top of page

‘విమానం’లో క్రెడిట్‌ వార్‌!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 2 days ago
  • 2 min read

ఉత్తరాంధ్ర వరదాయినిగా భావిస్తున్న.. విశాఖపట్నానికి ప్రత్యామ్నాయ విమానాశ్రయంగా భావిస్తున్న భోగాపురంలో నిర్మిస్తున్న అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా నిర్ణీత గడువు కంటే ముందే ప్రయాణికుల సర్వీసులు నిర్వహించేందుకు దాదాపు సిద్ధం కావడం ముదావహం. ఆదివారం నిర్వహించిన తుది ట్రయల్‌ రన్‌ విజయవంతం కావడంతో వచ్చే జూన్‌ నుంచి విమానాశ్రయ కార్యకలాపాల నిర్వహణకు మార్గం సుగమమైంది. ఈ క్రమంలోనే ఈ ఎయిర్‌పోర్టు అరుదైన రికార్డు నమోదు చేసింది. గ్రీన్‌ఫీల్డ్‌ విభాగంలో దేశంలోనే రెండో ఎయిర్‌పోర్టుగా ఖ్యాతి గడిరచింది. వాయువేగంతో నిర్మాణం పూర్తి చేసుకున్న గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయంగా కూడా భోగాపురం పేరు తెచ్చుకుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కొద్ది నెలల్లోనే వినియోగదారులకు అందుబాటులోకి రానున్న ఈ విమానాశ్రయం విశాఖ నగరానికి, ఉత్తరాంధ్రకే కాకుండా యావత్తు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి గేమ్‌ ఛేంజర్‌గా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. తొలి కమర్షియల్‌ విమానాన్ని విజయవంతంగా రన్‌వై పైకి ఆహ్వానించిన తుది ట్రయల్‌ పూర్తి చేసిన అధికారులు.. ఇప్పుడు మిగిలిన ఉన్న చిన్నాచితకా పనులను పూర్తి చేయడంపై దృష్టి సారించారు. కాగా గ్రీన్‌ఫీల్డ్‌ విభాగంలో దేశంలో ఏర్పాటైన రెండో విమానాశ్రయం భోగాపురం. దీనికి ముందు ముంబై మహానగరంలో తొలి గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌ పోర్టు నిర్మించారు. అయితే ఈ రెండు విమానాశ్రయలను పోల్చి చూస్తే భోగాపురం విమానాశ్రయం కొన్ని అదనపు ప్రత్యేకతలను సంతరించుకోవడం విశేషం. ముంబై ఉన్న పాత విమానాశ్రయం ప్రయాణికుల రద్దీని తట్టుకోలేకపోతుండటంతో పెరుగుతున్న అవసరాలను తీర్చేందుకు వీలుగా ఆ నగరంలో మరో ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణాన్ని పర్యావరణ హితంగా గ్రీన్‌ఫీల్డ్‌ విభాగంలో చేపట్టి ఇటీవలి అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులు తీవ్ర జాప్యం, అంతరాయాలతో ఏకంగా 25 ఏళ్ల పాటు సాగాయని చెబుతున్నారు. దేశ ఆర్ధిక రాజధాని అయిన ముంబైకి రెండో విమానాశ్రయం అవసరమని 90వ దశకంలోనే ప్రభుత్వం భావించింది. కానీ అనేక అడ్డంకులు, ఇతర కారణాలతో నిర్మాణానికి సుదీర్ఘ కాలం పట్టిందని అంటున్నారు. ఇదే సమయంలో దేశంలో మరో మెట్రో నగరమైన బెంగళూరులో కూడా రెండో విమానాశ్రయం నిర్మాణానికి కర్ణాటక ప్రభుత్వం పదేళ్ల నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కానీ ఇంతవరకు కార్యరూపంలోకి తేలేకపోయింది. ఇప్పుడున్న పరిస్థితులను పరిశీలిస్తే బెంగళూరుకు రెండో విమానాశ్రయ నిర్మాణం ఎప్పుడు చేపడతారో.. ఎప్పుడు పూర్తి చేస్తారో తెలియని పరిస్థితి ఉంది. కానీ ఎదుగుతున్న విశాఖ నగర అవసరాలకు అనుగుణంగా, ప్రస్తుతం అక్కడున్న నేవీ విమానాశ్రయానికి ప్రత్యామ్నాయంగా చేపట్టిన భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు నిర్మాణం మాత్రం రికార్డు సమయంలో పూర్తయింది. ముంబైకి రెండున్నర దశాబ్దాలు పట్టిన, బెంగళూరుకు ఎప్పుడు నిర్మిస్తారో తెలియని పరిస్థితి ఉన్నా.. విశాఖ విషయంలో మాత్రం నిర్మాణం ప్రారంభించిన సుమారు రెండున్నరేళ్లలోనే పూర్తి కావడం విశేషం. వాస్తవానికి భోగాపురం విమానాశ్రయం ఐదేళ్ల క్రితమే పూర్తి కావాల్సి ఉందని అంటున్నారు. 