top of page

లెక్కల్లో తేడా కొట్టింది.. ఏసీబీకి పట్టించింది!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • 7 days ago
  • 3 min read
  • కంచిలి హాస్టల్ కుక్, ఏబీసీడబ్య్లూవో మధ్య స్పర్థలు

  • ఒడిశా విద్యార్థుల విషయంలో మాటామాటా

  • ఆ కక్షతోనే వసూళ్ల భేటీపై ఉప్పందించిన ఉద్యోగి

  • ఒకేసారి అంతమంది పట్టుబడటం ఇదే తొలిసారి

  • తెల్లవారుజాము వరకు కొనసాగిన ఏసీబీ విచారణ

( సత్యంన్యూస్,శ్రీకాకుళం)

ప్రభుత్వ వసతి గహాల్లో అక్రమాలు కొత్త కాదు. వాటిలో ఆశ్రయం పొందే విద్యార్థుల సంఖ్యను బట్టి ఆ శాఖ అధికారులకు నెలవారీ మామూళ్లు ఇచ్చే సంప్రదాయం బీసీ, ఎస్సీ సంక్షేమ శాఖల్లో పాతుకుపోయింది. ఒక్కో విద్యార్థికి ఇంత అని నిర్ణయించి మరీ హాజరు ఆధారంగా లెక్కగట్టి వార్డెన్లు నెలనెలా తమ అధికారులకు ముడుపులు కడుతూ తమ అక్రమాలకు లైసెన్సు తీసుకుంటుంటారు. ఎక్కువ హాజరు చూపడం వంటి అనేక అక్రమాలకు హాస్టల్ స్థాయిలో పాల్పడుతూ దండిగా సంపాదిస్తుంటారు. ప్రభుత్వం విద్యార్ధుల మెస్‌చార్జీలు పెంచిన ప్రతిసారీ దానికి అనుగుణంగా ఈ వసూళ్లు, మామూళ్ల లెక్క మారుతుంటుంది. వీటిపై ఏసీబీ దాడులు కూడా కొత్త కాదు. కానీ తాజాగా కంచిలిలో ఏబీసీడబ్ల్యూవో బాలముకుందరావుతోపాటు కొందరు వార్డెన్లను ట్రాప్ చేసి పట్టుకోవడం వెనుక ఆ శాఖలోని దిగువస్థాయి సిబ్బంది ప్రమేయం ఉండటమే విశేషం. యథా రాజా.. తథా ప్రజ అన్నట్లు పైస్థాయిలో అధికారులు అక్రమ వసూళ్లకు పాల్పడుతుంటే.. తాము మాత్రం ఎందుకు మడి కట్టుకోవాలన్నట్లు హాస్టళ్లలోని కిందిస్థాయి సిబ్బంది సైతం అక్రమాలకు తెరతీస్తున్నారు. ఈ క్రమంలో ఒక కుక్, ఏబీసీడబ్ల్యూవో బాలముకుందరావు మధ్య ఏర్పడిన స్పర్థలే తాజా దాడులకు దారి తీశాయని బీసీ సంక్షేమ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.

