వైదిక గ్రామంపై విద్వేషాల పెత్తనం!
- BAGADI NARAYANARAO

- Jul 15, 2025
- 3 min read
సంప్రదాయాలకు చిరునామాగా ఫరీదుపేట
కూరగాయల సాగులో ఉత్తరాంధ్రలోనే పేరు
విద్యావంతులు, ఉద్యోగులకు లోటు లేదు
విషబీజాలు నాటిన కొన్ని కుటుంబాల ఆధిపత్య ధోరణి
వాటికి ఆజ్యం పోసిన రాజకీయ విభేదాలు
పేరుప్రతిష్టలను మసకబార్చిన హత్యలు, గొడవలు, కేసులు

శ్రీకూర్మంలో ఐదు దశాబ్దాల క్రితమే కళింగ సత్రం నిర్మించి వైష్ణవ సంప్రదాయం ప్రకారం వివాహాలు, ఇతర వైదిక కర్మలు, పితృకర్మలు చేయిస్తున్న చరిత్ర ఆ గ్రామస్తులది.
రంగనాథస్వామి ఆలయం నిర్మాణం.. ఆ తర్వాత నుంచి అక్కడ పుట్టిన చాలామందికి రంగనాథం, రంగమ్మ అన్న పేర్లు పెట్టే సంప్రదాయానికి శ్రీకారం చుట్టిన గ్రామం అది.
వైష్ణవాలయాలకు వెళ్లే సమయంలోనే తిరునామాలు పెట్టుకునే సంప్రదాయం నిత్యం స్త్రీ, పురుష భేదం లేకుండా వర్థిల్లుతున్న వైదిక ప్రాంతమది.
నగరంలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం నారాయణ తిరుమలను నిర్మించిన విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి గురుగుబిల్లి యతిరాజులుది ఈ గ్రామమే.
నిరంతరం కాయగూరలు పండిరచి నగరానికి సరఫరా చేయడంతోపాటు ఒకప్పుడు దొండ సాగులో ఉత్తరాంధ్రకే టాప్‌గా నిలిచిన గ్రామం అది.
ఎన్నో విశిష్టతలు.. ఎన్నెన్నో సంప్రదాయాలకు ప్రసిద్ధి చెందిన ఆ ఊరే ఫరీదుపేట. కానీ ఒకే ఒక్క చెడ్డపేరు.. ఈ విశిష్టతలన్నింటీ ఊడ్చిపారేసి ఫరీదుపేట అంటే భయపడే పరిస్థితికి తీసుకొచ్చింది. అసలు ఎందుకీ దుస్థితి దాపురించింది? ఎవరు దీనికి కారకులు?? అన్న కోణంలో జరిపిన విశ్లేషణే ఈ కథనం.
(సత్యం న్యూస్, శ్రీకాకుళం)
ఓవైపు ఆధ్యాత్మిక ఔన్నత్యం.. మరోవైపు వ్యవసాయ రంగంలో పేరుప్రతిష్టలు సొంతం చేసుకున్న ఎచ్చెర్ల మండలం ఫరీద్‌పేట పేరెత్తితే మాత్రం జిల్లా ప్రజలు భయపడుతున్నారు. ఈ గ్రామంలో పని చేయడానికి ఉద్యోగులు సైతం ఇష్టపడరు. అయ్య బాబోయ్ అక్కడికా అంటూ వెనుకంజ వేసే పరిస్థితి. దీనికి కారణం కొన్ని కుటంబాల ఆధిపత్య ధోరణి. వాటికి రాజకీయాలు తోడు కావడంతో అగ్నిలో ఆజ్యం పోసినట్లయ్యింది. దేవుడి కార్యం విషయంలో రెండు వంశాల మధ్య దశాబ్దాల క్రితం తలెత్తిన ఆధిపత్య పోటీ క్రమంగా ముదిరి విభేదాలు, ఘర్షణల స్థాయికి చేరి.. హత్యలు, దాడుల వరకు వెళ్లిపోయింది. ఫలితంగా కొన్ని కుటుంబాలు మగదిక్కును కోల్పోతే.. కొందరు ఆస్తులు కోల్పోయి గ్రామంలో జీవనం గగనమై ఇతర ప్రాంతాలకు వలసపోవాల్సి వచ్చింది. జిల్లాలోనే ఏకైక ఫ్యాక్షన్ గ్రామంగా అత్యంత సమస్యాత్మక ప్రాంతంగా రికార్డులకు ఎక్కడమే కాకుండా.. గుడి, బడిలాగే గ్రామంలో పోలీస్ పికెట్ కొనసాగడం కామన్ అయిపోయింది.