2019లోనే దీని నిర్మాణానికి శంకుస్థాపన జరిగినా రకరకాల కారణాల వల్ల పనులు ముందుకు సాగలేదు. 2023లో అప్పటి సీఎం జగన్‌ మరోసారి విమానాశ్రయానికి శంకుస్థాపన చేయగా, నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత జగన్‌ అధికారం నుంచి దిగిపోయారు. దాంతో 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం భోగాపురం విమానాశ్రయాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని నిర్దేశించుకుంది. ప్రభుత్వ మార్గనిర్దేశంలో నిర్మాణ సంస్థ జీఎంఆర్‌ గ్రూప్‌ యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేసింది. పలు ప్రత్యేకతలు సంతరించుకున్న భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు కల సాకారం చేసిన క్రెడిట్‌ సొంతం చేసుకునే విషయంలో రాజకీయ యుద్ధం జరుగుతుండటం మాత్రం శోచనీయం. దీని చరిత్ర చూస్తే విశాఖలో ఉన్న రక్షణ శాఖకు చెందిన విమానాశ్రయాన్ని పౌర అవసరాలకు అనుగుణంగా విస్తరించడానికి వీల్లేకుండా నేవీ నుంచి ఆంక్షలు ఉండటంతో అంతర్జాతీయ నగరంగా ఎదుగుతున్న విశాఖ అవసరాలను తీర్చేలా అధునాతన హంగులతో మరో విమానాశ్రయం నిర్మించాలన్న ఆలోచన 1997లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి కలిగింది. కానీ రాష్ట్ర విభజన తర్వాత గానీ ఆ అలోచనకు కదలిక రాలేదు. విభజిత ఆంధ్రప్రదేశ్‌లో ఏకైక పెద్ద నగరంగా విశాఖ ఉన్నందున అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు తప్పనిసరైంది. 2014`19 మధ్య రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉండటం, కేంద్రంలోనూ ఆ పార్టీ నుంచి కేంద్ర పౌరవిమానయాన మంత్రి ఆశోక్‌గజపతిరాజు ఉండటం వల్ల 2015 జూన్‌లో విమానాశ్రయ నిర్మాణానికి సాంకేతిక అనుమతులు లభించాయి. జీఎంఆర్‌ కన్సార్టియం నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. అప్పటి చంద్రబాబు సర్కారు విమానాశ్రయానికి మొదట 15 వేల ఎకరాలు అవసరమని.. ఆనక ప్రజాగ్రహంతో ఐదువేల ఎకరాలు అవసరమని ప్రతిపాదించింది. అయినా భూసేకరణకు సంబంధించి అనేక వివాదాలు, కేసుల కారణంగా ప్రగతి లేకుండాపోయింది. చివరికి 2019 ఎన్నికలకు రెండు నెలల ముందు ఫిబ్రవరి నెలలో అప్పటి సీఎం చంద్రబాబు హడావుడిగా శంకుస్థాపన చేశారు. 2019 జూన్‌లో అధికారంలోకి వచ్చిన జగన్‌ సర్కారు భూసేకరణను 2750 ఎకరాలకు కుదించడంతోపాటు తుది అనుమతులు సాధించి కరోనా అనంతరం 2023లో మరోసారి శంకుస్థాపన చేశారు. అప్పటినుంచీ నిర్మాణ పనులు పుంజుకుని 75 శాతం వరకు పూర్తయ్యాయి. అనంతరం వచ్చిన చంద్రబాబు సర్కారు పనులు మరింత వేగిరం చేసి తుది దశకు తీసుకొచ్చింది. ఈ పరిస్థితుల్లో ఒక పెద్ద ప్రాజెక్టును రెండు ప్రభుత్వాలు కలిసి పూర్తి చేసి ప్రజలకు మేలు చేస్తున్నామని భావించాలే తప్ప.. రాజకీయ లబ్ధి కోసం తాపత్రయ పడటం సమంజసం కాదు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page