వాయు‘వేగా’పురం!
- DV RAMANA

- 5 days ago
- 3 min read
శరవేగంగా భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు
అల్లూరి సీతారామరాజు విమానాశ్రయంగా నామకరణం
ఇటీవలే రన్‌వే, ఏటీసీలపై సాంకేతిక పరీక్షలు
రెండు హైవేలను అనుసంధానిస్తూ రోడ్లు
అనుబంధంగా పర్యాటక హటళ్లు, రిసార్టులు
లక్ష్యం మేరకు వచ్చే ఆగస్టులో అందుబాటులోకి

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
ఉత్తరాంధ్రకు మకుటాయమానం, ఈ ప్రాంత అభివృద్ధికి శిఖర సమానంగా భావిస్తున్న భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణ పనులు వాయువేగంతో పూర్తి అవుతున్నాయి. నిర్ణీత లక్ష్యం మేరకు 2026 ఆగస్టు నాటికి విమానాశ్రయాన్ని ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చేందుకు అటు జీఎంఆర్ సంస్థ, ఇటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయంలో పట్టుదల వహిస్తుండగా, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా ఉన్న శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఆయన స్వయంగా అక్కడ పర్యటించి నిర్మాణ పనులను పరిశీలించారు. దీనికి నామకరణం కూడా జరిగింది. మన్యం వీరుడు, విప్లవ యోధుడు అల్లూరు సీతారామరాజును చిరస్మరణీయం చేస్తూ భోగాపురం ఎయిర్‌పోర్టుకు అల్లూరి సీతారామరాజు విమానాశ్రయంగా నామకరణం చేశారు. ఇప్పటికే 85 శాతం పనులు పూర్తి అయినట్లు నిర్మాణవర్గాల ద్వారా తెలిసింది. ఎయిర్‌పోర్టుకు కీలకమైన రన్‌వే, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ) భవనాల నిర్మాణాలు దాదాపు పూర్తి అయ్యాయి. ఇటీవలే ట్రయల్ రన్స్ కూడా నిర్వహించారు. విమానాశ్రయం చుట్టుపక్కల ప్రాంతాల్లో పర్యాటకరంగ అభివృద్ధికి కూడా శరవేగంగా అడుగులు పడుతున్నాయి.
విశాఖకు ప్రత్యామ్నాయంగా..
కేంద్ర, రాష్ట్రాల్లో ఎన్డీయే ప్రభుత్వాలే ఉండటంతో రాష్ట్రంలో అభివృద్ధి వేగం పుంజుకుంది. విస్తారమైన తీరప్రాంతం ఉన్న ఏపీలో నౌకాశ్రయాలతోపాటు ప్రధాన పట్టణాల్లో ఏడు కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలపడంతోపాటు కొన్ని ప్రాజెక్టుల్లో ఆర్థికంగా భాగస్వామి అవుతోంది. వీటిలో భాగంగానే ప్రస్తుతం విశాఖలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రత్యామ్నాయంగా భోగాపురంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మించాలన్న ప్రతిపాదనలను కేంద్రం ఆమోదించింది. విశాఖ విమానాశ్రయం వాస్తవానికి నావికాదళానిది. తూర్పు నావికాదళం(నేవీ)కి ప్రధాన కేంద్రంగా ఉన్న విశాఖలో దాని అవసరాల కోసం ప్రస్తుత ఎయిర్‌పోర్టును నిర్మించారు. నేవీకి చెందిన ఐఎన్‌ఎస్ డేగా ఆధ్వర్యంలోనే ఇది నడుస్తోంది. దాన్నే ఇన్నాళ్లూ సివిల్ ఎయిర్‌పోర్టుగానూ వినియోగిస్తున్నారు. రక్షణపరంగా కీలకమైన నేవీ కార్యకలాపాలకే ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉన్నందున.. అంతర్జాతీయ నగరంగా ఎదుగుతున్న విశాఖలో పెరుగుతున్న విమాన ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా దేశీయ సర్వీసులు పెంచడానికి, అంతర్జాతీయ విమాన సర్వీసులు నడపడానికి ఆంక్షలు అడ్డంకిగా మారుతున్నాయి. దాంతో విశాఖ ఎయిర్‌పోర్టును పూర్తిగా నేవీకే అప్పగించి.. విశాఖ, ఉత్తరాంధ్ర అవసరాలకు అనుగుణంగా ఆధునిక హంగులతో మరో విమానాశ్రయం నిర్మించాలన్న ప్రతిపాదన 1997లోనే తెరపైకి వచ్చింది. అప్పట్లో సబ్బవరం, అచ్చుతాపురం, కొరుప్రోలు వంటి ప్రాంతాల్లో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి స్థలపరిశీలనలు కూడా జరిగాయి. తర్వాత రాష్ట్ర విభజన వంటి పలు కారణాల వల్ల ఆ ప్రతిపాదన ముందుకు వెళ్లలేదు. చివరికి 2015లో భోగపురాన్ని ఖరారు చేశారు. ఉత్తరాంధ్రలో ప్రధాన నగరాలైన విశాఖ నుంచి 44 కి.మీ., విజయనగరం నుంచి 23 కి.మీ., శ్రీకాకుళం నుంచి 64 కి.మీ. దూరంలో ఉండటం, ఒడిశాలోని గంజాం, పర్లాకిమిడి, కొరాపుట్ వంటి జిల్లాలకు కూడా అనుకూలంగా ఉంటుందని భావించి భోగాపురం ప్రాంతాన్ని గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి ఎంపిక చేశారు. 2017లో బిడ్‌లు ఆహ్వానించగా జీఎంఆర్ గ్రూప్, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) టెక్నికల్, ఫైనాన్స్ బిడ్‌లు సమర్పించాయి. ఈ ఎయిర్‌పోర్టులో రన్‌వే, టెర్మినల్ భవనాలు, లాంజ్‌లు, ఏటీసీ, కార్గో నిర్వహణతోపాటు విమానాల నిర్వహణ, మరమ్మతులు, ఓవర్‌హాలింగ్(ఎమ్మార్వో) కేంద్రం, ఏవియేషన్ అకాడమీ వంటి వాటి నిర్మాణానికి 5311 ఎకరాలను అప్పటి టీడీపీ ప్రభుత్వం కేటాయించగా, 2019 ఎన్నికలకు రెండు నెలల ముందు అప్పటి సీఎం చంద్రబాబు దీనికి శంకుస్థాపన చేశారు. కానీ ఆ తర్వాత వచ్చిన వైకాపా ప్రభుత్వం 2200 ఎకరాలకు కుదించినా, నిర్మాణ సన్నాహాలు మాత్రం వేగవంతం చేసింది. భూసేకరణ సమస్యలన్నింటినీ పరిష్కరించి జీఎంఆర్ గ్రూప్ ఆధ్వర్యంలో స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసిన తర్వాత 2023 మే నెలలో అప్పటి సీఎం వైఎస్‌జగన్ మరోమారు శంకుస్థాపన చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అన్ని రకాల అనుమతులు లభించిడంతో అదే ఏడాది నుంచి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. గత ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్రాల్లోనూ ఎన్డీయే విజయం సాధించడంతో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి రెక్కలొచ్చాయి. దీనికితోడు రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో పౌరవిమానయాన శాఖ మంత్రిగా ఉండటం కలిసివచ్చింది. ఆయన నిరంతర పర్యవేక్షణలో నిర్మాణాలు అత్యంత వేగంగా సాగుతున్నాయి.
