top of page

వివరణ కోరడమే విచారణా?!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • Dec 20, 2025
  • 3 min read
  • పౌరసరఫరా సంస్థ డీఎంపై గ్రీవెన్స్‌లో ఫిర్యాదు

  • వివరాల సేకరణతోనే మమ అనిపించేసిన విచారణాధికారులు

  • అందరినీ డమ్మీలుగా మార్చి అధికారాలు హస్తగతం

  • వీలున్నప్పుడల్లా వచ్చి వ్యవహారాలు సర్దుకుంటున్నారన్న ఆరోపణలు

  • ఈ ఆరోపణలను పట్టించుకోకపోవడంపై విమర్శలు

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

జిల్లా పౌరసరఫరాల సంస్థలో విచారణకు అర్థమే మారిపోయింది. బాధితులు చెప్పిన, పత్రికల్లో వచ్చిన వార్తలనే మళ్లీ బాధ్యుడి ముందు ఉంచి వివరణ కోరడం ద్వారా విచారణ ప్రక్రియను ఓ ప్రహసనంగా మార్చేశారు. అది కూడా ఒక అధికారిపై విచారణ జరపాలంటే అతనికంటే ఉన్నత స్థానంలో ఉన్నవారిని విచారణాధికారిగా నియమించాలి. ఇక్కడ దాన్ని కూడా అతిక్రమించారు. పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ వేణుగోపాలరావుపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ పేరుతో జరుగుతున్న తతంగం అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. సీసీఎల్‌ఏలో పనిచేసిన ఇక్కడికి వచ్చిన వేణుగోపాలరావు డిప్యూటీ కలెక్టర్‌ హోదా కలిగిన అసిస్టెంట్‌ సెక్రటరీ స్థాయి అధికారి. అతనిపై విచారణ జరిపే అధికారం జాయింట్‌ కలెక్టర్‌ ఆపై స్థాయి అధికారులకే ఉంటుంది. కానీ వేణుగోపాలరావుపై విచారణకు పౌరసరఫరాల సంస్థకే చెందిన ఇద్దరు మేనేజర్ల నియమించి మొక్కుబడి తంతుగా మార్చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నెల ఎనిమిదో తేదీన గ్రీవెన్స్‌లో పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ వేణుగోపాలరావుపై పోలాకి మండలం సుసరాం గ్రామానికి చెందిన శ్రీదుర్గా మోడ్రన్‌ రైస్‌ మిల్లు యజమాని తమ్మినేని భూషణరావు పలు ఆరోపణలతో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా రెండు రోజుల క్రితం సంస్థ జిల్లా కార్యాలయంలో విచారణ జరిగింది. విచారణ పేరుతో జరిగిన తంతు చూసినవారు ఇదంతా చేతులు దులుపేసుకునే తతంగమని అభిప్రాయపడ్డారు.

గత ఏడాది సెప్టంబర్‌ ఒకటో తేదీన ఇచ్ఛాపురంలో జరిగిన సీఎం చంద్రబాబు సభకు వచ్చిన వారికి ఆహారం సరఫరా చేయడంలో విఫలమయ్యారంటూ అప్పటి పౌరసరఫరా సంస్థ జిల్లా మేనేజర్‌ శ్రీనివాసరావును పక్కన పెట్టి ఆయన స్థానంలో సీసీఎల్‌ఏ నుంచి వేణుగోపాలరావును తీసుకువచ్చారు. చిత్రం ఏమిటంటే ఒకపక్క శ్రీనివాసరావును కొనసాగిస్తునే, వేణుగోపాలరావుకు జిల్లా మేనేజర్‌గా బాధ్యతలు అప్పగించారు. దాంతో దాదాపు ఎనిమిది నెలలపాటు ఒకే కార్యాలయానికి ఇద్దరు జిల్లా మేనేజర్లుగా ఉన్నారు. ఆ తర్వాత శ్రీనివాసరావు బదిలీపై వెళ్లిపోయారు. అప్పటినుంచి వేణుగోపాలరావు జిల్లా మేనేజర్‌గా పూర్తి అధికారం చెలాయిస్తున్నారు. వాస్తవానికి ఆయన్ను ఒక్క ఏడాది కాలానికే పరిమితం చేసి సీసీఎల్‌ఏ నుంచి జిల్లాకు పంపారు. సంబంధిత జీవోలో ఆ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. కానీ ఏడాది పూర్తి అయినా తిరిగి సీసీఎల్‌ఏకు వెళ్లకుండా వేణుగోపాలరావు ఇక్కడే తిష్ట వేశారు.

