విధి వంచితులు కాదు.. విజేతలు
- Guest Writer
- Sep 26
- 4 min read
క్రీడా ప్రయాణంలో ప్రమాదాల హర్డిల్స్
వాటిని జయించి పతకాలు సాధించిన ఘనులెందరో
వైకల్యంతోనే అసమాన విజయాలతో ఘనచరిత్ర
ఎందరికో స్ఫూర్తిమంత్రం.. వారి విజయ ప్రస్థానం

క్రీడారంగం.. శారీరక పటుత్వానికి, మానసిక స్థైర్యానికి ఈ రంగం దోహదం చేస్తుంది. అందుకే చిన్నప్పటినుంచే పిల్లలను మైదానానికి పంపి ఆటలాడిరచాలని సూచిస్తుంటారు. కానీ విధి ఆడిన వికృత క్రీడలో ఎంతోమంది క్రీడాకారులు ఓడిపోయి, దారుణమైన ప్రమాదాలకు గురిచేసి పూర్తిగా ఆటకు దూరం చేస్తుంటాయి. వారి భవిష్యత్తును చీకటిమయం చేస్తుంటాయి. మానసికంగా కుంగదీస్తుంటాయి. అయితే కొందరు మాత్రం దీనికి పూర్తిగా మినహాయింపు. తమను తీవ్రంగా దెబ్బతీసిన ప్రమాదాలనే వీరు సవాల్ చేశారు.. చేస్తున్నారు. తమ క్రీడా జీవితం ముగిసిపోయినట్లేనన్న డాక్టర్ల వాదనను కూడా సవాల్ చేస్తూ.. మళ్లీ శిరమెత్తి, సగర్వంగా నిలబడి.. తమదైన క్రీడలను శాసించిన కొందరు ధీమంతుల విజయగాధలు..
భారత క్రికెట్‌ను నడిపిన ఒంటికన్ను
అతడో నవాబు. ఇంగ్లాండు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో చదివేవాడు. యూనివర్సిటీ తరఫున క్రికెట్ మ్యాచ్ ఆడి.. ఆ రాత్రి తోటి క్రీడాకారులతో డిన్నర్‌కు వెళ్లాడు. అనంతరం స్నేహితులు ‘నడిచి వెళ్దాం’ అంటే ‘అలసిపోయాను. కార్లో వెళ్లిపోతాను’ అని చెప్పి స్నేహితుడి కారు ఎక్కాడు. వందగజాలు కూడా వెళ్లకముందే, ఎదురుగా ఒక పెద్ద కారు వచ్చి ఢీ కొనడంతో కుడి భుజం బెణికింది. విండ్ స్క్రీన్ పగిలి అద్దం కంట్లో గుచ్చుకుంది. ‘ఈ భుజంతో తిరిగి మళ్లీ క్రికెట్ ఆడగలనా’ అనుకున్నాడు. హాస్పిటల్‌కి వెళ్తే అక్కడి డాక్టర్లు ‘మీకు నొప్పి తెలియలేదు కానీ మీ కుడి కన్ను పూర్తిగా పోయింది. ఇక ఆటకి పనికిరారు’.. అన్నారు. అయినా అతను నిరాశ పడలేదు. అతడి ప్రయాణాన్ని ఆ ప్రమాదం రెడ్ లైట్ వేసి ఆపలేదు. ఆపై జీవితాంతం ఒంటికన్నుతోనే ఆడాడు. అతడు సిక్సర్లు కొడుతుంటే ఎదుటి జట్టు ఆటగాళ్లు బెంబేలెత్తిపోయేవాళ్లు. అతని అసలు పేరు మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ. హర్యానాలోని గురుగావ్ జిల్లాలో పటౌడీ అనే నగరానికి జమిందార్ కాబట్టి ‘నవాబ్ అఫ్ పటౌడీ’ అని కూడా అంటారు. చాలా అందగాడు. ఆ రోజుల్లో నవాబ్ ఆఫ్ పటౌడీ గ్రౌండ్‌లో ఆడుతుంటే కేవలం అతన్ని చూడటానికే అమ్మాయిలు స్టేడియానికి వచ్చే వాళ్లంటే అతిశయోక్తి కాదు. కాశ్మీర్ కి కలి చిత్ర హీరోయిన్ షర్మిలా టాగోర్ భర్త ఇతడు. ‘దేవర’ ఫేమ్ సైఫ్ ఆలీ ఖాన్‌కు తండ్రి. ఒక కన్నుతోనే క్రికెటర్‌గా రాణించి భారతజట్టుకు కెప్టెన్ కూడా అయ్యాడు. భారత క్రికెట్ చరిత్రలో అతి చిన్న వయసు(21 ఏళ్లు)లో జాతీయ జట్టుకు కెప్టెన్ అయినవాడుగా, ఎక్కువసార్లు గెలిచిన కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్నాడు.
