వంకర తీసిన శంకర
- NVS PRASAD
- 2 days ago
- 3 min read
రెండేసి ఇన్‌ఛార్జిలకు మంగళం
కలిసి రానివారిని వదిలించుకునే ప్రయత్నం
గత ఎన్నికలు, విధేయతే ప్రమాణికం
అధ్యక్ష బరిలో పాండ్రంకి, ఉంగటి
ప్రధాన కార్యదర్శిగా కోరాడ హరి
నగర తెలుగు యువత అధ్యక్షుడిగా గిరిజాశంకర్
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
శంకరేంటి.. ఎమ్మెల్యే అభ్యర్థేంటి.. అసలు మనం చేస్తేనే కదా గెలిచేది.. మనం ఎటుంటే అటే ఎమ్మెల్యే అన్న రీతిలో వంకరటింకరగా గడిచిన ఎన్నికల్లో వ్యవహరించిన టీడీపీ నగర కేడర్‌కు గొండు శంకర్ గట్టి దెబ్బే కొట్టారు. ఎన్నికలై ఏడాదైనా ఇంకా పాత వాసనలు వదిలించుకోని వారిని ఆయనే వదిలేశారు. అంతా పార్టీ నిర్ణయమేనని బయటకు చెబుతూనే తన సొంత టీమ్‌ను సిద్ధం చేసుకున్నారు.
శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అధ్యక్ష, కార్యదర్శుల పోస్టులు దాదాపు ఖరారైపోయాయి. లాంచనంగా ప్రకటించడమే తరువాయి. రాష్ట్రమంత్రి అచ్చెన్నాయుడు జిల్లాలో లేకపోవడం వల్ల ప్రకటన విడుదల వాయిదా పడిరది. లేదంటే.. పార్లమెంటరీ పరిధి మహానాడులోనే కమిటీని ప్రకటించి ఉండేవారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు నగర టీడీపీ అధ్యక్షుడిగా మాజీ కౌన్సిలర్ పాండ్రంకి శంకర్, ప్రధాన కార్యదర్శిగా కోరాడ హరిగోపాల్‌లను నియమించినట్లు తెలుస్తుంది.
అరసవల్లి టీడీపీ ఇన్‌ఛార్జిగా ఉన్న ఉంగటి వెంకటరమణను నగర పార్టీ అధ్యక్షుడ్ని చేసి, కప్పగంతుల కార్యకర్తలకు చెక్ పెట్టాలని ఎమ్మెల్యే గొండు శంకర్ భావిస్తున్నారు. కానీ, ఎమ్మెల్యేతో పాటు నగర పార్టీ అధ్యక్షుడు కూడా వెలమే అవుతారేమోనన్న కోణంలో పార్టీ అభ్యంతరం చెబుతుందన్న భావన శంకర్‌కు ఉంది. అలా కాకుండా ఇతర పార్టీల అధ్యక్షుల్ని లెక్కలోకి తీసుకుంటే ఉంగటి వెంకటరమణ గట్టి పోటీయే ఇస్తున్నారు. శ్రీకాకుళం ఎమ్మెల్యేగా ధర్మాన ప్రసాదరావు ఉన్నప్పుడు నగర పార్టీ అధ్యక్షుడిగా అదే సామాజికవర్గానికి చెందిన సాధు వైకుంఠరావు పని చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అంబటి కృష్ణ పోటీ చేసినప్పుడు అదే సామాజికవర్గానికి చెందిన గోవింద మల్లిబాబు టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. బీజేపీ నుంచి చల్లా వెంకటేశ్వరరావు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి, ఆ తర్వాత కాలంలో ఆయనే టౌన్ బీజేపీ అధ్యక్షుడిగా పని చేశారు. కాబట్టి ఉంగటి రమణకు అడ్డు లేదనుకుంటే అలా ముందుకు పోతారు. లేదూ అంటే మాత్రం పాండ్రంకి శంకర్ (కాపు), కోరాడ హరిగోపాల్ (కళింగకోమటి)లతో పార్టీ సంస్థాగత ఎన్నికల పూర్తయిందనిపిస్తారు.
