విజయాలకు స్ఫూర్తి.. అధికారుల తీరుతో అపఖ్యాతి!
- NVS PRASAD
- Aug 12
- 2 min read
కార్గిల్ పార్కు సాక్షిగా రూ.52 లక్షలు బురదపాలు!
పనులను పట్టించుకోని మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులు
సగం పని చేసి చేతులెత్తేసిన ఒక కాంట్రాక్టర్
ఇష్టారాజ్యంగా పనులు చేసిన మరో ఘనుడు
ఉన్న సౌకర్యాలను కూడా ఉడ్చేసిన సమన్వయ లోపం
ఒక షర్టు కుట్టాలంటే ముందు కటింగ్ మాస్టర్ కోతలేస్తాడు.. ఆ తర్వాత దర్జీ స్టిచ్చింగ్ చేస్తాడు.. కాజాలు కుట్టేవాడొకడు, బొత్తాలు పెట్టేవాడొకడు.. ఉంటారు. చివరకు ఇస్త్రీతో పరిపూర్ణమైన షర్టు మన ఒంటిపైకి వస్తుంది. ఇన్ని విభాగాలను సమన్వయం చేయాలంటే టైలరింగ్ షాపు నిర్వాహకుడికి వాటిపై పూర్తి అవగాహన ఉండాలి. లేకపోతే లేడీస్ టైలర్‌లో రాజేంద్రప్రసాద్ బట్టల సత్తిగాడికి కుట్టిన షర్టు మాదిరిగా తయారవుతుంది పరిస్థితి. సమన్వయం లోపిస్తే ఏ పనైనా అలానే ఏడుస్తుందనడానికి తాజా ఉదాహరణే నగరంలోని కార్గిల్ పార్కు.

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
కార్గిల్‌లో పాక్‌పై భారత్ సాధించిన విజయానికి గుర్తుగా స్థానిక జిల్లాపరిషత్ ఎదురుగా ఉన్న హౌసింగ్‌బోర్డు కాలనీలో ఒక పార్కును నిర్మించారు. నగరంలో ఇదే అతి పెద్ద పార్క్. అతి పెద్ద హౌసింగ్ బోర్డు కాలనీకి మధ్యలో ఉన్న ఈ పార్కును స్థానికులు నిత్యం ఉపయోగిస్తుండగా. నాయకులు, అధికారులు మాత్రం దేశభక్తి పొంగిపొర్లే రోజుల్లోనే విజిట్ చేస్తుంటారు. ఆమధ్య ఈ పార్క్ మీద మున్సిపల్ అధికారులకు ప్రేమ పొంగుకొచ్చినట్టుంది. నగరంలో ఎక్కడా లేనివిధంగా అత్యంత సుందరమైన పార్కుగా దీన్ని తీర్చిదిద్దడానికి నడుం బిగించారు. అంతవరకు బాగానే ఉంది. కానీ మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం, అప్పటి మున్సిపల్ ఇంజినీర్‌కు ఇంజినీరింగ్ పనుల మీద తప్ప మిగతా వాటిపైనే దృష్టి ఉండటం, అసలు కాంట్రాక్టర్ సబ్ కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించడం, మరో కాంట్రాక్టరు తనకు ఇచ్చిన డబ్బులకు ఇంతే పని జరుగుతుందని చేతులెత్తేయడంతో కార్గిల్ పార్కు పరిస్థితి గతంలో కంటే కార్గిల్ పార్క్ పరిస్థితి ప్పుడు ఘోరంగా తయారైంది. ఇప్పుడు కాలనీ వాసులకు.. ఈ పార్క్‌లో అడుగు పెట్టడం, మురుగు కాలువలో కాలు వేయడంలో ఏది కావాలో కోరుకోమంటే.. కాలువ వైపే మొగ్గు చూపుతున్నారు. నగరం నడిబొడ్డులో ఉన్న ఈ పార్క్ కోసం ఇంత ఉపోద్ఘాతము అవసరమా? అని బయటివారికి అనిపించొచ్చు. కానీ అక్షరాలా ఇక్కడ రూ.52 లక్షల రూపాయల పనులు చేసినట్లు మున్సిపల్ కార్యాలయంలో రికార్డులు చెబుతున్నాయి. కాంట్రాక్టర్లకు బిల్లులు ఏమేరకు చెల్లించారు? ఎప్పుడు చెల్లిస్తారు? పక్కన పెడితే.. ఇదంతా ప్రజల సొమ్ము. ఒక్క ఊపిరి పీల్చడానికి తప్ప, అన్నింటి మీదా పన్నులు వేసి సామాన్యుడి నడ్డి విరగ్గొడుతున్న ప్రభుత్వాలు ఇలా ఏమాత్రం బాధ్యత లేని అధికారులను తీసుకువచ్చి శ్రీకాకుళం నగరపాలక సంస్థలో కూర్చోబెట్టి ప్రజాసొమ్మును బురదపాలు చేస్తున్నారనడానికి సాక్ష్యమే కార్గిల్ పార్క్.