లేని విద్యార్థులను చూపించే మాయ

ప్రభుత్వ వసతి గహాల్లో విద్యార్థులను చేర్చుకోవడం నుంచి హాజరు వేయడం, మెనూ అమలు చేయడం వరకు ప్రతి దశలోనూ వార్డెన్లు, అధికారులు మామూళ్లు ఆశిస్తుంటారు. జిల్లాలోని తీరప్రాంత హాస్టళ్లలో ఈ దుస్సంస్కతి మరీ ఎక్కువగా ఉంది. ఈ హాస్టళ్లలో విద్యార్థులు లేకుండానే ఉన్నట్లు చూపించి మెనూ ఛార్జీల రూపంలో అధికారులు నిధులు భోంచేస్తుంటారు. తీరప్రాంత మత్స్యకార గ్రామాల్లో 16 వసతిగహాలు ఉన్నాయి. వాటి రికార్డులు చూస్తే పూర్తిస్థాయిలో విద్యార్ధులు ఉన్నట్లుంటుంది. కానీ హాజరు పట్టీల్లో చూపించినంత మంది విద్యార్థులు భౌతికంగా ఉండరు. లేని విద్యార్థుల హాజరు చూపించడానికి వార్డెన్లు రోజుకు ఒక్కో విద్యార్థికి రూ.5 చొప్పన చెల్లించి పాఠశాల వద్దకు రప్పించుకుని బయోమెట్రిక్ హాజరు వేస్తున్నారు. దీన్ని మ్యానేజ్ చేసేందుకే ఆశాఖ అధికారికి ఒక్కో విద్యార్థికి ప్రతి నెలా రూ.150 చొప్పన చెల్లిస్తున్నారు. ఆ ముడుపులు అందితేనే అధికారులు డైట్ బిల్లులు విడుదల చేస్తున్నారు. ఇక కాలేజీ వసతి గహాల్లో విద్యార్ధులు చేరినప్ప్పుడు ఒక్కొక్కరి నుంచి రూ.500 వసూలు చేస్తున్నారు. జిల్లాలో 17 కాలేజ్ వసతి గహాలు, 64 ప్రీమెట్రిక్ వసతి గహాలు ఉన్నాయి. వీటిలో సుమారు ఏడువేల మంది విద్యార్థులు ఉన్నట్లు రికార్డుల్లో చూపిస్తున్నారు. వాస్తవానికి అంతమంది ఉండరు. పోస్టు మెట్రిక్ విద్యార్ధులకు రూ.1600, 5 నుంచి 10 తరగతుల విద్యార్ధులకు రూ.1400, మూడు నాలుగు తరగతుల విద్యార్ధులకు రూ. 1150 చొప్పున ప్రభుత్వం మెస్ ఛార్జీలు చెల్లిస్తుంది. ఈ రేట్ల అధారంగానే విద్యార్ధుల సంఖ్యను లెక్క గట్టి ఒక్కో విద్యార్థికి రూ.50 నుంచి రూ.150 వరకు వార్డెన్లు తమ పై అధికారులకు సమర్పిస్తున్నారు. ఇచ్ఛాపురం, సోంపేట నియోజకవర్గాల పరిధిలో ఉన్న వసతి గహాల్లో జిల్లా సరిహద్దుýకు సమీపంలో ఉన్న ఒడిశా రాష్ట్ర విద్యార్ధులను చేర్చుకుంటున్నారు. వారికి ఆధార్ కార్డులు తయారు చేయించి హాస్టల్‌లో చేర్చుకోవడానికి పిల్లల తల్లిదండ్రుల నుంచి రూ. వేలు వసూలు చేస్తున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి పంపకాల్లో తేడా కొట్టి ఏసీబీకి ఉప్పందించేవరకు వెళ్లిందని, దాని పర్యవసానమే తాజా దాడులని తెలిసింది.

