top of page

శృతి తప్పుతున్న ‘రుతు’రాగం!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Sep 20, 2025
  • 3 min read
  • హిమాలయాలను బ్రేక్‌ చేసి టిబెట్‌కు పోయిన నైరుతి

  • దాంతో ఈశాన్య రుతుపవనాలకు లేదు గ్యారెంటీ

  • ఇలాంటి పరిణామం చరిత్రలో ఇదే మొదటిసారి

  • ఇదే కొనసాగితే దుర్భిక్షం బారిన పడే ప్రమాదం

  • తాజా మార్పులపై ఆందోళన వ్యక్తం చేస్తున్న శాస్త్రవేత్తలు

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)

కాలుష్యం ఇప్పటికే వాతావరణాన్ని కాటేస్తోంది. వర్షాకాలంలో ఎండలు, శీతాకాలంలో వర్షాలు, వేసవిలో అతి తీవ్రమైన ఎండలు ఇప్పటికే ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. సీజన్లు మారిపోతుండటం వ్యవసాయాన్ని దారుణంగా దెబ్బతీస్తోంది. అదనులో వర్షాలు లేకపోగా పంట చేతికొచ్చే సమయంలో కుంభవృష్టి వర్షాలు లేదా తుపాన్లు మొత్తం రైతు కష్టాన్ని తుడిచిపెట్టేస్తున్నాయి. ఈ కష్టాలు చాలవన్నట్లు మరో విపత్తు ముంచుకొస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. వాతావరణ నిపుణులే తాజా పరిణామంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నైరుతి రుతుపవనాలు దారి తప్పుతున్నాయన్నదే సరికొత్త ఆందోళన. ఇది ఈ ఒక్క ఏడాదికే పరిమితమవుతుందా? ముందు ముందు అదే కొనసాగుతుందా?? అన్నది తేల్చలేకపోతున్నారు. ఈ ఒక్క ఏడాదికే పరిమితమైతే ఫర్వాలేదు. కాని తప్పిన దారినే రాజమార్గంగా మార్చుకుంటే మాత్రం దాదాపు దేశమంతా తీవ్ర దుర్భిక్షం బారిన పడుతుంది. ‘అన్నమో.. రామచంద్రా’ అని అలమటించాల్సిన దుస్థితి దాపురిస్తుందంటున్నారు.

రుతుపవనాలే ఆయువుపట్టు

మన దేశానికి రుతుపవనాలే ఆయువు పట్టు. వర్షాకాలం ప్రారంభంలో అండమాన్‌ వైపు నుంచి దేశంలోకి ప్రవేశించే నైరుతి రుతుపవనాలే మన పంటలకు ప్రధాన నీటి వనరులు సమకూరుస్తాయి. తర్వాత ఈశాన్య రుతుపవనాలు పంటల సీజను చివరి దశలో ఆదుకుంటాయి. మే చివరి వారం లేదా జూన్‌ మొదటి వారంలో అండమాన్‌ ప్రాంతంలో చురుకందుకునే నైరుతి రుతుపవనాలు అక్కడి నుంచి కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ మీదుగా ప్రయాణిస్తూ సెప్టెంబర్‌ నాటికి హిమాలయ ప్రాంతానికి చేరుకుంటాయి. అక్కడితో నైరుతి రుతుపవనాల ఉపసంహరణ పూర్తి అయినట్లే. హిమాలయ సానువులు అడ్డుకోవడం వల్ల అక్కడి నుంచి ఆ రుతుపవనాలు ముందుకు వెళ్లలేక వెనుదిరుగుతాయి. అయితే తిరుగు ప్రయాణంలో అవి ఈశాన్య రుతుపవనాలుగా మారి అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో బంగాళాఖాతంలో వాయుగుండాలు, తుపాన్లు పుట్టిస్తాయి. ఈ నైరుతి, ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో కురిసే వర్షాలతోనే దేశంలో అన్ని ప్రధాన రిజర్వాయర్లు, ఇతర నీటి వనరులు నీటి కళ సంతరించుకుంటాయి. ఖరీఫ్‌ పంటలకు పుష్కలంగా సాగునీరు అందుతుంది. చెరువులు, కుంటలు, ఇతర చిన్న చిన్న నీటివనరుల కింద కూడా పంటలు పండిస్తుంటారు. వందలాది పట్టణాలు, గ్రామాల తాగునీటి అవసరాలను కూడా నైరుతి, ఈశాన్య రుతుపవనాలే తీరుస్తుంటాయి. కానీ కొన్నేళ్లుగా సంభవిస్తున్న వాతావరణ మార్పులు వర్షాల కోసం ఎదురుచూడాల్సిన దుస్థితికి కారణమవుతున్నాయి.

