top of page

వీరమల్లు పక్కనే ‘అతడు’

  • Guest Writer
  • Aug 6, 2025
  • 3 min read

టాలీవుడ్‌లో టాప్‌ స్టార్‌ హీరోలు అనగానే ముందు వినిపించే పేర్లలో మహేష్‌ బాబు, పవన్‌ కళ్యాణ్‌ పేర్లు ఖచ్చితంగా ఉంటాయి. వారిద్దరికీ ఉన్న ఫ్యాన్‌ బేస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇద్దరూ పాన్‌ ఇండియా మార్కెట్‌ పెద్దగా లేదు, కానీ తెలుగు రాష్ట్రాల్లో వారికి ఉన్న ఫాలోయింగ్‌ ఏ పాటిదో గతంలో పలు సార్లు నిరూపితం అయ్యింది. వీరిద్దరి కాంబోలో సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. అది సాధ్యం కాలేదు, ముందు ముందు సాధ్యం కాకపోవచ్చు. అయితే పవన్‌ కళ్యాణ్‌ సినిమాలో మహేష్‌ బాబు డబ్బింగ్‌ చెప్పడం ద్వారా ఒక రికార్డ్‌ క్రియేట్‌ చేశారు. ఆ సమయంలో ఇద్దరికీ కామన్‌ మిత్రుడు అయిన త్రివిక్రమ్‌ ఆ అరుదైన కలయికకు మూలం అయ్యారు. ఆ తర్వాత మళ్లీ అలాంటి చిన్న చిన్న కలయిక కూడా జరగలేదు.

పవన్‌ కళ్యాణ్‌, మహేష్‌ బాబు కటౌట్స్‌ ఇద్దరిని సింగిల్‌ స్క్రీన్‌ మీద చూడటం చాలా అదరుగా జరుగుతూ ఉంటుంది. ఒకటి రెండు సార్లు పవన్‌ కళ్యాణ్‌, మహేష్‌ బాబు కలిసి ఉన్న ఫోటోలు వీడియోలు వచ్చాయి. కానీ పవన్‌ రాజకీయాల్లో బిజీ అయిన తర్వాత, ఉప ముఖ్యమంత్రి గా బిజీగా ఉన్న నేపథ్యంలో అది అసాధ్యంగా మారింది. ఇలాంటి సమయంలో పవన్‌ కళ్యాణ్‌ వీరమల్లుగా, మహేష్‌ బాబు అతడుగా సింగిల్‌ ఫ్రేమ్‌ లో కనిపించారు. అయితే రియల్‌గా కాకుండా ఇద్దరూ కటౌట్స్‌ లో కనిపించి అలరించారు. ప్రస్తుతం ఈ స్టిల్‌ సోషల్‌ మీడియాలో సునామి మాదిరిగా విస్తరిస్తుంది. ఏ థియేటర్‌ లో తీశారు, ఎవరు తీశారు అనే విషయాలు ఏమీ అక్కర్లేకుండానే అభిమానులు, నెటిజన్స్‌, ఇండస్ట్రీ వర్గాల వారు ఇలా ప్రతి ఒక్కరూ ఈ ఫోటోను షేర్‌ చేస్తున్నారు, అంతే కాకుండా సేవ్‌ చేసుకుంటున్నారు.

అతడు రీ రిలీజ్‌కి భారీ ఏర్పాట్లు పవన్‌ కళ్యాణ్‌ నటించిన హరి హర వీరమల్లు సినిమా ఇంకా థియేటర్‌లో ఉంది. దానికి సంబంధించిన కటౌట్స్‌ భారీ ఎత్తున ఉన్నాయి. ఇక ఏ థియేటర్‌ లో అయితే వీరమల్లు ఆడుతుందో అదే థియేటర్‌లోని ఇంకో స్క్రీన్‌ లో మహేష్‌ బాబు హీరోగా నటించి కల్ట్‌ మూవీగా నిలిచిన అతడు రీ రిలీజ్‌ కాబోతున్న విషయం తెల్సిందే. అతడు రీ రిలీజ్‌ నేపథ్యంలో ఫ్యాన్స్‌ సందడి భారీ ఎత్తున చేస్తున్నారు. ముఖ్యంగా అతడు రీ రిలీజ్‌ కాబోతున్న కొన్ని థియేటర్ల వద్ద భారీ ఎత్తున హోర్డింగ్స్‌, ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల విడుదలైన వీరమల్లు సినిమాకు ఏమాత్రం తగ్గకుండా అతడు సినిమా కటౌట్‌ ను భారీ ఎత్తున పెట్టడం జరిగింది. మహేష్‌ బాబు, పవన్‌ కళ్యాణ్‌ ల యొక్క కటౌట్‌ లను చూస్తూ ఉంటే కన్నుల పండుగ అన్నట్లుగా ఉందని ఫ్యాన్స్‌ అంటున్నారు.

