విద్యా వలసలకు వేయాలి అడ్డుకట్ట
- DV RAMANA

- 7 hours ago
- 2 min read

ఉన్నత కోర్సులైనా.. ఉద్యోగమైనా.. వాటిని అందిపుచ్చుకోవడానికి వేరే రాష్ట్రానికో, దేశానికో వెళ్తున్నామంటే.. ఇక్కడ అటువంటి అవకాశాలు లేకపోవడమో లేక ఉన్నా అందకపోవడమో జరగాలి. సరిగ్గా ఇవే కారణాలతో మన యువత అవకాశాలను అన్వేషిస్తూ విదేశాలకు వలస వెళుతోంది. ఉద్యోగాల కంటే ఉన్నత విద్యావకాశాల పేరుతో యువజనం పెద్దసంఖ్యలో ఇతర దేశాలకు వెళుతున్నారు. చదువు పూర్తి అయిన తర్వాత అక్కడే ఉద్యోగావకాలు అందిపుచ్చుకుని స్థిరపడిపోతున్నారు. ఇదేం కొత్తగా ఉత్పన్నమైన సమస్య కాదు. కొన్ని దశాబ్దాలుగా భారత్ వంటి అనేక దేశాలు ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. దీన్నే మేథోవలస అని వ్యవహరిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు మేథోవలస కంటే అకడమిక్ మైగ్రేషన్ అంటే విద్యావలస పెద్ద సమస్యగా మన ముందు నిలబడింది. ఇంకో విధంగా చెప్పాలంటే మన విద్యా వ్యవస్థను సవాల్ చేస్తున్నది. ఏటా లక్షలాది మంది విద్యార్థులు ఉన్నతస్థాయి డిగ్రీ కోర్సులు, అంతర్జాతీయ ఉపాధి అవకాశాల కోసం విదేశాలకు పయనమవుతున్నారు. దీనికి ప్రధాన కారణం.. నైపుణ్యం(స్కిల్స్) పెంచని కోర్సులేనని చెప్పాలి. మన వర్సిటీల్లో అమల్లో ఉన్న అకడమిక్ కోర్సులు డిగ్రీ పట్టాలు చేతిలోపెట్టేవే తప్ప ఉపాధి కల్పించేవిగా లేకపోవడం వల్ల మన విద్యావ్యవస్థ నీరుగారిపోతున్నది. దీన్ని తక్షణమే సంస్కరించకపోతే భవిష్యత్తులో ఈ వ్యవస్థలపైనే ఆధారపడిన దేశీయ పరిశోధన, ఆవిష్కరణల రంగం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు. గత కొన్నేళ్ల గణాంకాలు పరిశీలిస్తే దేశం నుంచి అకడమిక్ వలసలు క్రమంగా పెరుగుతున్న విషయం స్పష్టంగా గోచరిస్తుంది. విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటా స్థిరంగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా 2023లో 13.2 లక్షల మంది మన దేశం నుంచి విదేశాలకు వలస వెళ్లారు. అదే 2014లో స్వల్ప పెరుగుదలతో 13.3 లక్షల వలసలు నమోదయ్యాయి. ఇక 2025లో 13.8 లక్షల విద్యార్థులు తరలి వెళ్లారు. దేశవ్యాప్తంగా జరిగిన వలసల్లో ఒక్క కేరళ రాష్ట్రం నుంచే 11 శాతం ఉండటం ఆశ్చర్యపరుస్తున్నది. వాస్తవానికి కేరళ పూర్తి అక్షరాస్యత సాధించిన దేశం. ఉన్నత విద్యాభ్యాసం చేసిన వారి సంఖ్య కూడా ఎక్కువే. కానీ ఆ రాష్ట్రం నుంచి వలసలు అధికంగా ఉన్నాయంటే దానికి కారణం.. ఆ రాష్ట్రంలో అత్యున్నత విద్యావకాశాలు లేకపోవడమేనని స్పష్టమవుతుంది. భారత్ నుంచి వలస వెళ్తున్న విద్యార్థుల్లో సుమారు 40 శాతం వరకు అమెరికా, కెనడాలనే ఎంచుకుంటున్నారు. ఆ తర్వాత బ్రిటన్, ఆస్ట్రేలియా, జర్మనీలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా జర్మనీలో ఇంజనీరింగ్, నర్సింగ్ వంటి వృత్తి విద్యా కోర్సులు తక్కువ ఖర్చుతో లభిస్తుండటం వల్ల విద్యార్థులు అటువైపు మొగ్గు చూపుతున్నారు. విదేశాలకు వెళ్లే విద్యార్థుల్లో అత్యధికులు మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారే. భూములు, ఆస్తులను తాకట్టు పెట్టి రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు