విద్యాసంస్థలను కలిపెయ్... విద్యార్థులను కర్వేపాకులా తీసిపారెయ్!
- BAGADI NARAYANARAO

- Jul 1, 2025
- 3 min read
రూ. 6 లక్షల అపరాధ రుసుము చెల్లించని ‘గ్లోబల్’
నాలుగు విద్యాసంస్థలను కలిపేసుకొని చేతులెత్తేసిన సంస్థ
‘చక్రధర్’ విద్యార్థుల ఫిర్యాదుతో కలెక్టర్ దృష్టికి
‘ఇంటర్నెషనల్’ పేరుతో జంతర్‌మంతర్

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
శ్రీకాకుళం నగరంలో ఆదివారంపేట సమీపంలో ఉన్న గ్లోబల్ జూనియర్ కళాశాలలో తనిఖీలు జరిపిన అధికారులు రూ.6 లక్షల జరిమానా విధిస్తే, ఆ మొత్తాన్ని కళాశాల యాజమాన్యం ఇప్పటివరకు చెల్లించలేదు. ఎందుకు చెల్లించలేదని అధికారులూ అడగలేదు. ఇదే అదనుగా అనుమతులు లేకపోయినా 20 రోజుల క్రితం ప్రారంభమైన కొత్త విద్యా సంవత్సరానికి కూడా గ్లోబల్ యాజమాన్యం యథేచ్ఛగా అడ్మిషన్లు నిర్వహించి, క్లాసులు కొనసాగిస్తోంది. ఇదేంటయ్యా.. అని ప్రశ్నిస్తే, అనుమతి కోసం ఇంటర్ బోర్డుకు దరఖాస్తు చేస్తున్నట్లు నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.
నగరంలోని చక్రధర్ జూనియర్ కళాశాలను విలీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న గ్లోబల్ యాజమాన్యం.. తమ సంస్థలో చదివి పాసైన విద్యార్థులకు చక్రధర్ కళాశాల పేరుతో సర్టిఫికెట్లు ఇస్తోంది. కానీ చక్రధర్ కళాశాలలో చదివిన వారికి మాత్రం సర్టిఫికెట్లు ఇవ్వకుండా అవస్థల పాల్జేస్తోంది. చక్రధర్ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు చక్రధర్ మృతి చెందగా.. ఆయన కుమార్తె ద్వారా ఆ విద్యాసంస్థలన్నింటినీ మధ్యవర్తుల ఒప్పందం ఆధారంగా గ్లోబల్ యాజమాన్యం విలీనం (స్వాధీనం) చేసుకుంది. అయితే విలీన ప్రక్రియ ఇప్పటికీ పూర్తికాలేదు. ఒప్పందం ప్రకారం జరపాల్సిన చెల్లింపులను గ్లోబల్ యాజమాన్యం పూర్తి చేయనందున విలీన ప్రక్రియ అసంపూర్తిగా మిగిలిపోయినట్లు సమాచారం. అయినా గ్లోబల్ జూనియర్ కళాశాలలో చదివిన విద్యార్ధులకు చక్రధర్ విద్యాసంస్థ పేరుతోనే సర్టిఫికెట్లు ఇస్తున్నారు. కానీ 2024`25 విద్యా సంవత్సరంలో చక్రధర్ జూనియర్ కళాశాలలో చదివిన వారికి మాత్రం సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. గ్లోబల్ కళాశాలలో చక్రధర్ కళాశాల విలీనమైందంటూ కొన్నాళ్లు కలిసి కొనసాగించిన బంధం నచ్చక పలువురు చక్రధర్ కళాశాల విద్యార్ధులు వేరే కళాశాలల్లో చేరారు. కానీ ఇంటర్‌లో చేరినప్పుడు చక్రధర్ యాజమాన్యానికి ఇచ్చిన పదో తరగతి మార్క్ షీట్, టీసీ, స్టడీ సర్టిఫికెట్ల కోసం వారంతా గ్లోబల్ యాజమాన్యం చుట్టూ తిరుగుతున్నారు. చక్రధర్ విద్యాసంస్థ కొనుగోలుకు ఒప్పందం కుదిరిన సమయంలోనే రాసుకున్న పత్రాల మేరకు అక్కడి విద్యార్ధుల సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకున్న గ్లోబల్ యాజమాన్యం.. కళాశాల నుంచి వెళ్లిపోయిన విద్యార్థులకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆ సర్టిఫికెట్లు ఇస్తామంటూ ఎన్‌వోసీలు కూడా ఇచ్చింది. కానీ ఇప్పుడు వాటిని ఇవ్వడానికి ఒక్కో విద్యార్థి నుంచి రూ.50 వేలు డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. దీనిపై 11 మంది విద్యార్ధులు సోమవారం గ్రీవెన్స్‌లో జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో గ్లోబల్ బండారం బయటకొచ్చింది.
ఆది నుంచీ వివాదాలే..
