వందేళ్ల స్ఫూర్తి.. తరగని సేవా దీప్తి
- DV RAMANA

- Jun 13, 2025
- 4 min read
అసిధారా వత్రంలా నిరంతరాయంగా నిర్వహణ
బెవర గోపాలనాయుడు చొరవతో ఏర్పాటు
తొలుత బాటసారులకు.. తర్వాత దూరప్రాంత విద్యార్థులకు ఆదరువు
దాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్న ఆ కుటుంబ వారసులు
మధ్యలో కొన్నేళ్లు దేవదాయ శాఖ ఆధీనంలో నిర్వహణ
మళ్లీ ఇప్పుడు వారసులకే ఆ బాధ్యతలు అప్పగింత
అన్నదాన సత్రం వ్యవహారాల్లో శశిభూషణరావుదే కీలకపాత్ర

సౌకర్యాల లేమి.. పరిమిత ఆర్థిక వనరులు.. వంటి అనేక అవరోధాల నడుమ పూర్వకాలంలో విద్యాభ్యాసం కష్టతరంగా ఉండేది. రవాణా వసతులు అంతంతమాత్రంగా ఉన్న ఆ కాలంలో గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల్లోని విద్యాసంస్థలకు వెళ్లి చదువుకోవడం పేదవర్గాలకు దాదాపు అసాధ్యం. దీన్ని దృష్టిలో ఉంచుకునే అప్పట్లో సంపన్నవర్గాలకు చెందిన అనేకమంది దాతలు సొంత వనరులతో సత్రాలు ఏర్పాటు చేసి అన్నదానం చేసేవారు. వారి దాతృత్వం ఎంతోమందిని విద్యావంతులుగా.. ఉన్నతోద్యోగులుగా తీర్చిదిద్దింది. అటువంటి దాతృత్వానికి ప్రతీక నేటికీ పాలకొండలో సజీవంగా కనిపిస్తుంది. వందేళ్లు పూర్తి చేసుకున్నా ఇప్పటికీ దూరప్రాంత విద్యార్థుల కడుపు నింపుతూ స్ఫూర్తి పరిమళాలు వెదజల్లుతోంది. తమ పూర్వీకులు వెలిగించిన ఈ స్ఫూర్తి దీప్తి మలిగిపోకుండా వారి వారసులు ఇప్పటికీ చేతులు అడ్డం పెట్టి కాపాడుతున్నారు. శిథిలమైన భవనాన్ని పునరుద్ధరించడంతోపాటు ప్రస్తుత కాలానికి అనుగుణంగా దాన్ని స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రంగా మార్చుందుకు ప్రయత్నిస్తున్నారు.
(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
వందేళ్ల క్రితం.. రవాణా సౌకర్యాలు ఇప్పటిలా విస్తృతంగా లేవు. విద్యాసంస్థలు కూడా విస్తరించలేదు. ఎక్కడో పట్టణ ప్రాంతాల్లో తక్కువ సంఖ్యలోనే ఉండేవి. ఫలితంగా గ్రామాల నుంచి విద్యాసంస్థలు ఉన్న ప్రాంతాలకు వెళ్లి, అక్కడే ఉండి చదువుకోవడం అందరికీ, ముఖ్యంగా పేదలకు సాధ్యమయ్యేది కాదు. అక్కడక్కడా దాతలు నిర్వహించే అన్నదాన సత్రాలు మాత్రం కొంతవరకు ఆదరువుగా ఉండేవి. ఆ కోవకు చెందినదే పాలకొండ పట్టణంలోని ముదునూరువారి వీధిలో ఉన్న బెవర గోపాలనాయుడు అన్నసత్రం. గత ఏడాదే వందేళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్న ఈ సత్రం నేటికీ సేవలు అందిస్తోంది. వ్యవస్థాపకులు మరణించినా ఆ కుటుంబంలోని తర్వాత తరాల వారు ఈ దాతృత్వ యజ్ఞాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. మధ్యలో కొన్నేళ్లు దేవదాయ శాఖ ఈ సత్రాన్ని స్వాధీనం చేసుకున్నా.. చివరికి మళ్లీ వ్యవస్థాపక కుటుంబానికి దాని నిర్వహణ బాధ్యతలు దక్కాయి. ఒకప్పుడు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పాలకొండ తాలూకా కేంద్రంగా ఉండేది. