రాష్ట్రపతికి ‘సుప్రీం’ నిర్దేశంలో తప్పేముంది?
- DV RAMANA

- May 21, 2025
- 2 min read

అత్యున్నత రాజ్యాంగ వ్యవస్థల మధ్య సంఘర్షణ అవాంఛనీయం. ఒకవేళ అలాంటి పరిస్థితే తలెత్తితే దాన్ని నివారించడానికి మిగతా రాజ్యాంగ వ్యవస్థలు కృషి చేయాలి. కానీ దురదృష్టవశాత్తు ప్రస్తుతం అలా జరగడంలేదు. రాజ్యాంగ అనిశ్చితికి కారణమవుతున్న ఒక సుదీర్ఘకాలం వివాదంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు ఇస్తే దాని అమలుకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోకుండా.. దానికి భిన్నంగా వ్యవహరిస్తోంది. గవర్నర్ల పాత్రపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను రాష్ట్రపతి ప్రశ్నించడం కొత్త వివాదానికి తెరలేపింది. అసలు అలా తీర్పు ఇచ్చే అధికారం సర్వోన్నత న్యాయస్థానానికి ఉందో లేదో తేల్చమని సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్నాలుగు ప్రశ్నలు సంధించారు. పేరుకు రాష్ట్రపతి వీటిని సంధించినా ఈ వ్యవహారం మొత్తం కేంద్రం కనుసన్నల్లోనే జరిగిందనేది బహిరంగ రహస్యం. గవర్నర్ల వ్యవహారశైలిని తప్పుపడుతూ గత నెలలో సుప్రీంకోర్టు తీర్పునకు విరుగుడు ఏమిటన్నదానిపై కేంద్రం మంతనాలు ప్రారంభించింది. అటార్నీ జనరల్, సోలిసిటర్ జనరల్, ఇంకా న్యాయశాఖ ప్రతినిధులతో విస్తృత చర్చలు జరిపి చివరికి రాష్ట్రపతి ద్వారానే సుప్రీంకోర్టును ప్రశ్నించాలని నిర్ణయించుకుని, ఆ మేరకు ప్రశ్నావళిని రూపొందించి రాష్ట్రపతి భవన్‌కు అందజేసింది. దానికిముందు ఈ తీర్పుపై సమీక్ష కోరాలా లేక మరింత విస్తృత ధర్మాసనం ద్వారా రివ్యూ కోరాలా అని తర్జనభర్జనలు పడిరది. చివరికి రాజ్యాంగంలోని 143(1) అధికరణం కింద రాష్ట్రపతి పేరిట సలహా కోరడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చింది. ఎందుకంటే రాష్ట్రపతి ఏవైనా సందేహాలు లేవనెత్తితే వాటిపై చర్చించేందుకు ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏర్పాటు చేయటం పరిపాటి. గతంలో ఇలా కోరిన సందర్భాలు ఉన్నాయి. 1960లో సి జాబితాలోని రాష్ట్రాల ప్రతిపత్తిపై కేంద్రం ‘సుప్రీం’ సూచనలు కోరింది. ప్రాదేశిక భూభాగంపై పాకిస్తాన్‌తో ఒప్పందం చేసు కోవచ్చా అంటూ 1951లో, ఎమర్జెన్సీ తర్వాత ఆనాటి అత్యాచార కేసుల విచారణకు ప్రత్యేక న్యాయ స్థానాలు ఏర్పాటు చేయవచ్చునా? అన్న అంటూ 1978లో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు సూచనలు కోరింది. వీటిపై సూచనలు ఇవ్వడం, ఇవ్వకపోవడమన్నది సుప్రీం ఇష్టం. కాకపోతే ప్రస్తుతం రాష్ట్రపతి పంపిన ప్రశ్నావళి రాజ్యాంగ నిబంధనల అనువర్తింపునకే కాకుండా రాజకీయ సంఘర్షణ, రాజ్యాంగ ప్రతిష్టంభనకూ దారితీసే ప్రమాదం ఉంది. తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన పది బిల్లులను ఆమోదించకుండా చాలాకాలంగా తన వద్దే అట్టి పెట్టుకు వివాదంపై సుప్రీంకోర్టు విచారించింది. తన వద్దకు వచ్చే బిల్లులను మూడు నెలల్లోగా ఆమోదం లేదా తిరస్కరణ చేయాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది. రాష్ట్రపతి పరిశీలనకు పంపితే అప్పుడు కూడా మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని నిర్దేశించింది. దాంతో రాష్ట్రపతికి సుప్రీంకోర్టు ఎలా ఆదేశాలిస్తుందని చాలా మంది అభ్యంతరాలు లేవనెత్తారు. ఇప్పుడు రాష్ట్రపతి చేసిన 143(1) ప్రస్తావన కూడా అలాంటి ప్రశ్నలనే లేవనెత్తింది. వాస్తవానికి చాలామంది వాదిస్తున్నట్టు ఇక్కడ సుప్రీంకోర్టు.. రాష్ట్రపతి లేదా గవర్నర్ల నిర్ణయాధికారంపై ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు. తమకు నచ్చిన నిర్ణయం తీసుకోవడానికి కాలవ్యవధి మాత్రమే నిర్దేశించింది. ఇది కూడా ఇందిరాగాంధీ హయాంలో సర్కారియా కమిషన్, వాజ్‌పేయి హయాంలో పూంఛ్ కమిషన్లకు నేతృత్వం వహించిన మాజీ న్యాయమూర్తులు చెప్పిందే. గతంలో రెండుమూడు సందర్భాల్లో అత్యున్నత న్యాయస్థానం ఇంతకంటే సూటిగా రాష్ట్రపతి విధి విధానాలను నిర్దేశించింది. ఎస్‌ఆర్ బొమ్మై కేసులో రాష్ట్ర ప్రభుత్వాల రద్దు, రాష్ట్రపతి పాలన విధింపు విషయంలో జరిగిన ఏకపక్ష పోకడలకు 1994లో సుప్రీంకోర్టు అడ్డుకట్ట వేసింది. మరణ శిక్ష పడిన ఖైదీల క్షమాభిక్ష దరఖాస్తులపై నిర్ణయం తీసుకోవడానికి కూడా గడువును సుప్రీంకోర్టు నిర్దేశించింది. అప్పుడెప్పుడూ లేని అభ్యంతరం ఇప్పుడే ఎందుకొచ్చినట్టు? పైగా సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి ప్రశ్నావళి పంపడానికి ముందే ఉపరాష్ట్రపతి జగదీప్ దన్‌కర్ సుప్రీంకోర్టుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన మాటలు కేంద్రం వైఖరికి ప్రతిధ్వనులేనని ఇప్పుడు అర్థమవుతున్నది. మోడీ హయాంలో అనేక రాష్ట్రాల్లో నియమితులైన గవర్నర్లు అత్యుత్సాహంతో ప్రత్యక్ష రాజకీయ పాత్ర పోషిస్తూ బీజేపీయేతర ప్రభుత్వాలను ముప్పుతిప్పలు పెడుతున్నారు. రాజ్యాంగ వ్యవస్థలైన అసెంబ్లీలు తీర్మానించిన బిల్లులు గవర్నర్ల వద్ద మగ్గిపోతున్నాయి. మరి ఆ రాజ్యాంగ వ్యవస్థల అధికారాన్ని కాపాడాలంటే.. సుప్రీంకోర్టు వంటి వ్యవస్థలు గట్టిగా వ్యవహరించాల్సిందే కదా!










Comments