మొదటి నుంచీ గ్లోబల్ విద్యాసంస్థల వ్యవహారం గోల్‌మాల్‌గానే ఉంది. నగరంలో రెండుచోట్ల గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్ పేరుతో తరగతులు నిర్వహిస్తోంది. మండలవీధిలో ఉన్న స్కూల్‌కు మొదట్లో ఎనిమిదో తరగతి వరకు మాత్రమే అనుమతి ఉండేది. గత ఏడాది మాత్రమే 8, 9, 10 తరగతుల నిర్వహణకు అనుమతి పొందింది. కాగా నగరంలో రెండుచోట్ల నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ స్కూల్‌కు కూడా అనుమతుల్లేవు. అయినా దర్జాగా తరగతులు నిర్వహిస్తున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తే తనిఖీల పేరుతో హడావుడి చేసి.. ఆ తర్వాత పట్టించుకోవడంలేదు. అసలు గ్లోబల్ విద్యాసంస్థల ప్రారంభమూ వివాదాస్పదమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నగరంలో రెండు దశాబ్దాలుగా పని చేస్తున్న విశాఖ పబ్లిక్ స్కూల్‌ను నడిపించడానికి ఒప్పందం కుదుర్చుకుని అనుమతులు లేకపోయినా గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్ అని బోర్డు పెట్టేసింది. విశాఖ పబ్లిక్ స్కూల్ పేరుతోనే విద్యార్ధులను చేర్చుకుని తర్వాత దశలవారీగా గ్లోబల్ స్కూల్‌కు తరలించేందుకు ప్రయత్నించారు. గ్లోబల్ స్కూల్ పేరుతో చదువులు చెప్పి విశాఖ పబ్లిక్ స్కూల్ పేరుతో సర్టిఫికెట్లు ఇవ్వడం ప్రారంభించారు. రెండేళ్లకే విశాఖ పబ్లిక్ స్కూల్‌ను నిర్వీర్యం చేసేసిన తర్వాత మండల వీధిలో ఉన్న శారదా ప్రైమరీ స్కూల్ యాజమాన్యంతో ఒప్పందం చేసుకొని ఆ భవనంలో గ్లోబల్ స్కూల్‌ను ప్రారంభించారు. అయితే ఆశించిన స్థాయిలో ఫలితాలు లేక విశాఖ పబ్లిక్ స్కూల్ యాజమాన్యంపై తల్లిదండ్రులు ఒత్తిడి పెరగడంతో కళ్లు తెరిచిన యాజమాన్యం గ్లోబల్ విద్యాసంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. కాగా శారదా స్కూల్ భవనంలో పెట్టిన గోబల్ స్కూల్ పేరును ఇంటర్నేషనల్ స్కూల్‌గా బోర్డు పెట్టడంతో అనేకమంది ఆసక్తి చూపినా దానికి విద్యాశాఖ అనుమతులు లేవని తేలడంతో విశాఖ పబ్లిక్ స్కూల్‌కు క్యూ కట్టారు. ఆ తర్వాత రాజకీయ ప్రాపకంతో ఒకటి నుంచి ఏడో తరగతి వరకు అనుమతులు తీసుకొని ప్రైమరీ స్కూల్ నడుపుతున్నారు.
స్కూల్‌కు అనుతులు.. ఇంటర్ క్లాసులు
మరోవైపు ఆదివారంపేటలో ఇండియన్ ప్లే స్కూల్ యాజమాన్యంతో ఒప్పందం చేసుకొని ఒకటి నుంచి పదో తరగతి వరకు క్లాసులు నిర్వహిస్తున్నారు. స్కూల్ నిర్వహణకు మాత్రమే అనుమతులు ఉండగా గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్ పేరుతో బోర్డులు ఏర్పాటు చేసి ఉన్నత తరగతులు నిర్వహిస్తోంది. చక్రధర్ ఐఐటీ, నీట్ అకాడమీలను గ్లోబల్ ఐఐటీ, నీట్ అకాడమీగా పేరు మార్చి సమాంతరంగా ఇంటర్ తరగతులు నిర్వహిస్తున్నారు. ఐఐటీ, నీట్ అకాడమీలో ఇంటర్ విద్యార్ధులకు హాస్టల్ కూడా నిర్వహిస్తున్నారు. ఇంటర్ పూర్తి చేసిన వారికి చక్రధర్ జూనియర్ కళాశాల పేరుతో సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. తనతో ఒప్పందాలు చేసుకున్న విశాఖ పబ్లిక్ స్కూల్, శారద ప్రైమరీ స్కూల్, ఇండియన్ ప్లే స్కూల్, చక్రధర్ విద్యా సంస్థలన్నింటినీ ఏదోవిధంగా గ్లోబల్ యాజమాన్యం ఇబ్బంది పెట్టిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఒప్పందాలను అనుగుణంగా గ్లోబల్ యాజమాన్యం నడుచుకోకపోవడంతో ఆయా సంస్థల యాజమాన్యాలతో పాటు వాటి నుంచి గ్లోబల్ విద్యాసంస్థల్లో చేరిన విద్యార్ధులు కూడా ఇబ్బంది పడుతున్నారు.










Comments