వైద్య కళాశాలలపై రాజకీయ యుద్ధం!
- DV RAMANA

- 2 days ago
- 2 min read

సార్వత్రిక ఎన్నికల్లో థంపింగ్ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం గత వైకాపా ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలను, పథకాలను తిరిగదోడుతూ తన విధానాలకు అనుకూలంగా మార్పులు చేర్పులు చేస్తోంది. కొన్నింటికి పేర్లు మార్చితే, మరికొన్నింటిలో మూల లక్ష్యాన్నే మార్చివేస్తోంది. వీటిలో మిగతావాటి సంగతెలా ఉన్న మెడికల్ కళాశాలల విషయంలో చంద్రబాబు సర్కారు అనుసరిస్తున్న వైఖరి, దాన్ని సమర్థించుకుంటున్న తీరు మాత్రం సామాన్య జనంలో విమర్శల పాలవుతున్నాయి. వైకాపా సర్కారు ఉన్నప్పుడు రాష్ట్రంలో రికార్డుస్థాయిలో ఒకేసారి 17 ప్రభుత్వ వైద్యకళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వీటన్నింటినీ ప్రైవేటురంగంలోనే ఏర్పాటు చేయాలని నిర్ణయించడం వల్ల సామాన్య కుటుంబాల విద్యార్థులకు వైద్యవిద్య చదువుకునే అవకాశం లభించడంతోపాటు ఈ కళాశాలలకు అనుబంధంగా ఏర్పాటయ్యే బోధనాస్పత్రుల ద్వారా పేదలకు ఉచిత ప్రభుత్వ వైద్యం అందుతుందన్న ఆనందం సర్వత్రా వ్యక్తమైంది. కానీ తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్డీయే కూటమి ప్రభుత్వం భిన్నవైఖరి అనుసరిస్తూ వివాదానికి బీజం వేసింది. పూర్తిగా ప్రభుత్వరంగంలో కాకుండా పీపీపీ(పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం) పద్ధతిలో నిర్మించాలని విధాన నిర్ణయం తీసుకుంది. పది వైద్య కళాశాలలను ఈ విధానం పరిధిలోకి తెచ్చింది. దీన్ని వైకాపాతో సహా పలు పార్టీలు, ప్రజాసంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. దీంతో రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు పీపీపీ చుట్టునే తిరుగుతున్నాయి. తమ ప్రభుత్వం మంజూరు చేసిన మెడికల్ కళాశాలలను పీపీపీ పేరుతో ప్రైవేటుకు ధారాదత్తం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వైకాపా ఉద్యమబాట పట్టగా.. ఇటు వాటిని పీపీపీ విధానంలోనే ప్రారంభించాలని తీసుకున్న నిర్ణయాన్ని చంద్రబాబు సర్కారు ప్రిస్టేజ్ ఇష్యూగా తీసుకుంది. మొదటి విడతలో ఆదోని, మార్కాపురం, పులివెందుల, మదనపల్లె కళాశాలలకు పీపీపీ విధానంలో చేపట్టేందుకు టెండర్లు ఆహ్వానించగా ఒక్క దరఖాస్తు కూడా రాకపోవడంపై కూడా భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. వైద్య కళాశాలలను పీపీపీ సాకుతో ప్రైవేటుకు ధారదత్తం చేయడాన్ని అడ్డుకుంటామంటూ వైకాపా ప్రత్యక్ష కార్యాచరణకే దిగింది. రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల ఉద్యమం నిర్వహించిన, కోటి సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని గవర్నర్‌కు సమర్పించి, పీపీపీ విధానాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారనడానికి కోటి సంతకాలే నిదర్శనమని పేర్కొంది. అక్కడితో ఆగని వైకాపా అధినేత సహా పేర్ని నాని వంటి సీనియర్ నేతలు కాస్త తీవ్ర హెచ్చరికలు చేయడాన్ని టీడీపీ వర్గాలు మరో విధంగా ప్రచారం చేస్తున్నాయి. జగన్ బెదిరింపు రాజకీయాల వల్లే కొత్త కాలేజీల నిర్మాణానికి టెండర్లు వేసేందుకు ఎవరూ ముందుకు రాలేదని టీడీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. దానికి తగినట్లే వైకాపా అధినేత జగన్, మాజీమంత్రి పేర్ని నాని కొన్ని కీలక వ్యాఖ్యలు చేసి ఈ ప్రచారానికి మరింత ప్రాధాన్యం తీసుకొచ్చారు. కూటమి సర్కారు మొండి పట్టుదలకు పోయి పీపీపీ విధానంలోనే వైద్య కళాశాలలు నిర్మించినా.