విలీన చిక్కుముడికి సరికొత్త విరుగుడు!
- Prasad Satyam
- 9 hours ago
- 3 min read
వివాద పరిష్కారం దిశగా ప్రతిపాదనలు
అభివృద్ది చెందిన ప్రాంతాలను అలాగే ఉంచడం..
గ్రామీణ వాతావరణం ఉన్న వాటిని పంచాయతీలు చేయడం
బాధిత పంచాయతీల ప్రతినిధుల వినూత్న ఆలోచన
ఎమ్మెల్యే శంకర్ ప్రయత్నాలకు ఊతమిచ్చే అవకాశం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
‘కావాలంటే రికార్డు చేసుకోండి.. ఈ ఏడాది జులై నాటికి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిపించి తీరుతాం’.. అని అసెంబ్లీ ఎన్నికల సమయంలో విలేకరులకు ఎమ్మెల్యే గొండు శంకర్ నొక్కి వక్కాణించారు. ఆ గడువుకు మరో నెల రోజుల సమయమే ఉంది. ఈ స్వల్ప వ్యవధిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందా? అంటే కచ్చితంగా కుదరదనే చెప్పాలి. కాకపోతే కొంత ఆశావహ వాతావరణం ఇప్ప్పుడు కనిపిస్తోంది. విలీన సమస్యలకు, వివాదాలకు విరుగుడుగా సరికొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అయితే ఇది ప్రభుత్వం వైపు నుంచి కాకుండా బాధితుల నుంచే వస్తుండటం అనుకూల పరిణామంగా భావిస్తున్నారు శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగకపోవడానికి కోర్టు కేసులు ఏమేరకు కారణమవుతున్నాయి? దీనికి సంబంధించి వైకాపా ప్రభుత్వం చేసిన చట్టం ఏం చెబుతున్నది? అసలు విలీన పంచాయతీలు ఏం కోరుకుంటున్నాయి? రాష్ట్రంలో ఎన్ని నగరపాలక సంస్థలు ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నాయి? వంటి అంశాలపై ఎమ్మెల్యే శంకర్‌కు మొదట్లో అవగాహన లేదు. ఆ విషయం ఆయనే నిజాయితీగా ఒప్ప్పుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన వెంటనే మున్సిపల్ ఎన్నికలు జరిపిస్తానని హామీ ఇచ్చిన ఆయన ఆ దిశగా చేసిన ప్రయత్నాలు రివర్స్ కావడంతో దీని లోతుపాతులు ఆరా తీయడం మొదలుపెట్టారు. ఈ ప్రయాణంలో ‘సత్యం’లో వచ్చిన కథనాలు తనను ఎడ్యుకేట్ చేశాయని స్వయంగా ఆయనే తన ఇంటర్వ్యూలో చెప్పారు కూడా. ఆ అవగాహనతో విలీన పంచాయతీల చిక్కుముడి విప్పడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఏడు పంచాయతీలను శ్రీకాకుళం కార్పొరేషన్‌లో విలీనం చేయగా వాటిలో ఐదు శ్రీకాకుళం నియోజకవర్గ పరిధిలోనే ఉన్నాయి. మిగతా రెండింటి కోసం ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు ప్రభుత్వంతో పోరాడుతున్నారు. ఈ తరుణంలో శ్రీకాకుళం నియోజకవర్గ పరిధిలోని ఐదు పంచాయతీలు ప్రతినిధులు ఒక కొత్త ప్రతిపాదనతో త్వరలోనే ఎమ్మెల్యేను, ఆయన ద్వారా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణను కలవడానికి సిద్ధపడుతున్నారు.
తాజా ప్రతిపాదనలు ఇవీ..