-తుపాకి.కామ్‌ సౌజన్యంతో..

జాతీయ సినీ పురస్కారాలు..ఓ బాయికాట్‌.. ఓ ప్రశ్న

2018లో 65వ జాతీయ పురస్కారాలు ప్రకటించారు. ఢల్లీిలో అవార్డుల ప్రధానోత్సవం. కొనసాగుతున్న సంప్రదాయం ప్రకారం, దేశ అత్యున్నత పౌరుడైన రాష్ట్రపతి లేదా ఆ తర్వాతి స్థానంలో ఉన్న ఉపరాష్ట్రపతి ఈ అవార్డులు అందిస్తారు. ఈసారి కూడా అలాగే అందిస్తారని అవార్డు గ్రహీతలు అనుకున్నారు. తీరా కార్యక్రమానికి ముందు పరిస్థితి మారిపోయింది. అనివార్య కారణాల వల్ల రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పూర్తి కార్యక్రమానికి హాజరు కాలేరని, ఆ స్థానంలో అప్పటి కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాథోడ్‌ అవార్డులు అందిస్తారని ప్రకటించారు. ముఖ్యమైన కొన్ని అవార్డులు మాత్రమే రాష్ట్రపతి ఇస్తారని తెలిపారు.

అవార్డు గ్రహీతల్లో చాలామంది అసంతృప్తి చెందారు. జీవితంలో ఒక్కసారి అందుకునే జాతీయ పురస్కారం రాష్ట్రపతి కాకుండా మరెవరో రాజకీయ నాయకురాలు ఇవ్వడం వారికి నచ్చలేదు. కానీ తప్పదని ఓపిగ్గా కార్యక్రమంలో కూర్చున్నారు. అయితే మలయాళీలు మహ పౌరుషమైన మనుషులు. మొత్తంగా ఆ కార్యక్రమాన్ని బాయికాట్‌ చేశారు.

ఆ కార్యక్రమంలో గాయకుడు జేసుదాస్‌, మలయాళ దర్శకుడు జయరాజ్‌ ఉన్నారు. వారు మినహా మిగిలిన మలయాళీలు కార్యక్రమం నుంచి వెళ్లిపోయారు. వాళ్లను చూసి మిగిలిన భాషల్లోని మరికొందరు సైతం అదే బాట పట్టారు. అక్కడి నుంచి విమానం ఎక్కి వాళ్ల వాళ్ల ఊళ్లకు వెళ్లిపోయారు. వారి కుర్చీలు ఖాళీగా కనిపిస్తే పరువు పోతుందన్న భయంలో మొత్తంగా వారి పేరు రాసి ఉన్న స్థానాలు అక్కడి నుంచి తీసేశారు. మొత్తంగా ఆ కార్యక్రమం చాలా హడావిడిగా, అస్తవ్యస్తంగా జరిగింది. (ఆ తర్వాత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తన పదవీ కాలంలో సినీ పురస్కారాల ప్రదానోత్సవానికి మళ్లీ రాలేదు. అవార్డులిచ్చే బాధ్యతను అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీసుకున్నారు)

