విశ్రమిస్తున్న మిగ్.. ఇద్దామా చివరి హగ్
- DV RAMANA

- Sep 25, 2025
- 3 min read
ఆరు దశాబ్దాల మిగ్`21లకు శాశ్వత సెలవు
ఇండో`పాక్ యుద్ధాల్లో అరివీర పోరాట పటిమ
వాయుసేన అమ్ములపొదిలో తిరుగులేని అస్త్రం
వేగమే శాపంగా ఎగిరే శవపేటికలన్న అపవాదు
శుక్రవారం చండీగఢ్‌లో అధికారిక వీడ్కోలు కార్యక్రమం

మిగ్`21.. ఈ పేరు చెబితేనే మన ఛాతీ గర్వంతో విశాలమవుతుంది. మన ఒళ్లంతా ఒకరకమైన ఉత్సాహంతో రోమాంచితమవుతుంది. మన దేశానికి ప్రత్యేకించి వాయుసేను ఆరు దశాబ్దాలపాటు అవిశ్రాంత, అపురూప సేవలు అందించిన.. శత్రువుల పాలిట అరివీర భయంకర ఫైటర్లుగా పేరొందిన ఈ జెట్‌లు ఇప్పుడు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. వాటిని కొనుగోలు చేసేందుకు అనేక సంస్థలు పోటీ పడుతున్నాయి. అదేమిటి.. అసమాన సేవలు అందించిన యుద్ధ విమానాలను అమ్మేయడం ఏమిటి? అన్న ప్రశ్నలు, అనుమానాలు తలెత్తవచ్చు. సుదీర్ఘ సేవలు అందించిన మిగ్`21లను యుద్ధసేవల నుంచి మన సైన్యం పూర్తి విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించడమే దీనికి కారణం. సర్వీసు నుంచి వైదలగే ఈ విమానాలను ప్రదర్శనశాలలో ఉంచేందుకు వీలుగా కొనుగోలుకు పెట్టారు.
(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
మనుషులతో సహా సమస్త జీవజాలానికి నిర్ణీత జీవితకాలం(లైఫ్‌స్పాన్) ఉన్నట్లే యంత్రాలు, వాహనాలు, వస్తువులకు కూడా జీవితకాలం ఉంటుంది. అదే తరహాలో భారత వాయుసేన(ఎయిర్‌ఫోర్స్)కు సుదీర్ఘ కాలం సేవలందించి, ఎన్నో యుద్ధాల్లో విజయాలు సాధించిపెట్టిన మిగ్`21 ఫైటర్ జెట్లు జీవితకాలం ముగిసి, విశ్రాంతికి సిద్ధమవుతున్నారు. 1963లో మన వాయుసేన అమ్ములపొదిలో చేరిన ఈ యుద్ధ విమానాలు 62 ఏళ్లు నిర్విరామంగా సేవలందించాయి. మారే కాలంతోపాటు యుద్ధరీతులు, ఆయుధాలు కూడా మారుతున్న క్రమంలో మిగ్`21లకు విశ్రాంతినిచ్చి.. వాటి స్థానంలో స్వదేశీ తయారీ ఎల్‌సీఏ తేజస్ ఎంకే1ఎను ప్రవేశపెట్టనున్నారు. 1963లో తొలిసారిగా వీటిని ఎక్కడ వాయుసేనలోకి తీసుకుని జాతికి అంకితం చేశారో అక్కడే తుది వీడ్కోలు పలకాలని వాయుసేన నిర్ణయించింది. ఆ మేరకు ఈ నెల 26న చండీగఢ్‌లోని 23వ స్క్వాడ్రన్(పాంథర్స్)లో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో వీటికి సెలవు ప్రకటించనున్నారు. ప్రస్తుతం భారత వాయుసేనలో 31 మిగ్`21లతో కూడిన రెండు స్క్వాడ్రన్లు ఉన్నాయి. వీటన్నింటినీ సేవల నుంచి ఉపసంహరిస్తారు. దాంతో వాయుసేనలో మొత్తం స్క్వాడ్రన్ల(దళాలు) సంఖ్య 29కి తగ్గుతుంది.