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తమ అవసరాలన్నింటికీ ఈ పట్టణానికే వచ్చేవారు. అలాగే ఉన్నత పాఠశాల కూడా ఇక్కడే ఉండేది. దాంతో చాలా ప్రాంతాల విద్యార్థులతోపాటు ప్రజలు వివిధ పనులపై నిత్యం పాలకొండకు వచ్చేవారు. అయితే వందేళ్ల క్రితం ఈ ప్రాంతాలు తీవ్ర కరువుకాటకాలతో అల్లాడేవి. దాంతో విద్యార్థులు, బాటసారులు నానా ఇబ్బందులు పడేవారు. ఈ పరిస్థితులను గమనించిన ఒక భూస్వామి చలించిపోయారు. ఆపన్నులను ఆదుకునేందుకు ఏదైనా చేయాలని తపించారు. అతనే వీరఘట్టం మండలం నీలానగరానికి చెందిన బెవర గోపాలనాయుడు. ఆయన తపన నుంచి పుట్టిందే బెవర గోపాలనాయుడు అన్నదాన సత్రం. ఇప్పటికీ ఆ కుటుంబ దాతృత్వానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.
తరతరాలుగా సేవలు

ఉత్తరాంధ్రలో దాతృత్వానికి మారుపేరుగా నిలిచిన సంస్థ.. విజయనగరం రాజవంశానికి చెందిన మన్సాస్ ట్రస్ట్. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అప్పటి వరకు ఉన్న సంస్థానాల విలీన ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ఆ పరిణామాల నేపథ్యంలో 1958లో విజయనగరం పూజపాటి రాజావారు తమ సంస్థానానికి చెందిన భూములను విరాళంగా ఇచ్చి మన్సాస్ ట్రస్ట్ పేరుతో ధార్మిక సంస్థను ఏర్పాటు చేశారు. కానీ దానికి దాదాపు పాతికేళ్ల ముందే..1924 మార్చిలో బెవర గోపాలనాయుడు తొలుత దూరప్రాంతాల నుంచి వచ్చే బాటసారుల కోసం అన్నదాన సత్రాన్ని ఏర్పాటు చేశారు. దీని నిర్వహణ కోసం నీలానగరం, తెట్టంగి, లుంబూరు గ్రామాల్లో తమ కుటుంబానికి ఉన్న 50 ఎకరాల భూములను విరాళంగా ఇచ్చారు. తర్వాత ఆయన కుమారుడు బెవర వేణుగోపాలనాయుడు పణుకువలసలో 20 ఎకరాల భూములను విరాళంగా ఇచ్చారు. నాగావళి ఆయకట్టు పరిధిలో ఉన్న ఈ భూములన్నీ ఏడాదికి మూడు పంటలు (రెండు వరి, ఒక అపరాలు) పండేవే. పాలకొండకు వివిధ పనులపై వచ్చే బాటసారుల ఆకలి తీర్చే క్రతువు ప్రారంభించిన గోపాలనాయుడు, భూముల నుంచి వచ్చే ఆదాయం మిగులుతుండటంతో చదువుకునేందుకు గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులకు కూడా ఆ సౌకర్యాన్ని విస్తరింపజేసి.. వారి ఆకలి తీర్చడం ప్రారంభించారు. ఆ విధంగా ప్రతిరోజు సుమారు 80 మంది విద్యార్థులకు పగలు, రాత్రి.. రెండు పూటలా భోజనం పెట్టేవారు. ఆహారం మిగిలిపోతే ఉదయం చద్దన్నంగా కూడా పెట్టేవారు. గోపాలనాయుడు తదనంతరం కుమారుడు వేణుగోపాలనాయుడు దాన్ని కొనసాగించారు. ఈయనకు పిల్లలు లేరు. దాంతో వ్యవస్థాపకుడైన గోపాలనాయుడు సంతానమైన ఆరుగురు కుమార్తెల వారసులు అన్నదాన సత్రం నిర్వహణ బాధ్యతలు కొనసాగించారు. గోపాలనాయుడు మునిమనుమడైన డాక్టర్ పాలవలస శశిభూషణరావు గత కొన్నేళ్లుగా ఈ సత్రం బాగోగులు, నిర్వహణ చూస్తున్నారు.
