top of page

విద్యుత్‌ లేని భవనం.. షార్ట్‌ సర్క్యూట్‌ ఎలా సాధ్యం?!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • Sep 12, 2025
  • 3 min read
  • భైరి రాజసూర్య ధర్మకాటా ఓనర్ల మరో మోసం

  • గొడౌన్‌ నిర్వాహకుడి ఫిర్యాదుతో వెలుగులోకి

  • అద్దెకు తీసుకునే ముందే కనెక్షన్‌ తీసేయించానని వెల్లడి

  • బీమా పరిహారం కోసం తమను ముంచేశారని ఆరోపణ

(సత్యంన్యూస్‌,శ్రీకాకుళం)

ధర్మకాటా ముసుగులో అక్రమాలకు పాల్పడుతున్న దాని యజమానుల మరో అక్రమం తాజాగా వెలుగులోకి వచ్చింది. భైరిజంక్షన్‌ వద్ద రాజసూర్య ధర్మకాటా నడుస్తున్న భవనాన్ని ప్రభుత్వ పంట కాలువ ఆక్రమించి కట్టారని ఇప్పటికే అధికారులు నిర్ధారించి యజమానులకు నోటీసులు జారీ చేశారు. దానికి అధికార యంత్రాంగం పడగొట్టేయడం ఖాయమన్న నిర్ధారణకు వచ్చిన యజమానులు కూల్చివేతకు ముందే భవన నిర్మాణా ఖర్చులను రాబట్టుకునేందుకు భవనం గ్రౌండ్‌ ఫ్లోర్‌ను గొడౌన్‌కు అద్దెకు ఇవ్వడం, దానిలో అగ్నిప్రమాదం సృష్టించి బీమా పరిహారం మంజూరయ్యేలా మేనేజ్‌ చేస్తున్న వైనంపై ‘సత్యం’ పత్రికలో కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. కాగా ధర్మకాటా యజమానుల మరికొన్ని అక్రమ బాగోతాలు వెలుగులోకి వస్తున్నాయి. అగ్ని ప్రమాదం జరిగి కాలిపోయిందని చెబుతున్న గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని గొడౌన్‌కు విద్యుత్‌ కనెక్షనే లేదు. అయినా విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తోనే అగ్నిప్రమాదం జరిగి.. గొడౌన్‌ కాలిపోయిందని తప్పుడు నివేదిక రాయించి, దాన్ని చూపించి భవన యజమానులు ఇన్సూరెన్స్‌కు క్లెయిమ్‌ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. ధర్మకాటా భవనం గ్రౌండ్‌ ఫ్లోర్‌ను అద్దెకు తీసుకుని రబ్బరు పౌడరు నిల్వ చేసే గొడౌన్‌గా ఉపయోగించుకున్న గార మండలం తూలుగు పంచాయతీ శేకులపేటకు చెందిన బెవర సాయి ఈ విషయం బయటపెట్టారు. శుక్రవారం శ్రీకాకుళం రూరల్‌ పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఆయన రాజసూర్య ధర్మకాటా యజమానులు బైరి సూర్య నారాయణ, బైరి వెంకటరమణలపై ఫిర్యాదు చేశారు. బైరి రెవెన్యూ సర్వే నెంబర్‌ 31/12లో ఉన్నది అక్రమ నిర్మాణమని పంచాయతీ అధికారులు గుర్తించి భవనాన్ని తొలగిస్తామని నోటీసులు ఇచ్చిన తర్వాత ఈ ఏడాది మార్చి నాలుగో తేదీన గ్రౌండ్‌ ఫ్లోర్‌ను తనకు అద్దెకు ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అడ్వాన్స్‌గా రెండు నెలల అద్దె చెల్లించి.. నెలకు రూ.4వేల అద్దె ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నట్టు పేర్కొన్నారు. కాగా గత నెల 11న భవన యజమానులు ఫోన్‌ చేసి గొడౌన్‌లో మంటలు రేగాయని.. వాటిని అదుపు చేశామని సమాచారం ఇచ్చినట్టు పోలీసులకు వివరించారు. దాంతో ఆ మరుసటి రోజులు అంటే ఆగస్టు 12న ఫిర్యాదుదారు కుటుంబ సభ్యులు బెవర ఢల్లీిశ్వరరావు, బెవర అప్పన్న వెళ్లి గొడౌన్‌ను పరిశీలించి ఫొటోలు తీసుకున్నారు.

మా స్టాక్‌ తగలెట్టేశారు!