తొలి సూపర్‌సోనిక్ ఫైటర్లు
మిగ్`21 రకం యుద్ధ విమానాలను అప్పటి సోవియట్ రష్యా తొలి తయారీదారుగా ఉంది. 1960లో సోవియట్ యూనియన్‌లోని మికోయన్-గురేవిచ్ సంస్థ దీన్ని డిజైన్ చేసింది. అదే ఏడాది ఈ రకం తొలి విమానాన్ని ఆ దేశం రంగంలోకి దించగా.. 1963లో రక్షణ ఒప్పందాల్లో భాగంగా భారత్‌కు అందజేయడం ప్రారంభించింది. అప్పటినుంచి దీన్ని సమయానుకూలంగా అప్‌గ్రేడ్ చేస్తూ మన దేశానికి సరఫరా చేస్తున్నారు. ఆ విధంగా సుమారు 870 మిగ్ విమానాలు భారత వాయుసేనలో చేరాయి. మన వాయుసేనలో చేరిన తొలి సూపర్‌సోనిక్ ఫైటర్ జెట్లుగా ఇవి పేరొందాయి. అత్యున్నత సాంకేతిక విలువలు, యుద్ధ సామర్థ్యంతో అప్పటి ఈ విమానాలు అమెరికా సహా పశ్చిమ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేశాయంటే అతిశయోక్తి కాబోదు. ఈ విమానాల టెక్నాలజీని తెలుసుకోవడానికి ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ ఏకంగా ఒక మిగ్`21 విమానాన్ని దొంగతనంగా ఎత్తుకెళ్లిందంటే ఇవి ఎంతగా భయపెట్టాయో అర్థం చేసుకోవచ్చు. మిగ్`21లను నడపడానికి అలవాటు పడిన పెలట్లు ఇతర యుద్ధ విమానాలను నడపడానికి సుముఖత చూపరనే పేరుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉత్పత్తి అయిన యుద్ధ విమానాల్లో ఒకటిగా మిగ్`21కు పేరుంది. 60కిపైగా దేశాలు 11వేల మిగ్‌లను తయారు చేశాయి. ఈ ఫైటర్ జెట్ గంటకు రెండువేల కిలోమీటర్ల వేగంతో గాలితో పోటీపడుతూ దూసుకుపోగలదు. అలాగే ఒకే ఒక్క సెకన్ వ్యవధిలోనే 250 మీటర్ల వేగం అందుకుని నిట్టనిలువుగా ఆకాశంలోకి దూసుకుపోగలదు. శత్రు భూభాగాల్లోకి వాయువేగంగా చొరబడి లక్ష్యాలపై దాడులు చేసి.. అంతే వేగంగా తిరిగి రావడం దీని ప్రత్యేకతగా చెబుతారు.
ఎన్నో యుద్ధాల్లో అసమాన పరాక్రమం
వాయుసేనలో చేరినప్పటినుంచి దానికే కాకుండా యావత్తు భారత సైన్యానికి మిగ్`21 విమానాలు వెన్నుదన్నుగా నిలిచాయి. వాయుసేన తరఫున గగనతల దాడులు చేయడంతోపాటు ఆర్మీ, నేవీ బలగాలకు గగనతలం నుంచి రక్షణ కవచంగా ఉపయోగపడేవి. పలు యుద్ధాలు, ప్రత్యేక ఆపరేషన్లలో పాల్గొని వాటిని విజయవంతం చేయడంలో కీలకపాత్ర పోషించాయి. 1965, 1971లలో జరిగిన ఇండో`పాక్ యుద్ధాల్లో భారత్ అద్భుత విజయాలకు ఇవి చాలా దోహదం చేశాయి. 