విద్యాలయాలు కాదు.. వివాదాలయాలు!
- BAGADI NARAYANARAO

- Sep 22, 2025
- 3 min read
వరుస ఘటనలతో పరువు తీసుకుంటున్న కేజీబీవీలు
కాంట్రాక్టు ఉద్యోగులు కావడంతో పెరిగిన బాధ్యతారాహిత్యం
ప్రిన్సిపాళ్ల అతి చేష్టలు, వేధింపులతో బాలికలకు భంగపాటు
విద్యాప్రమాణాలు, మెనూ అమలుపై దృష్టిపెట్టని సమగ్రశిక్ష అధికారులు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
2024 జూలై 25.. కోటబొమ్మాళి కస్తూర్బా గాంధీ విద్యాలయం (కేజీబీవీ)లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న బి.పూజ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానకి పాల్పడిరది.
2024 జూలై 6.. కోటబొమ్మాళి కేజీబీవీలో కలుషిత ఆహారం కారణంగా 20 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.
2024 అక్టోబర్ 21.. జి.సిగడాం కేజీబీవీ నుంచి ఇద్దరు ఇంటర్ విద్యార్ధినులు అదృశ్యమైనా గోప్యంగా ఉంచారు. సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు గొడవ చేసిన తర్వాతే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
2025 మార్చి 28.. మందస మండలం గుడామణి రాజపురం కేజీబీవీలో రాత్రి పూట ఆహారం తీసుకున్న తర్వాత వాంతులు, విరోచనాలతో 22 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.
రెండు రోజుల క్రితం.. పొందూరు కేజీబీవీలో ఇంటర్ సెకండియర్ విద్యార్థిని వందన మేడపై నుంచి పడి కాలు, వెన్నుపూస విరగ్గొట్టుకుంది. ఈ వ్యవహారం వెలుగులోకి రాకుండా సిబ్బంది, సమగ్ర శిక్ష అధికారులు జాగ్రత్త పడ్డారు.`
..ఇవి కేవలం వెలుగులోకి వచ్చిన కొన్ని సంఘటనలే. అన్నీ రాత్రి వేళల్లో జరిగినవే. కేజీబీవీల్లో దుర్ఘటనలు జరిగితే గోప్యంగా ఉంచి బాధిత విద్యార్ధినుల తల్లిదండ్రులను సామదానభేద దండోపాయాలతో లొంగదీసుకుని వివాదం కాకుండా, అసలు సంఘటనలే బయటకు రాకుండా జాగ్రత్తపడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యార్థినులు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడాల్సిన అగత్యం ఎందుకొచ్చిందన్న వివరాలు వెలుగులోకి రాకుండా అందరి నోళ్లూ మూయిస్తున్నారు. కేజీబీవీల్లో ప్రిన్సిపాల్స్‌తో సహోద్యోగులందరూ కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్నవారే. వారంతా తమదే రాజ్యమన్నట్లు విచ్చలవిడిగా వ్యవహరిస్తూ విద్యార్థినులను వేధిస్తుండటం, అక్రమాలకు పాల్పడుతుండటమే కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనివల్లే ఆత్మహత్యాయత్నాలు, పరారీ, అస్వస్థతకు గురవడం వంటి అవాంఛనీయ ఘటనలకు దారితీస్తున్నాయంటున్నారు. ఈ విద్యాలయాల్లో చేరేవారందరూ బడుగు, బలహీనవర్గాలవారే కావడంతో కేజీబీవీ అధికారులు, సిబ్బంది విద్యార్థులను, వారి తల్లిదండ్రులను చిన్నచూపు చూస్తున్నారన్న ఆరోపణలు విమర్శలు ఉన్నాయి.
