వలసదారులపై ఎందుకీ వ్యతిరేకత?
- DV RAMANA

- Sep 20, 2025
- 2 min read

తమ దేశంలో విదేశీ వలసదారులు ఉండరాదని ఇంగ్లండ్ ప్రజ నినదిస్తోంది. అమెరికాలో అయితే ఏకంగా దేశాధ్యక్షుడే మైగ్రెంట్స్‌ను నేరుగా పొమ్మనకుండా వీసా ఫీజలు, ఉద్యోగాల్లో స్థానికులకే అవకాశాలు వంటి కఠిన నిర్ణయాలతో పొగ పెడుతున్నారు. ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, కెనడా తదితర దేశాల్లోనూ ఇటువంటి నిర్ణయాలు లేదా ప్రజా ఉద్యమాలు జరుగుతున్నాయి. వీటి ప్రభావం ప్రధానంగా ప్రవాస భారతీయులపైనే పడుతోంది. ప్రపంచీకరణ తర్వాత మొత్తం ప్రపంచమే కుగ్రామంగా మారిపోయిందని, దానివల్ల విదేశాల్లో అవకాశాలు పుష్కలంగా లభిస్తాయన్న ఆశ ఇప్పుడు తిరోగమనంలోకి వెళ్లిపోతోంది. 1980లో ఇంగ్లండ్, అమెరికా, ఆస్ట్రేలియా, స్పెయిన్, ఫ్రాన్స్ తదితర దేశాలకు భారత్‌తో పాటు ఆసియా దేశాల నుంచి వలసలు బాగా పెరిగాయి. 2008 తర్వాత అభివృద్ధి చెందిన దేశాలకు ఐటీ నిపుణుల వలసలు పెరిగాయి. ఇవి ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలకు వెన్నుదన్నుగా నిలిచాయి. కానీ ఇప్పుడు ఆ దేశాలే వలసలను అడ్డుకునేందుకు ఆంక్షలు, ఉద్యమాలు గేట్లు వేస్తున్నాయి. వర్కింగ్ వీసా ఫీజు భారీ పెంపుతోపాటు గ్రీన్‌కార్డు, జన్మతః పౌరసత్వ సౌకర్యం రద్దు, ఆమెరికన్ సంస్థల్లో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలన్న నిర్ణయాలతో అమెరికా ప్రవాసులకు పొగ పెడుతోంది. అమెరికా ఫస్ట్ అన్న నినాదం వినిపిస్తోంది. కాగా ఇంగ్లండ్‌లోని లండన్ వంటి నగరాల్లో వలసదారులకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. వార్సా, డబ్లిన్, బెర్లిన్ వంటి నగరాల్లోనూ ఇటువంటి ఉద్యమాలే జరుగుతున్నాయి. ఆస్ట్రేలియా, కెనడాలు సైతం ఇదే బాటలో పయనిస్తున్నాయి. వీటికి ప్రధాన కారణం స్థానిక సంస్కృతి, సంప్రదాయాలు దెబ్బతింటున్నాయన్నదే. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మేధో వలసలను అమెరికా ప్రోత్సహించగా పలు యూరప్ దేశాలు అనుసరించాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధావులు ఆయా దేశాలకు వలస వెళ్లారు. మరి ఇప్పుడెందుకు ఈ నిరసనలు అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దీనిపై భిన్న రకాల చర్చ జరుగుతోంది. ఆయా దేశాలవారు జాత్యాంహకరంతో వ్యవహరిస్తున్నారని కొందరు వాదిస్తున్నారు. వలసదారుల ప్రభావంతో తమ సంస్కృతీసంప్రదాయాలు, జీవన విధానాలు దెబ్బ తింటున్నాయని ఆయా దేశాలవారు ఆరోపిస్తున్నారు. అక్రమ వలసలను అరికట్టడం, వలసదారులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం తమ దేశాల ఆర్థిక వ్యవస్థలకు పెను భారంగా మారుతోందంటున్నారు. దాంతోపాటు స్థానికుల ఉద్యోగ అవకాశాలు, సౌకర్యాల కల్పనపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని అంటున్నారు. వాస్తవానికి ప్రపంచీకరణతో ప్రస్తుతం ఆందోళన చేస్తున్న దేశాలే ఎక్కువ ప్రయోజనం పొందాయి. ఆయా దేశాలకు మేధో వలసలు పెరగడం వల్ల ఆర్థికవృద్ధి, సాంకేతిక పరిజ్ఞానం, జీవన ప్రమాణాల పెరుగుదలలో పెను మార్పులు వచ్చాయి. అయితే భిన్న దేశాలు, భిన్న సంస్కృతులు, భిన్న ఆర్థిక, సామాజిక నేపథ్యాల నుంచి వెళ్లినవారు తమ సంప్రదాయాలనే కొనసాగిస్తూ వస్తున్నారు. ఇది అక్కడి స్థానికులకు, వలసదారులకు మధ్య పూరించలేని అంతరం ఏర్పడుతోందన్న వాదన ఉంది. ఈ పరిస్థితుల్లో నాలుగోదశ ప్రపంచీకరణ అన్ని దేశాలను ఆలోచింపజేస్తున్నది. విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో స్థానికుల వాటా తగ్గిపోతున్నదన్న వాదనతో పాటు శ్వేతజాతీయుల అహంకారపూరిత వైఖరి కూడా వలసదారులను దేశం నుంచి తరిమివేయాలన్న భావనను పెంచి పోషిస్తోంది. దీన్ని కప్పిపుచ్చుకునేందుకు తమ సంస్కృతి దెబ్బతింటోందని, వర్ణ సంకరం జరుగుతుందన్న వాదనలను అంతర్లీనంగా ప్రచారంలో పెడుతున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఆయా దేశాల రాజకీయ పార్టీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు తమ స్వార్థ ప్రయోజనాల కోసం తమ ప్రసంగాలు, పోస్టులతో ఈ తరహా ఆందోళనల తీవ్రతను మరింత పెంచుతున్నారని కొందరు భావిస్తున్నారు. దీనికి ఉదాహరణ లండన్‌లో జరిగిన భారీ ర్యాలీపై ప్రపంచ సంపన్నుడు ఎలన్‌మస్క్ వర్చువల్ (ఆన్‌లైన్‌లో)గా మాట్లాడిన అంశాలే. స్థానికులు తమ ఉనికి, అస్తిత్వాల కోసం పోరాడక తప్పదని పరోక్షంగా వ్యాఖ్యానించారు. గత మూడు దశాబ్దాలకు పైగా ప్రపంచ నూతన ఆర్థికాభివృద్ధి నమూనా అంతిమ ఫలితం ఏమిటన్న దానికి ఇది ఒక ఉదాహరణా లేక మూడో ప్రపంచ దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు తమదైన ఆర్థికాభివృద్ధి నమూనాను తయారు చేసుకొని ఆచరించాల్సిన అవసరం, అనివార్యతకు సంకేతమా? అన్నది ఆయా దేశాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది.










Comments