రాష్ట్రపతి రబ్బర్‌స్టాంప్ కాకూడదు!
- DV RAMANA

- Jul 26, 2025
- 2 min read

ఉప రాష్ట్రపతిగా ఉన్న జగదీప్ ధన్‌ఖడ్ హఠాత్తుగా రాజీనామా చేయడం.. అందుకు దారితీసిన పరిణామాలుగా పేర్కొంటూ విస్తృతంగా ప్రచారంలోకి వచ్చిన వివాదాస్పద అంశాలు అత్యున్నత రాజ్యాంగ వ్యవస్థల పనితీరుపై చర్చకు ఆస్కారమిచ్చాయి. ఉప రాష్ట్రపతి, గవర్నర్ వ్యవస్థలపై ఇంత వరకు నడిచిన చర్చ.. అత్యున్నత రాజ్యాంగ పదవి అయిన రాష్ట్రపతి వ్యవస్థపైకి మళ్లింది. దీనికి మరో సందర్భం కూడా కలిసివచ్చింది. స్వతంత్ర భారతదేశానికి ఇంతవరకు 15 మంది రాష్ట్రపతు లుగా వ్యవహరించారు. వారిలో ఏకంగా పదిమంది సంవత్సరాలు వేరైనా ఒకే నెల, తేదీన.. అంటే జూలై 25న పదవులు చేపట్టడం ఒక అరుదైన విశేషం. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి స్వాతంత్య్రానంతరం బాబూ రాజేంద్రప్రసాద్ మొట్టమొదటిసారి రాష్ట్రపతి పదవి చేపట్టారు. ఆయన తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణన్.. ఆ తర్వాత వరసగా జాకీర్ హుస్సేన్, వరహాగిరి వెంకట(వి.వి.)గిరి, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, నీలం సంజీవరెడ్డి, జ్ఞానీ జైల్‌సింగ్, ఆర్.వెంకట్రామన్, శంకరదయాళ్‌శర్మ, కె.ఆర్.నారాయణన్, అబ్దుల్ కలాం, ప్రతిభా పాటిల్, ప్రణబ్‌ముఖర్జీ, రామనాథ్ కోవింద్ రాష్ట్రపతులుగా పనిచేయగా.. ఆ క్రమంలో ప్రస్తుతం ద్రౌపది ముర్ము ఆ పదవిలో ఉన్నారు. కాగా మధ్యలో బీడీ జెట్టీ, మహమ్మద్ హిదయతుల్లా ఉప రాష్ట్రపతులుగా కొనసాగుతూనే.. రాష్ట్రపతి పదవిని కొన్నాళ్లు తాత్కాలికంగా నిర్వహించారు. వీరిలో ఇద్దరు (ప్రతిభా పాటిల్, ద్రౌపది ముర్ము) మాత్రమే మహిళా రాష్ట్రపతులు. కాగా రాష్ట్రపతి పదవి అనేది దేశంలో అత్యున్నత రాజ్యాంగ పదవి. అందుకే రాష్ట్రపతిని దేశ ప్రథమ పౌరుడిగా గౌరవిస్తాం. అలాగే అది కేవలం పదవి కాదు.. ఒక సమున్నత వ్యవస్థ. అందుకే రాష్ట్రపతి భవన్‌ను రాజ్యాంగ సౌధంగా అభివర్ణిస్తుంటారు. ఇందుకు తగినట్లే రాష్ట్రపతికి విశేష అధికారులు ఉంటాయి. రాజ్యాంగపరంగా దేశ పరిపాలన సాగేంచేది రాష్ట్రపతే. ప్రధాన మంత్రి, ఆయన మంత్రిమండలితో కూడిన జాతీయ(కేంద్రం) ప్రభుత్వం దేశపాలన లో రాష్ట్రపతికి సలహాలిస్తూ, సహకరించే వ్యవస్థగానే రాజ్యాంగంలో పేర్కొన్నారు. కేంద్ర కేబినెట్, పార్ల మెంటు తీసుకునే ప్రతి నిర్ణయం, ప్రతి బిల్లుపై రాష్ట్రపతి ఆమోద