విజయం అమ్మాయిలది.. తెరవెనుక అతనే సారధి!
- DV RAMANA

- 2 days ago
- 3 min read
కష్టకాలంలో హెడ్ కోచ్‌గా అమోల్ ముజుందార్
అదే సమయంలో జట్టు నుంచి సీనియర్ల నిష్క్రమణ
జూనియర్లతో కూడిన టీమును తీర్చిదిద్దిన ఘనత
ప్రపంచ కప్‌తో పతాకస్థాయికి విజయ పరంపర
అంతర్జాతీయ క్రికెట్ ఆడకుండానే కప్‌ను ముద్దాడిన ధీరుడు

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
భారత మహిళల క్రికెట్ జట్టు తొలిసారి వన్డే వరల్డ్ కప్‌ను అందుకుంది. దేశమంతా ఆ సంబరాలు జరుపుకొంటున్న వేళ. జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తోపాటు పలువురు జట్టు సభ్యులు ఒక వ్యక్తికి పాదాభివందనాలు, ఆలింగనాలు చేసుకున్న దృశ్యాలు టీవీల్లోనూ, సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి. క్రికెటర్లు అంతగా గౌరవించిన ఆ వ్యక్తే మన మహిళా జట్టు హెడ్ కోచ్. పేరు అమోల్ ముజుందార్. మైదానంలో మన జట్టు రాణించడం, విజయం సాధించడానికి కారణం ఈయన వ్యూహ చతురత, నాయకత్వ బలమే కారణం. మహా విజయానికి కారకుడైన ముజుందార్ పూర్వాశ్రమంలో ప్రతిభావంతుడైన క్రీడాకారుడు. దేశివాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారించిన వీరుడు టీమ్ ఇండియాలో చోటు సంపాదించడంలో మాత్రం విఫలమయ్యారు. ఆయన విఫలమయ్యారనేకంటే క్రికెట్ రాజకీయాలే ఈ ప్రతిభావంతుడిని ఫెయిల్ చేశాయని చెప్పాలి. ఫలితంగా ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ అయినా ఆడని ఈ యోధుడు మన మహిళా జట్టుకు గురువు(హెడ్ కోచ్)గా బాధ్యతలు తీసుకోవడమే కాకుండా నిర్విరామ కృషితో జట్టును సుదృఢంగా తీర్చిదిద్ది వరల్డ్ కప్‌ను ముద్దాడిరచాడు. ఎన్నడూ ప్రచారం కోసం పాకులాడకుండా తెరవెనుకే ఉన్నప్పటికీ జట్టు ప్రతి అడుగులోనూ.. ప్రతి విజయంలోను ముజుందార్ ముద్ర సుస్పష్టం. భారత మహిళా క్రికెట్‌కు ఆయన సేవలు అమూల్యం.
ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ అయినా..
మన దేశంలో ఒక దుస్సంప్రదాయం ఉంది. అక్షరం ముక్క రానివాళ్లు పెద్ద పెద్ద విద్యాసంస్థలు నడుపుతుంటారు. ఏమాత్రం పరిజ్ఞానం లేనివాళ్లు రాజకీయాల్లో రాణిస్తుంటారు.. పదవుల్లో కూర్చొని పాలకులుగా మారిపోతుంటారు. అదే కోవలో క్రికెట్ ఆడనివారు.. అసలు బ్యాట్, బాల్ పట్టుకోవడమే తెలియనివారు మన క్రికెట్ రంగాన్ని పాలిస్తున్నారు. వారి దన్నుతో ఎందరో క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులన్న ముద్ర వేసేసుకున్నారు. అంతర్జాతీయ పోటీల్లో పదే పదే విఫలమైనా ఇటువంటి గాడ్‌ఫాదర్ల అండదండలతో జట్లలో తమ స్థానాలను పదిలపర్చుకున్నవారెందరో ఉన్నారు. ఇలాంటి ఇనుప గోడలే ప్రతిభావంతుల పాలిట అడ్డుగోడలుగా మారి వారి క్రీడా జీవితానికి వెలుగు లేకుండా చేసి, వారిని దురదృష్టవంతుల జాబితాలో చేర్చేసిన ఉదంతాలు కోకొల్లలు. అలాంటి దురదృష్టవంతుల్లో ఎన్నదగినవాడే ఈ అమోల్ ముజుందార్. పాఠశాల రోజుల్లో ముంబైలో సచిన్, కాంబ్లీల జోడీ ఏకధాటిగా 664 పరుగులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించినప్పుడు.. వారిద్దరిలో ఎవరు అవుటైనా బరిలోకి దిగేందుకు