మహానాడు లోపు పార్టీని నియోజకవర్గాల స్థాయిలో సంస్థాగతంగా పునర్నిర్మించాలని పిలుపునివ్వడం వల్ల నెల రోజులు పైబడి ఎమ్మెల్యే గొండు శంకర్ దీని మీద తీవ్ర కసరత్తు చేశారు. అందులో భాగంగానే కులాలు, ప్రాంతాలను పరిగణలోకి తీసుకొని కమిటీని ఖరారు చేసినట్లు తెలుస్తుంది. బూత్ లెవెల్‌లో కమిటీలు వేయాలి, వార్డు ఇన్‌ఛార్జిలు సమావేశానికి రావాలని పిలుపునిస్తే, కొన్ని డివిజన్లలో సరైన స్పందన కనపడలేదు. మరికొన్ని డివిజన్లలో నామ్కే వాస్తేగా వచ్చి మొక్కుబడి మీటింగ్‌లో కూర్చుని వెళ్లిపోయేవారు. గొండు శంకర్ కూడా చాలా రోజుల నుంచి ఇటువంటి వారిని పొమ్మనలేక, పొగబెట్టలేక మోసుకు తిరిగారు. అయితే ఇప్పుడు సంస్థాగత నిర్మాణం పుణ్యమాని ఇటువంటి చాలామంది ఇన్‌ఛార్జిలను ఇంటికి పంపించేస్తున్నారు.
2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున గొండు శంకర్ టిక్కెట్ తెచ్చుకుంటే, ఆయన్ను కొందరు ఓపెన్‌గానే వ్యతిరేకించగా, మరికొందరు మాత్రం అప్పటి ఎంపీ రామ్మోహన్‌నాయుడు, పార్టీ అధ్యక్షుడు కూన రవికుమార్‌లపై ఒత్తిడి తెచ్చి మరీ తమ పంతం సాధించుకున్నారు. తీరా పోల్ మేనేజ్‌మెంట్ దగ్గరకు వచ్చేసరికి తెర వెనుక కుట్రలు పన్నడంతో ఈసారి కమిటీ కూర్పు ఎలా ఉంటుందోనన్న ఆసక్తి అందరిలోనూ రేకెత్తింది. ఎందుకంటే గడిచిన ఎన్నికల్లో శంకర్ గెలుపు కోసం ఏమాత్రం పని చేయకుండా వెన్నుపోటు రాజకీయాలు చేసినవారినే ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత అక్కున చేర్చుకున్నారనే వాదన బలంగా వినిపించింది. ఎమ్మెల్యే కూడా ఇది తన దృష్టిలో ఉన్నా, అటువంటి వారెవర్నీ దూరం పెట్టే ప్రయత్నం చేయలేదు. నగరం మీదే రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడి దృష్టి ఉండటం, కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు కార్యాలయం ఇక్కడే ఉండటం వంటి కారణాల వల్ల ఎవరు ఎవరితో ఉన్నారు? ఎవరు వెన్నుపోటు పొడిచారు? అన్న అంశాల జోలికి గొండు శంకర్ ఇన్నాళ్లూ పోలేదు. కానీ తొలిసారిగా తనకు అనుకూలంగా కమిటీని ఏర్పాటు చేసుకుంటున్నారు.
ఎన్నికలు జరిగిన ఏడాది తర్వాత సంస్థాగతంగా పార్టీ నిర్మాణం చేపడుతున్నందున పాత, కొత్త కలయిక తప్పదు. కాకపోతే సింబల్ మేరకు తనతో వచ్చినవారికి మాత్రం ఆయన అగ్రతాంబూలం ఇచ్చారు. ఇందులో భాగంగానే పాండ్రంకి శంకర్, కోరాడ హరిగోపాల్‌కు ప్రధాన పోస్టులు దక్కనున్నట్టు భోగట్టా. వాస్తవానికి నగర అధ్యక్ష పదవికి చాలామంది పోటీ పడ్డారు. బరిలో ఆర్థికంగా, సామాజికంగా బలంగా ఉండే వ్యక్తులు కావాలని శంకర్ కూడా భావించారు. ఆ కేటగిరీలో ఫిల్టర్ చేస్తే నలుగురు తేలారు. కానీ గడిచిన ఎన్నికలకు ముందు తాను టిక్కెట్ ఊగిసలాటలో ఉన్నప్పుడు, వచ్చిన తర్వాత చివరి వరకు గుండ కుటుంబంతో అంటిపెట్టుకుని ఉన్నవారిని వేరుగా చూస్తే పాండ్రంకి శంకర్, కోరాడ హరిగోపాల్‌లు, ఉంగటి వెంకటరమణ నిగ్గుతేలినట్టు భోగట్టా. బలగ ప్రాంతం నుంచి శంకర్ సర్పంచ్‌గా ఉన్నప్పుడు కూడా అనుచరుడుగా ఉన్న రెడ్డి గిరిజాశంకర్‌కు పట్టణ తెలుగు యువత అధ్యక్ష బాధ్యతలు అప్పగించనున్నట్టు తెలుస్తుంది.
