రాహుల్, తేజస్వీలకు బీహారీల జెల్ల!
- DV RAMANA

- Nov 14
- 2 min read
వారి నాయకత్వాన్ని తిరస్కరించిన ఓటర్లు
20 ఏళ్ల తర్వాత కూడా ఎన్డీయేపైనే విశ్వాసం
ఏమాత్రం ప్రభావం చూపని ఓట్ల చోరీ ప్రచారం
తొలి ప్రయత్నంలో జనసురాజ్ పార్టీ అట్టర్‌ఫ్లాప్

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
బీహార్ ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్, ఇండియా కూటములకు ఆ రాష్ట్ర ఓటర్లు జెల్లకొట్టారు. ఎన్డీయేకే నాలుగోసారి పట్టం కట్టి కాంగ్రెస్, ఆర్జేడీ, మరికొన్ని పార్టీల కూటమి అయిన మహాఘట్‌బంధన్‌ను తిరస్కరించారు. ఈ నెల 6, 11 తేదీల్లో రెండు దశల్లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయంపై మహాఘట్‌బంధన్ చాలా ఆశలు పెట్టుకుంది. జాతీయస్థాయిలో రాహుల్‌గాంధీ, రాష్ట్రంలో ఆర్జేడీ యువనేత తేజస్వి యాదవ్‌ల నాయకత్వాన్ని ఈ ఎన్నికలు పటిష్టం చేస్తాయని, కేంద్రంలో ఇండియా కూటమికి బూస్ట్ ఇస్తాయని అనుకున్నారు. కానీ ఫలితాలు పూర్తి భిన్నంగా వస్తున్నాయి. శుక్రవారం జరిగిన ఓట్ల లెక్కింపు ఆసాంతం ఎన్డీయే వైపు ఏకపక్షంగా సాగింది. ఏ దశలోనూ మహాఘట్‌బంధన్ పోటీ ఇవ్వలేకపోయింది. గత ఎన్నికల్లో ఎన్డీయేతో పోటాపోటీగా సీట్లు సాధించి ముచ్చెమటలు పట్టించిన మహాఘట్‌బంధన్ ఈసారి విజయం సంగతి అటుంచి.. కనీసం ఆ దరిదాపుల్లోకే వెళ్లలేకపోయింది. సగానికిపైగా సిటింగ్ స్థానాలనే కాపాడుకోలేక చతికిలపడిరది. అన్ని అంచనాలను తారుమారు చూస్తూ ఈసారి కూడా బీహారీబాబులు ఎన్డీయేకే పట్టం కట్టడానికి అనేక కారణాలు, పరిణామాలు దోహదం చేశాయి.
వారి ముందు ఆనని తేజస్సు
ఎన్డీయే ముఖ్యంగా నితీష్`మోదీల కాంబినేషన్, ఛరిష్మా ముందు మహాఘట్‌బంధన్‌కు సారధ్యం వహించిన ఆర్జేడీ యువనేత తేజస్వీయాదవ్ ఓటర్లకు ఆనలేదని అంటున్నారు. తమపై బీహార్ ప్రజల విశ్వాసం చెక్కుచెదరకుండా చూసుకోవడంలో నితీష్, మోదీ ద్వయం విజయం సాధించింది. ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన రెండు దశాబ్దాల తర్వాత కూడా బీహారీలు ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ పట్ల సంతృప్తి వ్యక్తం చేయడం చిన్న విషయం కాదు. ఇదే నితీష్ పార్టీయ అయిన జేడీయూతోపాటు బీజేపీ సహా మిగతా ఎన్డీయే పక్షాలను ఊహించని విజయం సాధించి పెట్టింది. మరోవైపు మహాఘట్‌బంధన్‌కు కొత్త తేజస్సునిస్తారనుకున్న తేజస్వీయాదవ్‌ను ముఖ్యమంత్రిగా చూడ్డానికి మెజారిటీ బీహారీలు అయిష్టత చూపించారు. అదే ఈ ఎన్నికల ఫలితాల్లో ప్రతిఫలించింది. ఎన్నికల ప్రచారానికి ముందు ఎన్డీయేపై ఒత్తిడి పెంచడానికి తేజస్వీని తమ సీఎం అభ్యర్థిగా మహాఘట్‌బంధన్ ప్రకటించి, దాన్నే ప్రధాన ప్రచారాస్త్రంగా ప్రయోగించింది. ఆ వ్యూహమే ఎదురుతన్ని దారుణ పరాభవం మిగిల్చింది.
ఎన్డీయేతోనే మహిళలు, బీసీలు
ఈ ఎన్నికలకు ముందు బీహార్‌లో ప్రత్యేక ఓటర్ల జాబితా రివిజన్(ఎస్‌ఐఆర్) పేరుతో 45 లక్షలకుపైగా ఓట్లను తొలగించేశారని ఆరోపణలు వచ్చాయి. దీన్ని ఓట్‌చోరీగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ విస్తృత ప్రచారం చేశారు. బీహార్ అంతటా పర్యటించి ఓటర్ల హక్కుల యాత్ర చేశారు. తేజస్వి యాదవ్, దీపాంకర్ భట్టాచార్య మరియు ముఖేష్ సాహ్ని, ఇతర మహాఘట్‌బంధన్ నాయకులతో కలిసి ఓటర్ల మద్దతు పొందేందుకు ప్రయత్నించారు. కానీ బీహార్ ప్రజలు ఆ ప్రయత్నాలన్నింటినీ తిప్పికొట్టారు. ఈ ఎన్నికల్లో తొలిసారి బరిలోకి దిగి తన అదృష్టాన్ని పరీక్షకు పెట్టిన ప్రశాంత్ కిషోర్‌కు చెందిన జన్‌సరాజ్ పార్టీని ఓటర్లు ఫెయిల్ చేశారు. ఆ పార్టీ ఒకే ఒక్క చోట ఆధిక్యంలో ఉంది. అక్కడ కూడా గెలుస్తుందో లేదో డౌటే అంటున్నారు. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే.. గతం కంటే రికార్డుస్థాయి పోలింగ్ జరగడం, మహిళలు పెద్దసంఖ్యలో ఓట్లు వేయడం ఎన్డీయేకే కలిసివచ్చింది. ఎగ్జిట్ పోల్స్‌లోనే ఇది వెల్లడైంది. ఇక బీసీలు కూడా ఎన్డీయేకే దన్నుగా నిలిచారు. ఈ వర్గం ఓట్ల కోసమే మహాఘట్‌బంధన్ తమ ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముఖేష్ సాహ్ని ని ప్రకటించింది. అది కూడా కలిసిరాలేదని ఫలితాల సరళితో స్పష్టమైంది.










Comments