వారసుడు సిద్ధం.. విజయమే లక్ష్యం!
- Prasad Satyam
- Dec 26, 2025
- 2 min read
కేడర్ జారిపోకుండా జవసత్వాలందిస్తున్న యువనాయకుడు
ప్రతిపక్షంలో పోరాటాలతో ప్రత్యేక గుర్తింపు
రాబోయే కాలానికి కాబోయే వారసుడు ధర్మాన కృష్ణచైతన్య

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
అధికారంలో ఉంటే రాజకీయాలు ఎవరైనా చేస్తారు. మరీ సూటిగా చెప్పాలంటే.. ఆ సమయంలో వారేం చేసినా ఆహా ఓహో కత్తి.. అనేవారే ఎక్కువగా కనిపిస్తారు. అధికారం లేనప్పుడు కేడర్‌ను నిలుపుకోవడం, పార్టీని నడుపుకోవడం అంత సులువు కాదు. అధికారం ఒక బెల్లం. దాని చుట్టే చీమలుంటాయి. పదవి ఉన్నవాడి చుట్టే కేడర్ ఉంటుంది. కానీ, సర్వకాల సర్వావస్థల్లోనూ తనను నమ్ముకున్నవారి కోసం బరిలో నిలబడటం అంత సులువు కాదు. బహుశా అందుకేనేమో స్వయంగా తండ్రే ఈసారి ఎన్నికల్లో మా అబ్బాయి బరిలో ఉంటాడంటూ కార్యకర్తల ముందు కుండబద్దలుగొట్టారు. ఆ కొడుకు మీద ఎంత భరోసా ఉంటే ఆ తండ్రి తన రాజకీయ సన్యాసాన్ని ప్రకటిస్తారు.? ఆ కొడుకు మీద కేడర్ ఎన్ని ఆశలు పెట్టుకుంటే కురుక్షేత్రంలోకి దించుతారు? ఆ తండ్రి ధర్మాన కృష్ణదాస్ అయితే, ఆ కొడుకు ధర్మాన కృష్ణచైతన్య.
కృష్ణచైతన్య రాజకీయాల్లోకి రావాలనేది దాసన్న ఆలోచన. అయితే అజాతశత్రువుగా పేరు తెచ్చుకున్న ఆయన స్థానంలో చిన్నకొడుకును ప్రజలు అంగీకరిస్తారా? లేదా? అన్న మీమాంస ఇటు దాసన్నతో పాటు అటు వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డికీ ఉంది. జెడ్పీటీసీ ఎన్నికల్లో పోలాకి నుంచి విజయంతో అరంగేట్రం చేసినా, ఇంకా ఏదో ఒక మూల అపనమ్మకాలు అందరికీ ఉన్నాయి. ఎందుకంటే ఆ ఎన్నిక సమయంలో టీడీపీ స్థానిక ఎన్నికలను బాయ్‌కట్ చేసింది. ధర్మాన కృష్ణదాస్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ విజయం స్వయంకృషితో వచ్చిందా? లేదూ అంటే అధికార పార్టీ వేవ్‌లో దక్కిందా? అని తేలడానికి ఎక్కువ సమయం పట్టలేదు. తన రక్తంలోనే రాజకీయ నాయకుడు ఉన్నాడని కృష్ణచైతన్య నరసన్నపేట నియోజకవర్గంలో రుజువు చేసిన సందర్భాలు కోకొల్లలు. తండ్రి కీలకమైన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, రెవెన్యూ శాఖకు మంత్రిగా ఉంటూనే ఉపముఖ్యమంత్రిగా పని చేయడం వల్ల నియోజకవర్గాన్ని ఆ రెండున్నరేళ్లు కృష్ణచైతన్యే హ్యాండిల్ చేశారు. మంచైనా, చెడైనా, ఓడినా, గెలిచినా బాధ్యత తనదేనని భుజానికెత్తుకున్నారు. కట్ చేస్తే.. 2024లో వైకాపా అధికారం కోల్పోయింది. దీనికి తోడు జిల్లాలో ఒక్క సీటు రాకుండా క్లీన్ స్వీప్ అయిపోయింది. భవిష్యత్ రాజకీయాన్ని దర్శించే దార్శనికులకు ఇదే సరైన సమయం. వైకాపా ప్రతిపక్షంలో నీరుగారిపోకుండా నరసన్నపేట నియోజకవర్గంలో కేడర్ చేజారిపోకుండా నిలపడం వెనుక దాసన్న కంటే కృష్ణచైతన్య పాత్రే పెద్దది. గడిచిన 19 నెలల్లో తమ పార్టీ ఇచ్చిన పిలుపునందుకొని ఉద్యమానికి సారధ్యం వహించిన కృష్ణచైతన్యలో నాయకత్వ లక్షణాలను ఇప్పుడిప్పుడే ఆ పార్టీ గుర్తిస్తోంది. బహుశా అందుకేనేమో దాసన్న కూడా ఈసారి కృష్ణచైతన్య బరిలో ఉంటాడని ఓ సందర్భంలో ప్రకటించారు. విద్యుత్ ఛార్జీల పెంపుదల మీద రోడ్డెక్కినప్పుడు కృష్ణచైతన్య అగ్రసివ్‌నెస్‌ను ప్రస్తుత ప్రభుత్వం కనిపెట్టింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరించాలని, దాన్ని గవర్నర్‌కు పంపాలని పార్టీ పిలుపునిచ్చినప్పుడు ఆ కార్యక్రమం కోసం నరసన్నపేట నుంచే పెద్ద ఎత్తున ఊరేగింపు ఉంటుందని భావించిన పోలీసుల కాన్సంట్రేషన్ జిల్లా మొత్తం కంటే నరసన్నపేట నుంచి శ్రీకాకుళం వచ్చే రోడ్డుపైనే ఉందంటే కేడర్‌లో చైతన్య నింపిన ఉత్సాహం ఏపాటితో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు నియోజకవర్గంలో ధర్మాన కోటా కింద కాకుండా ఏ కోణంలో ఇంటెలిజెన్సీ తీసుకున్నా వైకాపాకు తనకు మించిన అభ్యర్థి దొరకడనే రీతిలో కృష్ణచైతన్య తన నాయకత్వాన్ని బిల్డ్ చేసుకున్నారు. అధికారంలో ఉన్నప్పుడు తప్పులు జరగడం సహజం. తప్పును తప్పుగా ఒప్పుకోవడం సంస్కారం. ఎటువంటి అహంకారానికీ పోకుండా 2019`24 మధ్య పొరపాట్లు జరిగివుంటే మన్నించాలని, ఇకనుంచి కార్యకర్తలే తన కుటుంబమంటూ ముందుకు వెళ్తున్న కృష్ణచైతన్యను వైకాపా నాయకులు కూడా అంతే స్థాయిలో రిసీవ్ చేసుకున్నారు.