మరో కొత్త విపత్తు

వాతావరణ మార్పులతో వర్షాలు గతి తప్పడమే ఆందోళన కలిగిస్తుంటే.. ఈ ఏడాది రుతుపవనాల గమనంలో ఒక అసాధారణ మార్పును నిపుణులు గమనించారు. ఎప్పటిలాగే ఈసారి కూడా హిమాలయాల వరకు వెళ్లిన నైరుతి రుతుపవనాలు అక్కడి నుంచి వెనుదిరగకుండా నేపాల్‌, భూటాన్‌ దాటి టిబెట్‌ వరకు వెళ్లిపోయాయి. ప్రకృతి సహజంగా వీటిని అడ్డుకుని వెనక్కి పంపాల్సిన అతి ఎత్తయిన హిమాలయాలు ఎందుకు చేతులెత్తేశాయన్న ప్రశ్నలు వాతావరణ నిపుణులనే తికమకపెడుతున్నాయి. వాతావరణం మరో పెనుమార్పుకు గురవుతున్నదా? అన్న అనుమానాలు భయపెడుతున్నాయి. అదే జరిగితే నైరుతి చేజారిపోతుందని అంటున్నారు. యథాప్రకారం ఈనెల తొలివారంలోనే హిమాలయాలను చేరుకున్న నైరుతి.. అక్కడి నుంచి వెనక్కి మళ్లకుండా టిబెట్‌ పీఠభూమికి చేరుకున్నట్లు శాటిలైట్‌ చిత్రాల ఆధారంగా శాస్త్రవేత్తలు నిర్ధారించారు. పీఠభూమి అయిన టిబెట్‌లో వాతావరణం సాధారణంగా పొడిగా ఉంటుంది. శీతాకాలంలో మాత్రం పశ్చిమ గాలుల ప్రభావంతో హిమపాతం కురుస్తుంది. దానికి భిన్నంగా ఈ నెలలోనే టిబెట్‌లో వర్షపాతం నమోదు కావడం వాతావరణ మార్పులకు పెద్ద సంకేతంగా భావిస్తున్నారు. ఎండల వేడికి సముద్ర జలాలు ఆవిరై బంగాళాఖాతం, అరేబియా సముద్రం నుంచి వచ్చే తేమగాలుల ప్రభావంతో నైరుతి రుతుపవనాల రూపంలో దేశమంతా విస్తరించి మన ఆర్థిక వ్యవస్థకు, వ్యవసాయ రంగానికి జీవమిస్తాయి. అంత కీలకమైన నైరుతి టిబెట్‌ వెళ్లడం వల్ల వాతావరణ లెక్కలన్నీ తారుమారవుతాయని అంటున్నారు. ఈ పరిణామం జరగడం చరిత్రలో చాలా అరుదైనది, మొదటిదని సైంటిస్టులు చెబుతున్నారు.

ఎందుకిలా జరిగింది?

వాతావరణ మార్పులు, భూతాపమే దీనికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. కర్బన ఉద్గారాలతో భూమి, సముద్రాలు వేడెక్కడం, హిమాలయాల్లో మంచు కరగడం వంటివి కొత్త సమస్యలు సృష్టిస్తున్నాయి. కాగా వేగంగా వీచే గాలులు నైరుతి రుతుపవన తేమను అత్యంత ఎత్తుకు తీసుకెళ్లి హిమాలయాలను దాటించేశాయంటున్నారు. వీటికి తోడు లానినా ఎఫెక్ట్‌తో హిమాలయ ప్రాంతాల్లో వర్షపాతం పెరిగింది. ఒక అద్యయనం ప్రకారం గత పదేళ్లలో తొలిసారి వంద మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందంటున్నారు. అలాగే ఈ ఏడాది ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, జమ్మూ కాశ్మీర్‌లలో 108 నుంచి 114 శాతం అధిక వర్షపాతం నమోదైంది. మన దేశంలో 80 వర్షపాతం వర్షం నైరుతి రుతుపవనాల సీజనులోనే కురుస్తుంది. కానీ ఆ వర్షపాతాన్ని టిబెట్‌కు తీసుకెళ్లిపోతే మన వర్షపాతం తగ్గడంతోపాటు పొడిగా ఉండే టిబెట్‌ ఏరియాలో అధిక వర్షపాతం కారణంగా పర్యావరణం మారుతుంది. పశ్చిమ గాలులు, నైరుతి రుతుపవనాల మధ్య సంఘర్షణ కారణంగా క్లౌడ్‌ బరస్ట్‌లు, రుతుపవనాలు మితిమీరిన వేగంతో వెళ్లిపోవడం వంటివి జరుగుతున్నాయి. గత కొన్ని శతాబ్దాలుగా నైరుతి రుతుపవనాలను అడ్డుకున్న హిమాలయాలు ఇప్పుడు చేతులెత్తేయడం దక్షిణాసియా వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు. ఏదో ఒక సీజనులో రుతుపవనాలు ముఖం చాటేస్తేనే.. ముందు ముందు మంచి వానలు పడకపోతాయా అని ఆశగా ఎదురుచూస్తారు రైతులు. కానీ నైరుతి ఒక్కసారి హిమాలయాలు దాటి టిబెట్‌ దాకా వెళితే ఇక వెనక్కు తిరిగి రావు. ఎందుకంటే హిమాలయాల కంటే పెద్ద అడ్డుగోడలు లేవు. అదే జరిగితే ఈశాన్య రుతుపవనాలు అనేవే ఉండవు. ఒకవేళ కొంత భాగం తిరిగొచ్చినా తేమలేని, బలహీన పవనాలతో కురిసే వర్షాలు, కలిగే ప్రయోజనం అంతంతే.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page