లైంగిక దాడుల కేసుల్లో వివక్ష!
- DV RAMANA

- Nov 6, 2025
- 3 min read

విశాఖ నగరంలో ఒక డిగ్రీ విద్యార్థి తన కళశాలకే చెందిన ఇద్దరు మహిళా లెక్చరర్ల లైంగిక వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పంజాబ్‌లోని జలంధర్ నగరంలో ఓ యువకుడు రాత్రిపూట వెళ్తుండగా కారులో వచ్చిన కొందరు అమ్మాయిలు ఏదో అడ్రస్ అడిగారు. కారులో తమతో వచ్చి చూపించమని అడిగారు. కారు ఎక్కిన ఆ యువకుడిపై అత్యాచారం చేశారు. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్‌కు చెందిన 32 ఏళ్ల నిరుద్యోగికి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించిన ఓ పోలీస్ ఇన్‌స్పెక్టర్ తాను చెప్పినట్లు చేయాలని బలవంతం చేశాడు. ఆరు నెలల పాటు లైంగికంగా వేధించాడు. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరులో 20 ఏళ్ల యువకుడు సాయంత్రం వాకింగ్‌కు వెళ్లిన సమయంలో పరిచయం ఉన్న ఓ వ్యక్తి చెరుకు రసం తాగుదామని పిలిచి చెట్లపొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఏమిటి ఆశ్చర్యపోతున్నారా?! నిజం.. మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపుల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎన్ని చట్టాలు చేసినా నేరగాళ్లకు ముకుతాడు వేయలేకపోతుండటంతో మహిళలపై అకృత్యాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. అయితే పురుషులపైనా లైంగిక దాడులు పెరుగుతున్నాయి. అయితే ఈ దాడులకు సంబంధించి పెద్దగా కేసులు, క్రైమ్ రికార్డులు లేవు. కొన్ని అధ్యయనాల ప్రకారం ప్రతి పదిమంది పురుషుల్లో ఒకరు ఏదో రకమైన లైంగిక దాడి గురవుతున్నారని తేలింది. అయితే బయటకు చెప్తే పరువు పోతుందని, పెళ్లి కాదని, మగవాడు కాదంటారన్న రకరకాల భయాలతో మెజారిటీ బాధితులు ఫిర్యాదులు చేయడంలేదు. వీటన్నింటి కంటే ముందు తనపై లైంగిక దాడి జరిగిందని చెబితే మన సమాజం నమ్మదు. తిరిగి అతనివైపే అనుమానపు దృక్కులు సారిస్తుంది. ‘రేప్’ అనేది మగవాడి హక్కు అని, చేస్తే అతడే చేయాలి అన్నట్లుగా సినిమాలు చిత్రీకరించి సమాజాన్ని బ్రెయిన్ వాష్ చేసేశాయి. కానీ మహిళలపై పురుషులే కాకుండా పురుషులపై మహిళలు అత్యాచారాలకు, లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఘటనలు ఆమధ్య కాలంలో కాస్త ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. కానీ బయటకు రాని దాడులు చాలా ఎక్కువగా ఉంటాయని అంచనా. ఈ పరిస్థితికి మన క్రిమినల్ చట్టాల్లో ఉన్న లొసుగులు కూడా కారణమే. నేరం ఎవరి విషయంలో జరిగినా నేరమేనని మన క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ చెబుతోంది. దాని ప్రకారం మగ రేప్, ఆడ రేప్ అనే తేడాగానీ, వివక్ష గానీ ఉండకూడదు. కానీ దురదృష్టవశాత్తు వీటికి సంబంధించిన చట్టాల్లో దాదాపు అన్నీ మహిళలకు రక్షణ కల్పించేవే తప్ప పురుషుల మాన రక్షణకు ప్రత్యేకించిన చట్టం ఒక్కటంటే ఒక్కటైనా లేదు. మైనర్ అయినా, మేజర్ అయినా సమ్మతి లేకుండా లైంగిక చర్యలను