సగర్వంగా నిలబడిన హాకీ స్టిక్
అతి చిన్నవయసులో అంతర్జాతీయ హాకీలో అరంగేట్రం (2004) చేసిన అతి కొద్దిమంది క్రీడాకారుల్లో సందీప్ సింగ్ ఒకరు. అప్పుడు (2004లో) అతడి వయసు 18 ఏళ్లు. ఒక దశలో ప్రపంచ హాకీ చరిత్రలోనే అతడిది అత్యుత్తమ వేగం (గంటకు 145 కి.మీ) అని చెప్పుకునేవారు. పక్క ఆటగాడికి వేగంగా ‘పాస్’లు ఇవ్వటంలో ఆ రోజుల్లో అతడికి మించినవారు లేరని ప్రతీతి. ‘బతుకు చదరంగంలో అతిచిన్న పావులం మనం. ఎదుటి ఆటగాడికి ‘షా’ చెప్పి గెలిచామని అనుకునే లోపే.. ఏదో ఓ మూల నుంచి ప్రత్యర్థి ఏనుగు వచ్చి మన రాజును కూలదోస్తుంది. విధి కూడా అంతే. గెలిచి అందలం ఎక్కుతుండగానే కాలు జార్చి మన గెలుపునకు ‘చెక్’ పెడుతుంది. మన పట్టుదలని పరీక్షిస్తుంది’.. అంటాడు ఈ ఆటగాడు.
డాక్టర్ల నమ్మకం వమ్ము
ఒక దురదృష్టమైన రోజు (2006 ఆగస్టు 22) విధి అతడిని వెక్కిరించింది. జర్మనీలో జరిగే ప్రపంచ కప్ పోటీల్లో పాల్గొనటానికి కల్కా-ఢల్లీి శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో వెళుతుండగా ఒక ఆర్పీఎఫ్ అధికారి చేతిలోని తుపాకీ పొరపాటున పేలి.. బుల్లెట్ అతడి వెన్నెముక నుంచి శరీర దిగువ భాగంలోకి దూసుకుపోయింది. ఫలితంగా నడుము కింది భాగం అచేతనమై దాదాపు రెండేళ్లు వీల్‌చైర్‌పై ఉన్నాడు. ఇక అతడు ఎప్పటికీ నడవలేడనీ, జీవితాంతం అలాగే ఉండవలసి ఉంటుందనీ డాక్టర్లు నమ్మకంగా చెప్పారు. ఆ నమ్మకాన్ని నమ్మటానికి అతడు నిరాకరించాడు. ‘ఫిజియో థెరపిస్ట్’ భుజం మీద ఒక చెయ్యి, ‘దృఢసంకల్పం’ మీద మరో చెయ్యి వేసి అతడు నడవటం మొదలుపెట్టాడు. ఆస్పత్రిలో ఉండగానే తమ్ముడు విక్రమ్ గీత్ సింగ్ అతనికి హాకీ స్టిక్ ఇచ్చి వీలైనంత తొందరలో తిరిగి మైదానంలోకి అడుగుపెట్టమని ప్రోత్సహించాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోగానే తిరిగి హాకీ ప్రాక్టీసు కూడా ప్రారంభించాడు..! అకుంఠిత దీక్షతో కృషి చేసి తిరిగి భారత జట్టులో స్థానం సాధించి కీలక ఆటగాడిగా కొనసాగాడు. ఒక టోర్నమెంట్‌లో ఏకంగా 12 గోల్స్ కొట్టి కొత్త రికార్డు నెలకొల్పాడు. అంతే కాదు.. జాతీయ కోచ్ అయ్యాక భారతదేశానికి రెండు ఒలింపిక్ బంగారు పతకాలు సాధించిపెట్టాడు. అలా తనను వెక్కిరించిన విధిని చిరునవ్వుతో పరిహసించాడు.
