లీప్ సెకండ్‌కు ఇక సెలవ్!
- DV RAMANA

- Aug 13, 2025
- 3 min read
భూ భ్రమణంలో వ్యత్యాసాలతో రోజు వ్యవధిలో తేడాలు
వాటిని సరిచేసేందుకు యూటీసీ ప్రక్రియ
చరిత్రలో ఇంతవరకు తొలగించిన సందర్భాలు నిల్
ఇంతవరకు 27 సందర్భాల్లో ఆదనపు సెకండ్ల చేరిక

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఒక అసాధారణ, అరుదైన అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. భూభ్రమణం సాధారణ స్థాయి కంటే కాస్త వేగం పుంజుకోవడమే సదరు అసాధారణ పరిణామం. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి ఒక రోజులో ఉండే కో ఆర్డినేటెడ్ యూనివర్శల్ టైమ్(యూటీసీ) నుంచి ఒక సెకండు తగ్గించాలని శాస్త్రవేత్తలు, కాలాన్ని కొలిచే నిపుణులు భావిస్తున్నారు. వాస్తవానికి ఇదేమీ కొత్త విషయం కాదు. 2022లోనే దీనిపై చర్చించిన అంతర్జాతీయ నిపుణులు 2035లో ఒక సెకను తగ్గించాలని నిర్ణయించారు. కానీ ప్రస్తుతం భూభ్రమణ వేగం పెరుగుదల చూస్తే.. దాని కంటే ముందే ఆ పని చేయాల్సి వస్తుందేమోనని అభిప్రాయపడుతున్నారు. చరిత్రలో ఒక సెకండును తగ్గించడం ఇదే తొలిసారి అని అంటున్నారు. భూభ్రమణ వేగంలో వ్యత్యాసాల కారణంగా సెకండ్లను కలిపిన సందర్భాలు ఉన్నా.. ఇప్పటివరకు తొలగించే అవసరం మాత్రం రాలేదు. ఇలా కలపడం లేదా తొలగించే సెకండ్లనే లీపు సెకండ్లని అంటుంటారు.
ఏమిటీ లీపు సెకండు
భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూనే తన చుట్టూ తాను తిరుగుతుందని.. ఈ పరిభ్రమణం ఆధారంగానే రోజులు, నెలలు, సంవత్సరాలు గణిస్తారని మనం చిన్నప్పుడే సైన్ పాఠాల్లో చదువుకున్నాం. భూమి తన ఇరుసుపై తిరుగుతుంటుంది. ఇలా తన చుట్టూ తాను ఒకసారి పూర్తిగా తిరగడానికి సగటున 24 గంటలు లేదా 86,400 సెకండ్లకు సమానం. కానీ వాస్తవానికి ప్రతి రెండు భ్రమణాలకు మధ్య కొంత వ్యత్యాసం ఉంటుంది. చంద్రుడి గురుత్వాకర్షణ, వాతావరణ మార్పులు, భూమి లోపలి ద్రవ కేంద్రం వంటి పలు అంశాల దీనిపై ప్రభావం చూపిస్తాయి. అందువల్ల కచ్చితంగా 86,400 సెకండ్ల వ్యవధిలోనే కాకుండా కాస్త అటూ ఇటూగా ఒక భ్రమణం పూర్తి అవుతుంటుంది. ఈ భూ భ్రమణ తీరును, దానికి తీసుకున్న సమయాన్ని కొన్ని సంస్థలు నిరంతరం పర్యవేక్షిస్తుంటాయి. ఇంటర్నేషనల్ ఎర్త్ రొటేషన్ అండ్ రిఫరెన్స్ సిస్టమ్ సర్వీసు, యూఎస్ నేవల్ అబ్జర్వేటరీ తాజా సమాచారం ప్రకారం.. జులై 10న 24 గంటల కంటే 1.36 మిల్లీసెకండ్ల ముందే రోజు పూర్తయ్యింది. ఈ సంవత్సరంలో ఇప్పటివరకూ ఇదే అతి తక్కువ నిడివి గల రోజు. ఇక జులై 22న 1.34 మిల్లీసెకండ్ల ముందే రోజు పూర్తి కాగా.. ఆగస్టు 5న 1.25 సెకండ్ల ముందు రోజు ముగిసింది. సాధారణంగా భూమి సూర్యుడి చుట్టూ ఒకసారి తిరగడానికి 365 రోజుల కంటే ఒక పావు వంతు రోజు ఎక్కువే పడుతుంది. కానీ 365 రోజులనే ఒక సంవత్సరంగా పరిగణిస్తున్నారు. దాని వల్ల ప్రతి సంవత్సరం 0.25 అంటే పావు రోజు కాలమానంలో మిగిలిపోతోంది. అందువల్ల నాలుగేళ్లకోసారి ఒకరోజును అదనంగా ఫిబ్రవరి నెలలో కలుపుతున్నారు. అలా నాలుగేళ్లకోసారి ఫిబ్రవరి నెలలో 29 రోజులు వచ్చిన సంవత్సరాన్ని లీపు సంవత్సరంగా పరిగణిస్తున్నారు. అదేమాదిరిగా భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని ఒకరోజు అంటే 24 గంటలుగా పరిగణిస్తున్నా.. దాని భ్రమణ వేగాన్ని బట్టి అంటే మందగిస్తే 24 గంటలకంటే ఎక్కువ పట్టడం, వేగం పెరిగితే 24 గంటలకంటే తక్కువ సమయం పట్టడం వల్ల ఆ హెచ్చుతగ్గులను సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. భూభ్రమణ వేగం తగ్గి కాల వ్యత్యాసం 0.9 సెకన్లకు చేరినప్పుడు యూటీసీ సమయానికి ఒక సెకండును కలుపుతారు. దాన్నే లీపు సెకండు అంటారు.
