శేఖర్ కమ్ముల.. చాలా వాటికి నచ్చుతాడు!!
- Guest Writer
- Jun 20
- 2 min read

ఇది కుబేర సినిమా ప్రమోషన్..వాక్యం కాదు.
చాలా వాటికి నచ్చుతాడితడు.
తొలి సినిమా’ ఈ దేశపు రాజకీయాల మీద. చూశాక, ఇతను కచ్చితంగా త్వరలో ఫేడ్ అవుట్ అవుతాడని అనుకున్నాను. కొనడం,అమ్మడం మాత్రమే తెలిసిన భారత రాజకీయాల మీద తీసిన ఆ సినిమా ఏ మాత్రం మారడానికి వీలు కానీ, లేని ఇండియన్ రాజకీయాల గురించి కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. అయితే అంత సీరియస్ ట్రాక్ లో కూడా దర్శకుడు లవ్ ట్రాక్ దగ్గర దొరికిపోతాడు.
అతని సినిమాల్లో మ్యూజిక్ సినిమాలోని క్యారెక్టర్ ఆత్మను పట్టుకుంటుంది. ఎక్కడ వెలగాలో అక్కడ ఖచ్చితంగా అది వెలుగుతుంది. అక్కడ మొదలైంది. అతని సినిమాని పరిశీలనగా చూస్తూ ప్రేమించడం. ఇక బ్యానర్ మీద డైరెక్టర్ శేఖర్ కమ్ముల పేరు చూసి సినిమా చూడడం కొంచెం అలవాటు.
‘ ఆనంద్’ చాలాసార్లు చూసినప్పుడల్లా ఎందుకు ఇష్టం ఉంటుందో కానీ, చిరాకుగా ఉన్నప్పుడు ‘ సింక్ దగ్గర మాటిమాటికి నీళ్ల పంపు కు అడ్డం పడుతున్న జుట్టును అదాటును కత్తిరించే హీరోయిన్ని చూడగలిగిన వాడు ఎందుకు నచ్చడు.?
అయితే, పేద పిల్లల కోసం దిగివచ్చే’ కుబేరులు’ అనే ఇతని ఆదర్శం మీద నాకు కొంచెం కినుక ఉండేది, ఉంటుంది కూడా. ఇక ‘లవ్ స్టోరీ’ దగ్గర ఎంత నచ్చేసాడో చెప్పలేను. ‘ ఎక్కడపడితే అక్కడ, గుండెల్లోకి కలుక్కుమని గుచ్చుకునే కులం పీడన’ అందరికీ అర్థం కాదు. ముఖ్యంగా ఫ్యూడల్ కులం నుండి, సాఫ్ట్వేర్ ఉద్యోగం ద్వారా అమెరికాలో తిరిగి, ఇండియాకి వచ్చే వాళ్లకు. కానీ ఇతను దానిని దాటేశాడు. అర్ధం ఐనోళ్ళకి దాటడం ఎంత అవసరమో తెలుస్తుంది. గీతలు చెరిపివేయగలగటం ఒక పెద్ద సాహసమే. ఆ సాహసాన్ని చాలా చోట్ల చేశాడు ఇతను.
‘ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ అని చెప్పే ఇతను, మిడిల్ క్లాస్ కి అప్పర్ క్లాస్ కి మధ్య గీతలు చెరిపేయాలని, ఆడే క్రికెట్ ద్వారా చెప్పడమే కాదు’ ఎగురుతున్న విమానంలో, ప్రమాదాలను చెరిపేసే ప్రేమను కూడా చెప్పినప్పుడు’ ఇతను ఈ నేల కోల్పోయిన అమ్మ ప్రేమ ఏదో మళ్లీ మళ్లీ చెప్పాలనుకుంటున్నాడని భలే ఇష్టం వేసింది. అన్ని అంతే.