పాడ్స్ కట్టుకొని రెడీగా స్టాండ్స్‌లో ఏకంగా రెండు రోజులు నిరీక్షించిన దురదృష్టవంతుడు ఇతడే. అదే అతని క్రీడాజీవితాన్ని మసకబార్చేసింది. భారత అండర్`19 వరల్డ్ కప్ టీం వైస్ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ వంటి వారితో కలసి ఇండియా`ఏ జట్టులో కూడా ఆడాడు. తన రెండు దశాబ్దాల క్రీడా జీవితంలో రంజీ సహా దేశివాళీ పోటీల్లో పరుగుల వరద పారించి ఎన్నో సెంచరీలు కొట్టినా.. ఒక్కసారి కూడా మన జాతీయ సెలక్టర్లు ఇతడిపై తమ కరుణా కటాక్ష వీక్షణాలు ప్రసరింపజేయలేదు. భారత జట్టుకు ఎంపిక చేయాలని ఆలోచించలేదు. దీనికి కారణం.. అప్పట్లో భారత జట్టులో ఐదుగురు టాప్ బ్యాటర్లు గట్టివారే ఉండటం, దానికితోడు ముజుందార్ వెనుక క్రికెట్‌ను శాసించే పెద్దలెవరూ లేకపోవడం. క్రీడాకారుడిగా ఆయన ప్రతిభను గణాంకాల్లో చూస్తే 38 ఏళ్ల వయసు వరకు రంజీ పోటీల్లో ఆడిన ముజుందార్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 171 మ్యాచ్‌లు 11,167 పరుగులు, లిస్ట్`ఏ క్రికెట్‌లో 113 మ్యాచ్‌లు ఆడి 3286 పరుగులు సాధించాడు. అయినా భారత క్రికెట్ జట్టులో స్థానం పొందలేకపోయాడు. ఎప్పటికైనా ఒక్క అవకాశం రాకపోతుందా అన్న ఆశతో ఎదురుచూపులతోనే సరిపోయింది.
ముళ్ల కిరీటమని తెలిసినా..
క్రీడాకారుడిగా లభించని అవకాశం మరో రూపంలో తలుపు తట్టింది. అదే భారత మహిళల క్రికెట్ హెడ్ కోచ్ పదవి. అది ఉన్నత పదవే అయినా అంతకంటే ముళ్ల కిరీటం. జట్టు గెలుపు ఓటములకు టీంతోపాటు నేరుగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. దానికి తగినట్లు 2023లో అమోల్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించేనాటికి భారత మహిళా జట్టు వరుస పరాజయాలు, అవమాన భారాలతో పూర్తిగా కుంగిపోయిన స్థితిలో ఉంది. రమేష్ పవార్ కోచ్ బాధ్యతల నుంచి వైదొలగిన తర్వాత పది నెలలపాటు కోచ్ లేక జట్టు పరిస్థితి దారుణంగా తయారైంది. పైగా అదే సమయంలో మిథాలిరాజ్, రaూలన్ గోస్వామి వంటి పలువురు ప్రతిభావంతులైన సీనియర్ క్రికెటర్లు రిటైర్ కావడంతో మహిళల టీము పరిస్థితి నడిపించేవారు లేని నావలా తయారైంది. ఆ పరిస్థితుల్లో జట్టు బాధ్యతలను నెత్తికెత్తుకున్న ముజుందార్ జట్టును తీర్చిదిద్దే బాధ్యతను సవాల్‌గా స్వీకరించారు. మొదట ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం పెంచారు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ కోచ్‌గా, దక్షిణాఫ్రికా జట్టు భారత పర్యటనలో తాత్కాలిక కోచ్‌గా పనిచేసిన అనుభవం ఉన్న ఆయన అదనంగా ముంబై జట్టు ప్రధాన కోచ్‌గా, భారత అండర్-19, అండర్ -23 జట్ల కోచింగ్ స్టాఫ్‌లో ఒకరిగా పని చేసిన అనుభవం ఉంది. ఆయన దాన్నంతా రంగరించి తన మార్గదర్శనంలో దశ, దిశ కల్పించారు. 2024లో జరిగిన టీ20 ప్రపంచ కప్‌లో మన మహిళా జట్టు ఆటతీరు నిరాశాజనకంగా ఉన్నా.. నిస్పృహ చెందకుండా వన్డే ఫార్మాట్‌పై దృష్టి సారించారు. 2025లో భారత్ మొదట ఇంగ్లండ్ గడ్డపై సిరీస్ గెలిచింది. తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియాపై సిరీస్ విజయం సాధించడంతో ఆత్మవిశ్వాసం పెరిగింది.