భయపెట్టిన నీటినే జయించాడు
దత్తు బోకనాల్‌కు నీరంటే అమితమైన భయం. తన జీవితకాలంలో అతను నదిని గానీ, కాలువను గానీ చూడలేదు. తమ ఊళ్లోని గ్రామస్తులందరికీ కలిపి తవ్విన ఒకే ఒక సామూహిక బావి (నుయ్యి)లోని నీటిని మాత్రమే చూశాడు. మరోలా చెప్పాలంటే అతడు ఎప్పుడూ ‘ప్రవహిస్తున్న నీటిని’ చూడలేదు. సముద్రమూ, కెరటాలూ అని ఎవరో చెప్తే వినడమే తప్ప అవి ఎలా ఉంటాయో తెలియదు. దేశంలోనే అత్యంత కరువు కాటకాలకు నెలవైన మహరాష్ట్రలోని నాసిక్ జిల్లా తాలేగావ్ గ్రామం దాటి అతడు ఎన్నడూ బయటకి వెళ్లలేదు. అక్కడ వర్షం కూడా అరుదే. తాలేగావ్ లాంటి చిన్న గ్రామంలో పుట్టిన దత్తు బోకనాల్‌కి పెద్ద పెద్ద కోరికలు లేవు. లోతైన గుంతల నుంచి నీటిని తోడుకెళ్లి పొలాన్ని తడపటమే అతడి దినచర్య. వర్షం అక్కడో వరం. రైతుల ఆత్మహత్యలు సాధారణం. అతడి తండ్రి ఒక కూలీ. ఐదో తరగతి చదువుతున్న సమయంలో దత్తు తండ్రికి ఆర్థికంగా సహాయపడాలని నిర్ణయించుకుని పగలు కూలి పని, రాత్రిళ్లు పెట్రోలు బంకులో పని చేసేవాడు. తన జీవితంలో అతడు టెలివిజన్, రిఫ్రిజిరేటర్లు చూడలేదు. ‘ఒలింపిక్స్’ అనే పేరు కూడా వినలేదు. చిత్రమేమిటంటే అటువంటి వాడు రియో ఒలింపిక్స్‌లో భారతదేశం తరఫున సాగరక్రీడ(రోవింగ్)లో పాల్గొన్న ‘ఏకైక’ క్రీడాకారుడిగా ఎదిగాడు.
