వారంతా నా అక్కచెల్లెళ్లు
- BAGADI NARAYANARAO
- 3 days ago
- 1 min read
సౌమ్య వివాదాన్ని రాజకీయం చేస్తున్నారు
అన్ని కులాల్లోనూ అభిమానులున్నారు
ఎమ్మెల్యే కూన రవికుమార్

(సత్యంన్యూస్,శ్రీకాకుళం)
తనతో పాటు ఒంటిమిట్ట రామాలయానికి వచ్చిన మహిళ గాని, తన పక్కన ఫొటో దిగిన మరో మహిళ గాని తనకు అక్కచెల్లెళ్లని, అమరావతి వచ్చిన పార్టీ కేడర్‌తో దేవాలయాలకు వెళ్లినప్పుడు కలిసే పూజలు చేశామని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ పేర్కొన్నారు. వైకాపా ఆమదాలవలస ఇన్‌ఛార్జి చింతాడ రవికుమార్ బుధవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో చేసిన ఆరోపణలకు గురువారం ఉదయం కూన రవికుమార్ జిల్లా పార్టీ కార్యాలయంలో కౌంటరిచ్చారు. కేజీబీవీ ప్రిన్సిపాల్ సౌమ్య వివాదాన్ని వైకాపా నాయకులు రాజకీయానికి ముడిపెట్టి దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ప్రిన్సిపాల్ సౌమ్యది నాటకమని ప్రజలందరికి తెలిసిందన్నారు. తనను టార్గెట్‌గా చేసుకొని ఇంతవరకు ఫేక్ ప్రచారానికి కారణమైన కొందరు మరో అడుగు ముందుకేసి తన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యేలు దగ్గరికి ఎంతోమంది స్నేహితులు, సన్నిహితులు, కార్యకర్తలు దేవాలయం దర్శనం కోసం లెటర్స్ కోసం వస్తారన్నారు. పార్టీకి చెందిన మహిళా నాయకులు, కార్యకర్తలు తనతో పాటు దర్శనానికి వస్తామన్న సందర్భాలు అనేకం ఉన్నాయన్నారు. ఇకనుంచి ప్రతీ ఫొటో చింతాడ రవికి పంపిస్తానని కూన పేర్కొన్నారు. చంద్రబాబు పాఠశాలలో విద్యాభ్యాసం చేసిన కార్యకర్తగా మహిళలను ఎలా గౌరవించాలో, ఎలా ప్రవర్తించాలో తెలిసిన వ్యక్తినన్నారు. నేరచరిత్ర కలిగిన వ్యక్తి అధినేతగా ఉన్న వైకాపా నాయకులు మహిళల పట్ల ఎలా వ్యవహరిస్తారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. చింతాడ రవి చూపించిన ఫొటోలో ఒకామె ఆమదాలవలస నియోజకవర్గంలోని ఒక గ్రామానికి సర్పంచ్ అని తెలిపారు. ఆ ఫోటోలను మీడియాకు చూపించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. వైకాపా ఇన్‌ఛార్జిగా ఉన్న చింతాడ రవికుమార్ లాంటి వ్యక్తులు ఉన్న ఆ పార్టీలోని మహిళల పరిస్థితి ఏమిటో గుర్తు చేసుకోవాలన్నారు. కుటుంబ సంబంధాలు తెలియని వ్యక్తులు వైకాపాలో ఉన్నారని దుయ్యబట్టారు. వైకాపా నేతలతో దేవాలయాలకు వెళ్లిన మహిళల్ని కూడా ఇలానే రోడ్డుకీడుస్తారా అని కూన ప్రశ్నించారు. చింతాడ రవి వార్డు మెంబర్ స్థాయి కంటే తక్కువని ఎద్దేవా చేశారు. తనకు కులాలకు అతీతంగా అభిమానులున్నారని కూన రవి అన్నారు. విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్, సింతు సుధాకర్, ముద్దాడ కృష్ణమూర్తినాయుడు, పీఎంజే బాబు, మాదారపు వెంకటేష్, తమ్మినేని గీత, విభూది సూరిబాబు, గుత్తు చిన్నారావు, టీడీపీ మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు.
Kommentare