విడాకులకు దారితీస్తున్న జీవనశైలి
- DV RAMANA

- Jul 15, 2025
- 2 min read

ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్స్ సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ జంట తమ వైవాహిక బంధానికి బ్రేక్ చెప్పారు. చిన్ననాటి స్నేహితులు, బ్యాడ్మింటన్ క్రీడలో శిక్షణ పొందడం నుంచి పోటీల్లో పాల్గొనడం వరకు కలసిమెలసి మసలిన వీరు ఆ అనుబంధాన్ని వివాహం ద్వారా మరింతగా పటిష్టం చేసుకు న్నారు. అయినా కొన్నేళ్లకే ఈ జంట విడిపోవాలని నిర్ణయించుకున్నారంటే వివాహ బంధం ఎంత బలహీనమైపోయిందో అర్థమవుతుంది. వీరే కాదు ప్రముఖ సంగీత దర్శకుడు, అస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ దంపతులు సుమారు మూడు దశాబ్దాల వైవాహిక బంధానికి ముగింపు చెబుతున్నట్లు ఆమధ్య ప్రకటించారు. అలాగే ప్రముఖ క్రికెటర్ యజువేంద్ర చాహల్, ధనశ్రీ దంపతులు కూడా విడాకుల బాట పట్టారు. ఈ కేసు ప్రస్తుతం కోర్టులో పెండిరగులో ఉంది. ఈ ఉదంతాలన్నీ సనాతన ధర్మాన్ని, సంప్రదాయాన్ని పాటించే, దాన్ని గౌరవించే మన దేశంలో నానాటికీ విడాకుల కేసులు పెరిగిపోతున్నాయి. కొన్నేళ్ల క్రితం వరకు వివాహ వ్యవస్థపై అపరిమితమైన విశ్వాసం ఉండేది. కుటుంబంలో గానీ, భార్యాభర్తల మధ్య గానీ పొరపొచ్చాలు, విభేదాలు, గొడవలు తలెత్తినా తమలో తాము సర్దుకుపోయేవారు లేదంటే స్థానిక పెద్దల చొరవతో రాజీకి వచ్చేవారు. ఏకొద్దిమందో తప్ప కోర్టులకెక్కి విడాకుల వరకు వెళ్లేవారు కాదు. కానీ రాను రాను జీవనశైలితో పాటు మనుషులు నడవడిక మారిపోతోంది. సంప్రదాయలు, సనాతన వ్యవస్థల పట్ల పట్టింపు లేకుండా పోతోంది. దానితోడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పోయి చిన్న కుటుంబాలు ఏర్పడటం, భార్యాభర్తలు ఇరువురూ ఉద్యోగాలు చేస్తూ సంపాదనపరులుగా ఉండటం వల్ల కుటుంబ వ్యవస్థ కూడా దెబ్బతింటోంది. గతంలో భర్త బయటకెళ్లి ఉద్యోగమో, ఉపాధో పొంది సంపాదించి తెచ్చే బాధ్యత నిర్వర్తిస్తే.. భార్య ఇంటి మేనేజ్ చేస్తే నిలబెట్టే బాధ్యత చేపట్టేది. కానీ ఇప్పుడు మెజారిటీ కుటుంబాల్లో దంపతులిద్దరూ సంపాదిస్తుం డటంతో కుటుంబ బాధ్యతల నిర్వహణ విషయంలో వారి మధ్య ఇగో సమస్యలు తలెత్తుతున్నాయి. ఫలానా పని నేనే ఎందుకు చేయాలి? అన్న ధోరణి విభేదాలకు బీజం వేస్తోంది. అలాగే మానసిక దౌర్బల్యం కారణంగా ఇష్టమైన కూర వండలేదు.. ఇష్టమైన చీర కొనలేదు.. వంటి సిల్లీ కారణాలతోనూ చాలామంది విడాకులకు వెళ్లిపోతున్నారు. వీటికితోడు విడాకుల కేసుల విషయంలో సుప్రీంకోర్టు పలు నిర్ణయాలు తీసుకోవడంతో ఇవి త్వరత్వరగా పరిష్కారమై విడాకుల మంజూరు ప్రక్రియ వేగవంత మైంది. పూర్వం విడాకుల కేసు సెటిల్ కావడానికి సంవత్సరాలు పట్టేది. కానీ ఇప్పుడు పెళ్లి అయిన నెలల వ్యవధిలోనే అభిప్రాయాలు కలవడం లేదంటూ జంటలు విడాకులకు వెళుతుండగా, కోర్టులు కూడా అంతే వేగంగా మంజూరు చేసేస్తున్నాయి. ఫలితంగా ఈ కేసులు బాగా పెరిగిపోయాయి. దేశంలో విడాకులపై ఓ సంస్థ సర్వే చేయగా సంచలన విషయాలు వెల్లడయ్యాయి. రాష్ట్రాలవారీగా చూస్తే అత్యధిక విడాకుల రేటుతో మహారాష్ట్ర మొదటిస్థానంలో ఉంది. ముంబై, పుణె వంటి మహానగరాలు ఉండటంతో పాటు పెరుగుతున్న పట్టణీకరణ, ఆర్థిక స్వాతంత్య్రం, మానసిక ఒత్తిళ్లు వంటి కారణాల వల్ల మహారాష్ట్ర 18.7 శాతం విడాకుల రేటుతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత కర్ణాటక రాష్ట్రం 11.7 శాతంతో రెండో స్థానంలో ఉంది. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో కూడా విడాకుల రేటు అధికంగానే ఉన్నట్లు సర్వేలో తేలింది. చట్టపరమైన అవగాహన పెరగడం వల్ల ఈ రాష్ట్రంలో విడాకుల కేసులు రోజు రోజుకు పెరుగుతుండగా ప్రస్తుతం 8.8 శాతంతో మూడో స్థానంలో ఉంది. సంప్రదాయాలకు పెద్దపీట వేసే పశ్చిమ బెంగాల్‌లో కూడా విడాకుల రేటు క్రమంగా పెరుగుతుండటం గమనార్హం. ముఖ్యంగా కోల్‌కతా వంటి పట్టణ కేంద్రాల్లో విడాకుల రేటు 8.2 శాతం ఉన్నట్లు సమాచారం. అధిక పని ఒత్తిడి, వేగవంతమైన జీవితం, ఈ తరం జనాభాకు బంధాలపై పూర్తి అవగాహన లేకపోవడం తదితర కారణాలు విడాకుల కేసుల్లో పెరుగుదలకు దోహదం చేస్తున్నాయి. ఇక తమిళనాడులోని చెన్నై వంటి మహానగరాల్లో విడాకుల రేటు గణనీయంగా ఉన్నట్లు తేలింది. విద్య, ఆర్థిక స్వేచ్ఛ వల్ల ఈ రాష్ట్రంలో విడాకుల కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని విశ్లేషించగా ఇక్కడ విడాకుల రేటు 7.1 శాతంగా ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్‌లో విడాకుల రేటు అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ కెరీర్, జీవనశైలి వంటి అంశాలు దీనికి కారణమవుతు న్నాయి. ప్రస్తుతం తెలంగాణలో విడాకుల రేటు 6.7శాతంగా ఉంది.










Comments