గోదావరి నుంచి లవ్ స్టోరీ దాకా. అతని సినిమాలు ఫ్రెష్ గా ఉంటాయి. మనకు బాగా తెలిసిన క్యారెక్టర్స్ లోని కొత్తగా తెలిసే అద్భుతమైన మనస్తత్వం లాగా. ప్రేమ తెలియడం గొప్ప కాదు. ప్రేమించడం ఎలాగో తెలియజేయడం గొప్ప. సమాజంని అస్తవ్యస్తం చేస్తున్న ‘ గీతలు’ ఏవో తెలియడం గొప్పకాదు. ఆ గీతల్ని చెరిపి వేయడం ఎట్లాగో తెలియడం గొప్ప. మన జీవిస్తున్న సమాజంలో’ తప్పులు’ ఏవో తెలియడం గొప్పకాదు. ఆ తప్పుల్ని సరిదిద్దుకోవడం ఎలాగో తెలియజేయడం గొప్ప. వంశాలు,డిఎన్‌ఏలు జబ్బ చరుచుకునే చోటే దొంగలు, మాఫియాలు అడ్డగోలుగా బాక్స్ ఆఫీస్ లో డబ్బును దోచుకునే చోటే వికసితభారతం 75 ఏళ్ల తర్వాత కూడా ప్రజాస్వామ్యం అంచులు కూడా తాకడానికి సాహసించనప్పుడు, సిగ్గులేకుండా రాజరికాన్ని బాహాటంగా ప్రచారం చేస్తున్నప్పుడు ఇతను ఒకడు మనిషిలోని సున్నితమైన స్పందన కోసం అతనిలో రావాల్సిన మార్పు కోసం అతనిని వెలిగించే ప్రేమ కోసం మానవ సంబంధాలు విచ్ఛిన్నం చేస్తున్న సంపదదాహం నిర్మూలన కోసం మన ఎదురుగా ఒక పసి పిల్లవాడు పొద్దుపొద్దున్నే మంచులో తడిసిన ఒక పువ్వు ఇచ్చినట్టుగా మనతో మాట్లాడుతాడు చూడూ’ ఇది నచ్చుతుంది.
పల్లెటూర్లు ఊరి చివరి చెరువు ఏమాత్రం భేషజాలు పోకుండా అందర్నీ కలిపే నది. పువ్వులకు నీళ్లు పోసే అమ్మాయి అంతఃపురాలు దాటి అటువంటి అమ్మాయి కోసం కఠినమైన ఎండలో నిలబడే అబ్బాయి అనేకరకాల అహంకారాలను కడిగేసే వాన రకరకాల గీతలు చెరిపే మనుషులు అందరినీ బతికించే ప్రేమ మనుషుల మధ్య ప్రేమలు పంచే దేవుడు జీవితాన్ని పరిపుష్టం చేసే స్వేచ్ఛ కోసం తపించే అమ్మాయిలు ఇట్లా ఒక్కరేమిటి, అతను ‘ సినిమా ద్వారా ఈ ప్రపంచానికి ఏదైనా ఒక మంచి చెప్పాలనుకుంటున్న రుషిలాగా అనిపిస్తాడు.
నిజం చెబుతున్నాను ఇదంతా శేఖర్ కమ్ముల గురించే. కుబేర సినిమా గురించి అసలు కాదు. కానీ రోడ్డుమీద బండిని డ్రైవ్ చేస్తూ వెళ్తున్నప్పుడు ఎందుకు’ కుబేర’ సినిమా పోస్టర్ నా చూపుని లాక్కెడుతుందో తెలియదు. ముఖ్యంగా దుమ్ము కొట్టుకున్న, మురికి చొక్కాతో మంచి క్లాసికల్ పోస్టర్స్ మీద దిగాలుగా నించున్న’ ధనుష్’ బొమ్మ.
ఎందుకురా ఇప్పటికే పేరుకుపోయిన అబద్దాలతో మరింత నాశనం చేస్తారు మనసుల్ని. కాస్త అతని చూసి కొంచెం నేర్చుకోవడానికి ప్రయత్నించండి. డబ్బు ,కులం, ఆదిపత్యం నీతో ఏదీ ఊరికి ఉత్తరాన బూడిదయ్యేటప్పుడు తోడు రాదు. కుబేర’ థియేటర్లోనే చూస్తాను.
- డాక్టర్ నూకతోటి రవికుమార్
Comments