గొడౌన్‌లో అగ్ని ప్రమాదం జరిగి నష్టం వాటిల్లినందున, ఇన్సూరెన్స్‌ పరిహారం చెల్లించాలని భవన యజమానులు క్లెయిమ్‌ చేసినట్లు ‘సత్యం’ కథనం ద్వారా తెలుసుకున్న గొడౌన్‌ నిర్వాహకుడు బెవర సాయి పోలీసు స్టేషన్‌కు వచ్చి అసలు విషయం చెప్పారు. రబ్బర్‌ పౌడర్‌ నిల్వ ఉంచడం తప్ప మరో అవసరం లేనందున గొడౌన్‌కు విద్యుత్‌ అవసరం లేదని యజమానులకు చెప్పి విద్యుత్‌ బోర్డులను, కనెక్షన్లను పూర్తిగా తొలిగింపజేశామని వివరించారు. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాతే గత నెల 14 నుంచి రబ్బర్‌ పౌడర్‌ను గొడౌన్‌లో నిల్వ ఉంచుతున్నామన్నారు. కానీ గత నెల 17న మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో భవన యజమాని బైరి వెంకటరమణ ఫోన్‌ చేసి గొడౌన్‌లో విద్యుత్‌ షాక్‌ సర్క్యూట్‌ వల్ల మంటలు చెలరేగాయని చెప్పినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. విద్యుత్‌ సౌకర్యం లేని గొడౌన్‌లో షార్ట్‌సర్క్యూట్‌ అయ్యిందని చెప్పడంపై ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుట్రపూరితంగా గొడౌన్‌కు నిప్పుపెట్టినట్లు కనిపిస్తోందని పోలీసులకు వివరించారు. విద్యుత్‌ కనెక్షన్లు పూర్తిగా తొలగించిన గొడౌన్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ కావడానికి అవకాశం లేదన్నారు. భవనం నిర్మాణం అక్రమమని నోటీసులు అందుకున్న తర్వాత దాన్ని అధికారులు కూల్చేస్తారని తెలిసి తనకు అద్దెకు ఇచ్చి మోసగించారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇన్సూరెన్స్‌ కోసం కుట్ర చేసి గొడౌన్‌లో తాము నిల్వ చేసిన రూ.5 లక్షలు విలువ చేసే రబ్బర్‌ పౌడర్‌ను కాల్చేశారని వివరించారు. ఫైర్‌ సిబ్బంది వచ్చేలోగా భవన యజమానులే తమ మనుషుల ద్వారా మంటలను ఆర్పేశారని, కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందన్నారు. మంటలను అదుపు చేయడానికి వచ్చిన ఫైర్‌ అధికారులకు విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల ప్రమాదం జరిగినట్లు మభ్యపెట్టారని పేర్కొన్నారు. గొడౌన్‌లో షార్ట్‌ సర్క్యూట్‌కు అవకాశం లేకపోయినా ఇన్సూరెన్స్‌ కొట్టేయాలన్న కుట్రతో రబ్బర్‌ పౌడర్‌ను తగులబెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఫోర్టరీ పత్రాలతో మహిళ భూమికి ఎసరు

భవన యజమానులైన బైరి సూర్యనారాయణ, వెంకటరమణలపై 2024లో రూరల్‌ స్టేషన్‌లో కేసు నమోదై ఉంది. శ్రీకాకుళం కత్తెరవీధికి చెందిన మెట్ట విశాలాక్షి వద్ద భూమిని తీసుకొని బీపీఎల్‌ రిటైల్‌ అవుట్‌లెట్‌ ఏర్పాటు చేసిన తర్వాత మోసం చేశారని ఆరోపణలతో ఈ కేసు నమోదైంది. 2018లో విశాలాక్షి బైరి సర్వే నెంబర్‌ 32/2సిలో 29 సెంట్లు కొనుగోలు చేశారు. దానికి ఆనుకొని బైరి సూర్యనారాయణ, బైరి వెంకటరమణలకు చెందిన 29 సెంట్ల భూమి ఉంది. దీంతో విశాలాక్షిని సంప్రదించి బీపీఎల్‌ రిటైల్‌ అవుట్‌లెట్‌ పెట్టి 50 శాతం భాగస్వామ్యం ఇస్తామని నమ్మించారు. రిటైల్‌ అవుట్‌లెట్‌ను రాజసూర్య విశాలాక్షి ఫిల్లింగ్‌ స్టేషన్‌గా నమోదు చేశారు. బీపీఎల్‌తో కుదుర్చుకున్న ఒప్పందంలో మాత్రం బైరి సూర్యనారాయణ, వెంకటరమణలనే యజమానులుగా నమోదుచేసి విశాలక్షిని తప్పించేసినట్లు 2023లో బీపీఎల్‌ యాజమాన్యం ఆర్‌టీ దరఖాస్తుకు ఇచ్చిన సమాచారంతో స్పష్టమైంది. దాంతో ఆమె 2024లో పోలీసులను ఆశ్రయించారని విశ్వసనీయ సమాచారం. తన పేరుతో ఉన్న భూమికి నకిలీ లీజ్‌ పత్రాలు తయారుచేసి సమర్పించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. రెవెన్యూ రికార్డులు తారుమారు చేసి 29 సెంట్ల భూమిని సొంత భూమిగా చూపించారు. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో 29 సెంట్ల భూమిని విశాలాక్షి పేరుతో అడంగల్‌లో నమోదు చేశారు. అదే రీతిలో ఇప్పుడ రాజసూర్య ధర్మకాటా భవనంలోని గొడౌన్‌లో అగ్ని ప్రమాదం జరిగినట్టు ప్రచారం చేసుకొని ఇన్సూరెన్స్‌ పొందాలని ప్రయత్నాలు చేస్తున్నారని బాధితుడు బెవర సాయి ఆరోపిస్తున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page