అభిమాన ‘చైతన్య’ం..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువనేత డాక్టర్ ధర్మాన కృష్ణచైతన్య జన్మదిన వేడుకలు నియోజకవర్గవ్యాప్తంగా శుక్రవారం అత్యంత వైభవంగా జరిగాయి. ఆయన అందుబాటులో లేనప్పటికీ, కార్యకర్తలు, అభిమానులు ఆయనపై తమకున్న ప్రేమాభిమానాలను చాటుకుంటూ వేడుకలను పండుగలా నిర్వహించారు. మబగాంలో జరిగిన ప్రధాన కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, పద్మప్రియ దంపతులు పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ముఖ్యనేతలు కృష్ణచైతన్య రాజకీయ ప్రస్థానంపై రూపొందించిన ‘స్పెషల్ సాంగ్’ సీడీని ఆవిష్కరించారు.
యువనేత పుట్టినరోజును పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు హోరెత్తాయి. నరసన్నపేటలోని వృద్ధాశ్రమంలో మహిళా నేతలు వృద్ధులతో కలిసి కేక్ కట్ చేసి, వారికి పండ్లు, రొట్టెలు పంపిణీ చేసి మమకారాన్ని చాటుకున్నారు. అటు జలుమూరు మండలం చల్లపేట జంక్షన్ వద్ద సంతోషిమాత ఆలయంలో యువనేత పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకోగా, పోలాకి మండలం పిన్నింటిపేట జంక్షన్ వద్ద యువత భారీ కేక్ కటింగ్ చేశారు. నియోజకవర్గవ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ అభిమానులు సంబరాలు జరుపుకున్నారు.
నరసన్నపేట పార్టీ కార్యాలయం జనసందోహంతో కనిపించింది. ధర్మాన కృష్ణదాస్ రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుని, నిరంతరం ప్రజల చెంతనే ఉంటున్న కృష్ణచైతన్యకు 2029 ఎన్నికల్లో అవకాశం కల్పించాలని శ్రేణులు ఏకగ్రీవంగా ఆకాంక్షించాయి. యువత, మహిళలు, పార్టీ సీనియర్ నేతలు భారీగా తరలివచ్చి జై ధర్మాన.. జై చైతన్య అంటూ నినదించారు.










Comments