రిజర్వేషన్ల వ్యవహారం రాష్ట్ర పరిధిలోని అంశమైతే తమకున్న మెజారిటీ బలంతో అసెంబ్లీలో బిల్లు పాస్ చేయించుకుని జబ్బలు చరుచుకోవచ్చు. కానీ కులప్రాతిపదిన రాజకీయ రిజర్వేషన్లు కల్పించడమన్నది కేంద్రంలో పరిధిలో ఉంది. దీనిపై రాష్ట్ర అసెంబ్లీ బిల్లు పాస్ చేసినా, జీవోలు జారీ చేసినా.. అంతిమంగా పార్లమెంటు ఆమోదం పొందితే తప్ప అవి చట్టరూపం దాల్చే అవకాశం లేదు. పైగా ఈ అంశంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టే గతంలో పరిమితులు విధించింది. పలు కేసుల విచారణ సందర్భంగానూ న్యాయస్థానం దీన్ని ప్రస్తావించింది. ఒక్క తమిళనాడుకు మాత్రమే ఈ విషయంలో మినహాయింపు ఉంది. అయినా పట్టించుకోని రేవంత్ సర్కారు ‘అక్కడ మా రాహుల్ చెప్పారు.. ఇక్కడ మేం అమలు చేస్తాం’ అన్నట్లు దూకుడుగా వ్యవహరించి చివరికి బొక్క బోర్లాపడిరది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రేవంత్ ప్రభుత్వం ఏకపక్షంగా జీవో నెం.9 జారీ చేసేసింది. దీనివల్ల రాష్ట్రంలో మొత్తం రిజరేషన్లు సుప్రీంకోర్టు విధించిన 50 శాతం పరిమితిని దాటేశాయి. ప్రభుత్వ జీవోను పలువురు హైకోర్టు సవాల్ చేయగా.. కోర్టు దాన్ని విచారణకు స్వీకరించింది. తుది తీర్పు వెలువడే వరకు రిజర్వేషన్ల జీవో అమలుపై స్టే కూడా విధించింది. దాంతో బీసీ ఛాంపియన్‌గా స్థానిక ఎన్నికల గోదాలో విజయ విహారం చేసేద్దామనుకున్న రేవంత్ సర్కారు గొంతులో పచ్చి వెలక్కాయ పడిరది. అయినా బింకంగా హైకోర్టు స్టే ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్(ఎస్‌ఎల్‌పీ)కి కూడా తిరస్కారమే ఎదురైంది. తెలంగాణ హైకోర్టు దీనిపై విచారణ జరుపుతున్న తరుణంలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది. జీవోపై హైకోర్టు విధించిన స్టే ఎత్తివేతకు నిరాకరించింది. హైకోర్టు విచారణ ముగిసి, తీర్పు వచ్చే వరకు ఆగాలంటే స్థానిక ఎన్నికలు జాప్యమవుతాయన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనకు స్పందిస్తూ కావాలంటే పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలు జరుపుకోవచ్చని గతంలో హైకోర్టు చేసిన సూచననే సుప్రీంకోర్టు కూడా చేసింది. దాంతో రేవంత్ వ్యూహానికి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టు తుది తీర్పు వచ్చే వరకు ఆగినా రిజర్వేషన్ల పెంపునకు గ్రీన్‌సిగ్నల్ లభించే సూచనలు కనిపించడం లేదు. దాంతో ఇప్పుడు సర్కారు ముందు రెండే మార్గాలు ఉన్నాయి. ఒకటి.. పాత రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలకు వెళ్లడం. రెండు.. ప్రభుత్వపరంగా కాకుండా కేవలం పార్టీపరంగా మాత్రమే టికెట్ల పంపిణీలో బీసీలకు 42 శాతం ఇచ్చి మమ అనిపించుకోవడం. ఈ రెండిరట్లో ఏది చేసినా ప్రతిపక్షాలకు అదో అస్త్రంగా మారి ప్రభుత్వపక్షాన్ని ఇబ్బందిపెట్టక తప్పదు.










Comments