ముద్ర పడాల్సిందే. అప్పుడే అవి చట్టరూపం దాలుస్తాయి. అలాగే కేంద్ర ప్రభుత్వం చేసే బిల్లులు, తీసుకునే నిర్ణయాలు దేశానికి, ప్రజలకు నష్టదాయకంగా ఉన్నాయని భావిస్తే.. వాటినే తిరస్కరించే, అవసరమైతే కేంద్ర ప్రభుత్వన్ని రద్దుచేసే విచక్షణాధికారాలను సైతం మన రాజ్యాంగం రాష్రపతికి దఖలుపర్చింది. కానీ ఇంతవరకు పూర్తిస్థాయిలో వాటిని ఏ రాష్ట్రపతి కూడా వినియోగించలేదనే చెప్పాలి. ఆ విచక్షణాధికారాలను విని యోగించే పరిస్థితి రాలేదేమో కదా! అనే అభిప్రాయం కలగవచ్చు. కానీ స్వాతంత్య్ర భారత చరిత్రలో అటువంటి క్లిష్ట పరిస్థితులు కొన్ని వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ అప్పుడు కూడా రాష్ట్రపతు లుగా ఉన్నవారు తగిన రీతిలో స్పందించలేదన్న అపవాదు ఉంది. ఒక్క జైల్‌సింగ్ మాత్రమే ఒక సందర్భంలో తన విచక్షణాధికారాలను ప్రయోగించారు. ఆయన తప్ప మిగతావారు ప్రభుత్వం, ప్రధానులతో విభేదించిన సందర్భాలు లేవు. ప్రధాని, ఆయన కేబినెట్ తీసుకున్న నిర్ణయాలకు మౌనంగా ఆమోదముద్ర వేయడం తప్ప ఏ రాష్ట్రపతీ తనదైన ముద్ర వేయలేదు. ఇదే రాష్ట్రపతి అంటే కేవలం సంతకం చేసి రబ్బర్ స్టాంప్ వేసే వ్యవస్థ, కేవలం హోదా అనుభవంచే పదవి అన్న అభిప్రాయం స్థిరపడిపోయిందనడం అతిశయోక్తి కాదు. ఈ నిష్క్రియాపరత్వమే, కేంద్రాన్ని అడ్డుచెప్ప లేని బలహీనతే అనేక ప్రభుత్వాల హయాంలో లెక్కలేనన్ని అవినీతి కార్యకలాపాలు, కుంభకోణాలు జరిగి దేశ ప్రతిష్టకు, ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం చేకూర్చాయి. అయితే రాష్ట్రపతులందరూ నిజా యితీగానే పనిచేశారు. ప్రభుత్వాన్ని నియంత్రించే బాధ్యతను మాత్రం నిర్వర్తించలేకపోయారు. అయితే ఇందిర కుటుంబానికి విధేయుడిగా పేరొందిన జైల్‌సింగ్ మాత్రం రాజీవ్‌గాంధీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పోస్టల్ బిల్లును తిప్పి పంపి ఆ రోజుల్లో పెద్ద సంచలనమే సృష్టించారు. అలా ఇంకె వరూ చేయలేకపోయారు. ఎమర్జెన్సీకి ముందు, ఎమర్జెన్సీ సమయంలో దేశం తీవ్ర విపత్కర పరి స్థితుల్లో ఉన్నా అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ రాష్ట్రపతిగా తన విశేషాధికారాలను విస్మ రించి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తీసుకున్న నిర్ణయాలను మౌనంగా ఆమోదించి విమర్శల పాలయ్యారు. ఇప్పటికీ అదే అవ్యవస్థ కొనసాగుతుండటం దురదృష్టకరం.










Comments