ఒడిశా విద్యార్థుల విషయంలో వివాదం

కంచిలిలోని బీసీ ప్రీమెట్రిక్ హాస్టల్లో పనిచేస్తున్న ఒక కుక్ ఒడిశా ప్రాంత విద్యార్ధులను వసతి గహంలో చేర్పిస్తూ డబ్బులు దండుకుంటున్నాడని సమాచారం. ఈ విషయం తెలుసుకున్న సోంపేట ఏబీసీడబ్ల్యూవో బాలముకుందరావు సదరు హాస్టల్లో ఆకస్మిక తనిఖీ చేశారు. హాజరుపట్టీలో అక్కడ 197 మంది విద్యార్థులు ఉన్నట్లు చూపించగా 133 మందికే ఆహారం సిద్ధం చేయడాన్ని గమనించి కుక్‌ను ప్రశ్నించారు. దానికి సమాధానం చెప్పకపోగా కుక్ ఎదురుతిరిగాడు. దాంతో ఆగ్రహించిన బాలముకుందరావు ఒడిశా నుంచి పిల్లలను తీసేకువచ్చి హాస్టల్లో చేర్చుతున్నట్లు ఆధారాలు ఉన్నాయని, వాటిని ఉన్నతాధికారుల దష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. దానికితోడు కొందరు విద్యార్ధుల తల్లిదండ్రులు కుక్ అక్రమాలపై ఫిర్యాదు చేయడంతో వాటన్నింటిపై జిల్లా అధికారికి రిపోర్టు చేయడానికి ఏబీసీడబ్ల్యూవో సిద్దమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న కుక్ స్థానిక అధికార పార్టీ ప్రజాప్రతినిధిని ఆశ్రయించగా అయన అధికారులతో మాట్లాడి కుక్‌పై చర్యలు తీసుకోకుండా అడ్డుకున్నారు. అయితే ఒడిశా విద్యార్ధులను చేర్చుకోవడానికి వసూలు చేసిన మొత్తంలో వాటా ఇవ్వాలని ఆ తర్వాత బాలముకుందరావు డిమాండ్ చేయడం, కుక్ కొంత మొత్తం ఇవ్వడంతో వారి మధ్య వివాదం సద్దుమణిగిందనుకున్నారు. కానీ తనను ఇబ్బందిపెట్టిన ఏబీసీడబ్ల్యూవోపై కక్ష పెంచుకున్న కుక్ తగిన అవకాశం కోసం ఎదురుచూశాడు. అదే తరుణంలో ఏబీసీడబ్ల్యూవో తన పరిధిలోని వార్డెన్లతో సమీక్ష సమావేశం పేరుతో కంచిలి కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఆయన పరిధిలోని 11 వసతి గహాలకు బాధ్యత వహిస్తున్న ఐదుగురు వార్డెన్లు ఇటీవల విడుదలైన డైట్ బిల్లులకు సంబంధించి తమ హాస్టళ్ల వాటా సొమ్మును లెక్కగట్టి ఏబీసీడబ్ల్యూవోకు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న కంచిలి కుక్ ఏసీబీకి సమాచారం ఇచ్చాడు. దాంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు మాటు వేసి ఏబీసీడబ్ల్యూవో బాలముకుందరావుతో పాటు ఎంఎస్‌పల్లి, రాజపురం వార్డెన్ ఉపేంద్ర, పలాస కాలేజీ గర్ల్స్, మందస బీసీ గర్ల్స్ హాస్టల్ వార్డెన్ కష్ణవేణి, బొడ్డపాడు, ఎర్రముక్కాం వార్డెన్ టి.కోదండరావు, పలాస కాలేజీ బాలురు, జీఆర్‌పురం, మామిడిపెల్లి వార్డెన్ ఎస్.రామకష్ణ, ఇచ్ఛాపురం, కొలిగాం వార్డెన్ బి.కాంతారావులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వీరి నుంచి రూ.1,84,070 స్వాధీనం చేసుకున్నారు. తనకు అందే సొమ్ములో ఎవరెవరికీ ఎంత వాటా ఇవ్వాలన్నది ఒక పేపరుపై బాలముకుందరావు రాసుకున్నట్లు తెలిసింది. అతని టేబుల్‌పైౖనే ఉన్న ఆ పేపర్‌ను కూడా స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు దానిపై వార్డున్లు, కార్యాలయ సిబ్బంది, ఏబీసీడబ్ల్యూవోను ప్రశ్నించినట్లు సమాచారం. గురువారం తెల్లవారుజాము మూడు గంటల వరకు అందరినీ కార్యాలయంలోనే ఉంచి వివరాలు సేకరించిన అధికారులు బాలముకుందరావును అదుపులోకి తీసుకున్నారు. ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ఆరెస్టులు ఉంటాయని వార్డెన్లకు తెలిపినట్టు తెలిసింది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page