top of page

శిక్షణే వారికి శిక్షట!

  • Writer: Prasad Satyam
    Prasad Satyam
  • 3 days ago
  • 2 min read
  • వగలుపోతున్న వేగు చుక్కలు!

  • వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం

  • సౌకర్యాలు బాలేవంటూ జారిపోతున్న పిల్లలు

  • ఉచితంగా చదివిస్తామంటే సవాలక్ష సాకులు

  • అదే కార్పొరేట్ స్కూళ్లలో అయితే లక్షల ఫీజులు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

రైజింగ్ స్టార్స్.. మెరిసే నక్షత్రాలు.. మెరికలు.. మట్టిలో మాణిక్యాలు.. ఇలా ఏ పేరు పెట్టి సానబెట్టడానికి ప్రయత్నించినా.. చదువు మీద శ్రద్ధ లేనోడ్ని మాత్రం తీర్చిదిద్దలేమని మరోసారి నిరూపితమైంది. గుర్రాన్ని కొనగలం గానీ.. దానితో నీళ్లు తాగించడం మనవల్ల కాదనే సామెత బహుశా ఇలాంటి పరిస్థితుల నుంచే పుట్టుకొచ్చి ఉంటుంది. ప్రతి ఏడాది ప్రైమరీ, హైస్కూల్ లెవల్‌లో విద్యార్థుల అభ్యసనా స్థాయి గణనీయంగా పడిపోతున్నదని, ఎనిమిదో తరగతి విద్యార్థి రెండో తరగతి లెక్క కూడా చేయలేకపోతున్నాడని జాతీయ గణాంకాలు ఎప్పటికప్ప్పుడు మన కళ్లకు కట్టిస్తున్నాయి. మరోవైపు ఉద్యోగాలున్నా స్కిల్ (నైపుణ్యం) ఉన్నవారు లేకపోవడం వల్ల అవి భర్తీ కావడంలేదన్న విషయమూ తెలుసు. వీటన్నిటికీ మసిపూసి పదో తరగతిలో శతశాతం ఉత్తీర్ణత సాధించాలని ప్రతి జిల్లాపైన ఒత్తిడి ఉంది. అందుకు అనుగుణంగా చూసిరాతలను ప్రోత్సహించడం మొదలై చాలా ఏళ్లయింది. అయినా వెనుకబడిపోయిన విద్యార్థుల కోసం రైజింగ్ స్టార్స్ పేరిట ఒకచోట కూర్చోబెట్టి నెలరోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చి మార్చిలో జరిగే పబ్లిక్ పరీక్షలకు పంపాలనే నిశ్చయంతో ప్రభుత్వం ఉంటే.. ఇంటికి దగ్గరలో స్కూల్ ఉన్నప్ప్పుడే రెగ్యులర్‌గా వెళ్లని విద్యార్థులు, నాలుగు రుచులతో అమ్మ అన్నం పెడితేనే బాగులేదని పెదవి విరిచే తరం ఇప్ప్పుడు నాలుగు గోడల మధ్య కూర్చోబెట్టి గేట్లు మూసేసి ఉదయం 5 నుంచి రాత్రి 7 గంటల వరకు పాఠాలు చెబుతాం వినండి అంటే.. వింటారా? అసలు ఆ కాంపౌండ్‌లో ఉంటారా? ఇటువంటి వాటికి సజీవ సాక్ష్యమే శ్రీకాకుళం డివిజన్‌లో జరుగుతున్న రైజింగ్ స్టార్స్ శిక్షణ కార్యక్రమం.

అసౌకర్యాల సాకు

శ్రీకాకుళం డివిజన్‌లోని గార, ఎచ్చెర్ల, పొందూరు, లావేరు, పోలాకి, రణస్థలం, సరుబుజ్జిలి, జి.సిగడాం మండలాల పరిధిలో ఉన్న 27 ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో 300 మంది చదువులో పూర్తిగా వెనుకబడి ఉన్నారని గుర్తించిన ఉపాధ్యాయులు వారికి రైజింగ్ స్టార్స్ పేరుతో ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. తల్లిదండ్రులను పిలిపించి శిక్షణకు తమ పిల్లలను పంపిస్తామంటూ విల్లింగ్ లెటర్లు ఇవ్వాలని కోరారు. అయితే 203 మంది మాత్రమే తమ పిల్లలను ప్రత్యేక శిక్షణకు పంపడానికి అంగీకరించారు. తీరా ఈ నెల 9న గార బీసీ సంక్షేమ వసతిగహంలో క్లాస్‌లు ప్రారంభమయ్యే సమయానికి 178 మంది మాత్రమే వచ్చారు. రెండో రోజు ఈ సంఖ్య 122కు పడిపోయింది. శనివారం నాటికి 65 మందే కోచింగ్‌లో కూర్చున్నారు. ఇంతమంది ఎందుకు డ్రాపౌట్స్ అయ్యారంటే.. భోజనాలు బాగులేవని, వసతి సౌకర్యాలు సంతప్తిగా లేవని తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడంతో ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇదే కార్పొరేట్ స్కూళ్లలో అయితే ఏది పెడితే అది తిని, ఎక్కడ పడితే అక్కడ పడుకొని లక్షలకు లక్షలు ఫీజులు కట్టి మరీ చదివించే తల్లిదండ్రులు.. అక్కడ వాష్‌రూమ్‌లు సరిగ్గా ఉండవని తెలిసి నా కూడా తమ పిల్లలను హాస్టళ్లలో ఉంచి చదివించడానికే మక్కువ చూపిస్తుంటారు. కానీ ప్రభుత్వం 122 మందిని ఒక హాస్టల్‌లో ఉంచితే మాత్రం సౌకర్యాలు లేవని సాకు చూపిస్తున్నారు.