ఆర్మీ అధికారి ఆలంబన
తండ్రి మరణించిన తర్వాత భవన నిర్మాణ కూలీగా, ఆపైన మేస్త్రిగా, ఆ తర్వాత పెళ్లిళ్లలో భోజనాలు సర్వ్ చేసే వెయిటర్‌గా, ట్రాక్టర్ డ్రైవర్‌గా, ఇంకా ఏవేవో చిన్న చిన్న పనులు చేస్తూ చివరికి 2012లో సైన్యంలో చేరాడు. అతని ఎత్తు, శరీర దారుఢ్యం చూసి ఒక ఆర్మీ ఆఫీసర్ అతడిని పడవ పందాల్లో పాల్గొనమని సలహా ఇచ్చాడు. అక్కడి కోచ్ ప్రోత్సాహంతో అతడు వాటర్ గేమ్స్‌లో పాల్గొనడం ప్రారంభించాడు. అప్పుడు కూడా పెద్ద పెద్ద మెడల్స్ సంపాదించాలన్నది అతడి ఆశయం కాదు. రోవింగ్‌లో కాస్త గుర్తింపు వస్తే సైన్యంలో ప్రమోషన్ వస్తుందని, గ్రామంలో తమ కుటుంబానికి మరికాస్త ఎక్కువ డబ్బు పంపవచ్చని కోరిక. అక్కడ గ్రామంలో అతడి కుటుంబ సభ్యులు ఐదుగురు అతడు పంపించే డబ్బు మీదే ఆధారపడి ఉన్నారు. ‘నాకు తండ్రి లేడు. అమ్మ పక్షవాతంతో మంచం మీద ఉంది. పొలాలకు నీళ్లు లేవు. పొలాల్లో పంటలు లేవు. కుటుంబానికి నేనొక్కడినే ఆధారం. నా వృత్తే నాకు ఆధారం. పోటీల్లో గెలిస్తే జీతం మరింత పెరుగుతుందని ఒకటే నమ్మకం’ అనేవాడు బొకనాల్. ఆ ఏడాది ఒలింపిక్స్ రియోలో జరుగుతున్నాయి. ఆ ఒలింపిక్స్‌లో పాల్గొనే సమయానికి బకనాల్ వయస్సు 25 ఏళ్లు. రోవింగ్‌లో భారతదేశానికి ఇప్పటి వరకూ కేవలం ఒకే మెడల్ వచ్చింది. అది అతడి ద్వారానే లభించింది. అప్పటి వరకు సముద్రాన్ని గానీ, నదిని గానీ చూడని ఆ యువకుడు తన కుటుంబాన్ని దరిద్ర సాగరం నుంచి బయట పడేయడానికి పడవ ప్రయాణం మొదలుపెట్టాడు. ఇండోనేషియాలో జరిగిన 18వ ఏషియన్ గేమ్స్‌లో భారతదేశానికి గోల్డ్ మెడల్ సంపాదించి పెట్టాడు. బోకనాల్ ప్రస్తుతం ఇండియన్ ఆర్మీలో జూనియర్ కమిషన్ ఆఫీసర్‌గా పని చేస్తున్నాడు.
అతని స్థైర్యానికి క్యాన్సర్ అవుట్
ఒకే ఓవర్లో 6 సిక్సర్లు కొట్టిన హీరో అతడు. 2011 క్రికెట్ ప్రపంచ కప్ పోటీలు పూర్తి అవుతుండగా అతడికి ఊపిరితిత్తుల క్యాన్సర్ సోకింది. తీవ్రమైన బాధతో విలవిలలాడిపోయేవాడు. బ్లడ్ వామిటింగ్స్ చేసుకునేవాడు. ఆ సమయంలో అతడి తల్లి అతనికి గొప్పగా సేవ చేసింది. మొహంపై రక్తాన్ని తుడుస్తూ ‘ఎప్పటికైనా మళ్లీ నువ్వు దేశానికి నీ సర్వీసెస్ అందజేస్తావురా’ అంటూ ధైర్యం చెప్పేది. రెండేళ్లపాటు ఆటకు దూరంగా ఉండి, వైద్యుల సహాయంతో అతడు కోలుకున్నాడు. 2015 ఐపీఎల్‌లో ‘ఢల్లీి డేర్ డెవిల్స్’ ఇతడిని రూ.16 లక్షలకు కొనడంతో ఆ ఏడాది ఐపీఎల్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. మృత్యువును క్లీన్ బౌల్డ్ చేసిన ఆ క్రికెటర్ యువరాజ్ సింగ్.
- యండమూరి వీరేంద్రనాథ్










Comments