బ్యాంకు రుణాలు తీసుకుని విదేశీ చదువులకు వెళ్తున్నారు. కానీ అలా వెళ్తున్న వారందరి పరిస్థితి ఆశాజనకంగా లేదు. కొంతమందికి మంచి ఉద్యోగాలు లభిస్తున్నప్పటికీ చాలామంది తక్కువ స్థాయి విద్యాసంస్థల్లో చేరి, నైపుణ్యం లేని పనులు (అన్ స్కిల్డ్ జాబ్స్) చేస్తూ చివరకు భారీ అప్పులతో స్వదేశానికి తిరిగి వస్తున్నారు. ఇది వ్యక్తిగతంగా ఆయా కుటుంబాలకే కాకుండా, దేశంలోని మేధో సంపత్తికి కూడా నష్టం కలిగిస్తోంది. భారతీయ ఉన్నత విద్యను అంతర్జాతీయీకరించడమే ఈ సమస్యకు పరిష్కారం. అది ఒక సామాజిక, ఆర్థిక అవసరం. దీని ద్వారా నాణ్యమైన పరిశోధనలు, సామాజికాభివృద్ధి సాధ్యమవుతుంది. అమెరికన్ కౌన్సిల్ ఆన్ ఎడ్యుకేషన్ (ఏసీఈ) నమూనా ప్రకారం.. విద్యాసంస్థలు డిగ్రీలు ఇవ్వడమే కాకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అనుసంధానం కావాలి. అంతర్జాతీయ లక్ష్యాలను విద్యాసంస్థల ప్రధాన ప్రణాళికలో భాగం చేయడం, విద్యాసంస్థల యాజమాన్యం అంతర్జాతీయ మార్పులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా పనిచేయగలిగేలా కోర్సులు రూపొందించడం, అధ్యాపకులకు అంతర్జాతీయ పరిశోధనల్లో శిక్షణ, అకడమిక్ సపోర్ట్ ఇవ్వడం, విదేశీ సంస్థలతో కలిసి పని చేసే (మొబిలిటీ) అవకాశాలు కల్పించడం, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో కలిసి బలమైన నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకోవడం వంటి ఆరు అంశాల్లో ఈ అనుసంధానత ఉండాలి. మన వర్సిటీల కరిక్యులమ్‌ను వీటికి అనుగుణంగా ప్రక్షాళన చేయాలి. విద్యార్థుల్లో అంతర్జాతీయ దృక్పథం, సాంస్కృతిక అవగాహన, డిజిటల్ నైపుణ్యాలు పెంచడం ద్వారా వారిని ‘గ్లోబల్ రెడీ గ్రాడ్యుయేట్లు’గా మన దేశంలోనే తీర్చిదిద్దగలిగితే యువతపై విదేశాలకు వెళ్లాలనే ఒత్తిడి తగ్గుతుంది. ఇలాంటి చర్యల వల్ల దేశీయ విద్యాసంస్థల ప్రతిష్ట పెరగడమే కాకుండా విదేశీ సంస్థల నుంచి పరిశోధనలకు మరిన్ని నిధులు వచ్చే అవకాశం ఉంటుంది. స్వీడన్ వంటి దేశాలు ఈ విషయంలో ఆదర్శంగా నిలుస్తున్నాయి. గ్లోబల్‌స్థాయి నమూనాలతో అక్కడి విశ్వవిద్యాలయాలకు అనుబంధంగా సైన్స్ పార్కులు, హెల్త్ పార్కులు ఏర్పాటు చేస్తున్నారు. విశ్వవిద్యాలయాల స్థాయిలో జరిగే పరిశోధనలు వెంటనే ఈ పార్కుల ద్వారా పరిశ్రమలకు చేరుతాయి. దీన్నే అకడమిక్` ఇండస్ట్రీ లింకేజ్ అంటారు. దీనివల్ల కొత్త స్టార్టప్‌లు పుట్టుకొచ్చి, స్థానికంగానే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అదేకాకుండా విదేశీ విద్యాసంస్థలతో సంయుక్తంగా పనిచేసే అవకాశాలను అన్వేషించి అందిపుచ్చుకోవాలి. ఇందుకోసం భారతీయ విశ్వవిద్యాలయాలు విదేశీ సంస్థలతో జాయింట్ డిగ్రీ లేదా డ్యూయల్ డిగ్రీ కోర్సులు నిర్వహించేలా ఒప్పందాలు కుదుర్చుకోవాలి. ఇప్పటికే కొన్ని భారతీయ వర్సిటీలు ఇటువంటి ఒప్పందాలను అమలు చేస్తున్నా.. ఇది మరింత విస్తతం కావాల్సిన అవసరం ఉంది. భారత ప్రభుత్వం అందించే స్కాలర్‌షిప్‌ల ద్వారా విదేశీ విద్యార్థులను కూడా మన దేశానికి ఆహ్వానించాలి. ఇలాంటి విధానాలు అమలు చేస్తేనే మన దేశం విద్యారంగంలో ప్రపంచ స్థాయికి ఎదిగి అకడమిక్ వలసలలు తగ్గుతాయి.










Comments