ఇటీవల వర్చువల్ పద్ధతిలో క్లస్టర్ల వారీగా తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించారు. అందులో భాగంగా ఈ ఐదు విలీన పంచాయతీలను ఒకే క్లస్టర్ కింద చేర్చారు. ఆ సందర్భంగా ఒక్కచోట చేరిన ఈ పంచాయతీల తాజా, మాజీ సర్పంచ్‌లందరూ ఒక కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు. ఆ ప్రతిపాదన ప్రకారం.. శ్రీకాకుళం కార్పొరేషన్‌కు ఆనుకొని ఉంటూ కాలనీలుగా అభివృద్ధి చెందిన పంచాయతీలు, ప్రాంతాలను కార్పొరేషన్‌లోనే కొనసాగిస్తూ .. ఇప్పటికీ అభివృద్ధికి నోచుకోక గ్రామాలుగానే ఉన్న పంచాయతీలను నగరపాలక సంస్థ నుంచి విడదీసి తిరిగి గ్రామాలుగానే గుర్తించాలన్నది ఈ సరికొత్త ప్రతిపాదన సారాంశం.
ఉదాహరణకు పాత్రునివలస పంచాయతీనే తీసుకుంటే.. దీని పరిధిలో అభివృద్ధి చెందిన మేజర్స్ కాలనీ, ఫ్రెండ్స్ కాలనీ, ఆర్‌కే నగర్, వెంకటేశ్వర నగర్, సాయి నగర్‌లను కార్పొరేషన్‌లో ఉంచేసి పాత్రునివలస గ్రామం, దానికి ఆనుకొని ఉన్న ఇందిరమ్మ కాలనీ, టీచర్స్ కాలనీలను పంచాయతీగా మార్చాలి.
సిద్ధిపేట పంచాయతీలో సిద్ధిపేట, గోవిందపురం గ్రామాలను పంచాయతీ గొడుగు కిందకు తెచ్చి.. మిగిలిన కాలనీలన్నింటినీ కార్పొరేషన్‌లోనే కొనసాగించాలి.
ఖాజీపేట గ్రామాన్ని వదిలేసి నగరం చుట్టూ ఉన్న ఆ పంచాయతీ పరిధిలోని కాలనీలను కార్పొరేషన్‌లో ఉంచాలి.
పెద్దపాడు పంచాయతీ మొత్తాన్ని నగరపాలక సంస్థ పరిధి నుంచి తప్పించి తిరిగి గ్రామపంచాయతీ చేయాలి.
ఆ ఒక్కదానిపైనే భిన్నాభిప్రాయాలు
ఈ ప్రతిపాదనలకు ఎమ్మెల్యే అంగీకరిస్తే.. ఆ తర్వాత మున్సిపల్ మంత్రిని కలిసి ఈ ప్రతిపాదనల ప్రకారమైతే విభజనకు సహకరిస్తామని ప్రతిపాదించనున్నారు. అయితే పెద్దపాడు విషయంలోనే కొంత సమస్య రావచ్చు. ఈ పంచాయతీ మొత్తం గ్రామీణ వాతావరణంలో ఉన్నందున దాన్ని పంచాయతీగానే ఉంచాలని కోరడమే చర్చకు దారి తీసే అవకాశముంది. ఎందుకంటే.. శ్రీకాకుళం మున్సిపాలిటీలో పంచాయతీల విలీన అంశం తెరపైకి వచ్చినప్ప్పుడు అనుకూలంగా స్పందించిన తొలి పంచాయతీ పెదపాడే. 2009లో అప్పటి పంచాయతీ పాలకవర్గం విలీనానికి అనుకూలంగా తీర్మానించింది. 2014లో మళ్లీ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2015లో దీన్ని మున్సిపాలిటీ నుంచి విడగొట్టి మళ్లీ పంచాయతీగా మార్చారు. అంతకుముందు 2011 డిసెంబర్‌లో ఏడు పంచాయతీలను విలీనం చేస్తూ అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో విలీన పంచాయతీల సర్పంచ్‌లు 2012లో కోర్టుకెళ్లారు. దీనిపై స్టే వచ్చింది. ఆ తర్వాత కలెక్టర్ నుంచి మళ్లీ రికార్డులు వెనక్కు తెచ్చుకున్నారు. 