top of page

వివాద భోజనులు!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Oct 8, 2025
  • 2 min read

పురాణాల్లో నారదుడి గురించి అందరికీ తెలిసిందే. ఆయన వచ్చారంటే చాలు.. అక్కడ ఏదో ఒక వివాదం, గొడద రగలడం ఖాయం అన్నది మన పురాణాలే పేర్కొన్న మాట. అడుగుపెట్టిన చోటల్లా తంపులు పెట్టి కలహాలు రేపుతాడు కనుకనే ఆయన్ను కలహ భోజనుడని అంటారు. ఈ కాలంలోనూ అటువంటి కలహ భోజనులు ఉన్నారు. వారే మన సెలబ్రిటీలు. భావ ప్రకటన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ అనేకమంది విచక్షణారహితంగా మాట్లాడేస్తుంటారు. అవి ఎంతటి వివాదాలకు దారితీస్తాయో.. ఎందరి మనోభావాలను దెబ్బతీస్తాయో.. మతపరమైన భావోద్వేగాలను ఎంతగా రెచ్చగొడతాయో.. ఏమాత్రం ఆలోచించరు. ఆలోచించినా పట్టించుకోరు. ఆ కోవలోకే కొందరు సెలబ్రిటీలను చేర్చవచ్చు. తమ వ్యాఖ్యలతో నిత్యం వివాదాల మంటలు రాజేసి చలి కాచుకునే ఈ బాపతు సెలబ్రిటీలు వ్యక్తిగత ప్రచారం కోసం, సోషల్‌ మీడియాలో లైకుల కోసం తమ వాచాలతను ప్రదర్శిస్తుంటారు. ఇటువంటి వారిని నారదుడితో పోల్చడం కూడా ఆ మహర్షిని అవమానించడమే అవుతుంది. ఎందుకంటే.. నారదుడి ఎటువంటి కలహాలు సృష్టించినా వాటి అంతిమ లక్ష్యం లోకకల్యాణమే. కానీ నేటి సెలబ్రిటీలు తమ అనుచిత వ్యాఖ్యలతో సమాజంలో అశాంతి సృష్టిస్తున్నారు. పూజ్యనీయులను, గౌరవనీయులను అవమానిస్తున్నారు. ఇదంతా ఇప్పుడెందుకంటే.. గాంధీజీ ఎంత మహనీయుడే కొత్తగా ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. మనదేశానికి ఆయన మహాత్ముడైతే.. ప్రపంచానికి ఆయన శాంతి దూత. అలాగే రామాయణంలో రావణుడు పాత్ర ఎలాంటిదో తెలిసిందే. కానీ గాంధీ జయంతి, దసరా పర్వదినం సందర్భంగా గాంధీజీని తెగుడుతూ, రావణుడిని పొగుడుతూ ఇద్దరు సెలబ్రిటీలు సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టులు తీవ్ర వివాదానికి కారణమవుతున్నాయి. కొత్త వివాదాలకు తెరతీస్తున్నాయి. అశాంతి, అలజడికి కారణమవుతున్నాయి. వీరిద్దరి అనుచిత వ్యాఖ్యలపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. టాలీవుడ్‌ నటుడు శ్రీకాంత్‌ అయ్యంగార్‌ అలియాస్‌ శ్రీకాంత్‌ భరత్‌ గాంధీజీని స్త్రీ లోలుడిగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తే.. బాలీవుడ్‌ సీనియర్‌ నటి సిమీ గరేవాల్‌ రావణాసురుడిని సీతను ఆదరించిన మహనీయుడిగా అభివర్ణించడం ద్వారా తాజా వివాదాలకు కారణమయ్యారు. వివాదాస్పద నటుడిగా పేరొందిన శ్రీకాంత్‌ గాంధీ జయంతి అంటే అక్టోబర్‌ రెండున పోస్టు చేసిన ఒక వీడియోలో ఆయనొక మహాత్ముడా.. జాతిపితా? అంటూ గాంధీజీని బూతులు తిట్టారు. దీన్ని నిరసిస్తూ కొందరు ట్రోల్‌ చేసినా మళ్లీ మరో వీడియో పెట్టాడు. గాంధీ స్త్రీలోలుడు అంటూ దారుణమైన కామెంట్లు చేశారు. కామెంట్‌ చేశాడు. