top of page

వాడని రోడ్డుకు పన్నెందుకు కట్టాలి?

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Sep 6
  • 2 min read
  • స్టీల్‌ప్లాంట్‌ లాజిస్టిక్‌ కాంట్రాక్టర్‌ సవాల్‌

  • పన్ను వసూలు చేసిన రాష్ట్ర ప్రభుత్వంపై న్యాయపోరాటం

  • పిటిషనర్‌ వాదనతో ఏకీభవించిన సుప్రీంకోర్టు

  • పబ్లిక్‌ వనరులు వాడుకోకపోతే పన్ను కట్టక్కర్లేదని తీర్పు

ree

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)

పౌరుల సౌకర్యార్థం ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు వెచ్చించి మౌలిక వసతులు కల్పిస్తుంటాయి. వాటి నిర్వహణ బాధ్యతను కూడా అవే నిర్వర్తిస్తుంటాయి. అందుకుగాను.. ప్రభుత్వ వసతులను వాడుకుంటున్న ప్రజల నుంచి కొంత మేరకు పన్నులు వసూలు చేస్తుంటాయి. వాడుకుంటున్నవారి సంగతి సరే.. వాడుకోనివారు కూడా పన్నులు కట్టాల్సిందేనా? ఈ ప్రశ్న ఇంతవరకు ఎవరిలోనూ తలెత్తకపోవచ్చు. తలెత్తినా ప్రభుత్వం కల్పించిన మౌలిక వసతులను వినియోగించుకున్నా.. వినియోగించుకోకపోయినా సంబంధిత పన్నులు కట్టాల్సిందేనన్న భావనే అందరిలో ఉంది. కానీ ఒక సంస్థ ఇదే ప్రశ్నను లేవనెత్తి ప్రభుత్వాన్ని సవాల్‌ చేసింది. తన నుంచి ఉత్తపుణ్యానికి వసూలు చేసిన భారీ పన్ను మొత్తాన్ని తిరిగి పొందేలా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ద్వారానే ఉత్తర్వులు తెచ్చుకుంది. ఈ ఉత్తర్వులతో ప్రభుత్వం కొత్త సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు స్ఫూర్తితో ప్రభుత్వ సౌకర్యాలను వాడుకోనందున తాము కూడా పన్నులు చెల్లించేదిలేదని ఇతరులు భీష్మిస్తే.. వివాదాల పరిష్కారానికే పుణ్యకాలం ముగిసిపోతుంది. ఆ సంగతి పక్కనపెడితే.. సుప్రీంకోర్టు తీర్పు ప్రభుత్వ వనరులను ఉపయోగించుకోకపోయినా పన్నులు చెల్లిస్తున్నవారికి మాత్రం ఉపశమనం కలిగించే అంశమే.

అసలేం జరిగిందంటే..

విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ (రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌`ఆర్‌ఐఎన్‌ఎల్‌)లోని సెంట్రల్‌ డిస్పాచ్‌ యార్డ్‌లో ఇనుము, ఉక్కు ఉత్పత్తుల నిర్వహణ, నిల్వ కోసం 36 మోటారు వాహనాలను వినియోగించే కాంట్రాక్ట్‌ను 2020 నవంబరులో ఒక కాంట్రాక్టు సంస్థ చేజిక్కించుకుంది. స్టీల్‌ప్లాంట్‌ లోపల ఉండే ఈ యార్డ్‌ కాంపౌండ్‌ గోడలతో పటిష్టంగా ఉంటుంది. సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌) సిబ్బంది ద్వారా రాకపోకలను నియంత్రిస్తుంటారు. అలాగే ప్లాంట్‌లో కాంట్రాక్టు పనులు చేసే వాహనాలకు కూడా కాంట్రాక్ట్‌ వర్క్‌ పూర్తి అయ్యే వరకు బయటకు వెళ్లే అవకాశం ఉండదు. అదంతా స్టీల్‌ప్లాంట్‌కు చెందిన ప్రైవేటు స్థలం. రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం ఉండదు. రాష్ట్ర ప్రభుత్వ రోడ్లపై తిరగకుండానే తమ వాహనాలకు వసూలు చేసిన రోడ్డు ట్యాక్స్‌ను తమకు తిరిగి ఇచ్చేయాలని సదరు కాంట్రాక్టు సంస్ధ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అయితే ఈ వాదనను తిరస్కరిస్తూ రోడ్డు పన్ను తిరిగి ఇచ్చేదిలేదని రాష్ట్ర రవాణా శాఖ సమాధానం ఇచ్చింది. దీన్ని సవాల్‌ చేస్తూ కాంట్రాక్ట్‌ సంస్థ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించింది. దీన్ని విచారించిన సింగిల్‌ జడ్జి బెంచ్‌ పిటిషన్‌ దాఖలు చేసిన కాంట్రాక్టు సంస్థ తన వాహనాలను సెంట్రల్‌ డిస్పాచ్‌ యార్డ్‌ లోపల మాత్రమే నడుపుతోందని, అది పబ్లిక్‌(రాష్ట్ర ప్రభుత్వ ఆస్తి) ప్లేస్‌ కాదని స్పష్టం చేసింది. అందువల్ల పిటిషనర్‌ రోడ్డు ట్యాక్స్‌ కింద కట్టిన రూ. 22,71,700 తిరిగి చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఈ తీర్పును రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ముందు సవాల్‌ చేసింది. ఇది సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను పక్కన పెడుతూ గత ఏడాది డిసెంబర్‌లో ఆదేశాలిచ్చింది. దాంతో పిటిషనర్‌ సుప్రీంకోర్టు మెట్లెక్కారు.

సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు

ఈ అప్పీలును విచారణకు స్వీకరించిన న్యాయమూర్తులు మనోజ్‌ మిశ్రా, ఉజ్వల్‌ భూయాన్‌లతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్‌ ఆ సమయంలోనే కీలక వ్యాఖ్యలు చేసింది. వాహనాలు ఆర్‌ఐఎన్‌ఎల్‌కు చెందిన పరిమిత ప్రాంగణంలో ఉపయోగించిన లేదా ఉపయోగం కోసం ఉంచిన కాలానికి పన్ను విధించాల్సిన అవసరం లేదంటూ 1985లో ఒక లాజిస్టిక్స్‌ సంస్థ దాఖలు చేసిన కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించింది. విచారణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ మోటారు వాహన పన్ను చట్టం` 1963లోని సెక్షన్‌ 3ని డివిజన్‌ బెంచ్‌ ప్రస్తావిస్తూ.. ఈ నిబంధనలో ‘ప్రజా(పబ్లిక్‌) స్థలం’ అన్న పదాన్ని చాలా స్పష్టంగా ఉపయోగించారని ధర్మాసనం పేర్కొంది. మోటారు వాహనాలపై పన్ను విధించే విధానాన్ని ఇది వివరిస్తుందని బెంచ్‌ పేర్కొంది. రోడ్లు, హైవేలు వంటి ప్రజా మౌలిక సదుపాయాలను ఉపయోగిస్తున్నందుకు పౌరులు వాటి నిర్వహణ భారాన్ని కొంతైనా భరించాలన్నదే పన్ను విధించడంలోనే పరమార్థమని కోర్టు వ్యాఖ్యానించింది. వాహన పన్ను విధించే అధికారం చట్టప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నప్పటికీ దానికి కొన్ని పరిమితులు ఉంటాయని స్పష్టం చేసింది. ఈ కేసులో అప్పీలుదారు తమ సంస్థకు చెందిన మోటారు వాహనాలు వినియోగాన్ని స్టీల్‌ ప్లాంట్‌ ప్రాంగణానికే పరిమితం చేసినట్లు నిర్ధారణ అయినందున ఆ వాహనాలను ‘పబ్లిక్‌ ప్లేస్‌’లో ఉపయోగించడం లేదా ఉంచడం అనే ప్రశ్న తలెత్తదని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది, వాహనాన్ని పబ్లిక్‌ రోడ్లపై ఉపయోగించకపోయినా లేదా పబ్లిక్‌ ప్లేస్‌లో ఉంచకపోయినా మోటారు వాహన పన్ను విధించలేమని వెల్లడిరచింది. ‘ఒక మోటారు వాహనాన్ని పబ్లిక్‌ స్థలంలో ఉపయోగించకపోతే లేదా ఉపయోగించడానికి ఉంచకపోతే, సంబంధిత వ్యక్తి ప్రజా మౌలిక సదుపాయాల నుంచి ప్రయోజనం పొందుతున్నట్లు కాదు కాబట్టి.. ఆ కాలానికి అతనిపై మోటారు వాహన పన్ను భారం పడకూడదు’ అని స్పష్టం చేస్తూ సుప్రీంకోర్టు ద్విసభ్య బెంచ్‌ ఆగస్టు 29న ఇచ్చిన తీర్పులో స్పష్టం చేసింది. ఆ మేరకు పిటిషనర్‌ ఇప్పటికే చెల్లించిన ట్యాక్స్‌ సొమ్మును అతనికి వాపసు చేయాలని కూడా ఆదేశించింది. ఈ తీర్పు మన పన్నుల వ్యవస్థలో మార్పులకు నాంది పలికే అవకాశం ఉందంటున్నారు. ఈ తీర్పునే ఉదాహరణగా చూపిస్తూ ప్రభుత్వ వనరులను ఉపయోగించుకోనందున పన్నుల నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ తామరతంపరగా విజ్ఞాపనలు, కేసులు దాఖలయ్యే అవకాశం ఉంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page