ఇక 50 డివిజన్లలోనూ కేవలం గడిచిన ఎన్నికల్లో తన పట్ల విధేయత చూపినవారికే శంకర్ పెద్దపీట వేశారు. ఒకే ఇంటిలో రెండు వార్డులకు ఇన్‌ఛార్జిలు ఉండటం, భార్యాభర్తలో, తల్లీకొడుకులో, తండ్రీ కూతుర్లో వేర్వేరు వార్డుల్లో ఇన్‌ఛార్జిలుగా వ్యవహరించడం వంటివాటికి ఫుల్‌స్టాప్ పెట్టారు. దీంతో 50 డివిజన్లలో అందర్నీ సర్దుబాటు చేశారు. ఏది ఏమైనా గెలిచిన ఏడాది తర్వాత ఎమ్మెల్యే శంకర్ తన సొంత టీమ్‌ను తయారుచేసుకోగలుగుతున్నారు. ఎన్నికల నాటికి, ఇప్పటికి జరిగిన అనేక పరిణామాలు కూడా శంకర్ కొత్త జట్టు కూర్పునకు ఉపయోగకరంగా మారింది.
ఇప్పటికీ గుండ కుటుంబంతో ఎవరు టచ్‌లో ఉన్నారో, వైకాపాతో కలిసి గ్రామాల్లో ఎవరు రాజకీయాలు చేస్తున్నారోనన్న డేటా ఎమ్మెల్యే వద్ద ఉంది. ఉదయం లేచింది మొదలు అర్థరాత్రి ఇంటికెళ్లేవరకు బయటే ఉండే ఎమ్మెల్యేకు ఎప్పటికప్పుడు స్థానికుల నుంచి రిపోర్టులు అందడం వల్ల ఈ కూర్పునకు ఇవన్నీ ఉపయోగపడ్డాయి. ఇది కార్పొరేషన్ ఎన్నికల టీమ్ కాదు గానీ, 2029 సార్వత్రిక ఎన్నికలకు మాత్రం మళ్లీ ఇందులో మార్పులు, చేర్పులు తధ్యం. వాస్తవానికి యువకుడికి మాత్రమే నగర అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని, అందులో భాగంగానే వరం తనయుడు సంతోష్ పేరు పరిశీలనలో ఉందని అంతా భావించారు. అయితే, పార్టీకి వెళ్లిన జాబితాలో మాత్రం శంకర్, హరిగోపాల్, ఉంగటిల పేర్లే ఉన్నట్లు తెలుస్తుంది. నగర టీడీపీ ప్రధాన కార్యదర్శిగా రెడ్డి గిరిజాశంకర్‌కు ఇవ్వాలని భావించినా, కళింగ వైశ్య సామాజికవర్గం నుంచి ప్రాతినిధ్యం ఉండాలని హరిగోపాల్ పేరును పరిగణలోకి తీసుకున్నారు. ఇప్పటికే ఉంగటి రమణను ప్రభుత్వ పథకాల అమలుకమిటీలో సభ్యుడిగా నియమించారు. అలాగే అంధవరపు సంతోష్‌ను రిమ్స్ జనరల్ ఆసుపత్రి సలహామండలి సభ్యుడిగా ప్రతిపాదించారు. ప్రస్తుతం ఎమ్మెల్యే శంకర్ వద్ద ఉంది అని చెబుతున్న జాబితా మేరకైతే అధ్యక్ష, కార్యదర్శులుగా పాండ్రంకి శంకర్, కోరాడ హరిగోపాల్ పేర్లు వినిపిస్తున్నాయి. మాదారపు వెంకటేష్ కొద్ది రోజుల క్రితమే తాను రేస్‌లో లేనని ప్రైవేటుగా ప్రకటించినట్లు తెలుస్తుంది. ఇక కొర్ను నాగార్జున ప్రతాప్‌కు ఇవ్వాలన్న ప్రతిపాదన కూడా ఎమ్మెల్యే చుట్టూ తిరిగే వర్గం నుంచే వచ్చినప్పటికీ, ఆ పేరును అంగీకరించరని తేలింది. దీనికి తోడు ప్రతాప్ కూడా తన మద్దతు శంకర్‌కు ఉంటుందని చెప్పినట్లు భోగట్టా. శంకర్, హరిగోపాల్‌కు ఖరారైతే ఉంగటి రమణ సేవలను జిల్లా పార్టీకి వాడుకోనున్నట్టు భోగట్టా.
Hozzászólások