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై కొందరు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ‘15, 16 ఏళ్ల అమ్మాయిని పక్కన నగ్నంగా పడుకోబెట్టి.. తన నిగ్రహ శక్తిని పరీక్షించుకున్నాడు. ఎంతో మంది అమ్మాయిలను వేధించాడు. వాడు మహాత్ముడా? వాడు ఎక్స్‌ఎక్స్‌ ఆత్ముడు. వాడు స్వాతంత్య్రం తీసుకురావడం ఏమిటి?.. బొక్కా! సుభాస్‌చంద్రబోస్‌, భగత్‌సింగ్‌ లాంటి లక్షల మంది తెచ్చారు. వాళ్లు పరమాత్ములు. వీడు ఫ్యూడో ఫైల్‌’ అంటూ బూతులతో రెచ్చిపోయారు. తన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ట్రోల్‌ చేసిన వారిని కూడా ఇష్టమొచ్చినట్లు దూషించారు. ఒకవేళ మోహన్‌దాస్‌ కరమ్‌చంద్‌ గాంధీ ఫాదర్‌ ఆఫ్‌ నేషన్‌ అయితే.. నేను సిటిజన్‌ ఆఫ్‌ బాస్టర్డ్‌. జై హింద్‌.. ఇడియట్స్‌.. మీరు ఇంకా నేర్చుకోండి అంటూ శ్రీకాంత్‌ అయ్యాంగర్‌ పెచ్చరిల్లిపోయాడు. ఇటువంటి అతి చేష్టలు, పిచ్చి ప్రేలాపనలు ఆయన కొత్త కాదు. గతంలో కూడా సినిమా రివ్యూవర్స్‌పై, సినీ ప్రముఖులపై బూతులతో కామెంట్స్‌ చేసిన చరిత్ర ఉంది. మొదట నోరు జారడం.. పరిస్థితి చేజారిపోతుంటే.. క్షమాపణలు చెప్పి తప్పించుకోవడం ఆయనకు షరామామూలే. కానీ ఇప్పుడు ఏకంగా గాంధీజీపైనే అనుచిత వ్యాఖ్యలతో రెచ్చిపోవడం పై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆయనపై గాంధేయవాదులు భగ్గుమంటున్నారు. ఇక్కడ శ్రీకాంత్‌ అయ్యంగార్‌ ఇలా పెచ్చరిల్లితే.. అటు బాలీవుడ్‌కు చెందిన సిమీ గరేవాల్‌ రామాయణంలో విలన్‌ అయిన రావణాసురుడికి సర్టిఫికెట్‌ ఇచ్చేందుకు ప్రయత్నించారు. రావణుడు కొంటెవాడే కానీ మహిళల మానప్రాణాలు కబళించే రాక్షసుడు కాదంటున్నారు. దసరా రోజు రావణ దహనం చేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తూ సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టింది. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఏటా దసరా పండుగ చేసుకోవడం ఆనవాయితీ. రాముడు రావణుడిని పరిహరించిన మరు రోజు జరుపుకునే ఈ పండుగను విజయదశమి అని కూడా అంటారు. సిమీ గరేవాల్‌ పోస్టు దీన్ని ఖండిరచేలా ఉంది. ‘రావణా.. నువ్వు కాస్త కొంటెగా ఉన్నావే తప్ప రాక్షసుడిలా ప్రవర్తించలేదు. తొందరపడి సీతను అపహరించి లంకకు తీసుకెళ్లినా.. తిండి పెట్టావు, ఆశ్రయం కల్పించి ఆదరించావు. ఈ కాలంలో ఆడవాళ్లకు ఇస్తున్న గౌరవమర్యాదలతో పోలిస్తే అప్పట్లో నువ్వే ఒక స్త్రీ(సీతాదేవి)ని ఎక్కువ గౌరవించావు. ఆమె భద్రత కోసం మహిళా సెక్యూరిటీ గార్డుల (మహిళా రాక్షసులు)ను నియమించావు. సగంమంది పార్లమెంటు సభ్యుల కంటే కూడా నువ్వే ఎక్కువ చదువుకున్నావు’ అని ఆమె కొనియాడారు. రావణుడి బొమ్మను కాల్చడానికి నాకెటువంటి అభ్యంతరం లేదు. కానీ ఆయనేం చేశారన్నదే నా ప్రశ్న.. అని ట్వీట్‌ చేశారు. ఈ పోస్ట్‌పై విమర్శలు వెల్లువెత్తడంతో సదరు ట్వీట్‌ను డిలీట్‌ చేసింది. తిండి పెట్టి, ఆశ్రయం కల్పిస్తే గొప్పవారైపోతారా? మహిళలను కిడ్నాప్‌ చేసినా తప్పులేదా?? అని సిమీ గరేవాల్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. వ్యక్తిగత అభిప్రాయాలు, వాక్‌ స్వాతంత్య్రం పేరుతో ఇలా రెచ్చిపోవడం తగదు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page