ఉద్యోగం.. వ్యవసాయం..
జాతీయ రహదారికి ఇరువైపులా విస్తరించి ఉన్న ఫరీదుపేట గ్రామంలో 1500 గడపలు, ఆరువేల జనాభా ఉంది. 70 శాతం ప్రజలకు వ్యవసాయమే ప్రధాన వృత్తి. ముఖ్యంగా కూరగాయల సాగులు ఈ గ్రామం అగ్రగామి అని వ్యవసాయ గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు విద్యావంతులకు, ఉద్యోగులకు లోటు లేదు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా పని చేసిన గురుగుబిల్లి యతిరాజులు ఈ గ్రామానికి చెందినవారే. ఉమ్మడి ఏపీలో అగ్నిమాపక శాఖ డైరెక్టర్‌గా చేసిన బొడ్డేపల్లి సత్యనారాయణ కూగా ఈ గ్రామానికి చెందినవారే కాగా ఆయన కుమారుడు శ్రీనివాస్ ఐఆర్‌ఎస్ అధికారిగా కేంద్ర ప్రభుత్వ సర్వీసులో ఉన్నారు. ఇక పోలీసు, బ్యాంకు ఉన్నతోద్యోగాలతో డాక్టర్లు, ప్రొఫెసర్లుగా చేస్తున్నవారు, రైల్వే, ఆర్మీ తదితర రంగాల్లో పని చేస్తున్న అనేకమంది ఈ గ్రామంలో ఉన్నారు. వీటన్నింటితోపాటు కావలసినంత నేరచరిత్ర కూడా ఈ గ్రామానికి ఉంది. 1951 నుంచి ఇప్పటి వరకు 114 కేసులు నమోదైనట్లు పోలీసు రికార్డులు వెల్లడిస్తున్నాయి. హత్య, హత్యాయత్నం, దాడులు, దొమ్మీ తదితర ే కేసులు ఉన్నాయి. ఇవి కాకుండా స్టేషన్‌కు వెళ్లకుండా రాజీ చేసుకున్న కేసులకు లెక్కేలేదు.
ఏడున్నర దశాబ్దాల క్రితం..
ఫరీదుపేట చరిత్రను పరిశీలిస్తే 1951లో తొలిసారి ఈ గ్రామం పోలీసు రికార్డులకు ఎక్కింది. నరసయ్య అనే వృద్ధుడు తొలిసారి హత్యకు గురయ్యాడని, గ్రామంలో హత్య జరగడం అదే మొదటిసారి అని స్థానికులు చెబుతున్నారు. దీనికి ప్రతిగా ఒక వృద్ధురాలిని ప్రత్యర్ధులు హత్య చేశారనే ప్రచారం ఉంది. అప్పటినుంచి దాడులు , హత్యలు, రాజీలు నిత్యకృత్యంగా మారాయి. గ్రామంలో పైడి, కొత్తకోట కుటుంబాల మధ్య మొదటి నుంచి ఆధిపత్యం పోటీ ఉన్నా అంతకుముందెప్పుడూ అవి తీవ్రం కాలేదు. కానీ 1948లో గౌరీ పౌర్ణమి ఉత్సవాల సందర్భంగా ఆ రెండు వంశాల మధ్య తొలిసారి విభేదాలకు బీజం పడినట్లు స్థానిక పెద్దలు చెబుతున్నారు. పైడి కుటుంబాలు నాలుగు రోజులపాటు నిర్వహించే ఈ ఉత్సవాలకు ధీటుగా తాము కూడా నిర్వహించాలని కొత్తకోట కుటుంబాలు నిర్ణయించాయి. అప్పటి నుంచీ గ్రామంలో ఆ రెండు వంశాలు, వారికి మద్దతు ఇచ్చేవారు రెండు గ్రూపులుగా విడిపోయి గౌరీపౌర్ణమి ఉత్సవాలు జరపడం ప్రారంభించారు. ఆ నేపథ్యÛంలో జరిగిన ఒక వివాదమే 1951లో హత్యకు దారి తీసిందని గ్రామస్తులు చెబుతున్నారు. కాగా 2021 ఉత్సవాల్లో ఈ రెండు గ్రూపులు కాకుండా మూడో గ్రూపు కూడా అవతరించింది. మొదలవలస, సత్తారు కుటుంబాలు వేరేగా ఉత్సవాలు నిర్వహించడం ప్రారంభించాయని గ్రామస్తుల ద్వారా తెలిసింది.1990 తర్వాత చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలే దీనికి కారణమయ్యాయి.
