వర్షానికి నగరం పులుసై పోయింది..!
- NVS PRASAD

- Aug 26, 2025
- 2 min read
విలీన పంచాయతీల్లో పొంగిపొర్లుతున్న బందలు
అపార్ట్‌మెంట్ పార్కింగ్‌లలోకి చేరిన నీరు
మూడు నెలల ఉక్కపోతకు ఉపశమనం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
ఒడిశాకు దగ్గరలో అల్పపీడనం వల్ల ఉత్తరాంధ్రకు భారీ వర్షాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో సముద్రం, నదుల్లో చేపల వేట నాలుగు రోజులుగా ఆగిపోయింది. ఇటు నాగావళి, అటు వంశధార కూడా పెద్ద ఎత్తున ప్రవహిస్తుండటంతో వల వేసేవారు కరువైపోయారు. దీనికి తోడు సోమవారం నుంచి ఎడతెరిపి లేని వర్షాలు పడుతుండటం వల్ల చేపలబజారు కూడా కూడలేదు. బుధవారం వినాయకచవితి కాబట్టి ఈ వాతావరణంలో బేరం జరగదనేది వీరి భావన. కానీ నగరంలో మాత్రం అనేక విలీన పంచాయతీలతో పాటు లోతట్టు ప్రాంతాల్లో మంగళవారం ఎక్కువ మంది చేపల పులుసు వండుకున్నారు. నగరంలో అనేక చోట్ల బందలు ఉండటం, వాటికి ఆనుకొనే కాలనీలు ఉండటం వల్ల రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు బందలు నిండిపోయి రోడ్డు మీదకు నీరు ప్రవహిస్తోంది. నీటితో పాటే మట్టగిడసలు, గొరసలు వంటి చిన్న చిన్న చేపలు పెద్ద ఎత్తున బయటకు వస్తున్నాయి. వీటిని స్థానికులు పట్టుకోడానికి పోటీపడ్డారు. ఇది కేవలం సోమవారం నుంచి కురుస్తున్న వర్షానికి నగరంలో కనిపించే ఒక కోణం మాత్రమే.
ఎంతసేపూ ఆర్టీసీ కాంప్లెక్స్ నిండిపోయింది, కాలువలు పొంగిపొర్లుతున్నాయి అని చెప్పడం కంటే నగర నీటిలో కూడా చేపలున్నాయని చెప్పుకోవడం కొంచెం బెటరేమో?! కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి కాలువల్లో పూడిక తీయడం నిరంతర ప్రక్రియగా మారింది. దీనివల్ల బహుశా గతంలో ముంపునకు గురైన ప్రాంతాలు ఈసారి బయటపడివుండొచ్చు. ఇంతకు ముందు రోజుల తరబడి నీరు నిల్వ ఉండిపోయే బాకర్‌సాహెబ్‌పేట, గొంటివీధి వంటి రోడ్లు ఈసారి వర్షం తెరుపిచ్చిన వెంటనే క్లియరైపోయివుండొచ్చు. కానీ నగరాన్ని ఒక నమూనాగా తీసుకుంటే ఇప్పటికీ నీరు నిల్వ ఉండిపోయే ప్రాంతాలు పెరిగాయే తప్ప తగ్గలేదు. శ్రీకాకుళం నగరానికి ఆనుకొని ఉన్న విలీన పంచాయతీల్లోల రోడ్లయితే వేశారు కానీ, అనేకచోట్ల కాలువలు నిర్మించకపోవడం వల్ల ఇక్కడ వరదలాగ కనిపిస్తుంది. అన్నింటికీ మించి నగరంలో అనేకచోట్ల ఖాళీ స్థలాలు ఉండిపోయాయి. దీనికి దిక్కూదివానం లేదు. కనీసం వేకెంట్ ల్యాండ్ టాక్స్ వేసేందుకు మున్సిపాలిటీ వద్ద స్థల యజమాని పేరు కూడా లేదు. ఇవన్నీ వర్షాలకు నిండిపోయి రోడ్డు మీద ప్రవహిస్తున్నాయి. సోమవారం నుంచి పడుతున్న వర్షానికి శ్రీకాకుళం తడిసి ముద్దయిపోయింది. గతసారి కంటే ఈసారి వినాయక మండపాల సంఖ్య నగరంలో పెరిగింది. ఇవన్నీ వర్షానికి కరిగిపోకుండా ఉండటం కోసం పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కప్పుతున్నారు. ఇందుకోసం నగరంలో ఎక్కడెక్కడి ఫ్లెక్సీలు చింపుకొనిపోయారు. చివరకు అరసవల్లి సత్యసాయి మందిరం వద్ద ఊరూరు తిరిగి గెడ్డఉప్పు అమ్ముకునే ఓ నిరుపేద రెండు రోజుల క్రితమే లక్ష రూపాయలు అప్పు చేసి ఉప్పు కొని, అది వర్షానికి తడిసిపోకుండా ఫ్లెక్సీలు కప్పాడు. దీని అవసరం ఏ మండపంలో ఉన్న యువకులకు వచ్చిందో తెలియదు కానీ ఈ ఫ్లెక్సీలను రాత్రిపూట ఎత్తుకుపోయారు. దీంతో ఉప్పంతా కరిగి కాలువలో కలిసిపోయింది. ఆగస్టు వచ్చినా నగరంలో ఎండ తగ్గకపోవడం, గుబాయింపు పెరగడంతో పేదల ఊటీ ఇలా తయారైందేమిటి? అని బాధపడినవారికి ఈ వర్షాలు ఊరటనిచ్చాయి. కాకపోతే వినాయకచవితి మార్కెట్ మాత్రం సన్నగిల్లిందని కొందరు చెబుతున్నారు. వాస్తవానికి ప్రతీ ఏడాది కొన్ని స్వచ్ఛంద సంస్థలు చవితి ముందురోజు పెద్ద ఎత్తున మట్టి ప్రతిమలు పెద్ద ఎత్తున పంపిణీ చేసేవి. ఇప్పుడు వర్షం కారణంగా ఇవి తూతూ మంత్రంగా నిర్వహించారు. నగరంలో అనేక అపార్ట్‌మెంట్లలోకి మంగళవారం ఉదయానికే పార్కింగ్ ప్లేసుల్లోకి నీరు చేరిపోయింది. ఇక సెల్లార్లు ఉన్నవారి పరిస్థితేమిటో తెలియాలంటే.. వర్షం తగ్గిన తర్వాత మోటార్లు పెట్టి నీరు బయటకు తోడినప్పుడు తేలుతుంది. ప్రస్తుతానికైతే అదేదో వేసవి కాలం పౌడర్ అడ్వర్టైజ్‌మెంట్‌లాగా నగరం కూల్ కూల్, హాయ్ హాయ్‌గా ఉంది.










Comments