వారు కళ్లు మూసుకున్నారు.. వీరు కాలువను కాజేశారు!
- SATYAM DAILY
- Jan 6
- 2 min read
తుమ్మావీధిలో భవన నిర్మాణదారుడి కబ్జాకాండ
పట్టించుకోని టౌన్ ప్లానింగ్, సచివాలయ సిబ్బంది
స్థానికుల అభ్యంతరంతో నిర్మాణం తొలగింపు
ఈ ఆక్రమణతో స్వరూపం కోల్పోయిన మురుగు కాలువ

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
టౌన్ ప్లానింగ్ నిబంధనల ప్రకారం కొత్తగా కడుతున్న భవనానికి చుట్టూ ప్లాన్ ప్రకారం ఓపెన్ స్పేస్ ఉంచుతున్నారా లేదా అన్నది చూడటం దేవుడెరుగు.. అసలు నిర్మాణాలకు ఆనుకొని ఉన్న ప్రభుత్వానికి చెందిన కాలువలు, రోడ్లు ఆక్రమించేసి బహుళ అంతస్తులు నిర్మిస్తున్నా చూసీ చూడనట్లు వదిలేస్తున్న ఘనత మన టౌన్‌ప్లానింగ్ యంత్రాంగానిది. పట్టణీకరణ వేగవంతం కావడంతో ప్లాన్ ప్రకారం నిర్మాణాలు జరగాలన్న లక్ష్యంతో గత జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం వార్డు సచివాలయాలు ఏర్పాటుచేసి, ప్రత్యేకంగా ప్లానింగ్ సెక్రటరీ అంటూ ఓ రెగ్యులర్ పోస్టు ఏర్పాటు చేసింది. జగన్మోహన్‌రెడ్డి అధికారంలో ఉన్నన్నాళ్లూ నిబంధనల మేరకు కట్టుకుంటామని చెప్పినా కనపడని నాలుగో సింహంలా నిజాయితీకి మారుపేరులా బిల్డప్ ఇచ్చిన సచివాలయ ప్లానింగ్ సెక్రటరీలు ఆ తర్వాత కొద్దికాలానికే మున్సిపల్ కార్యాలయంలో ఉన్న టౌన్‌ప్లానింగ్ ఆఫీస్‌కు, వార్డుల్లో భవనాలు నిర్మిస్తున్న యజమానులకు మధ్య దళారులుగా మారిపోయారు. నగరంలోని 50 డివిజన్లలో మెజార్టీ ప్లానింగ్ సెక్రటరీల పరిస్థితి ఇదే. నగరపాలక సంస్థకు సమర్పించిన ప్లాన్ ప్రకారం ఓపెన్ స్పేస్ విడిచిపెట్టకపోయినా చూసీచూడనట్లు వదిలేస్తే కొంత సహించవచ్చు. కానీ ఏకంగా మున్సిపల్ ఆస్తులనే ఆక్రమించేస్తున్నా వీరు కళ్లు మూసుకోవడం స్థానికుల్లో అసంతృప్తిని రాజేసింది.
మున్సిపల్ ఆస్తులపై నిర్మాణం
నగరంలోని తుమ్మావీధి లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఎదురుగా ఉన్న స్థలంలో ఒకవ్యక్తి భవనం నిర్మిస్తున్నారు. దీనికి రెండువైపులా హద్దులుగా మున్సిపల్ కాలువలు, రోడ్డు ఉన్నాయి. రోడ్డుకు మూడు అడుగులు అవతల నుంచే నిర్మాణాలు చేపట్టాలన్న నిబంధనను పక్కన పెడితే, కనీసం కాలువ క్లీన్ చేయడానికి కూడా సదరు నిర్మాణదారు అవకాశం ఇవ్వడంలేదు. కాలువ గట్టుమీదే ప్లింత్ బీమ్ వేసి ప్రహరీ నిర్మాణానికి పూనుకున్నాడు. ఆ సందర్భంలో సంబంధిత ప్లానింగ్ సెక్రటరీ పండగ చేసుకున్నారు. ఇలాంటప్పుడే తనకు సొమ్ములొస్తాయని సినిమా చూశారు తప్ప నిర్మాణానికి అడ్డుకోవడానికి ప్రయత్నించలేదు. కానీ స్థానికులు మాత్రం కాలువ మూసుకుపోవడాన్ని చూస్తూ ఊరుకోలేక నిలదీయడంతో గత్యంతరం లేక కాలువపై నిర్మించిన ప్లింత్ బీమ్‌ను విరగ్గొట్టారు. దీనివల్ల రెండువైపులా కాలువ షేపులు మారిపోయి ఉండటం వల్ల నిట్టనిలువుగా ఉండాల్సిన ఈ గట్లు పూర్తిగా భవన నిర్మాణ స్థలంలోకి వెళ్లిపోయినట్లు కనిపిస్తున్నాయి. అదే సమయంలో అక్కడి సీసీ రోడ్డు కుంగిపోవడంతో రోడ్డు, కాలువ ఏకమైపోయాయి. భవన నిర్మాణదారుడు తన స్థలంలో తాను ఇల్లు కట్టుకుంటున్నట్టు వాదించవచ్చు. అందులో వాస్తవం కూడా ఉండవచ్చు. కానీ కాలువ కోసం, రోడ్డు కోసం స్థలం విడిచిపెట్టాలనే నిబంధన ఒకటి ఉందని సచివాలయ సిబ్బంది మర్చిపోయారు. సహజంగా ఎవరైనా ఇళ్లు, భవనాలు నిర్మిస్తే వారి నుంచి సొమ్ము దండుకుని అటువైపు చూడటం మానేస్తారు. ఎవరైనా అడిగితే ఎమ్మెల్యే పేరో, రాజకీయ నాయకుడి పేరో చెప్పి తమపై వారి ఒత్తిడి ఉందని చెప్పి తప్పించుకుంటున్నారు. ఈ కేసులో కూడా పక్క నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే పేరును వాడేస్తున్నారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే పేరు చెబితే నిత్యం వార్డుల్లో కనిపించే గొండు శంకర్‌ను స్థానికులు ఏదో ఒకరోజు అడుగుతారన్న భయంతో పక్క నియోజకవర్గ ఎమ్మెల్యేను తెర మీదకు తెచ్చారు. సాధారణంగా చిన్న చిన్న భవనాల వ్యవహారం కార్పొరేషన్ కార్యాలయంలో ఉన్న టౌన్‌ప్లానింగ్ విభాగం దృష్టికి వెళ్లదు. వార్డు స్థాయిలోనే సచివాలయ సిబ్బంది సెటిల్ చేసేస్తున్నారు. అదే బహుళ అంతస్తులైతే టౌన్‌ప్లానింగ్ సిబ్బందికి, యజమానికి మధ్య అంబికా దర్బార్‌బత్తిలా ప్లానింగ్ సెక్రటరీలు అనుసంధానమవుతున్నారు. తుమ్మా వీధిలో నిర్మిస్తున్నది కూడా మూడంతస్తుల భవనం కావడంతో ఇక్కడ అందరికీ సొమ్ములంది ఉంటాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.










Comments