రేషన్ కావాలా.. రేపు రా?
- BAGADI NARAYANARAO

- Nov 15
- 2 min read
నగరంలో పోర్టబుల్ కార్డుదారులపై డీలర్ల చిన్నచూపు
రెగ్యులర్ పంపిణీ అయ్యాక.. ఉంటే ఇస్తామని సాకులు
గడువులోపు వెళ్లిన సాధారణ కార్డుదారులకూ మొండిచెయ్యి
పోర్టబులిటీ కోసం అదనపు కోటా ఇస్తున్నామంటున్న అధికారులు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
ప్రజాపంపిణీ వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన మార్పులు ప్రజలను ఇబ్బందిపెడుతూ మళ్లీ పాత రోజులనాటి చేదు అనుభవాలను గుర్తుచేస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గడువులోగా వెళ్లినా పలువురు రేషన్ డీలర్లు బియ్యం స్టాకు లేదంటూ వెనక్కి పంపుతున్నారన్న ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. గత వైకాపా ప్రభుత్వం ఇంటి ముంగిటికే రేషన్ అన్న నినాదంతో ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ పంపిణీ చేసేది. కానీ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎండీయూ ఆపరేటర్లను తొలగించి రేషన్ డీలర్ల ద్వారా సరుకులు పంపిణీ చేసే పాత వ్యవస్థను పునరుద్ధరించింది. ప్రతి నెలా 15లోగా రేషన్ పంపిణీ చేయాలని నిబంధన విధించింది. ఆ గడువు దాటిన తర్వాత పంపిణీ చేయడానికి అవకాశం లేదు. అయితే నగరంలోని కొన్ని డిపోల పరిధిలో శనివారంతో గడువు ముగుస్తున్నా.. శుక్రవారం సాయంత్రం వరకు రేషన్ పంపిణీ చేయలేదు. కారణం ఏమిటని అడిగితే బియ్యం స్టాక్ అయిపోయిందని, స్టాక్ వచ్చిన తర్వాత పంపిణీ చేస్తామని డీలర్లు చెబుతున్నారని పలువురు కార్డుదారులు ఆరోపిస్తున్నారు. పౌరసరఫరాల అధికారులు మాత్రం పూర్తిస్థాయిలో బియ్యం అలాట్ చేశామని, డిపోలో బియ్యం లేవని చెప్పడానికి అవకాశం లేదని అంటున్నారు.
పోర్టబులిటీకి తిరస్కృతి
శ్రీకాకుళం నగర పరిధిలో 33 రేషన్ డిపోలు ఉన్నాయి. వాటిలో అంత్యోదయ కార్డులు 1124, తెల్లకార్డులు 25,478 ఉన్నాయి. అంత్యోదయ కార్డుకు 35 కేజీలు చొప్పున 39,360 కేజీల బియ్యం అలాట్ చేశారు. 25,478 తెల్లకార్డుల్లోని 77,253 యూనిట్లకు తలా ఐదు కేజీలు చొప్పున 3,86,265 కేజీలు అలాట్ చేశారు. ఆ మేరకు నగరంలోని అన్ని డిపోలకు కలిపి 425 టన్నుల బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ పంపిణీ చేసింది. దీంతోపాటు గుజరాతీపేట, పాత శ్రీకాకుళం, అరసవల్లి ప్రాంతాల్లోని డిపోలకు సాధారణ కేటాయింపునకు అదనంగా 10 శాతం రేషన్ ఇచ్చారు. పోర్టబులిటీ కార్డుదారులకు పంపిణీ చేసేందుకు వీలుగా ఈ కేటాయింపులు జరిపారు. అయినా కొన్ని డిపోల పరిధిలో లబ్ధిదారులకు బియ్యం అందలేదు. బియ్యం విడిపించుకోవడానికి రేషన్ షాపులకు వెళితే బియ్యం లేవని తిప్పి పంపిస్తున్నారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదో తేదీ నాటికే బియ్యం పంపిణీ పూర్తి అయిపోయిందంటూ ఆ తర్వాత వచ్చిన వారికి బియ్యం లేవని చెబుతూ పక్క డిపోకు వెళ్లి పోర్టుబులిటీ ద్వారా బియ్యం తీసుకోమని సలహా ఇస్తున్నారు.
గడువులోపు వెళ్లినా..