కుటుంబాల వైరంలోకి రాజకీయాలు చొరబడటంతో పరిస్థితి మరింత దిగజారింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పైచేయి సాధించే క్రమంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రతి చిన్న విషయాన్ని వివాదం చేయడం, పోలీసు స్టేషన్‌కు వెళ్లడం గ్రామంలో కొన్ని కుటుంబాలకు అలవాటుగా మారింది. ప్రత్యర్థులకు చెందిన వ్యవసాయ మోటార్లను బావుల్లో పడేయడం, పంటలు ధ్వంసం చేయడం లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. రాజకీయ ఒత్తిళ్లతో వివాదంతో సంబంధం లేనివారిని నిందితులుగా చేర్చి ప్రతీకారం తీర్చుకున్న సందర్భాలు ఉన్నాయని అంటున్నారు. చివరికి ఉద్యోగులు, విద్యార్థులను సైతం కేసుల్లో ఇరికించి వారి జీవితాలను నాశనం చేయడం పరిపాటైపోయింది. వారిని కేసుల నుంచి బయటపడేసేందుకు పోలీస్ స్టేషన్‌లో కూర్చొని సెటిల్మెంట్ చేసుకొనే సంప్రదాయం అప్పట్నుంచే ప్రారంభమైంది. అయితే రాజీ సెటిల్‌మెంట్ల సందర్భాల్లో వాటాల్లో తేడాలు రావడం, కొందరి మాట చెల్లుబాటు కాకపోవడం కూడా చాలా సందర్భాల్లో కొత్త ఉద్రిక్తతలకు కారణమవుతున్నాయి. వీటి పర్యవసానంగానే 2001లో పోలినాయుడు హత్య జరిగిందంటున్నారు. దీనికి ప్రతీకారంగా వైరివర్గానికి చెందిన రాంబాబును హత్య చేశారు. ఆ తర్వాత రాజకీయ పార్టీల ముసుగు కప్పుకొని ఎవరికివారు పెత్తనం చేయడం ప్రారంభించారు. ప్రత్యర్ధులను అడ్డు తప్పించాలనే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగానే ఇరువర్గాలను లీడ్ చేస్తున్న ఇద్దరిపై హత్యాయత్నాలు జరిగాయి. గ్రామంలో కేవలం 25 మంది రాజకీయ ప్రత్యర్ధులుగా మారి నడుపుతున్న ఫ్యాక్షన్ రాజకీయాల వల్ల అనేకమంది గ్రామాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఇలా నాలుగైదు కుటుంబాల మధ్య ప్రారంభమైన విభేదాలను కక్షలుగా పెంచి పెద్దవి చేసి మొత్తం గ్రామంపై రుద్దేసి, గ్రామ చరిత్రను మసక బార్చేశారు. వాటి ఫలితంగానే ఇప్పుడు ఫరీదుపేట.. కక్షల కోట అన్న చెడ్డపేరును మూటగట్టుకుంది. గ్రామంలో పోలీస్ పికెట్‌ను దాదాపు శాశ్వతం చేసిసి.. పోలీసులతో సహజీవనం చేయాల్సిన పరిస్థితికి చేరుకుంది.










Comments