2013 జులైలో రాష్ట్రంలో పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్ పాలన నడిచింది. ఆ వెంటనే ఎన్నికలు నిర్వహించానప్పటికీ ఈ ఏడు పంచాయతీలను మాత్రం మినహాయిస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ తోటపాలెం, కుశాలపురం, పాత్రునివలస, ఖాజీపేట పంచాయతీలు కోర్టుకెక్కాయి. దీంతో వీటికి ఎన్నికలు జరిగాయి. 2018 ఫిబ్రవరిలో మళ్లీ వీటిని మున్సిపాలిటీలో విలీనం చేయడానికి తీర్మానించాలంటూ అప్పటి ఎమ్మెల్యే కోరారు. కానీ వీరు అంగీకరించలేదు. 2018 ఆగస్టులో వీరి పదవీ కాలం ముగిసిన తర్వాత ప్రత్యేకాధికారులను నియమించి ఈ పంచాయతీలను మళ్లీ విలీనం చేశారు. దీంతో మళ్లీ వారు కోర్టుకెళ్లారు.
కోర్టు బయట పరిష్కారం!
ప్రభుత్వం మారిన తర్వాత పంచాయతీల విలీనంపై 2019లో ఒక ఆర్డినెన్స్ తీసుకువచ్చారు. దీన్ని ఆరు నెలల్లోగా చట్టంగా చేయాల్సి ఉన్నందున గడువు ముగియడానికి రెండు రోజుల ముందు కరోనా సమయంలో ఒకేరోజు సమావేశమైన అసెంబ్లీ ఈ ఆర్డినెన్స్‌ను చట్టంగా మార్చేసింది. ఇప్ప్పుడు ఈ చట్టం మీదే అనేక పంచాయతీలు హైకోర్టులో పోరాడుతున్నాయి. అందులో భాగంగానే శ్రీకాకుళం నియోజకవర్గంలో కోర్టుకెళ్లినవారు దాఖలు చేసిన రిట్ పిటిషన్ నెంబరు 17,924/2021 హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. ఇదే తరుణంలో ఎన్నికలు జరుపుతామంటూ 2022లో వార్డుల పునర్విభజన మొదలుపెట్టారు. ఇది కూడా అస్తవ్యస్తంగా జరిగిందంటూ ఆధారాలతో సహా విలీన పంచాయతీలు మళ్లీ కోర్టుకెక్కాయి. కోర్టు మొట్టికాయలు వేయడంతో కేసు ముగిసే వరకు ఎన్నికలు జరపబోమని హామీ ఇస్తూ ప్రభుత్వం కోర్టుకు అఫిడవిట్ రూపంలో హామీ ఇచ్చింది. అంతే.. అప్పట్నుంచి ఎన్నికల ఊసెత్తితే చాలు.. కోర్టులో కేసులు విత్‌డ్రా కావాలి లేదా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావాల్సిందేనని మున్సిపల్ మంత్రులుగా చేసినవారు చెబుతూ వస్తున్నారు. చట్టాల విషయంలో కోర్టులు జోక్యం చేసుకోవని ప్రభుత్వం భావిస్తుండగా.. గతంలో ఇలాంటి కేసులోనే నాలుగు పంచాయతీలకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చిందని విలీన బాధితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తెరపైకి వచ్చిన తాజా ప్రతిపాదనలో అంశాలు సానుకూలంగానే ఉన్నందున ఎవరికీ ఎటువంటి అభ్యంతరాలూ ఉండకపోవచ్చు. ఇదే జరిగితే మిగిలిన మున్సిపాలిటీలతో పాటు శ్రీకాకుళానికి కూడా ఎన్నికలు వచ్చే అవకాశం లేకపోలేదు.






Comments