నగరంలో పోర్టబులిటీ లబ్ధిదారుల అధికంగా ఉన్న 15 డిపోలను పౌరసరఫరాల అధికారులు గుర్తించారు. ఆ మేరకు ఆ 15 డిపోలకు రెగ్యులర్ అలాట్‌మెంట్‌తోపాటు 10 శాతం బియ్యం అదనంగా సరఫరా చేస్తున్నారు. మిగతా డిపోలకు మాత్రం రెగ్యులర్ కోటా మాత్రమే ఇస్తున్నారు. ఎందుకంటే వారి వద్ద క్లోజింగ్ బ్యాలెన్స్‌లో కొంత బియ్యం ఉంటున్నాయని అధికారులు చెబుతున్నారు. నగరంలో గ్రామీణ ప్రాంతాల నుంచి వలస వచ్చి సెటిల్ అయినవారు, అద్దె ఇళ్లలో ఉంటూ ఇళ్లు మారేవారు సమీపంలోని రేషన్ డిపోల్లో బియ్యం తీసుకుంటున్నారు. పోర్టబులిటీ సౌకర్యం అమల్లో ఉన్నందున రాష్ట్రంలో ఏ ప్రాంతం వారైనా ఏ రేషన్ షాపులోనైనా సరుకులు విడిపించుకునే అవకాశం ఉంది. కానీ రేషన్ డీలర్లు మాత్రం దాన్ని అమలు చేయకుండా పోర్టబులిటీ లబ్ధిదారులను పదో తేదీ తర్వాతే రావాలని చెబుతున్నారు. తమ రెగ్యులర్ కార్డుదారులకు రేషన్ ఇచ్చిన తర్వాత ఇంకా స్టాక్ ఉంటే నే పోర్టబులిటీ కార్డుదారులకు ఇస్తామని డీలర్లు చెబుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎండీయూ ఆపరేటర్లు ఉన్నప్పుడు విశాఖ ఏ, బీ కాలనీలకు వెళ్లి రేషన్ ఇచ్చేవారు. కానీ ఆ కాలనీల కార్డుదారులకు రూరల్ మండలం చాపురం, కళ్లేపల్లి షాపులకు బియ్యం అలాట్ చేస్తున్నారు. అయితే ఆ కాలనీల కార్డుదారులు చాపురం, కళ్లేపల్లి వెళ్లకుండా పోర్టబులిటీ ద్వారా మిగతా డిపోల్లో రేషన్ తీసుకుంటున్నారు. డీలర్లు తమ డిపో పరిధిలో ఉన్న తెల్లకార్డు లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేసిన తర్వాత మిగిలితే ఇటువంటి వారికి అవకాశం ఇస్తున్నారు.
ఆ కేటాయింపులతో సంబంధం లేదు
మరికొందరు డీలర్లు ప్రభుత్వం కేటాయించిన మేరకు బియ్యం పంపిణీ చేసేశామని చెప్పి గడువు చివరి తేదీల్లో వచ్చి వారికి కూడా స్టాక్ లేదని చెబుతున్నారు. మరికొందరు రూరల్ మండలంలోని కిల్లిపాలెంలోని ఉన్న రెండు డిపోలకు వెళ్లి బియ్యం తీసుకోవాలని సలహా ఇస్తున్నారని లబ్ధిదారులు చెబుతున్నారు. లబ్ధిదారులకు డీలర్లు రేషన్ బియ్యం పంపిణీ చేయడం లేదని వస్తున్న విమర్శలపై మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ఇటీవల వచ్చిన మొంథా తుపాను బాధితుల కోసం రేషన్ బియ్యం తరలించారని, అందుకే డీలర్లు బియ్యం లేవని చెబుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు మాత్రం తెల్లకార్డులకు ఇచ్చే కేటాయింపుతో మొంథా తుపాను బియ్యం పంపిణీకి సంబంధం లేదని స్పష్టం చేస్తున్నారు. ఆ రెండిరటికీ కేటాయింపులు వేర్వేరుగా జరిగాయని చెబుతున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల పరిధిలోని మత్స్యకారులు, చేనేత కుటుంబాలకు మాత్రమే ఒక్కో కుటుంబానికి 50 కేజీలు బియ్యంతో పాటు నిత్యావసరాలు పంపిణీకి ప్రత్యేక కేటాయింపులు చేశామని చెబుతున్నారు.










Comments