లోపాల రీసర్వేతో పాపాల ప్లాన్!
- BAGADI NARAYANARAO
- Aug 5
- 2 min read
రూ.కోట్లు విలువైన స్థలంపై ఆ నలుగురి కన్ను
వైకాపా హయాంలో మంత్రి పేషీ పేరుతో విఫల యత్నాలు
అది ప్రభుత్వ భూమి అని గతంలోనే కలెక్టర్ నిర్ధారణ
టీడీపీ సర్కారు వచ్చిన ఏడాది తర్వాత మళ్లీ అవే పన్నాగాలు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
చావోస్ థియరీ (గందరగోళ సిద్ధాంతం) ప్రకారం బటర్‌ఫ్లై ఎఫెక్ట్ అని ఒకటి ఉంటుంది. వ్యవస్థలో చిన్న చిన్న మార్పులు.. మరోచోట ఊహించని పెద్ద పరిణామాలకు కారణమవుతాయని ఈ సిద్ధాంతం చెబుతుంది. ఇది ఏమేరకు నిజమనేది చెప్పడానికి ప్రపంచంలో జరిగిన అనేక సంఘటనలను శాస్త్రవేత్తలు ఉదహరిస్తుంటారు. సరిగ్గా ఆ సిద్ధాంతాన్ని బలపరిచే సంఘటనే శ్రీకాకుళం నగరంలో జరిగింది.. జరగబోతోంది.
చెత్తలున్నప్పుడు అక్కర్లేదు
శ్రీకాకుళం ప్రజానీకం నిత్యం విడిచిపెట్టే వ్యర్థాలను వేయడానికి గతంలో జిల్లా పరిషత్ పక్కన డంపింగ్ యార్డును ఏర్పాటు చేయగా.. ఆ తర్వాత దాన్ని షిప్ట్ చేసి ఆ స్థలంలో హుద్‌హుద్ కాలనీ నిర్మించారు. అలాగే ఆదివారంపేట నుంచి కొత్తరోడ్డుకు వెళ్లే వరకు చెత్తను పోగేస్తే.. నగరం నుంచి వెళ్లి వచ్చేవారికి దుర్గంధమే స్వాగతం పలుకుతుందన్న ఉద్దేశంతో కంపోస్ట్ యార్డును వేరేచోటకు తరలించారు. ఆదివారంపేట అవతల చెత్తలు పడవేసే స్థలం భవిష్యత్తులో కోట్లు పలుకుతుందని బహుశా అప్పట్లో ఎవరూ ఊహించి ఉండరు. అక్కడ చెత్త ఉన్నంతవరకు ‘మా స్థలంలో’ చెత్తలేయడానికి మీరెవరంటూ ప్రశ్నించడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఇప్పుడు అక్కడ చెత్త క్లియరైపోయి స్థలం చదునుగా , అనువుగా కనిపించేసరికి అది ఒక భూమిలా కాకుండా కోట్ల రూపాయల కరెన్సీ కట్టలు పరిచిన ఓ ప్లాట్‌ఫామ్ మాదిరిగా అందరికీ కనిపిస్తోంది. అందుకే కొంతమంది కుమ్మక్కై ఆ స్థలాన్ని చేజిక్కించుకోవడానికి కొన్నేళ్లుగా చేయని ప్రయత్నం లేదు. విచిత్రమేమిటంటే.. వైకాపా హయాంలో ఆ పార్టీ కార్యకర్తలుగానో, సానుభూతిపరులుగానో సేవలందించినవారే తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ స్థలాన్ని కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
పరస్పర విరుద్ధ ఆదేశాలు
బలగ ఆదివారంపేట దాటిన తర్వాత ఎడమవైపు నాగావళి కరకట్టకు ఆనుకొని ఉన్న స్థలం తమదేనని, ఇంతవరకు పొజిషన్‌లో ఉన్నది తామేనని.. దాని మీద హక్కుపత్రాలు తమకు ఇవ్వాలంటూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది తర్వాత మళ్లీ ఆ నలుగురూ స్థానిక తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. వైకాపా హయాంలో ధర్మాన ప్రసాదరావు రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు ఆ స్థలంలో జెండా పాతేందుకు ప్రయత్నించింది కూడా వారే. అయితే అప్పటి కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ రికార్డులు తెప్పించుకుని భూమి స్వరూపాన్ని తెలుసుకుని.. అది ప్రభుత్వ భూమేనంటూ బోర్డులు పాతించారు. రెవెన్యూ మంత్రి చెప్పినా మా పని చేయరా? అని భావించిన ఆ నలుగురూ వైకాపా హయాంలోనే తమదని చెబుతున్న స్థలంలో కంచె వేసేశారు. దాన్ని తొలగించాలని కలెక్టర్, అలాగే ఉంచాలని అప్పటి రెవెన్యూ మంత్రి పేషీ పరస్పర విరుద్ధ ఆదేశాలివ్వడంతో ఏం చేయాలో తెలియక తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది సెలవుపై వెళ్లిపోయారు. ఈలోగా ఎన్నికలు, కలెక్టర్ మారడంతో అది నిలిచిపోయింది. ప్రభుత్వం మారిన ఏడాది తర్వాత ఇప్పుడు ఆ నలుగురూ ఆ భూమిపై హక్కుపత్రాలు ఇవ్వాలంటూ తహసీల్దార్ కార్యాలయానికి తిరుగుతున్నారు.