ప్రభుత్వం స్వాధీనం.. నిర్వహణ లోపం
గోపాలనాయుడు తదనంతరం ఆయన తనయుడు వేణుగోపాలనాయుడు సత్రం నిర్వహణ బాధ్యతలు చూశారు. అద్దె ఇంట్లో నిర్వహిస్తున్న సత్రానికి ఆయనే పాలకొండ పట్టణంలోని ముదునూరువారి వీధిలో సొంత గూడు సమకూర్చారు. 1949లో వేణుగోపాల్ మృతి చెందారు. దానికి ముందే ఆయన సత్రం నిర్వహణ బాధ్యతలను తమ కుటుంబ వారసులు, గ్రామ పెద్దలతో ఏర్పాటు చేసిన కమిటీకి అప్పగించారు. అప్పటినుంచి కమిటీ ఆధ్వర్యంలో సత్రాన్ని నిర్వహిస్తూ అన్నదానం నిరంతరాయంగా కొనసాగించారు. అయితే 1975 ప్రాంతంలో ప్రభుత్వం దీన్ని స్వాధీనం చేసుకుంది. అప్పటినుంచి చాలా ఏళ్లు దేవదాయ శాఖ దీన్ని నిర్వహించింది. అయితే కాలక్రమంలో వసతులు పెరగడం, రోడ్డు రవాణా సౌకర్యాలు విస్తరించడం, స్కూళ్లు కళాశాలలు ఎక్కడికక్కడ ఏర్పాటు కావడం, విద్యార్థుల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లు ఏర్పాటు చేసి ఉచిత భోజన వసతి కల్పించడంతో గోపాలనాయుడు సత్రానికి విద్యార్థుల రాక క్రమంగా తగ్గిపోయింది. అయినా ఇప్పటికీ రోజూ పది పదిహేను మంది విద్యార్థులు వస్తున్నారు. మరోవైపు దేవదాయ శాఖ అధికారుల నిర్వహణ లోపం వల్ల 2018 నాటికి సత్రం శిథిలావస్థకు చేరుకుంది. దాంతో చాన్నాళ్లు కోటదుర్గ గుడి ఆవరణలోనే ఈ సత్రానికి వచ్చే విద్యార్థులకు అన్నదానం చేసేవారు.
కొత్త భవనం నిర్మాణం
సత్రం దేవదాయ శాఖ చేతిలోకి వెళ్లడం, విద్యార్థుల సంఖ్య తగ్గడం, నిర్వహణ లోపం తదితర కారణాలతోపాటు సత్రం నిర్వహణకు వ్యవస్థాపకులు ఇచ్చిన భూములు చాలావరకు అన్యాక్రాంతమయ్యాయి. రావాల్సిన ఆదాయం కూడా రాని పరిస్థితులు తలెత్తాయి. భవనం శిథిలమైంది. ఈ పరిస్థితులను గమనించిన బెవర గోపాలనాయుడి వారసుల్లో కీలకపాత్ర పోషిస్తున్న డాక్టర్ పాలవలస శశిభూషణరావు సత్రం బాధ్యతలు తిరిగి తమకే అప్పగించాలని కోరుతూ ప్రభుత్వంతో సంప్రదింపులు ప్రారంభించారు. అలాగే శిథిల భవనం స్థానంలో కొత్త భవన నిర్మించాలని కోరారు. ఆయన కృషి ఫలితంగా అప్పటి దేవదాయ కమిషనర్ అనిల్‌కుమార్ సింఘాల్ చొరవతో కొత్త భవనానికి ఆమోదం లభించింది. అయితే నిర్మాణ వ్యయంలో ఐదో వంతు విరాళంగా ఇస్తే.. మిగిలిన వ్యయాన్ని ప్రభుత్వ నిధులతో భరిస్తామని సింఘాల్ షరతు పెట్టారు. దానికి అంగీకరించిన శశిభూషణరావు కుటుంబమంతా కలిసి భవన నిర్మాణ వ్యయం రూ.30 లక్షల్లో రూ.6 లక్షలు విరాళంగా ఇచ్చారు. దాంతో 2023లో సత్రానికి కొత్త భవనం సమకూరింది.