లైంగిక దాడిగా పరిగణించాలని చట్టాలు చెబుతున్నాయి. అనుమతి లేకుండా జరిపే లైంగిక సంపర్కాన్ని ఐపీసీ సెక్షన్ 377 నేరంగా పరిగణిస్తుంది. ఈ సెక్షన్ పురుషులను కూడా అత్యాచార బాధితులుగా గుర్తిస్తున్నా నేరస్తురాలు మహిళ అయినప్పుడు ఈ సెక్షన్ వర్తించదని చట్టం స్పష్టం చేస్తోంది. పురుషులపై జరిగే లైంగిక దాడుల కేసులను ఎలా విచారించాలో చెప్పే పూర్తిస్థాయి అవగాహన వ్యవస్థ మన వద్ద లేదు. ‘మీ మీద లైంగిక దాడి జరిగితే ధైర్యంగా మాకు చెప్పండి’ అంటూ మగవారికి భరోసా ఇవ్వగలిగే ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ లేదు. పైగా, ఎవరైనా కేసు పెడదామని వెళ్లినా ‘నువ్వే ఆ అమ్మాయిని ఏదో చేసి, రివర్స్ కేసు పెడుతున్నావా?’ అని అడిగేవారికీ, ‘మగవాడివయ్యుండి ఎదురించలేకపోయావా?’ అని అడిగేవారికీ లోటు లేదు. ఇలాంటి అనేక కారణాలతో చాలామంది తమపై జరుగుతున్న లైంగిక దాడుల విషయంలో మౌనం వహిస్తున్నారు. 18 ఏళ్లు నిండిన ఇద్దరు వ్యక్తులు (జెండర్‌తో సంబంధం లేకుండా) పరస్పర అంగీకారంతో జరిపే లైంగిక చర్యను తప్పు పట్టలేమని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అయితే కొందరు దీన్ని తమకు అనుకూలంగా మార్చుకొని నేరాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో మగవారిపై జరిగే చాలా లైంగిక దాడుల కేసుల్లో పురుషులే నిందితులవుతున్నారు. లైంగికంగా ఇతరులను బలవంతపెట్టడం, తాము చెప్పింది చేయాలని అడగటం, థ్రిల్ పేరుతో బలవంతంగా హోమో సెక్స్ వైపు మళ్లించడం, దుష్ప్రచారం చేస్తామని బెదిరించి లొంగదీసుకోవడం వంటివి జరుగుతున్నాయి. లైంగికదాడి చేయడంతో పాటు ఫొటోలు, వీడియోలు తీసి పెద్ద ఎత్తున డబ్బులు గుంజిన ఉదంతాలూ కోకొల్లలు. 14 నుంచి 22 మధ్య వయసున్నవారి మీదే అధికశాతం లైంగిక దాడులు జరుగుతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 2002 నుంచి పురుషులపై లైంగిక వేధింపుల కేసులు ఏటా 40 వరకు పెరుగుతాన్నాయి. అయితే వీటిపై కచ్చితమైన అధికారిక డేటా ఎక్కడా లేదు. కొన్ని నివేదికల ప్రకారం దేశంలో సుమారు 27 శాతం పురుషులు తమ జీవితంలో ఏదో ఒక సమయంలో లైంగిక వేధింపులకు గురైనవారేనట! ‘బయట తెలిస్తే మీ కుటుంబం పరువు పోతుందని, నువ్వే నాపై లైంగికదాడి చేశావని కేసు పెడతానని’ కొందరు మహిళలు యువకులను బెదిరించి లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. ‘నువ్వు రాకపోతే చచ్చిపోతానని, ‘నాతో గడపకపోతే మన ఫొటోలు లీక్ చేస్తానని’ బెదిరించే మహిళలు కూడా మన సమాజంలో ఉన్నారు. మగవాళ్లకూ శరీరం ఉంటుంది. మనసు ఉంటుంది. లైంగిక చర్యలో పాల్గొనే వారు 18 ఏళ్లు దాటిన వారైతే ఆ చర్య వారికి సమ్మతమైతే అది తప్పు కాదు. కానీ ఆడ, మగ.. ఇద్దరిలో ఎవరికి సమ్మతం కాకపోయినా అది అత్యాచారం కిందకే వస్తుంది. శిక్షార్హమైన నేరంగా పరిగణించబడుతుంది. అందువల్ల ఇలాంటి కేసుల్లో స్త్రీపురుషులన్న వివక్ష చూపకుండా ఒకేరకమైన సానుభూతి చూపాలి. న్యాయం అందించాలి.










Comments