వలసలు కాదు.. నిరుద్యోగమే అసలు సమస్య
- DV RAMANA
- 4 days ago
- 2 min read

దేశ జనాభా స్వరూపం మారిపోతోందని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి అడ్డుకట్ట వేయడానికి ‘అధికార జనాభా మిషన్’ ఏర్పాటు చేస్తామని కూడా అప్పటికప్పుడే ప్రకటించారు. జనాభా స్వరూపం మారడం అంటే ఏమిటి? అన్న సందేహం కలగవచ్చు. సాధారణంగా జనసంఖ్య పెరగడమో.. తరగడమో.. జరుగుతుందే తప్ప స్వరూపం మారడం దాదాపు అసాధ్యం. కానీ సాక్షాత్తు ప్రధాని నోటి వెంట ఆ మాట రావడంతో ఆయన భావమేమిటని ఆలోచిస్తున్నంతలోనే.. మోదీయే దానికి అర్థం చెప్పేశారు. దేశంలో వలస దారుల అక్రమ చొరబాట్లు పెరిగిపోతున్నాయని.. ఇది దేశ జనాభా స్వరూపాన్ని మార్చేందుకు పక్కా ప్రణాళికతో జరుగుతున్న కుట్ర అని ప్రధాని అభివర్ణించారు. అక్రమ వలసదారులు మన యువత ఉపాధిని లాక్కుంటూ.. మన సోదరీమణులను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు. కానీ ప్రధాని పేర్కొన్న అంశాల్లో ఎంతవరకు వాస్తవం? దానికి ఆధారంగా ఏవైనా గణాంకాలు ఉన్నాయా?? జనాభా విషయంలో అసలు సిసలు సవాలు ఇదేనా? అంటే కచ్చితంగా ఇదేనని చెప్పలేని పరిస్థితి. ప్రభుత్వ వాదనలను నిర్ధారించాలంటే జాతీయ జనాభా లెక్కలే(సెన్సస్) ప్రామాణికం. కానీ దురదృష్ట వశాత్తు గత 14 ఏళ్లుగా దేశంలో జనాభా లెక్కల సేకరణే జరగలేదు. ఫలితంగా 2011 తర్వాత జనాభాలో చోటుచేసుకుంటున్న మార్పులపై సమగ్ర సమాచారం అందుబాటులో లేదు. అది లేకుండా జనాభా స్వరూపం మారిపోతోందని చెప్పడం ఊహాగానమే అవుతుంది. జనాభా లెక్కలు లేకపోయినా అందుబాటులో ఉన్న ఇతర గణాంకాలు భిన్నమైన చిత్రాన్ని చూపుతున్నాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం దేశంలో సంతానోత్పత్తి రేటు (టీఎఫ్‌ఆర్) రెండు శాతానికి పడిపోయింది. జనాభా స్థిర త్వానికి అవసరమైన 2.1 శాతం కంటే ఇది తక్కువ. ఈ తగ్గుదల అన్ని మత సమూహాల్లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ముస్లింల సంతానోత్పత్తి రేటు 1992లో 4.4 ఉండగా 2019 నాటికి 2.4 శాతానికి తగ్గింది. ప్రభుత్వం జనాభా పెరుగుదలను ముప్పుగా చిత్రిస్తుంటే ఆర్థికవేత్తలు దీన్ని ‘డెమో గ్రాఫిక్ డివిడెండ్’ అనే అద్భుతమైన అవకాశంగా చూస్తున్నారు. అంటే.. దేశ జనాభాలో పనిచేసే వయసు (15-64 ఏళ్లు) వారు ఎక్కువగా ఉండటమనే సువర్ణావకాశం ముంగిట భారతదేశం ముంగిట ఉంది. జనాభాలో సుమారు 68 శాతం మంది పనిచేసే వయసువారే. నిపుణుల అంచనా ప్రకారం ఈ ప్రయోజనాన్ని అందిపుచ్చుకోవడానికి మనకు 2041 వరకు మాత్రమే సమయం ఉంది. కానీ ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటున్నామా అంటే వాస్తవాలు నిరాశ కలిగిస్తున్నాయి. దేశ యువత తీవ్రమైన సమస్యలతో సతమతమవుతోంది. ఇదే అసలైన జనాభా సంక్షోభం. నిరుద్యోగుల (15-29 ఏళ్లు) సంఖ్య పది శాతం దాటింది. ఇందులో పట్టభద్రులే 29 శాతం మేరకు ఉన్నారు. ఇది నిరుద్యోగ సమస్యకు నిదర్శనం. ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతున్నా తగినన్ని ఉద్యోగాలు సృష్టించలేకపో తున్నాం. విద్యా వ్యవస్థకు, పరిశ్రమల అవసరాలకు మధ్య పెద్ద అగాథం ఏర్పడటమే ఈ పరిస్థితికి కారణం. ఫలితంగా మన పట్టభద్రుల్లో సగం మంది మాత్రమే ఉద్యోగాలకు అర్హులుగా ఉంటున్నారు. మరోవైపు దేశంలో మహిళల శ్రామిక భాగస్వామ్య రేటు (ఎఫ్‌ఎల్‌ఎఫ్‌పి) చాలా తక్కువగా 24-32 శాతం మధ్య ఉంది. అంటే మానవ వనరుల్లో సగం శక్తిని మనం వృధా చేసుకుంటున్నామన్నమాట. ఆందోళన కలిగించే మరో సమస్య ఏమిటంటే.. దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా వృద్ధాప్యం వైపు పయని స్తుంటే.. ఉత్తరాది రాష్ట్రాల్లో యువ జనాభా పెరిగిపోతోంది. వారికి విద్య, ఉపాధి కల్పించడం పెను సవాలుగా మారింది. ప్రభుత్వం చెబుతున్న ‘వలసల ముప్పు’ కథనానికి.. వాస్తవ గణాంకాలకు పొంతన లేదన్నది వీటి వల్ల తేటతెల్లమవుతుంది. అసలైన జనాభా సంక్షోభం మోదీ చెప్పినట్లు బయటి నుంచి రావడం లేదు. అది మన కళ్ల ముందే కనిపిస్తోంది. కోట్లాది మంది నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ అందించి, వారికి తగిన ఉద్యోగాలు కల్పించడంలో పాలకులు విఫలమవుతున్నారు. వీటన్నింటినీ ప్రభుత్వ విధానాల వైఫల్యాలుగానే పరిగణించాల్సి ఉంటుంది. వీటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించ డానికి ప్రధానమంత్రి వలసల ముప్పు వాదనను ప్రజానీకంలోకి వదిలినట్లు కనిపిస్తోంది. దేశ భవి ష్యత్తుకు అసలైన ముప్పు వలసదారులు కాదని.. మన యువతకు ఉద్యోగాలు కల్పించలేకపోవడమనే వాస్తవాన్ని ప్రభుత్వం ఎంత త్వరగా గుర్తించగలిగితే అంత మంచింది.
Comments