అమ్మాయిలదీ అదే తీరు

ఇది వాస్తవమే కావచ్చు. ఎందుకంటే.. ఇప్పటికే హాస్టల్‌లో స్కూల్ పిల్లలు ఉంటారు. అక్కడ వీరిని అదనంగా చేర్చడం వల్ల ఇబ్బందులు తలెత్తివుండొచ్చు. కానీ డి`గ్రేడ్‌లో ఉన్న విద్యార్థులు నాలుగు ముక్కలు నేర్చుకోవడానికి నెల రోజులు ఓపికగా ఉండలేకపోవడం ఈతరం యాటిట్యూడ్‌ను మనకు పట్టి ఇస్తుంది. అయితే అబ్బాయిలే ఇలా ఉన్నారేమో అనుకుంటే పొరపాటే. ఇదే డివిజన్‌లో బాలికల కోసం కేజీబీవీలను కేటాయించారు. ఇక్కడంతా బాలికల ప్రపంచమే కాబట్టి అక్కడే చదువుకొని అదే హాస్టల్‌లో ఉండే అవకాశం ఉంది. ఇందులో శ్రీకాకుళం కేజీబీవీకి 31 మందిని కేటాయిస్తే ఇప్ప్పుడు 8 మందే ఉన్నారు. పొన్నాడకు 14 మందిని ఇస్తే ఒక్కరు ఉండగా గార కేజీబీవీకైతే ఒక్కరూ రాలేదు. రణస్థలానికి ఆరుగురు అమ్మాయిలను పంపితే ఇద్దరే మిగిలారు. లావేరుకు 16 మందిని పంపగా ఇద్దరే ఇప్ప్పుడు చదువుతున్నారు. వీరి నుంచి కూడా అదే కంప్లైంట్. సాధారణంగా రైజింగ్ స్టార్ విద్యార్థులు ఏ హాస్టల్‌లో ఉండి ఈ నెల రోజుల పాటు చదువుకుంటారో.. అదే హాస్టల్‌లో ఇప్పటి వరకు అమలుచేస్తున్న రోజువారీ మెనూ ప్రకారమే వీరికి భోజనాలు పెడతారు. అయితే ఇన్నాళ్లూ ఇంటి వంట తినడానికి అలవాటు పడిపోయిన వీరు ఇప్ప్పుడు హాస్టల్ ఫుడ్ అనగానే ఏమాత్రం సహించుకోవడంలేదు. ఇక గార హాస్టల్‌లో అయితే ఇంతమంది పిల్లలు ఒకేసారి చేరడం వల్ల వాష్‌రూమ్‌లు, కుళాయిలు ఛిద్రమైపోయాయి. దీంతో ఎక్కువ మంది బయటకు వెళ్లిపోవాల్సి వచ్చిందని తెలిసింది. ఇక బోధన విషయానికి వస్తే.. క్లస్టర్లలో ఉన్న ఉపాధ్యాయులు, పాఠశాలలో సర్‌ప్లస్‌గా ఉన్న సబ్జెక్ట్ టీచర్లు వీరికి బోధిస్తున్నారు. గతంలో రైజింగ్ స్టార్స్ పేరుతో సి, డి గ్రేడ్ విద్యార్థులను కార్పొరేట్ స్కూళ్లకు పంపేవారు. ఇందుకోసం ప్రభుత్వం ఒక్కో జిల్లాకు లక్షý రూపాయలు ఖర్చు చేసేది. ప్రస్తుత పరిస్థితి ప్రకారం చూసుకుంటే ఈ కార్పొరేట్ కాలేజీల్లో కూడా అప్పట్లో మన పిల్లలు ఉన్నారంటే నమ్మశక్యం కావడంలేదు. ఇప్ప్పుడు కూడా ఎంతమంది పిల్లలున్నారనే విషయాన్ని పక్కన పెట్టి సంబంధిత హాస్టల్ వార్డెన్లు ఎంతమందికి బిల్లులు పెట్టుకుంటారో చూడాలి.

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page