పోనీ ఇక్కడే ఉండిపోయినా నిబద్ధతతో పని చేస్తున్నారా అంటే అదీ లేదు. ఆయనపై అందిన ఫిర్యాదు, వస్తున్న ఆరోపణలే దీనికి నిదర్శనం. ధాన్యం సేకరణలో కీలకపాత్ర పోషించాల్సిన పౌరసరఫరాల సంస్థను డమ్మీగా మార్చేసి వేణుగోపాలరావే అధికారాలన్నింటినీ తనవద్దే అట్టిపెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. మండల స్థాయిలో పౌరసరఫరాల శాఖ డీటీల ద్వారా ధాన్యం సేకరణ జరగాలి. వాటికి సంబంధించిన అన్ని అధికారాలు వారికే ఉంటాయి. కానీ డీటీలను కొన్ని అంశాలకు మాత్రమే పరిమితం చేసి, ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఉత్సవ విగ్రహాల్లా మార్చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. మిల్లర్ల బ్యాంకు గ్యారెంటీలు, సీఎంఆర్‌ తదితర వ్యవహారాలను జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు పర్యవేక్షించాలి. కానీ ఆ బాధ్యతల నుంచి వారిని తప్పించి వేణుగోపాలరావు తన గుప్పిట్లో పెట్టుకున్నట్లు తెలిసింది. ఈయనగారి నిర్వాకాల కారణంగా రైతులు, మిల్లర్లు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా చర్యల్లేవన్న విమర్శలు ఉన్నాయి. అయితే ఈ విషయంలో మిల్లర్లు బహిరంగంగా నోరు విప్పడంలేదు. డీఎంపై ఫిర్యాదు చేస్తే తమకు ఇవ్వాల్సిన టార్గెట్ల కోత పెట్టి వేధిస్తారన్న భయమే వారి మౌనానికి కారణమని చర్చ జరుగుతోంది. తాను పైస్థాయిలో డబ్బులు ఇచ్చి ఇక్కడికి వచ్చానని తననెవరూ తప్పించలేరని వేణుగోపాలరావు బెదిరిస్తున్నట్టు తెలిసింది.

కాగా ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎం వేణుగోపాలరావుపై విచారణకు పౌరసరఫరాల సంస్థ రాష్ట్ర కార్యాలయం నంచి మేనేజర్‌ స్థాయి అధికారులిద్దరిని పంపించడం చర్చనీయాంశంగా మారింది. వారు విచారణ జరిపిన తీరు కూడా అంతే హాస్యాస్పదంగా కనిపించింది. వారు కలెక్టర్‌ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసిన మిల్లరు తమ్మినేని భూషణరావును పిలిపించి వివరాలు సేకరించారు. డీఎం వేణుగోపాలరావుపై ‘సత్యం’లో వచ్చిన కథనంతో పాటు ఇతర పేపర్ల క్లిప్పింగులను ఆయన వారికి అందించారు. డీఎం నుంచి తనకు ఎదురైన ఇబ్బందులను భూషణరావు విచారణాధికారులకు వివరించడంతో పాటు పలు అవినీతి ఆరోపణలు చేసినట్లు తెలిసింది. మిల్లర్లను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న తీరును వివరించినట్లు సమాచారం. అనంతరం భూషణరావు ఇచ్చిన వివరాలు, పేపర్ల క్లిప్పింగులను విచారణాధికారులు డీఎం వేణుగోపాలరావు ముందు పెట్టి వాటికి వివరణ ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. వాటిని పెద్దగా ఖాతరు చేయని డీఎం తనకు అనుకూలంగా ఉండే కొందరు మిల్లర్ల పేర్లు ప్రస్తావించి, వారి నుంచి సమాచారం తీసుకోవాలని సూచించినట్టు తెలిసింది. భూషణరావు ఉద్దేశపూర్వకంగానే తనపై ఫిర్యాదు చేసి పేపర్లలో వార్తలు రాయించారని కూడా ఆయన ప్రత్యారోపణ చేసినట్లు తెలిసింది. అంతటితోనే విచారణ తతంగాన్ని ముగించేసిన ఆ అధికారులు సంస్థ ఎండీకి విచారణ నివేదిక అందిస్తామని చెప్పి వెళ్లిపోయారు.

జిల్లాకు ఆయన అతిథి అధికారి

సీసీఎల్‌ఏలో పని చేస్తున్న వేణుగోపారావు శ్రీకాకుళం జిల్లాకు గెస్ట్‌ ఆఫీసర్‌ లాంటి వారన్న విమర్శలు ఉన్నాయి. తనకు కావలసినప్పుడల్లా ఉన్నతాధికారులను మేనేజ్‌ చేసి జిల్లాలో పలు హోదాల్లో కొంతకాలం పని చేయడం, మళ్లీ వెళ్లిపోవడం ఆయనగారికి షరా మామూలే. గతంలోనూ జిల్లా కలెక్టరేట్‌, శ్రీకాకుళం మున్సిపల్‌ కార్పొరేషన్‌, నరసనన్నపేట తహసీల్దార్‌ కార్యాలయాల్లో వివిధ హోదాల్లో పని చేశారు. తనకున్న రాజకీయ పరిచయాలతో అవసరమైనప్పుడు జిల్లాలో అనుకూలమైన పోస్టింగ్‌ వేయించుకోవడం, ఒకటి రెండేళ్లు పనిచేసి వ్యవహారాలు ముగించుకుని పాత పోస్టుకు వెళ్లిపోవడం పరిపాటిగా మారిందని విమర్శలు ఉన్నాయి. జిల్లాకు చెందిన కొందరు మిల్లర్ల అండ చూసుకుని వేణుగోపాలరావు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page