వైకాపా నాయకులపై పోలీస్ కేసులు
- BAGADI NARAYANARAO

- Nov 13
- 1 min read
శ్రీకాకుళంలో 8 మందికి నోటీసులు
జిల్లావ్యాప్తంగా వీడియో ఫుటేజ్‌ను పరిశీలిస్తున్న అధికారులు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
ప్రభుత్వ వైద్యకళాశాలలను పీపీపీ పద్ధతిలో ప్రైవేట్‌కు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం వైకాపా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన నిరసన ప్రదర్శనపై ప్రభుత్వం కన్నెర్ర చేసింది. పోలీసుల అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించినందుకు శ్రీకాకుళం నియోజకవర్గానికి చెందిన ఎనిమిది మందిని ప్రధానంగా గుర్తించారు. వీరితో పాటు మరికొందరిపై రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అమలులో ఉన్న పోలీసు యాక్ట్`30ని ఉల్లంఘించారని, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని, వందలాది మంది ఒక్క దగ్గర గుమిగూడారని కేసులు నమోదు చేశారు. వైకాపా జిల్లా ప్రధాన కార్యదర్శ గేదెల పురుషోత్తమరావు నిరసన ర్యాలీ చేపట్టడానికి శ్రీకాకుళం డీఎస్పీకి అనుమతి కోరారు. వైకాపా అనుమతిని డీఎస్పీ తిరస్కరించారు. కేవలం 50 మంది మాత్రమే తహసీల్ధారు కార్యాలయానికి వచ్చి వినతిపత్రం అందిస్తామని విన్నవించగా, దానికి పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. పోలీసుల నుంచి అనుమతి పొందిన వైకాపా నాయకులు దాన్ని ఉల్లంఘించి ర్యాలీ నిర్వహించారనే అభియోగంపై రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై వైకాపా నాయకులు మండిపడుతున్నారు. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. పోలీసుశాఖను వాడుకొని వేధింపులకు పాల్పడుతుందని విమర్శలు గుప్పిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 8 నియోజకవర్గాల్లో నిర్వహించిన నిరసన ర్యాలీలపై పోలీసులు ఆంక్షలు పెట్టడం, వాటిని వైకాపా నాయకులు, శ్రేణులు ఉల్లంఘించారని కేసులు నమోదు చేయడానికి సిద్ధమవుతున్నట్టు వైకాపా నాయకులు చెబుతున్నారు. గతంలో వివిధ సందర్భాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించిన నిరసన ర్యాలీలు, ఆందోళనలపై కొన్నిచోట్ల కేసులు నమోదయ్యాయి. అందులో బాధ్యులుగా గుర్తించి విచారణకు రావాలని పోలీసులు నోటీసులు పంపించినట్టు వైకాపా నాయకులు చెబుతున్నారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిర్వహించిన కార్యక్రమాలకు జనసమీకరణ కాకుండా పోలీసులు ఆంక్షలు విధించినా, లెక్క చేయకుండా వాటిని మీరుతూ వైకాపా నిర్వహించడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ర్యాలీలు విజయవంతం కావడానికి పోలీసుల వైఫల్యంగా ప్రభుత్వం ఆక్షేపిస్తుంది. దీంతో ఆంక్షలు ఉల్లంఘించినట్టు కేసులు నమోదు చేసి నోటీసులు అందించి విచారణకు వైకాపా నాయకులను స్టేషన్‌కు పిలుస్తున్నారు.










Comments