top of page

విశాఖకు మరో మణిహారం.. అణు జలాంతర్గాముల స్థావరం

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Jul 3, 2025
  • 3 min read
  • రాంబిల్లి వద్ద ఐఎన్‌ఎస్‌ వర్షాకు తుది మెరుగులు

  • వచ్చే ఏడాది తొలి దశ నిర్మాణం అందుబాటులోకి

  • దేశంలోనే తొలి ఆటమిక్‌ సబ్‌మెరైన్‌ కేంద్రం

  • విశాఖ తీరంపై ఒత్తిడి తగ్గించేందుకు అవకాశం

  • కేంద్ర ప్రభుత్వ లుక్‌ ఈస్ట్‌ పాలసీలో ఇదో భాగం

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)

సాగరతీరంలో ఉన్న విశాఖ మహానగరం ఇప్పటికే రక్షణపరంగా అత్యంత వ్యూహాత్మకం, కీలక ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఈ నగరానికి మరింత ప్రాముఖ్యత చేకూర్చేలా చేపట్టిన అణు నౌకా స్థావం నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది. త్వరలో అందుబాటులోకి రానుంది. విశాలమైన మనదేశ తూర్పు తీరాన్ని, బంగాళాఖాతంపై మన ప్రాదేశిక ఆధిపత్యాన్ని పరిరక్షించడంతోపాటు ఇతర దేశాలు, ఉగ్రవాదుల చొరబాట్ల నుంచి రక్షించేందుకు వీలుగా ఇప్పటికే విశాఖ ప్రధాన కేంద్రంగా కొన్ని దశాబ్దాలుగా తూర్పు నావికాదళం పని చేస్తోంది. దీంతోపాటు హిందుస్తాన్‌ షిప్‌యార్డు పేరుతో నౌకా నిర్మాణ కేంద్రం, నౌకలకు మరమ్మతులు చేసే డాక్‌యార్డులతోపాటు నేవల్‌ ఆర్మమెంట్‌ డిపో(ఎన్‌ఏడీ).. అంటే నేవీ ఆయుధాగారం, భీమిలి సమీపంలో క్షపణుల కేంద్రం.. ఐఎన్‌ఎస్‌ కళింగ, అలాగే డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌(డీఆర్‌డీవో)కు అనుబంధంగా నేవల్‌ సైంటిఫిక్‌ అండ్‌ టెక్నలాజికల్‌ లేబరేటరీ(ఎన్‌ఎస్‌టీఎల్‌) తదితర సంస్థలు విశాఖకు రక్షణపరంగా జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిపెట్టాయి. ఇప్పుడు వీటికి అదనంగా అణు జలాంతర్గాములు ప్రధాన కేంద్రం విశాఖ సిగలో మరో మణిహారంగా చేరనుంది. ఇది దేశంలోనే తొలి అణు జలాంతర్గాముల కేంద్రం కావడం విశేషం.

విశాఖ పోర్టుపై ఒత్తిడి తగ్గించేలా..

ప్రస్తుతం విశాఖ తీరంలో తూర్పు నావికాదళ ప్రధాన కేంద్రంతోపాటు విశాఖపట్నం పోర్టు, గంగవరం ప్రైవేట్‌ పోర్టు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. పోర్టుకు వచ్చే వాణిజ్య నౌకలతోపాటు నేవీకి చెందిన యుద్ధ, గస్తీ, నిఘా నౌకలు ఈ తీరానికి వస్తుంటాయి. వాణిజ్య నౌకలకు సంబంధించి వన్‌టౌన్‌ ఏరియాలోని తీరంలో నౌకలను నిలిపే బెర్త్‌లు ఉండగా, నేవీ నౌకలు నిలపడానికి డాక్‌యార్డు సమీపంలో ప్రత్యేక బెర్త్‌లు ఉన్నాయి. ప్రస్తుతం అక్కడే అణు జలాంతర్గాములను కూడా నిలుపుతున్నారు. ఈ క్రమంలో విశాఖ తీరంపై ఒత్తిడి పెరిగిపోతోంది. 2006లో తూర్పు నావికాదళం వద్ద 15 యుద్ధనౌకలు ఉండగా.. 2012 నాటికి వాటి సంఖ్య 46కు పెరిగింది. పెద్దసంఖ్యలో రాకపోకలు సాగించే నౌకల కారణంగా జలమార్గంలో రద్దీ తీవ్రతరమైంది. బెర్త్‌లు సరిపోని పరిస్థితి తలెత్తింది. నిర్వహణ కష్టాలు పెరుగుతున్నాయి. ఈ రద్దీని తగ్గించేందుకు విశాఖ నుంచి 200 కి.మీ. రేడియస్‌లో మరో నౌకాస్థావరాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన లుక్‌ ఈస్ట్‌ పాలసీలో భాగంగా 2005లోనే నిర్ణయించారు. ఆ మేరకు ప్రాజెక్టు వర్షా పేరుతో భారత నేవీ, కేంద్ర నౌకారవాణా శాఖ సంయుక్తంగా ప్రణాళికలు రూపొందించాయి.