రీసర్వే చెప్పిందట!
ఒకసారి అది ప్రభుత్వ భూమి అని నిర్ధారించి బోర్డులు సైతం పెట్టిన తర్వాత ఇప్పుడు కొత్తగా హక్కులు ఎక్కడినుంచి పుట్టుకొచ్చాయని ఆరా తీస్తే.. బ్రిటీషర్ల తర్వాత తామే చేస్తున్నామని గత ప్రభుత్వం సగర్వంగా చెప్పుకున్న భూముల రీసర్వేయే దీనికి కారణమని తేలింది. నాడు పైలట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళం జిల్లాను ఎంచుకొని రీసర్వే చేసి అనేక ప్రభుత్వ భూములను, దేవదాయ శాఖ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారు. జిరాయితీ భూములను సైతం వేరే వారికి ధారాదత్తం చేసేశారు. అసలు రీసర్వేయే తప్పులతడక మహాప్రభో.. అంటూ జనం గగ్గోలుపెడుతుంటే ఇప్పుడు దాన్ని ఆధారంగా చేసుకొని కోట్లు విలువ చేసే భూమిని తమకు తాంబూలంలో పెట్టి ఇచ్చేయమని ఆ నలుగురు అడుగుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రీసర్వేలో జరిగిన లోపాలను సవరిస్తామంటూ సచివాలయాల పరిధిలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహించారు. అక్కడ అందిన ఫిర్యాదుల పరిష్కారానికి ఇంతవరకు దిక్కూమొక్కూలేదు. అటువంటిది కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని రీసర్వేలో తమ పేరుతో చూపించారని, అందుకే తమకు హక్కుపత్రాలు ఇవ్వాలంటూ వీరు కోరడం విడ్డూరం.
రెవెన్యూ రికార్డుల్లో బలగ సర్వే నెంబర్`1లో ఉన్న భూమిని ఐదు సబ్ డివిజన్లు చేసి వారసత్వంగా వచ్చినట్టు ఎస్‌ఎల్‌ఆర్‌లో చూపించారు.
ఎస్‌ఎల్‌ఆర్‌లో పేర్కొన్న వివరాలకు వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేసిన వివరాలకు పొంతన కుదరడం లేదు.
రెవెన్యూ రికార్డుల ప్రకారం 1.05 ఎకరాల్లో కోనేరు ఉండాలి. కానీ అక్కడ కోనేరు జాడే లేదు. వీరు మాత్రం కోనేరుగా రికార్డుల్లో ఉన్న భూమి మెట్టుభూమిగా చెబుతున్నారు.
2023 ఆగస్టులో శ్రీకాకుళం`ఆమదాలవలస రోడ్డు విస్తీర్ణానికి ప్రభుత్వం నిర్ణయించడంతో దానికి ఆనుకుని ఉన్న నాగావళి వరద గట్టు భూమి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అప్పటి వరకు కనిపించని వారసులు, కొనుగోలుదారులు అకస్మాత్తుగా తెరమీదకు వచ్చారు.
Comentarios