top of page

రాష్ట్రంలో ఎన్‌కౌంటర్ల కలకలం

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Nov 19, 2025
  • 2 min read
  • వరుసగా రెండు రోజుల్లో రెండు ఘటనలు

  • మంగళవారం ఆరుగురు, బుధవారం ఏడుగురు మృతి

  • తాజా ఘటనలో దేవ్‌జీ మరణించినట్లు ప్రచారం

  • కానీ పోలీసుల జాబితాలో కనిపించని ఆ పేరు

  • హిడ్మాను కావాలని చంపలేదన్న ఇంటెలిజెన్స్‌ ఏడీజీపీ

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)

వరుసగా రెండోరోజూ రాష్ట్రంలోని మారేడుమిల్లి అడవుల్లో తుపాకులు గర్జించాయి. మరో ఏడుగురు మావోయిస్టులు మరణించారు. వీరిలో సీపీఐ మావోయిస్టు పార్టీ అగ్రనేతగా చెబుతున్న తిప్పిరి తిరుపతి అలియాస్‌ దేవ్‌జీ, ఇతర నేతలు ఉన్నట్లు సమాచారం. అయితే మృతుల్లో దేవ్‌జీ ఉన్నారా లేరా అన్నది పోలీసులు ధ్రువీకరించలేదు. ఆపరేషన్‌ కగార్‌ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, దండకారణ్యంలో షెల్టర్‌ కోల్పోయిన మావోయిస్టులు సరిహద్దులు దాటి ఆంధ్రప్రదేశ్‌లోకి కొన్ని రోజుల క్రితమే చొరబడ్డారు. నిఘా వర్గాల ద్వారా ఈ సమాచారం తెలుసుకున్న సాయుధ భద్రతా బలగాలు మంగళవారం తెల్లవారుజాము నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోని మారేడుమిల్లి టైగర్‌ జోన్‌ ప్రాంతంలో మావోయిస్టులు తారసపడగా ఇరుపక్షాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు టాప్‌ లీడర్‌ హిడ్మా, ఆయన భారత హేమ అలియాస్‌ రాజె సహా ఆరుగురు మృతిచెందిరు. ఆ వెంటనే విజయవాడ, ఏలూరు, కాకినాడల్లో జరిపిన సోదాల్లో 50 మంది మావోయిస్టులను, పెద్దసంఖ్యలో ఆయుధాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. కాగా వీరిచ్చిన సమాచారం ఆధారంగా బుధవారం ఉదయం కూడా మారేడుమిల్లి అడవిలోని అల్లూరు జిల్లా జీఎంవలస ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహిస్తుండగా మావోయిస్టులు ఎదురయ్యారు. పోలీసులను గమనించిన వారు వెంటనే కాల్పులు జరపడంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ ఘటనలో ఏడుగురు మావోయిస్టులు మరణించారు.

మృతులు వీరే..

ఎన్‌కౌంటర్‌ మృతులను గుర్తించినట్లు పోలీసులు ప్రకటించారు. మృతదేహాలకు రంపచోడవరం ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం బంధువులకు అప్పగిస్తామని పేర్కొన్నారు. వారిచ్చిన వివరాల ప్రకారం.. మావోయిస్టు పార్టీ ఏవోబీ ఇన్‌ఛార్జి మెట్టూరి బాబూరావు అలియాస్‌ టెక్‌ శంకర్‌ అలియాస్‌ శివ, కొన్నాళ్ల క్రితం ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన పార్టీ అగ్రనేత నంబాళ్ల కేశవరావు వద్ద గార్డు కమాండర్‌గా ఉన్న జ్యోతి అలియాస్‌ సరిత, సౌత్‌ జోనల్‌ కమిటీ సభ్యుడు సురేష్‌ అలియాస్‌ రమేష్‌, జాగరకొండ ఏరియా మిలీషియా కమాండర్‌ లోకేష్‌ అలియాస్‌ గణేష్‌, ఏరియా కమిటీ మెంబర్స్‌(ఏసీఎం) శ్రీను అలియాస్‌ వాసు, అనిత అలియాస్‌ షమ్మి మృతి చెందారు. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు టాప్‌ లీడర్‌ తిప్పిరి తిరుపతి అలియాస్‌ దేవ్‌జీ ఉన్నట్లు ఈ ఉదయం నుంచి వార్తలు వచ్చాయి. కానీ పోలీసులు ప్రకటించిన మృతుల జాబితాలో ఆ పేరు లేదు. దేవ్‌జీ మరణించారంటూ వచ్చిన వార్తలను పోలీసువర్గాలు ఖండిస్తున్నాయి.