తిరిగి వారసుల చేతికి
కాగా సత్రం నిర్వహణను తిరిగి తమకే అప్పగించాలన్న వారసుల విజ్ఞప్తిని ప్రభుత్వం మన్నించింది. ఆ మేరకు గత ఏడాది జారీ చేసిన జీవోఆర్టీ నెం. 614, తేదీ 12.9.2024 ద్వారా సత్రం నిర్వహణ అధికారాన్ని వారికి దఖలుపర్చింది. ఈ నేపథ్యంలోనే సత్రం ఏర్పాటు చేసి వందేళ్లు పూర్తి అయిన సందర్భంగా బెవర గోపాలనాయుడు మునిమనుమరాలు, ఐఏఎస్ అధికారి ఎస్. సత్యనారాయణ సతీమణి స్వర్ణశ్రీ విరాళంగా సమకూర్చిన గోపాలనాయుడు, వేణుగోపాలనాయుడు విగ్రహాలను గత నెల 28న సత్రం ఆవరణలో ఆవిష్కరించారు. ఇదే సందర్భంగా సత్రానికి విద్యార్థుల రాకపోకలు తగ్గిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సత్రాన్ని, దాని ఆదాయాన్ని వృథా పోనివ్వకుండా పేద విద్యార్థులను స్వయం ఉపాధి దిశగా నడిపించే స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రంగా మార్చేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సత్రం నిర్వాహక కమిటీ తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపింది. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వెంటనే స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ప్రారంభిస్తామని డాక్టర్ శశిభూషణరావు తెలిపారు.
భూములు అన్యాక్రాంతం
అన్నదాన సత్రం నిర్వహణకు దాని వ్యవస్థాపకుడు గోపాలనాయుడు 53 ఎకరాలు, తర్వాత ఆయన తనయుడు 20 ఎకరాలు ఇచ్చారు. వాటిని రైతులకు కౌలుకు ఇచ్చి.. తద్వారా వచ్చే ఆదాయంతో సత్రాన్ని నిర్వహించేవారు. అయితే దేవదాయ శాఖ స్వాధీనం చేసుకోవడం, అధికారులు పట్టించుకోకపోవడం వల్ల కౌలు వసూళ్లు నిలిచిపోయాయి. భూములు ఆక్రమణల పాలయ్యాయి. దాతలు ఇచ్చిన మొత్తం 73 ఎకరాల్లో ప్రస్తుతం 35 ఎకరాల నుంచి మాత్రమే ఎకరాకు ఐదు బస్తాలు చొప్పున కౌలు అందుతోంది. కొందరు రైతులు కౌలు చెల్లించడం మానేయగా.. కొందరు ఏకంగా భూములనే సొంతం చేసుకున్నారు. వీటిలో ఎనిమిది ఎకరాలు కోర్టు వివాదంలో చిక్కుకున్నాయి. ఈ భూములను విడిపించేందుకు కోర్టు ద్వారానే పోరాడుతున్నామని, త్వరలోనే తమకు అనుకూలంగా కోర్టు నిర్ణయం ప్రకటించవచ్చని డాక్టర్ శశిభూషణరావు ఆశాభావం వ్యక్తం చేశారు.










Comments