కాంట్రాక్టర్లు.. అధికారులు.. ఎవరి దారి వారిదే
15వ ఆర్ధిక సంఘం నిధుల నుంచి ఈ పార్కుకు రూ.12 లక్షలు కేటాయించారు. పార్క్‌లో మట్టి వేయడం, అందులో మొక్కలు పెంచడానికి ఈ సొమ్ము వినియోగించాలి. అయితే ఎంతమేరకు ఎత్తు చేయాలి? ఏ మెటీరియల్ వాడాలి? ఏ మొక్కలు నాటాలి? అనే స్పెసిఫికేషన్‌లు ఎక్కడా నిర్దేశించలేదు. కాగా ఆ నిధులతో భూమిని కొంత ఎత్తు చేసి.. నాలుగు పిచ్చిమొక్కలు నాటి.. ఇచ్చిన రూ.12 లక్షలకు ఈ పని మాత్రమే అవుతుందంటూ కాంట్రాక్టర్ చేతులు దులిపేసి వెళ్లిపోయాడు. అయినా ఆయనకు బిల్లుల చెల్లింపునకు ఇప్పుడు కార్పొరేషన్ సిద్ధంగా ఉంది. జీఎస్టీ వ్యవహారంలో కిందామీద పడుతుండటం వల్ల ఆలస్యం జరిగిందిమైంది కానీ.. లేదంటే ఈపాటికే బిల్లులు అయిపోయుండేవి. ఇక ఇదే పార్క్ అభివృద్ధి కోసం ‘సుడా’ రూ.40 లక్షలు కేటాయించింది. ఈ పనులను దక్కించుకున్న కంట్రాక్టర్.. వాటిని మహేష్ అనే మరో కాంట్రాక్టర్‌కు ధారాదత్తం చేశాడు. పోనీ సబ్ కాంట్రాక్టరైనా సక్రమంగా పనులు చేయించాడా.. అంటే అదీ లేదు. ఈ రూ.40 లక్షలతో పార్క్ ప్రహరీ ఎత్తు పెంచాలని, వాచ్‌మెన్ రూమ్‌ను పునర్నిర్మించాలని, చిన్నపిల్లలు ఆడుకోడానికి క్రీడా పరికరాలు ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. అయితే పార్క్ ప్రహరీని ఎత్తు చేసినప్పుడే దాని లోపల ఫుట్‌పాత్ ఏరియా మొత్తం సిమెంట్ గట్టును కట్టేశారు. ఇప్పుడు ఆ గట్టు వరకు పాత కాంట్రాక్టర్ ఎర్త్ ఫిల్లింగ్ చేయాలి. పార్క్‌లో ఉన్న మట్టికంటే చుట్టూ కట్టిన గట్టు ఎత్తుగా ఉంది. దీంతో వర్షం పడినప్పుడు నీరు ఈ మట్టితో కలిసిపోయి పార్క్ మొత్తం బురదగా మారిపోతోంది. ఇక గ్రీనరీ కోసం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. చిన్నపిల్లల ఆట పరికరాలు ఎలా ఉన్నాయో ఫొటోలు చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. రూ.52 లక్షలతో చేపట్టిన ఈ పనులను మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులు ఏరోజూ పర్యవేక్షించలేదని అక్కడి చిన్నపిల్లాడినడిగినా చెప్పేస్తాడు. ‘సుడా’ రూ.40 లక్షలు ఇచ్చి మున్సిపాలిటీ ద్వారా ఈ పనులు చేపట్టాలని కోరింది. ఈ ఒక్క కారణానికే పని కాకముందే పర్సంటేజీలు సెటిలైపోయాయి. కానీ ఇప్పటి వరకు ఈ రెండు పనుల మధ్య సమన్వయం ఉన్నట్టు కనిపించడంలేదు. పిచ్చిపిచ్చి రంగులతో ప్రహరీ, బురద, మట్టితో పార్క్ చూసినవారు ఈ జిల్లాకు 75 వసంతాలు పూర్తి అవుతున్న సందర్భంగానైనా దీనిపై దృష్టి సారించాలని కోరుతున్నారు.
Comments