సమన్వయంతో ఆపరేషన్‌ విజయవంతం

పోలీసులు, ఇంటెలిజెన్స్‌ విభాగాలు సమన్వయంతో పనిచేసి ఏపీలోకి చొరబడిన మావోయిస్టులను నియంత్రించే ప్రత్యేక ఆపరేషన్‌లో విజయవంతం అయ్యామని రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ విభాగం అదనపు డీజీపీ మహేష్‌చంద్ర లడ్డా చెప్పారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండురోజుల నుంచి కొనసాగిస్తున్న ప్రత్యేక ఆపరేషన్‌ గురించి వివరించారు. మంగళవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు, బుధవారంనాటి ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మరణించారని చెప్పారు. అయితే మృతుల్లో ఒకరైన హిడ్మాను పోలీసులే తీసుకెళ్లి కాల్చి చంపారన్న ఆరోపణలను లడ్డా ఖండిరచారు. పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లోనే ఆయన మరణించారని స్పష్టం చేశారు. కాగా మంగళవారం రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లో సోదాలు జరిపి 50 మంది పీఎల్‌జీఏ సభ్యులను అరెస్టు చేశాంమన్నారు. వీరంతా ఛత్తీస్‌గఢ్‌ వాసులేనన్నారు. చత్తీస్‌గఢ్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రావడానికి మావోయిస్టులు ప్రయత్నిస్తున్నట్లు తెలుసుకుని నిఘా విభాగం ద్వారా మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. వారిచ్చిన సమాచారం ఆధారంగా నవంబరు 17న కీలకమైన ఆపరేషన్‌ ప్రారంభించినట్లు చెప్పారు. ఎన్‌కౌంటర్‌ స్థలంలో లభించిన సమాచారంతో ఎన్టీఆర్‌, కృష్ణా, కాకినాడ, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో దాడులు జరిపి 50 మంది మావోయిస్టులను పట్టుకున్నామన్నారు. అరెస్టు అయిన వారిలో మావోయిస్టు పార్టీ కేంద్ర, రాష్ట్ర, ఏరియాల కమిటీ సభ్యులు, ప్లటూన్‌ టీం సభ్యుల ఉన్నారని, రాష్ట్ర చరిత్రలో ఇంతమంది కీలక మావోయిస్టులను పట్టుకోవడం ఇదే ప్రథమమని లడ్డా చెప్పారు. 45 ఆయుధాలు, 272 రౌండ్స్‌, రెండు మ్యాగజైన్‌, 750 గ్రాముల వైర్‌, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న సిబ్బందికి లడ్డా అభినందనలు తెలిపారు. ఇంటెలిజెన్స్‌ విభాగం ఈ విషయంలో బాగా పని చేసిందన్నారు. వారు ముందుగానే సమాచారం ఇవ్వడం వల్ల మావోయిస్టుల కదలికలను గమనించగలిగామని, అన్నీ సెట్‌ చేసుకున్నాక ఒకేసారి వారందరినీ పట్టుకున్నామని లడ్డా అన్నారు. తెలంగాణలో కొంతమంది ఇటీవల సరెండర్‌ అయ్యారు. వాళ్ల ద్వారా సమాచారం వెళితే ఇబ్బందులు ఉంటాయని భావించారు. అందుకే కొన్ని రోజులు షెల్టర్‌ తీసుకునేందుకు ఏపీలో పలు ప్రాంతాలను ఎంచుకున్నారు. మళ్లీ సమయం చూసి తమ ప్రాంతాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారని ఇంటెలిజెన్స్‌ డీజీపీ వివరించారు. కానీ వారి ప్రణాళికలను విజయవంతంగా అడ్డుకున్నామని చెప్పారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page