వనితలకు సేఫ్..మన విశాఖ!
- DV RAMANA
- 5 days ago
- 2 min read

సమాజంలో మహిళల భద్రత నానాటికీ తీసికట్టు అన్నట్లు క్షీణిస్తోందన్నది కఠిన వాస్తవం. నిత్యం పని ప్రదేశాలు, బహిరంగ స్థలాలు.. చివరికి సొంత ఇళ్లలో ఉన్న మహిళలపైనా అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. మహిళామూర్తుల రక్షణకు, వారు ధైర్యంగా సమాజంలో నడయాడగలిగే పరిస్థితి కల్పించేందుకు ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేస్తున్నా.. కామాంధుల అకృత్యాలకు అడ్డుకట్ట పడటంలేదు. గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ, నగర ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రముఖ నగరాలు, రాష్ట్రాల రాజధానుల్లో మహిళామణుల పరిస్థితి ఎలా ఉంది? ఏ నగరాన్ని వారు అత్యంత భద్రమైనదిగా ఫీలవుతున్నారు?. అన్న అంశంపై నిర్వహించిన సర్వేలో మన రాష్ట్రంలోని.. అందులోనూ ఉత్తరాంధ్ర ముఖద్వారమైన విశాఖపట్నం మహిళలకు దేశంలో అత్యంత భద్రమైన నగరంగా సగర్వంగా తలెత్తుకుని నిలవడం విశేషం. నారీ`2025 పేరుతో దేశవ్యాప్తంగా 31 నగరాల్లో 12,770 మంది మహిళలను సర్వే చేసి ఈ నివేదికను రూపొందించారు. నార్త్‌క్యాప్ యూనివర్సిటీ, జిందాల్ గ్లోబల్ లా స్కూల్ సంయుక్తంగా నిర్వహించిన ఈ సర్వే నివేదిక ప్రకారం.. జాతీయస్థాయిలో సగటున 65 శాతం మహిళా భద్రతా స్కోరు నమోదైంది. సర్వే చేసిన నగరాలను అత్యంత భద్రత, భద్రత, మధ్యస్థం, భద్రత లేమి, అత్యంత భద్రత లేమి అనే కేటగిరీలుగా విభజించి విశ్లేషించారు. ఈ విశ్లేషణలో విశాఖపట్నం, కోహిమా నగ రాల్లో లింగ సమానత్వం, పౌరభాగస్వామ్యం, పోలీసు సహాయం, మహిళలకు మౌలిక సదుపాయాల ప్రమాణాలు మెరుగ్గా ఉన్నాయి. అయితే కోల్‌కతా, పాట్నా, జైపూర్ వంటి నగరాల్లో పరిస్థితి దారు ణంగా ఉంది. అక్కడ కట్టుబాట్లు, పితృస్వామ్య నియమాలు డామినేట్ చేస్తుండటంతో పాటు మహిళ లకు కల్పించే మౌలిక సౌకర్యాల్లో లోపాలు ఉన్నట్లు ఈ సర్వే పేర్కొంది. విశాఖపట్నం, కోహిమా భువనేశ్వర్, ఐజ్వాల్, గాంగ్‌టక్, ఇటానగర్, ముంబైలు జాతీయ భద్రతా ర్యాంకుల్లో అగ్రస్థానంలో ఉన్నాయి. రాంచీ, శ్రీనగర్, కోల్‌కతా, ఢల్లీి, ఫరీదాబాద్, పాట్నా, జైపూర్‌లు తక్కువ స్కోర్ సాధిం చాయి. సర్వేలో పాల్గొన్న ప్రతి పదిమంది మహిళల్లో ఆరుగురు తమ నగరం సురక్షితమని భావిస్తు న్నారు. మిగతా 40 శాతం మంది తాము అంత సురక్షితంగా లేమని లేదా భయం భయంగా జీవిస్తున్నామని భావిస్తున్నారు. రాత్రి వేళల్లో ముఖ్యంగా ప్రజా రవాణా, వినోద ప్రదేశాల్లో భద్రత తీవ్రంగా క్షీణించినట్లు మహిళల అభిప్రాయాలను బట్టి తేలింది. విద్యాసంస్థలు 86 శాతం సురక్షితమని తేలినా.. రాత్రిపూట లేదా క్యాంపస్ వెలుపల మాత్రం అభద్రతాభావం వెంటాడుతు న్నట్లు చాలామంది అభిప్రాయపడ్డారు. ఇక పనిచేసే మహిళల్లో (వర్కింగ్ ఉమెన్స్)లో దాదాపు 91 శాతం మందికి తమ భద్రతపై అవగాహన ఉంది.. కానీ దాదాపు సగం మందికి తమ కార్యాల యాల్లో పోష్ (లైంగిక వేధింపుల నిరోధక వ్యవస్థ) అందుబాటులో ఉందో లేదో స్పష్టంగా తెలి యదు. చాలామంది మహిళలు తమ భద్రత విషయంలో అధికారులపైనే భారం వేసేస్తున్నట్లు సర్వే లో వెల్లడైంది. 69 శాతం మంది ప్రస్తుత భద్రతా వ్యవస్థలు, చట్టాలు కొంతవరకు సరిపోతాయని చెప్పగా.. 31 శాతం మంది గణనీయమైన లోపాలు లేదా వైఫల్యాలు ఉన్నట్లు పేర్కొనడం విశేషం. బహిరంగ ప్రదేశాల్లో వేధింపుల గురించి ప్రశ్నించినప్పుడు ఏడు శాతం మంది మహిళలు తాము వేధింపులకు గురైనట్లు చెప్పినట్లు 2024 నివేదికలో పేర్కొనగా.. ఇది ఇప్పుడు 24 ఏళ్లలోపు వారిలో రెట్టింపు.. అంటే 14 శాతానికి పెరిగింది. పరిసర ప్రాంతాలు (38 శాతం), ప్రజా రవాణా (29 శాతం) వనరులు మహిళల వేధింపులకు హాట్‌స్పాట్‌లుగా గుర్తింపు పొందాయి. అయితే ప్రతి ముగ్గురి లో ఒక బాధితురాలు మాత్రమే తాము ఎదుర్కొన్న వేధింపులను బయటపెట్టడానికి ముందుకొస్తున్నా రని ఈ సర్వే తేల్చింది. అయితే ప్రభుత్వ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాలు పూర్తి వాస్తవిక పరిస్థితిని ప్రతిబింబించలేవని నారీ`2025 నివేదిక నొక్కి చెప్పింది. జాతీయ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ విజయ రహత్కర్ ఈ నివేదికపై స్పందిస్తూ మహిళల భద్రతను కేవలం చట్టం, వ్యవస్థ సమస్యగానే చూడకూడదన్నారు. మహిళ జీవితంలో అనేక అంశాలను భద్రత ప్రభావితం చేస్తుందన్నారు. మహిళలు తాము భద్రంగా లేమని భావిస్తే తమను తాము పరిమితం చేసుకుంటారు. దీనివల్ల వారి సొంత ఎదుగుదలే కాకుండా దేశాభివృద్ధి కూడా మందగిస్తుందని సామాజికవేత్తలు చెబుతున్నారు.
Comments