1971లో తూర్పు పాకిస్తాన్ విముక్తికి, బంగ్లాదేశ్ అవతరణకు కారణమైన ఇండో`పాక్ యుద్ధ సమయంలో పాక్ సైన్యంపై మిగ్`21లు విరుచుకుపడిన తీరు అనుపమానం. ఈ ఏడాది డిసెంబర్ 13న యుద్ధం కొనసాగుతుండగా.. అప్పటి తూర్పు పాకిస్తాన్‌లోని ఢాకాలో ఉన్న గవర్నర్ బంగ్లాపై మన మిగ్`21 బాంబులతో విరుచుకుపడిరది. ఆ దెబ్బతో భయపడిన గవర్నర్ తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత రోజే 93వేల మంది పాక్ సైనికులు భారత సైన్యానికి లొంగిపోయారు. 1999లో కార్గిల్ పోరాటంలోనూ ఇవి సత్తా చాటాయి. 2019లో బాలాకోట్ దాడుల అనంతరం పాక్ విమానాలు జమ్మూకశ్మీర్‌లో చొరబడితే.. వాటిని తరిమేందుకు తొలుత రంగంలోకి దిగింది కూడా మిగ్-21 ఫైటర్ జెట్‌లే. అప్పట్లోనే అత్యంత శక్తివంతమైన ఎఫ్`16 యుద్ధ విమానాన్ని నేలకూల్చడం ద్వారా మిగ్`21 విమానాలు ప్రపంచవ్యాప్తంగా వార్తాంశమయ్యాయి. నిన్నమొన్నటి ఆపరేషన్ సింధూర్‌లోనూ వీరవిహారం చేసిన చరిత్ర మిగ్‌లది.
ఎగిరే శవపేటికలన్న అపకీర్తి
ఘన చరిత్ర, అసమాన పోరాటపటిమను సొంతం చేసుకున్న మిగ్`21లు ఎగిరే శవపేటికలన్న అపకీర్తిని కూడా మూటగట్టుకున్నాయి. ప్రస్తుత తరం విమానాలు ఫ్లై బై వైర్ వ్యవస్థతో తమ వేగాన్ని నియంత్రిస్తుండగా.. మిగ్‌లు మాత్రం గేర్ సిస్టమ్‌తో పనిచేస్తాయి. ఫలితంగా స్వల్ప సమయంలోనే అనల్ప వేగం అందుకోగలవు. కానీ అదే వీటికి శాపంగా పరిణమించింది. అంత వేగాన్ని నియంత్రించలేకపోవడం వల్ల మిగ్‌లు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. ఆరు దశాబ్దాల చరిత్రలో 400 కంటే ఎక్కువ మిగ్‌లు కూలిపోగా.. చాలామంది పైలట్లు ప్రాణాలు కోల్పోయారు.
తర్వాత మిగ్‌లను ఏం చేస్తారు..?
సేవల నుంచి ఉపసంహరించిన తర్వాత మిగ్-21లను విద్యా సంస్థలు, వార్ మెమోరియల్స్, మిలిటరీ మ్యూజియాలకు ప్రదర్శనల కోసం విక్రయిస్తారు. వీటిని కొనుగోలు చేసేందుకు ఆయా సంస్థలు పోటీ పడుతున్నాయి. అయితే వీటిని యథాథంగా విక్రయించరు. విమానాల్లోని ఇంజిన్, రాడర్లు, ఏవియానిక్స్, ఆయుధాలు, ఇతర కీలక పరికరాలను తొలగించి, మిగిలిన ఎయిర్ ఫ్రేమ్‌లను మాత్రమే విక్రయిస్తారు. ఒక ఎయిర్‌ఫ్రేమ్‌ను ప్రైవేటు విద్యాసంస్థలకు రూ.30 లక్షలకు అమ్ముతారు. యుద్ధ స్మారకాలు, మిలిటరీ మ్యూజియాలు వంటి ప్రభుత్వ సంస్థలకు ఉచితంగానే ఇస్తారు. ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు కొనాలనుకుంటే వేరే ధర ఉంటుంది. ఎయిర్ ఫ్రేమ్‌ను కొనుగోలు చేసిన సంస్థలు కొన్ని నిబంధనలు కచ్చితంగా పాటించాలి. వాయుసేన సూచించిన రంగులు, షేడ్స్‌నే ఉపయోగించాలి. ఎయిర్ ఫ్రేమ్‌లు దెబ్బతినకుండా చూసుకోవాల్సి ఉంటుంది.










Comments