top of page

వన్‌సైడ్‌ ప్రేమ.. సెల్‌టవర్‌ డ్రామా!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • Sep 1, 2025
  • 1 min read
  • తన ప్రేమను యువతి నిరాకరించిందని నిరాశ

  • ఆత్మహత్య చేసుకుంటానని యువకుడి సమాచారం

  • బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్‌ ఎక్కి హంగామా

  • ఎస్సై హరికృష్ణ చొరవతో దిగొచ్చిన ప్రేమికుడు

(సత్యంన్యూస్‌,శ్రీకాకుళం)

అమ్మాయి ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా.. తాను ప్రేమించిన యువతితో పెళ్లి చేయించాలని డిమాండ్‌ చేస్తూ ఓ యువకుడు నగరంలోని ఓ సెల్‌ టవర్‌ ఎక్కి డ్రామా సృష్టించాడు. చివరికి పోలీసులు రంగప్రవేశం చేసుకోవడంతో ఈ ప్రేమ డ్రామా ముగిసింది. వివరాల్లోకి వెళితే.. పొందూరు మండలం కింతలికి చెందిన విభూది శివకుమార్‌ ఎచ్చెర్ల మండలం ఇబ్రహీంబాద్‌కు చెందిన ఒక యువతిని ప్రేమిస్తున్నానంటూ ఐదేళ్లగా ఆమె వెంట పడుతున్నాడు. తనను పెళ్లి చేసుకోవాలని కోరుతున్నాడు. అయితే అతని ప్రేమను అంగీకరించని యువతి పెళ్లికి నిరాకరించినట్లు పోలీసువర్గాల సమాచారం. దాంతో శివకుమార్‌ ఇరుగ్రామల పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా పెట్టినట్లు తెలిసింది. అయినప్పటికీ యువతి, ఆమె కుటుంబ సభ్యులు తిరస్కరించారు. దాంతో నిరాశకు గురైన శివకుమార్‌ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగా సోమవారం ఉదయం శ్రీకాకుళానికి చేరుకుని బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రధాన కార్యాలయం ఆవరణలో ఉన్న సెల్‌ టవర్‌ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించాడు. దానికిముందే డయల్‌ 112కు ఫోన్‌ చేసి ప్రేమలో విఫలమైనందున ఆత్మహత్య చేసు కుంటానంటూ సమాచారం ఇచ్చాడు. ఆ సమాచారం అందుకున్న ఒకటో పట్టణ ఎస్సై హరకృష్ణ రంగంలోకి దిగారు. అప్పటికే శివకుమార్‌ ఎక్కినట్టు గుర్తించి సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. శివకుమార్‌ను మాటల్లో పెట్టి చాకచక్యంగా రెస్క్యూ చేసి కిందకు తీసుకువచ్చారు. అనంతరం అతన్ని రిమ్స్‌కు తరలించి ప్రాధమిక చికిత్స చేసిన అనంతరం కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించేశారు. కారణం ఏదైనా ఇటువంటి చర్యలకు ఎవరూ పూనుకోవద్దని, కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకొని వ్యవహారించాలని ఎస్సై హరికృష్ణ సూచించారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page