రన్‌వే, ఏటీసీ పూర్తి
అత్యంత అధునాతన హంగులతో నిర్మిస్తున్న ఈ ఎయిర్‌పోర్ట్ పనులు 85 శాతం పైగా పూర్తి అయ్యాయని జీఎంఆర్ గ్రూప్‌తోపాటు సహ భాగస్వామిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి కార్పొరేషన్ వర్గాలు వెల్లడిరచాయి. 3.8 కిలోమీటర్ల అతిపెద్ద రన్‌వే నిర్మాణం పూర్తి అయ్యింది. దీనిపై ఈ ఏడాది జూన్‌లోనే ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ వర్గాలు ట్రయల్ రన్, ఇతర సాంకేతిక పరీక్షలు నిర్వహించాయి. ఇక విమానాల రాకపోకలను నియంత్రించే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) టవర్ పనులు చివరి దశలో ఉన్నాయి. సిగ్నల్ వ్యవస్థ వంటి పనులు కూడా పూర్తి కావస్తున్నాయి. ఈ క్రమంలో ఏటీసీ టవర్ నుంచి సిగ్నల్స్ అందుతున్న తీరును పరిశీలించేందుకు ఏఏఐ, డీజీసీఏ(డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) అధికారులు ఒక చిన్న విమానంతో ఇటీవలే ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ చిన్న విమానం రన్‌వేకు దగ్గరగా వచ్చి ల్యాండ్ అయ్యే ప్రయత్నం చేసి, ఎయిర్‌పోర్ట్ చుట్టుపక్కల ప్రాంతాల్లో చక్కర్లు కొట్టి వెళ్లిపోయింది. ఇవే కాకుండా విమనాశ్రయం నుంచి విశాఖ నుంచి కనెక్టివిటీ పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నెం.16, నెం.26 జాతీయ రహదారులతో ఎయిర్‌పోర్టును అనుసంధానిస్తూ రోడ్డు మార్గం కూడా వేశారు. అలాగే వైజాగ్ బీచ్ కారిడార్, విశాఖ మెట్రోపాలిటన్ రిజియన్‌లతో దీన్ని అనుసంధానం చేయనున్నారు. మొత్తం మీద మొదటి దశ నిర్మాణం వచ్చే ఏడాది ఆగస్టుకల్లా అందుబాటులోకి వచ్చి విమానాలు ఎగిరే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. దీనివల్ల ఏటా 6.3 మిలియన్లు అంటే 63 లక్షల ప్రయాణికులు రాకపోకలు సాగించగలరు. రెండు, మూడు దశల విస్తరణతో ఎయిర్‌పోర్టు సామర్థ్యాన్ని 18 మిలియన్లు అంటే 1.80 కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలకు వీలుగా పెంచుతారు.
పర్యాటకానికి ఊతం
ఎయిర్‌పోర్టు చుట్టుపక్కల ప్రాంతాల్లో పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందనుంది. ఇప్పటికే 80 ఎకరాల తీర ప్రాంతాన్ని పర్యాటక శాఖకు కేటాయించగా, ఇందులో 40 ఎకరాలు మై కేర్ సంస్థకు, మరో 40 ఎకరాలు ఒబెరాయ్ హోటల్స్ గ్రూపునకు అప్పగించారు. ఈ సంస్థలు భోగాపురం, భీమిలి మండలాల్లో ఫైవ్‌స్టార్ హోటళ్లు నిర్మించనున్నాయి. విమానాశ్రయ సమీపంలోనే జీఎంఆర్ సంస్థ రూ.500 కోట్లతో భారీ ఫైవ్‌స్టార్ హోటల్ నిర్మించనుంది. ఒక ప్రైవేటు రిసార్ట్ యాజమాన్యం రూ.100 కోట్లతో బీచ్ ఫ్రంట్ రిసార్ట్ నిర్మాణ పనులను ఇప్పటికే ప్రారంభించింది. సుమారు రూ.150 కోట్ల వ్యయంతో కన్వెన్షన్ సెంటర్ కూడా రానుంది. భోగాపురానికి అనుకుని ఉన్న విశాఖ జిల్లా భీమిలి మండలంలో తాజ్ హోటల్ నిర్మాణానికి కూడా ఆ గ్రూప్ ముందుకు వచ్చింది. గతంలో భోగాపురం సమీపంలోని చింతపల్లి తీరంలో నిర్మించిన టూరిజం కాటేజీలను ఏపీ స్కూబా డైవింగ్ సంస్థకు కేటాయించారు. నాలుగున్నర ఎకరాల్లో ఉన్న ఈ కాటేజీల పునర్నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ విశాఖ`భోగాపురం పరిసర ప్రాంతాలకు పర్యాటక శోభ తీసుకురానున్నాయి.










Comments