రాంబిల్లిలో కొత్త స్థావరం

ఈ ప్రణాళికల్లో భాగంగా విశాఖ తీరానికి దక్షిణంగా ఉన్న గంగవరం తీరం వద్ద ప్రైవేట్‌ రంగంలో గంగవరం వాణిజ్య పోర్టు ఏర్పాటు చేశారు. ఇక నేవీకోసం తగిన వ్యూహాత్మక ప్రదేశం కోసం చాన్నాళ్లు అన్వేషణ సాగించి చివరికి విశాఖకు 50 కి.మీ. దూరంలో ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలో ఉన్న రాంబిల్లి తీరాన్ని అనువైనదిగా గుర్తించి అణునౌకా స్థావరం నిర్మాణానికి ఎంపిక చేశారు. విశాఖలోని తూర్పు నావికా దళ కేంద్రానికి సమీపంలోనే ఉన్న ఈ స్థావరం దాని ఆధీనంలోనే పని చేస్తుంది.

15 ఏళ్లుగా కొనసాగుతున్న ప్రాజెక్టు

రెండు దశల్లో చేపట్టాలని ప్రతిపాదించిన ఐఎన్‌ వర్షా మొదటి దశ నిర్మాణ పనులు 2011`12 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభమయ్యాయి. తొలి దశలో సివిల్‌, ఇతర నిర్మాణాలు బెర్త్‌ల నిర్మాణం వంటివి 2022లోనే పూర్తి కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా చాలా కాలం పనులు నిలిచిపోవడంతో జాప్యం జరిగింది. ఈ మొదటి దశ నిర్మాణమే ఇప్పుడు తుది దశకు చేరుకుంది. వచ్చే ఏడాది దీన్ని జాతికి అంకితం చేసి అందుబాటులోకి తెచ్చేందుకు నేవీ ఉన్నతాధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు రెండో దశలో ప్రతిపాదించిన సాంకేతిక పనులు, కమాండ్‌ సెంటర్‌ అణు జలాంతర్గాములు, అణు క్షపణులకు సంబంధించి రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌(ఆర్‌ అండ్‌ డి) కేంద్రం నిర్మాణాలు 2018లో ప్రారంభమై శరవేగంగా కొనసాగుతున్నాయి.

రాంబిల్లి ఎంత రహస్యంగా ఉంటుంది?

రాంబిల్లి వ్యూహాత్మకంగా చాలా సురక్షిత ప్రాంతం. హైనాన్‌ దీవిలో ఉన్న చైనాకు చెందిన అణు నౌకా స్థావరం మాదిరిగానే ఉంటుంది. ఇక్కడ సముద్రతీరం లోతుగా ఉండటం వల్ల ఈ జలాల్లో నిలిచే జలాంతర్గాములు శత్రువుల నిఘాకు దొరకవు. శాటిలైట్‌ కళ్లకు కూడా కనిపించకుండా బయటకు రావచ్చు, లోపలికి వెళ్లవచ్చు. అణ్వాయుధాలను మోసుకెళ్లే సూపర్‌ సానిక్‌ బాలిస్టిక్‌ మిసైల్‌ సబ్‌మెరైన్స్‌కు ఇటువంటి గోప్యత చాలా అవసరం. ఈ స్థావరంలోనే భూగర్భ గదులు, సొరంగాలు నిర్మించి అణు జలాంతర్గాములను అక్కడే కనిపించకుండా నిలిపి ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ స్థావరం కేంద్రంగా భవిష్యత్తులో స్టెల్త్‌ ఆపరేషన్లు నిర్వహించవచ్చు. భారత నావికాదళం వద్ద ప్రస్తుతం అరిహంత్‌ రేంజ్‌ అణు జలాంతర్గాములు ఉన్నాయి. ఈ శ్రేణిలో మొదటిది అరిహంత్‌ కాగా రెండోది అరిఘాత్‌.. ఈ క్రమంలో నిర్మాణంలో ఉన్న మూడో అణు సబ్‌మెరైన్‌ ఐఎన్‌ఎస్‌ అరిధామన్‌ తుది రూపరేఖలు దిద్దుకుంటోంది. ఈ ఏడాదిలోనే దాన్ని జలప్రవేశం చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అరిహంత్‌, అరిఘాత్‌ల కంటే అరిధామన్‌ పెద్దది. ఏడువేల టన్నుల బరువుతో 3500 కి.మీ. రేంజ్‌ ఉన్న కే`4 మిస్సైల్స్‌ ’క్షిపణులు)ను మోసుకెళ్లగల సామర్థ్యం దీని సొంతం. ఇవి కాకుండా భవిష్యత్తు మరో ఆరు అణు సబ్‌మెరైన్లు సమకూర్చుకోవాలని భారత నేవీ సంకల్పించింది. ఇవన్నీ రాంబిల్లిలో ఏర్పాటు చేస్తున్న ఐఎన్‌ఎస్‌ వర్షా ప్రధాన కేంద్రంగానే కార్యకలాపాలు నిర్వహిస్తాయి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page