వరి సాగు తగ్గించడమే పరిష్కారమా!
- DV RAMANA

- Sep 25, 2025
- 2 min read

మన రాష్ట్రానికి రైస్‌బౌల్ ఆఫ్ ఇండియాగా పేరు. రాష్ట్రంలోని క్రిష్ణాగోదావరి బేసిన్‌లో విస్తారంగా వరి పండిస్తారు కనుక మన రాష్ట్రాన్ని ప్రత్యేకించి క్రిష్ణాగోదావరి ప్రాంతాలను రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా వర్ణిస్తుంటారు. ప్రస్తుత కాలంలో రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో వరి సాగు బాగా పెరిగింది. అయినా మన రాష్ట్రానికున్న పేరు మాత్రం చెక్కుచెదరడంలేదు. మన రాష్ట్రంలోనూ వరి విస్తీర్ణం, బియ్యం ఉత్పత్తి పెరుగుతూవస్తోంది. అయితే ఇదే చేటు చేస్తోందా? వరి పంట పెరగడం వల్ల అమ్మకం సమస్య ఉత్పన్నం అవుతోందా?? మన రైతులు పండిస్తున్న ధాన్యం తినడానికి, ఎగమతి చేయడానికి కూడా పనికిరాకుండా పోతోందా??? ఇవి ఎవరో సామాన్యులు చేసిన వ్యాఖ్యలు కావు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రసంగ సారం ఇదేనని మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీలో వ్యవసాయ రంగంపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రిమిసంహారక మందులు, రసాయనిక ఎరువులు మోతాదుకు మించి వినియోగించడం వల్ల ధాన్యం నాణ్యత కోల్పోయి అమ్మకానికి, తినడానికి పనిరాని విధంగా తయారవుతోందని, అటువంటి ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి వీల్లేకుండాపోతోందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం నెలకొన్న యూరియా కొరతను ప్రస్తావిస్తూ పంట విస్తీర్ణం పెరగడంతోపాటు యూరియా వంటి రసాయనిక ఎరువులను అవగాహన రహితంగా ఎక్కువ మోతాదులో వాడటం వల్ల అధిక దిగుబడులు రాకపోగా పంట నాణ్యత దెబ్బతింటుందన్నారు. ఈ ఉద్దేశంతోనే ఆయన రాష్ట్రంలో పండిరచే ధాన్యం నుంచి ఉత్పత్తి చేసే బియ్యం తినడానికి, ఎగమతికి పనికిరావడంలేదని, పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆల్కహాల్ తయారీకి మాత్రమే పరిమితం కావాల్సి వస్తుందని వ్యాఖ్యానించి ఉండవచ్చు. దీని ఉద్దేశం రైతులను పంటల మార్పిడి వైపు మళ్లించడమే కావచ్చు. కానీ అది వరి సాగుకు చంద్రబాబు వ్యతిరేకం అన్న రీతిలో ప్రజల్లోకి వెళుతోంది. ఏడాదికి రెండు పంటలు వేసి వరి సాగు విస్తీర్ణం పెంచుకుంటూ వెళితే దాన్ని అమ్మేదెలా? రైతులకు గిట్టుబాటు ధరలు అందించేదెలా?? ఆయన ప్రశ్నించడం కూడా విస్మయం కలిగిస్తోంది. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా అన్ని రంగాల ఉత్పత్తులు, సేవలను పెంచుకుంటూ పోవడం సర్వసాధారణం. అందులోనూ మన రాష్ట్రంతో సహా దేశంలో మెజారిటీ ప్రజలకు వరి అన్నమే ప్రధాన ఆహారం. ఇతర దేశాల్లోనూ బియ్యం వినియోగం గణనీయంగానే ఉంది. అందుకే మన రాష్ట్రం, దేశం నుంచి చాలా దేశాలకు బియ్యం ఎగుమతులు జరుగుతుంటాయి. అవసరాలు కూడా పెరుగుతున్నాయి. దానికి అనుగుణంగా వరి సాగు పెంచాల్సిన అవసరం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. కానీ దీనికి విరుద్ధంగా వరి సాగు పెరిగిపోవడం వల్లే యూరియా కొరత, అమ్మకం కాకపోవడం, గిట్టుబాటు ధర లభించకపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని చంద్రబాబు చెప్పడం నిర్హేతుకమన్న వాదనలు వినిపిస్తున్నాయి. పూర్తిగానే వరి పంటపైనే ఆధారపడకుండా పంటల మార్పిడి విధానం అనుసరిస్తూ ఒక పంట వరి వేస్తే.. రెండో పంటగా అపరాలు వంటివి సాగు చేయడం.. అలాగే వరి స్థానంలో ఉద్యానవన పంటల వైపు రైతులు మరలాలని చంద్రబాబు అసెంబ్లీ వేదికగా హితవు చెప్పారు. పంటల మార్పిడి విధానాన్ని ప్రోత్సహించడానికి వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్న కారణాలు వేరు. ఎల్లప్పుడూ ఒకే పంట సాగు చేసుకుంటూ, విస్తీర్ణం పెంచుకుంటూ పోతే భూమి సారం కోల్పోయి, తెగుళ్లు సోకి పంట దిగుబడులు తగ్గిపోతాయని, అందువల్లే పంటల మార్పిడి విధానం అనుసరించాలని శాస్త్రవేత్తలు సూచిస్తుంటారు. కానీ సీఎం చంద్రబాబు దీన్ని వాణిజ్య సూత్రంగా మార్చేశారు. వరిపంటను బాగా తగ్గించేసి ఉద్యానవన, ఇతర వాణిజ్య, అపరాల పంటలు సాగు చేయాలంటున్నారు. ఇదే జరిగితే ధాన్యం ఉత్పత్తి పడిపోతుంది. పెరుగుతున్న జనాభా అవసరాలకు సరిపోక అధిక ధరలకు దిగుమతి చేసుకోవాల్సి వస్తుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. యూరియా కొరత విస్తీర్ణం పెరగడమే కారణమంటున్న ముఖ్యమంత్రి.. సాగు విస్తీర్ణం తగ్గించడం దానికి పరిష్కారం కాదని గుర్తించాలి. ఈ సమస్యను ఎదుర్కోవడానికి యూరియా పంపిణీ వ్యవస్థను సంస్కరించాలి. అక్రమంగా తరలించి, అధిక ధరలకు అమ్ముకుంటున్న అక్రమార్కులను కఠినంగా శిక్షించాలి. అదే సమయంలో మార్కెటింగ్ వ్యవస్థ లోపాలను అరికడితే పండిన పంటను అమ్మించడం సమస్య కాబోదు.










Comments