లీగ్ దశలో తడబడినా..
ఈ ఏడాదిలోనే గెలుపు బాట పట్టి ఆత్మవిశ్వాసంతో ఉన్న జట్టును మన దేశంలో జరిగే ప్రపంచ కప్ పోటీల కోసం ముజుందార్ ముందునుంచే సిద్ధం చేశారు. అయితే వరల్డ్ కప్ తొలి దశ లీగ్ పోటీల్లో మన జట్టు తీరు ఏమంత సంతృప్తికరంగా లేదు. మొత్తం ఆరు లీగ్ మ్యాచ్‌ల్లో తొలి రెండు గెలిచినా తర్వాత మూడిరటిలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ చేతిలో వరుస ఓటములు తప్పలేదు. ఆ తరుణంలో కోచ్ ముజుందార్ ఇచ్చిన విలువైన సూచనలు, కల్పించిన ఆత్మవిశ్వాసంతో మన క్రికెటర్లు బాగా పుంజుకున్నారు. దాంతో జట్టు మళ్లీ గాడిలో పడి న్యూజీలాండ్‌పై విజయం సాధించి సెమీఫైనల్లోకి నేరుగు అడుగుపెట్టగలిగింది. అక్కడ ప్రపంచ కప్ చరిత్రల్లోనే రికార్డు స్థాయి స్కోర్‌ను ఛేజ్ చేసి, ఏడుసార్లు విజేత నెంబర్ వన్ జట్టయిన ఆస్ట్రేలియాను సెమీ ఫైనల్లోకి ఇంటికి పంపగలిగింది. తమ జట్టులో ఈ గుణాత్మక మార్పునకు ప్రధాన కారణం కోచ్ అమోల్ మజుందార్ శిక్షణ, సలహాలేనని కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ స్వయంగా వెల్లడిరచింది. అదే స్ఫూర్తిని, ఆత్మవిశ్వాసాన్ని భారత జట్టు ఫైనల్లోనూ కొనసాగించింది. ‘ఇంగ్లండ్‌తో మ్యాచ్ తర్వాత సార్ కొంచెం కోపంగా మాట్లాడారు కానీ.. అది మాకు ఒక ఇన్‌స్పిరేషన్ అయ్యింది. ఆ మాటల్లో ప్రేమ, బాధ్యత ఉన్నాయి. ఆయన చెప్పింది నిజమని అందరం అంగీకరించాం. ఆ తర్వాత ప్రతి ఒక్కరితో వ్యక్తిగతంగా మాట్లాడి, జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపారు’ అని హర్మన్‌ప్రీత్ చెప్పడాన్ని చూస్తే.. జట్టుపై ముజుందర్ ముద్ర ఎంత బలంగా ఉందో.. ప్రపంచ కప్ విజయంలో ఆయన ఎంత కీలక పాత్ర పోషించారని అర్థం అవుతుంది.










Comments