నాడు ఆదరణ.. నేడు ఆందోళన
ప్రారంభమైన తొలినాళ్లలో మెరుగైన విద్యాబోధన, వసతి సౌకర్యాలతో కేజీబీవీలకు ఆదరణ పెరిగింది. బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు వీటిలో చేరేందుకు ఆసక్తి చూపించేవారు. అయితే ఇటీవలి కాలంలో వాటి ప్రతిష్ట మసకబారింది. కేజీబీవీల్లో వరుసగా అవాంఛనీయ ఘటనలు జరుగుతుండటంతో వీటిలో తమ పిల్లలను చేర్చేందుకు తల్లిదండ్రులు వెనుకాడుతున్నారు. కేజీబీవీలు లక్ష్యాల సాధనలో చతికిలపడడంతో పాటు, అక్కడి విద్యార్థినులకు రక్షణ కల్పించలేకపోతున్నాయన్న అప్రతిష్టను మూటగట్టుకుంటున్నాయి. పాఠశాలల నిర్వహణ అస్తవ్యస్తంగా మారడంతో విద్యార్థినులు, వారి తల్లిదండ్రుల్లో ఆసక్తి తగ్గుతోంది. జిల్లాలో 25 కేజీబీవీల్లో క్రమేపీ విద్యార్ధులు సంఖ్య తగ్గుతూ వస్తుంది. అడ్మిషన్ నోటిఫికేషన్ సమయంలో విద్యాలయాల్లో చేరుతున్నట్టు పరిచయం ఉన్నవారి ఆధార్ నెంబర్లను కూడదీసి ఆఫ్‌లైన్ రిజిస్టర్స్ ్టర్స్ చేయించి ఆహా.. ఓహో అంటున్నారు. వీటిని ఆన్‌లైన్ చేసినప్పుడు ఏదో ఒక వంక పెట్టి అడ్మిషన్ తీసుకోలేదని చెబుతున్నారు. ఈ వ్యవహారం అడ్మిషన్ల సమయంలో అందరు కేజీబీవీ ప్రిన్సిపాల్స్ చేస్తుంటారని సమగ్రశిక్ష అధికారులు చెబుతున్నారు. అడ్మిషన్లు సంఖ్య ఎక్కువగా చూపించడానికి ఆ పద్ధతిని అనుసరిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో బాలికా విద్యను ప్రోత్సహించడమే లక్ష్యంగా వీటిని ఏర్పాటుచేశారు. ఈ విద్యాలయాల్లో చేరే బాలికల భద్రతను దృష్టిలో పెట్టుకుని పెద్దపీట వేస్తూ బోధన, బోధనేతర సిబ్బంది, చివరికి స్వీపర్లు, వాచ్‌మెన్‌గా మహిళలనే నియమిస్తున్నారు. పురుషులను అసలు అనుమతించరు. కానీ కొందరు ప్రిన్సిపాళ్ల అతి చేష్టల కారణంగా కేజీబీవీలు వివాదాలకు కేంద్రాలుగా మారిపోతున్నాయి. అయితే ప్రిన్సిపాళ్లపై సమగ్రశిక్ష అధికారుల వేధింపులు తీవ్రస్థాయిలో ఉంటున్నాయని ఆరోపణలు ఉన్నాయి. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు సమగ్రశిక్ష అధికారులు ప్రిన్సిపాల్స్‌ను పావుగా వాడుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాంతో ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకులతో కేజీబీవీ ప్రిన్సిపాళ్లు అంటకాగుతుంటారని తెలిసింది. ఇటీవల కంచిలి, గార, పొందూరు కేజీబీవీ ప్రిన్సిపాళ్ల బదిలీ వివాదం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. ఈ ముగ్గురినీ రాజకీయ కారణాలతో బదిలీ చేశారంటున్నారు. కాగా పొందూరు ప్రిన్సిపాల్ సౌమ్యను కంచిలికి బదిలీ చేసిన వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారం రేపింది. మరోవైపు బదిలీ అయిన ముగ్గురు ప్రిన్సిపాల్స్‌పైనా ఆరోపణలు ఉన్నాయి. గార నుంచి పొందూరుకు బదిలీ అయిన లలితకుమారి రెండుసార్లు సస్పెండయ్యారు. కంచిలికి బదిలీ అయిన సౌమ్య ఒకసారి సస్పెండయ్యారు. గారకు బదిలీ అయిన రజనీపై చార్జీమెమోలు ఉన్నాయి. ఈ బదిలీల వ్యవహారంలో స్థానిక ఎమ్మెల్యేలను తప్పుదోవ పట్టించింది సమగ్రశిక్ష అధికారేనన్న ఆరోపణలు ఉన్నాయి.
పెత్తనం, నిధుల స్వాహాపైనే శ్రద్ధ
కేజీబీవీల నిర్వహణలో నిర్లక్ష్యం విద్యార్థులకు శాపంగా మారుతోంది. నిర్వహణ వైఫల్యాలతో విద్యార్ధులు ఆస్పత్రుల పాలవుతున్నారు. విద్యార్థినులకు పౌష్టికాహారం అందజేయడంతో పాటు అన్నిరకాల వసతులు కల్పిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కానీ వాస్తవం వేరేగా ఉంది. మెనూ సక్రమంగా అమలు కావడం లేదని అనేక సందర్భాల్లో వెలుగులోకి వచ్చింది. సమగ్రశిక్ష పరిధిలో ఉండే కేజీబీవీల్లో నిధుల ఖర్చు విషయంలో భారీ అవినీతి జరుగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రత్యేకాధికారుల ఖాతాల నుంచి నిధులు దారిమళ్లుతున్నాయని అంటున్నారు. దీనివల్ల ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతోంది. సమగ్రశిక్ష అధికారులు, విద్యాలయాల ప్రిన్సిపాళ్ల ఏకపక్ష, ఆధిపత్య ధోరణి కారణంగా చదువుకుందామన్న ఆశతో వచ్చే బడుగు, బలహీనవర్గాల బాలికలు సమిధలవుతున్నారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు తెగ హడావుడి చేసే ఉన్నతాధికారులు కేజీబీవీలను తరచూ తనిఖీ చేస్తున్న దాఖలాలు మాత్రం లేవు. ఈ నిర్లక్ష్యం ఫలితంగానే ప్రతిరోజూ జిల్లాలో ఏదో ఒక కేజీబీవీ వార్తలకెక్కుతోంది. వీటికి కారణాలు అన్వేషించి, భవిష్యత్తులో అటువంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సి అధికారులు సంఘటనలను కప్పిపుచ్చడానికే ప్రాధాన్యమివ్వడం వల్లే పరిస్థితులు నానాటికీ దిగజారిపోతున్నాయి.










Comments