అణు గడియారాల సాయంతో
రోజులో ఒక సెకండు వ్యత్యాసమే కదా.. అనుకోవచ్చు. కానీ దీర్ఘకాలంలో ఉపగ్రహాలు (శాటిలైట్స్), జీపీఎస్, అంతర్జాతీయ కమ్యూనికేషన్ నెట్‌వర్క్స్, కంప్యూటర్లు వంటి సున్నిత వ్యవస్థలపై ప్రభావం చూపొచ్చు. అందుకే శాస్త్రవేత్తలు కచ్చితంగా లెక్కించే అధునాతన అణు గడియారాల సాయంతో నిరంతరం సమయాన్ని పర్యవేక్షిస్తుంటారు. దీన్నే కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైమ్‌గా పిలుస్తున్నారు. దీన్నే ప్రామాణికంగా తీసుకుని అన్ని ఫోన్లు, కంప్యూటర్లలోనూ సమయాన్ని నిర్దేశిస్తారు. మరోవైపు శాస్త్రవేత్తలు ఉపగ్రహాల ద్వారా భూమి భ్రమణాన్ని పర్యవేక్షిస్తుంటారు. స్థిర తారలతో పోల్చి చూడటం ద్వారా భూమి స్థితిని తనిఖీ చేస్తుంటారు. ఒకసారి భూమి తన చుట్టూ తాను తిరగటానికి పట్టిన కాలం.. అణు గడియారాల సమయం మధ్య తేడాలేవైనా ఉన్నాయేమోనని గమనిస్తుంటారు. గత ఏడాది జులై 5న మామూలుగా కంటే 1.66 మిల్లీసెకండ్ల ముందే రోజు ముగిసి అతి పొట్టి దినంగా రికార్డులకు ఎక్కింది. అణు గడియారాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇలాంటిది గమనించటం అదే తొలిసారి. అయితే 1972 నుంచి రోజులు కాస్త త్వరగా ముగుస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూ భ్రమణ వేగంలో వ్యత్యాసాలు చాలాసార్లు కొద్దికాలమే ఉంటాయి. అందువల్ల పెద్ద వ్యత్యాసంగా కనిపించదు. ఒక ఏడాదిలో దీన్ని అంచనా వేయడం కష్టమే. కానీ ఇటీవల పొట్టి రోజులు ఎక్కువుతున్న ందున ఒక సెకండును తొలగించే అవకాశాలూ పెరుగుతున్నాయి. ఇప్పటి నుంచి 2035 మధ్యలో దీనికి 40% వరకు అవకాశముందని వివరిస్తున్నారు.
భూమి వేగానికి కారణమేంటి?
భూ భ్రమణ వేగంలో ఈ వ్యత్యాసాలకు చాలా అంశాలు కారణమవుతుంటాయి. చంద్రుడు, సముద్ర అలలు గణనీయమైన ప్రభావం చూపుతాయి. చంద్రుడు భూమి చుట్టూ సరిగ్గా వృత్తాకారంలో ఏమీ తిరగడు. భూమధ్యరేఖ నుంచి వీలైనంత ఎక్కువ దూరంలో ఉన్నప్పుడు భూమి భ్రమణ వేగం పెరుగుతుంది. వేసవిలో సహజంగానే భూమి కాస్త ఎక్కువ వేగంతో తిరుగుతుంది. గురుత్వాకర్షణ, గాలులు, నీటి సాంద్రత వల్ల సముద్ర జలాలు కదలటం.. కాలాల మార్పులు భూమి వేగాన్ని ప్రభావితం చేస్తాయి. మరోవైపు భూమిలోని ద్రవ అంతర్భాగ వేగమూ గత 50 ఏళ్లుగా నెమ్మదిస్తోంది. దీంతో దాని చుట్టూ ఉన్న ఘన భూమి వేగం పెరుగుతోంది. ఈ పరిణామాలను చూస్తే భవిష్యత్తులో రోజు కాలం తగ్గటం తథ్యంగా కనిపిస్తోంది.
కలపడమే.. తగ్గింపు లేదు
భూ భ్రమణానికి అనుగుణంగా శాస్త్రవేత్తలు అణు గడియారాల సమయాన్ని సవరిస్తుంటారు. వ్యత్యాసాలను బట్టి ఒక సెకండు తగ్గించటమో.. కలపటమో చేస్తుంటారు. ఇప్పటివరకూ లీప్ సెకండ్లను కలపటమే గానీ తీయటమనేది జరగలేదు. మొత్తం మీద 27 లీప్ సెకండ్లను యూటీసీకి కలిపారు. అయితే భూ భ్రమణ వేగం పెరగటం వల్ల 1972 నుంచి వీటిని కలపటం నెమ్మదించింది. 70 దశకంలో తొమ్మిది లీప్ సెకండ్లను కలపగా.. 2016 నుంచి ఒక్క సెకండునైనా కలపలేదు. 2035 కల్లా లీప్ సెకండ్లు కలపడాన్ని విరమించుకోవాలని 2022లో నిర్ణయించారు. కానీ భూ భ్రమణ వేగం ఇలాగే కొన్నేళ్ల పాటు పెరుగుతూ పోతే యూటీసీ నుంచి ఒక సెకండును తొలగించే అవకాశముందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.










Comments