అలా వెళ్లిపోయిన వారిలో జాతీయ ఉత్తమ సహాయనటుడు పురస్కారం అందుకోవాల్సిన ఫహాద్‌ ఫాజిల్‌(అవును ఆయనే), జ్యూరీ ప్రత్యేక పురస్కారం అందుకోవాల్సిన పార్వతి ఉన్నారు. ఇద్దరికీ అవి తొలి జాతీయ పురస్కారాలు. ఎంతో ఆశ ఉంటుంది. ఎంతో ప్రేమ ఉంటుంది. అయితే ఏంటి? తమ గౌరవం తమదే. దాన్నెందుకు వదులుకోవాలి? రాజకీయాలకు అతీతంగా ఉంటారని పేరుపొందిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి స్థాయి వ్యక్తులు ఇవ్వాల్సిన పురస్కారాలు సంప్రదాయానికి విరుద్ధంగా మరెవరో రాజకీయ నాయకురాలు ఇస్తే తామెలా తీసుకుంటాం? అందుకే బాయ్‌కాట్‌. ఏమైనా మలయాళీలు మలయాళీలే!

ఇప్పుడు నటి ఊర్వశి వంతు. మలయాళ సినిమా ‘ఉల్లోళుక్కు’కుగానూ ఈ ఏడాది ఆమెకు జాతీయ ఉత్తమ సహాయనటి పురస్కారం ప్రకటించారు. ఇదే సినిమాకుగానూ కేరళ ప్రభుత్వం ఇప్పటికే ఆమెకు ఉత్తమ నటి పురస్కారాన్ని అందించింది. ఇటీవల ఆమె మీడియాతో మాట్లాడుతూ ‘ఏ ప్రాతిపాదికన ‘జవాన్‌’ సినిమాలో షారుఖ్‌ఖాన్‌కి అవార్డు ఇచ్చారు? అవార్డు జ్యూరీ మీద సందేహం కలుగుతోంది’ అని ఆమె అన్నారు. ఈ సంవత్సరం ఉత్తమ సహాయ నటుడి పురస్కారం ప్రకటించిన నటుడు విజయ రాఘవన్‌ గురించి చెప్తూ, ‘ఇస్తే ఆయనకు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు ఇవ్వాలి. అలాంటి నటుడికి సహాయ నటుడి అవార్డు ఇచ్చి షారుఖ్‌ఖాన్‌కి ఉత్తమ నటుడి అవార్డా? ఏంటి ప్రాతిపదిక? ‘పూక్కాలమ్‌’ సినిమాలో విజయ రాఘవన్‌ 100 ఏళ్ల వయసున్న వృద్ధుడిగా ఎంతో గొప్పగా నటించారు. అలాంటి నటుడికి కదా ఉత్తమ నటుడి పురస్కారం రావాలి. భారీ బడ్జెట్‌ పెట్టి, ఇతర భాషల్లో తీసినట్లు 250 రోజులు తీసిన సినిమా కాదు ‘పూక్కాలమ్‌’. అంత మాత్రాన గొప్ప సినిమా కాకుండా పోతుందా?’ అని ఆమె ప్రశ్నించారు. కుడోస్‌ టు నటి ఊర్వశి.

ఈ మాత్రం ధైర్యంగా నిలదీసి అడిగే దమ్ము, ధైర్యం ఎంతమంది ఉంది? ఫలానా సినిమాకు ఏ ప్రాతిపదికన ఇచ్చారనే ప్రశ్న విమర్శకులో, సాంకేతిక నిపుణులో కాదు, ఏకంగా ఒక సీనియర్‌ నటి అడిగినప్పుడు కదా నిజంగా చర్చ జరుగుతుంది.

ఊర్వశికి ఇది తొలి జాతీయ అవార్డు కాదు. 2006లో ‘అచ్చువింటె అమ్మ’ అనే మలయాళ సినిమాకుగానూ జాతీయ ఉత్తమ సహాయనటి పురస్కారం అందుకున్నారు. ఆ సమయంలో ఉత్తమ నటుడిగా ‘బ్లాక్‌’ సినిమాకుగానూ అమితాబ్‌ బచ్చన్‌ అవార్డు అందుకున్నారు. కానీ ఆమె ఏ కామెంట్లూ చేయలేదు. తగిన నటుడికే అవార్డు వచ్చిందని భావించారు.

- విశీ(వి.సాయివంశీ)


 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page