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిపై సిట్ వేసి ప్రత్యేక దర్యాప్తు జరిపించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని జగన్, నానిలు హెచ్చరించడం వల్లే వైద్య కళాశాలల నిర్మాణానికి బిడ్లు రాలేదని కూటమి వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. తమ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ ముసుగులో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టి, పేదలకు ఉచిత వైద్యం అందకుండా చేయడాన్ని అడ్డుకోనేందుకు ఎంతవరకైనా వెళతామన్నట్లు వైకాపా దూకుడు ప్రదర్శిస్తుంటే ప్రభుత్వం కూడా అంతే పట్టుదలతో ఉంది. దీనిపై స్వయంగా ముఖ్యమంత్రి చందబ్రాబు స్పందించి వైకాపా తీరును, ఉద్యమాన్ని తప్పుపట్టారు. పీపీపీ విధానం కొత్తదేం కాదని, దీన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించి అనుసరిస్తోందని చెప్పుకొచ్చారు. పీపీపీ అంటే ప్రైవేటుకు అప్పగించడం కాదని, ప్రైవేటు వ్యక్తులు నిర్మించి, కొన్నాళ్లు నిర్వహించి, తర్వాత ప్రభుత్వానికి అప్పగించేస్తారని వివరించారు. వీటిపై పర్యవేక్షణ ప్రభుత్వానికే ఉంటుందన్నారు. పీపీపీ విధానంలో చేపడితే పేదలకు విద్య, వైద్యం అందదని ప్రచారం చేయడం కూడా కరెక్ట్ కాదన్నారు. దానికి ఉదాహరణగా రోడ్డు నిర్మాణాలను ఆయన ప్రస్తావించారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ నిర్మిస్తున్న రోడ్లకు పీపీపీ విధానాన్నే అనుసరిస్తున్నా.. ఆ రోడ్లపై వాహనాలు, ప్రజలు స్వేచ్ఛగా రాకపోకలు సాగిస్తున్నారని, అదేవిధంగా పీపీపీ మోడ్‌లో నిర్మించే వైద్యకళాశాలల ద్వారా సామాన్యులకు నిక్షేపంగా సేవలు అందుతాయన్నట్లు చంద్రబాబు చెప్పారు. కానీ పీపీపీ రోడ్లపై ఎక్కడికక్కడ టోల్‌ప్లాజాలు పెట్టి రోడ్ల నిర్మాణ ఖర్చులు, వాహనాలు తిరిగే ఛార్జీలు ప్రైవేట్ సంస్థలు ముక్కుపిండి వసూలు చేస్తున్న విషయం గమనార్హం. వైద్య కళాశాలలు నిర్మించిన తర్వాత కూడా భారీగా రుసుములు, ఛార్జీలు పెట్టి వసూలు చేస్తారన్న ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్రస్థాయిలో వైకాపా, టీడీపీల వాదనలు ఇలా ఉంటే.. పార్లమెంటు వేదికగా జరిగిన పరిణామాలు కూడా వివాదాన్ని కొత్తమలువు తిప్పాయి. వైద్యవిద్యలో పీపీపీ విధానం మేలని ఇటీవలే పార్లమెంటు స్టాండిరగ్ కమిటీ సిఫార్సు చేసింది. ఈ స్టాండిరగ్ కమిటీలో సభ్యుడిగా ఉన్న వైకాపా ఎంపీ మద్దిల గురుమూర్తి కూడా ఈ సిఫార్సులపై సంతకం చేయడాన్ని టీడీపీ హైలైట్ చేస్తూ వైకాపా ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని విమర్శలు గుప్పిస్తోంది. అలాగే కేంద్రం కూడా పీపీపీ విధానాన్నే అనుసరిస్తూ.. ఆ విధానంలో చేపట్టే నిర్మాణాలకు 40 శాతం సబ్సిడీ ఆఫర్ చేస్తున్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వవర్గాలు గుర్తు చేస్తున్నాయి. ప్రభుత్వరంగంలో నిర్మాణానికి ఆర్థిక పరిస్థితులు అనుకూలించడం లేదన్నది ప్రభుత్వ వాదనగా ఉంది. నాలుగు కళాశాలలకు బిడ్లు రాకపోయినా మరోసారి టెండర్లు ఆహ్వానిస్తామని స్పష్టం చేస్తోంది. ఈ పరిస్థితుల్లో కొత్త వైద్య కళాశాలల పరిస్థితి డోలాయమానంలో పడిరది.










Comments