వినోద ఆదాయం వికాసానికి దోహదపడాలి!
- DV RAMANA

- May 24, 2025
- 2 min read

ఇండియన్ ప్రీమియర్ లీగ్.. ముక్తసరిగా చెప్పాలంటే ఐపీఎల్.. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఐదు క్రీడా ఈవెంట్లలో ఒకటి. ఆదాయంలోనూ దానికదే సాటి. గణాంకాలు పరిశీలిస్తే.. ఐపీఎల్ 2023లో ఐపీఎల్ ద్వారా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) రికార్డు స్థాయిలో రూ.5,120 కోట్ల ఆదాయం ఆర్జించింది. మొత్తం టర్నోవర్ రూ.11,770 కోట్లకు చేరుకుంది. దీనికి మీడియా హక్కులే ప్రధాన కారణం. ఇక 2024, 2025 అంచనాల ప్రకారం ఐపీఎల్ వార్షికాదాయం రూ.12 వేల నుంచి రూ.13,500 కోట్లు. ఇది ప్రపంచంలోని అతిపెద్ద క్రీడా ఆదాయ వ్యవస్థల్లో ఒకటి. ప్రతి ఏటా ఈ క్రీడా సంబరం ప్రపంచాన్ని అబ్బురపరుస్తూనే ఉంది. మ్యాచ్‌లు జరిగే స్టేడియాలు ప్రేక్షకులతో కిక్కిరిసిపోతుంటాయి. అంతేకాకుండా టీవీలు, శాటిలైట్ ఛానళ్ల ద్వారా వీటి ప్రత్యక్ష ప్రసారాలను కోట్లాది అభిమానులు వీక్షిస్తుంటారు. ఫలితంగా బిలియన్ల విలువైన ప్రకటనల వర్షం కురుస్తుంటుంది. కానీ ఇంత పెద్ద ఆదాయంలో కొద్దిపాటి ట్యాక్సులు తప్ప మిగిలినదంతా బీసీసీఐ వద్దే పోగుపడిపోతోంది. వందల కోట్ల ఆ ఆదాయాన్ని అలా వృథాగా ఉంచేసే బదులు అందులో కొంతయినా దేశాభివృద్ధికి ఉపకరించే పరిశోధనలు, నూతన ఆవిష్కరణలకు వెచ్చిస్తే ఎంత బాగుంటుంది! వినోదం ద్వారా విజ్ఞానం, వికాసం సాధించగలిగితే అంతకుమించిన అద్భుతం ఇంకేముంటుంది. కానీ బీసీసీఐ ఇటువంటి ఆలోచన చేయకపోగా దాతృత్వ హోదా కింద ప్రభుత్వం నుంచి ఆదాయ పన్ను మినహాయింపులు పొందుతోంది. ఐపీఎల్ ఫ్రాంచైజీలన్నీ బిలియనీర్ల యాజమాన్యంలోనే ఉన్నాయి. మూలధన లాభాలపై పన్ను రాయితీల ప్రయోజనం కూడా పొందుతాయి. ఆటగాళ్ల రెమ్యూనరేషన్‌పై వ్యక్తిగతంగా పన్ను విధిస్తున్నారు. కానీ ఫ్రాంచైజీ లాభాలు, బీసీసీఐ ఆదాయాలు కార్పొరేట్ పన్ను నుంచి తప్పించుకుంటున్నాయి. ఐపీఎల్ ద్వారా బీసీసీఐకి వచ్చే లాభాలపై 40 శాతం పన్ను వర్తింపజేస్తే మూడేళ్లలో సుమారు రూ.15 వేల కోట్లు సేకరించవచ్చు. పది కొత్త ఐఐటీలకు లేదా జాతీయ డీప్-టెక్ ఇన్నోవేషన్ కార్పస్ ఫండ్ సమకూర్చడానికి ఈ మొత్తం సరిపోతుంది. దీనికి ఫ్రాంచైజీ లాభాలను కూడా జోడిస్తే ఏటా మరో రూ.400 కోట్లు సేకరించవచ్చు. మొత్తంగా ఏడాదికి సుమారు రూ. ఆరువేల కోట్ల వరకు పరిశోధన రంగానికి మళ్లించవచ్చు. కానీ ప్రస్తుతం దేశంలో దీనికి విరుద్ధంగా జరుగుతోంది. పరిశోధన సంస్థలు, ప్రయోగశాల పరికరాలు, వినియోగ వస్తువులు, సాఫ్ట్‌వేర్ లైసెన్స్‌లపై జీఎస్టీ వసూలు చేస్తున్న ప్రభుత్వం వినోద రంగానికి మాత్రం సబ్సిడీలు ఇవ్వడం విడ్డూరం. ఐపీఎల్ మాత్రమే కాకుండా సినిమా నిర్మాణాలు సైతం పన్ను మినహాయింపులు, సబ్సిడీలు పొందుతున్నాయి. మతపరమైన ట్రస్టులు పూర్తి పన్ను మినహాయింపులు అనుభవిస్తూనే తమ వాణిజ్య సామ్రాజ్యాలను విస్తరించుకుంటున్నాయి. కొత్త స్పోర్ట్స్ లీగ్‌లకు స్టార్టప్ ట్యాక్స్ హాలీడే ఇస్తున్నారు. దేశంలో డబ్బుకు కొరత లేకున్నా భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టాలనే దృక్పథం మనకు లేదు. తక్షణ రాబడి కోసం ప్రయత్నిస్తున్న వ్యాపారవేత్తలే ఆధిపత్యం చెలాయిస్తున్నారు. పరిశోధన, ఆవిష్కరణ, ప్రాథమిక సాంకేతిక అభివృద్ధిని ‘అధిక రిస్క్.. తక్కువ రిటర్న్’ వ్యాపారాలుగా మాత్రమే చూస్తున్నారు. అదే అమెరికా, చైనా, జర్మనీ వంటి దేశాలు పరిశోధనలకు ఎక్కువ నిధులు సమకూర్చడం ద్వారా సంపదను నిర్మించుకున్నాయి. మనం మాత్రం పునాదులు నిర్మించకుండా సంపదను వెతుకుతున్నాం. మన పాలకుల, పెట్టుబడిదారుల ఆలోచన ఎలా ఉందంటే.. ‘ఐపీఎల్ వంటి ఈవెంట్ల ద్వారా వినోదం అస్వాదిస్తాం.. కానీ దేశానికి అవసరమైన సెమీ కండక్టర్లను మాత్రం దిగుమతి చేసుకుంటాం. ఒకవైపు సినిమాల నిర్మాణ వ్యయాన్ని వందల కోట్ల నుంచి వేల కోట్లకు పెంచామని గర్వంగా చెప్పుకొంటున్న మనం.. అదే సమయంలో ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణల్లో చాలా వెనుకబడి ఉన్నాం. మన పారిశ్రామిక సంస్థలు తమ పెట్టుబడుల కోసం విచ్చలవిడిగా ఐపీవోలకు వెళుతున్నా.. కొత్త ఆవిష్కరణలకు కీలకమైన రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (ఆర్ అండ్ డి) రంగాన్ని మాత్రం ఆర్థికంగా పరిపుష్టం చేయడానికి ఇష్టపడం.’ క్రీడలు, వినోద రంగాల అభివృద్ధికి ఎవరూ వ్యతిరేకం కాదు. అవి కూడా చాలా ముఖ్యమైనవే. కానీ ప్రాధాన్యతల దృష్టికోణం అత్యవసరం. దేశానికి ఏది అత్యవసరం.. ఏ రంగం వల్ల అత్యధిక ప్రతిఫలం, భవిష్యత్తు వికాసం సాధ్యమవుతుందో గుర్తించి ఆ రంగాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. వినోదం వర్తమానాన్ని సజీవంగా ఉంచుతుంది. పరిశోధన భవిష్యత్తును నిర్మిస్తుంది. దీన్ని పరిగణనలోకి తీసుకోకతప్పదు.










Comments