top of page

రక్షణ కవచాల్నే కొట్టేశారు!

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • May 23
  • 2 min read
  • విజయగణపతి ఆలయం వద్ద.. సుందీరకరణ పేరుతో తొలగింపు

  • ఇది మున్సిపల్‌ సిబ్బంది నిర్వాకం

    ree
(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

చిన్న చిన్న తప్పిదాలే జీవితాంతం పొగిలి పొగిలి ఏడ్చేలా.. పొంత నిండిపోయేంత కన్నీటిని మిగులుస్తాయి. అలా అని అవి పరిష్కరించలేనంత పెద్ద సమస్యలు కావు. వాటి కోసం ప్రత్యేకంగా తీర్మానాలు చేయనక్కర్లేదు. బడ్జెట్లు విడుదల చేయక్కర్లేదు. కేవలం మనలాంటివే మిగిలిన ప్రాణాలు కూడా అన్న స్పృహ.. పరిష్కరించాలన్న చొరవ ఉంటే చాలు. నగరంలోని విజయగణపతి ఆలయం వద్ద 2023 నవంబరు 23న ద్విచక్ర వాహనంతో రోడ్డు క్రాస్‌ చేస్తున్న రైతుబజార్‌ సచివాలయ ఉద్యోగిని మౌనిక ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో మరణించింది. ఈ దారుణ ఘటనకు కారణం ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ కార్యాలయం వద్ద కేవలం ఓ చిన్న స్పీడ్‌ బ్రేకర్‌ లేకపోవడమే. నగరంలో ఏ సందులోకి వెళ్లినా సీసీ రోడ్లకు అడ్డంగా ఇష్టారాజ్యంగా వేసిన స్పీడ్‌బ్రేకర్లు కనిపిస్తుంటాయి. కానీ అవసరమైన క్రాసింగ్‌ల వద్ద, స్కూల్‌ జోన్‌ల వద్ద ఇవి మచ్చుకైనా కనిపించవు. అందుకే మౌనిక లాంటి వారు మరణిస్తున్నారు. మౌనిక బ్రెయిన్‌ డెడ్‌ కావడంతో ఆమె అవయవాలను కుటుంబ సభ్యులు దానమివ్వడంతో ఆ రోడ్డు ప్రమాదం ప్రాచుర్యంలోకి వచ్చింది. లేకపోతే అన్ని రోడ్‌ యాక్సిడెంట్ల మాదిరిగానే ఇదీ గాలిలోనే కలిసిపోయుండేది. పెద్దఎత్తున ఆమె అవయవ దానానికి స్పందన రావడంతో స్పీడ్‌బ్రేకర్‌ మీద చర్చ జరిగింది. దీంతో మున్సిపల్‌ యంత్రాంగం ఇక్కడ మౌనిక మరణం తర్వాత స్పీడ్‌బ్రేకర్‌ను ఏర్పాటు చేసింది. కానీ ఈమధ్య రోడ్ల మరమ్మతు, పాలకొండ రోడ్డు సుందరీకరణలో భాగంగా మౌనిక చనిపోయిన చోట స్పీడ్‌ బ్రేకర్‌ను తొలగించేశారు. స్థానిక డే అండ్‌ నైట్‌ జంక్షన్‌ వైపు నుంచి వచ్చే వాహనాలకు, నానుబాల వీధి వైపు నుంచి వచ్చేవాటికి ఇదే జంక్షన్‌ కావడం వల్ల మరో మౌనికను బలి తీసుకుంటే తప్ప స్పీడ్‌బ్రేకర్‌ వేయరా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇందుకోసం బడ్జెట్లు, అనుమతులు, శంకుస్థాపనలు అవసరం లేదు కదా..!



పుణ్యపు వీధి జంక్షన్‌లో.. కొత్తగా వేసిన దాన్నే పీకేశారు
  • దీనికి ఓ డాక్టర్‌ స్వార్థం కారణం

    ree
(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

అరసవల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమి ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించడం పుణ్యాన వచ్చిన నిధులతో స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్‌ నగరంలోని పాలకొండ రోడ్డును సుందరీకరించారు. నాలుగు నిధులొస్తే చాలు.. నగరాన్ని సుందరీకరించుకోవాలనేది ఆయన ఆలోచన. ఎప్పుడో తెలుగుదేశం హయాంలోనే విస్తరించిన పాలకొండ రోడ్డులో పాత డివైడర్లు తొలగించి కొత్తవి నిర్మించి వాటికి సొబగులు అద్దుతున్నారు. డివైడర్‌కు ఎక్కడపడితే అక్కడ ఖాళీలు వదిలితే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందన్న ఇంజినీర్ల సూచన మేరకు తక్కువ ప్రాంతాల్లోనే డివైడర్ల మధ్య ఖాళీలు వదిలారు. అందులో భాగంగా కృష్ణా పార్క్‌ జంక్షన్‌ వద్ద డివైడర్‌ను ఓపెన్‌ చేసి మిగిలిన చోట్ల డివైడర్‌తో పాటు స్టెప్‌ ఇన్‌ పుట్‌పాత్‌లు నిర్మించారు. వీటికే ఇప్పుడు రంగులు, ముగ్గులు వేసి టైల్స్‌ అంటిస్తున్నారు. ఈలోగానే కృష్ణాపార్క్‌ జంక్షన్‌కు బెత్తెడు దూరంలో ఉన్న పుణ్యపు వీధిలోకి వెళ్లడానికి డివైడర్‌ అడ్డుగా ఉందంటూ రాత్రికి రాత్రే కొందరు దాన్ని తవ్విపారేశారు. ఈ పని ఎవరు చేసుంటారని, అంత ధైర్యంగా ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసింది ఎవరా అని ఆరా తీస్తే.. అక్కడే ఉన్న ఒక ప్రైవేటు పీఎంపీ వైద్యుడే కారణమని తెలిసింది. ఈ డివైడర్‌ నిర్మించిన తర్వాత తన వద్దకు వచ్చే పేషెంట్ల సంఖ్య తగ్గిపోయిందని భావించి, దీన్ని తొలగింపజేశారని చెప్పుకొంటున్నారు. ఇంతవరకు ఆయన చేతిమాత్రే వైకుంఠ యాత్ర అనుకునేవారు. ఇప్పుడు ఆయన చర్యల వల్ల కూడా ప్రమాదాలు జరిగి ఎవరైనా వైకుంఠానికి పోతే బాధ్యత వహించేది మున్సిపాలిటీనా, లేదూ సుడానా, లేక ఈ వైద్యుడా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page