top of page

శాలిహుండం చోరీ కేసు ఛేదించిన పోలీసులు

  • Writer: ADMIN
    ADMIN
  • Feb 17, 2025
  • 1 min read
  • గ్రామానికి చెందిన జోగిరాజు అరెస్టు

  • పదిహేడున్నర తులాల బంగారం స్వాధీనం

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

గార పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శాలిహుండంలో జనవరి 22న ఉరజాన రమణమ్మ ఇంట్లో పగటిపూట జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. చోరీకి పాల్పడిన గ్రామంలోని ఆదిఆంధ్రా వీధికి చెందిన జోగి రాజును అదుపులోకి తీసుకున్నట్టు శ్రీకాకుళం డీఎస్పీ సిహెచ్‌ వివేకానంద తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మీడియా ముందుకు నిందితుడ్ని తీసుకువచ్చి వివరాలను వెల్లడిరచారు. ఉరజాన రమణమ్మ ఇంటి బీరువాలో దాచిన పదిహేడున్నర తులాల బంగారం దోచుకెళ్లిన కేసులో జోగిరాజును అదుపులోకి తీసుకొని మొత్తం ప్రాపర్టీని రికవరీ చేసినట్లు తెలిపారు. రమణమ్మ భర్త ఆదినారాయణ సింగుపురం జంక్షన్‌ వద్ద పండ్ల వ్యాపారం చేస్తుంటాడని, ఇద్దరూ రోజు మాదిరిగా ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. దుకాణం నుంచి రాత్రి 8.30 గంటలకు వచ్చి తాళం తీసి చూడగా ఇంటి వెనుక భాగంలో తలుపులు తీసి ఉన్నట్టు గుర్తించారు. రమణమ్మ వేసుకున్న బంగారం గాజులు, గొలుసు బీరువాలో భద్రపరిచేందుకు బీరువా తాళాలు వెతకారు. బీరువా తాళం దొరక్కపోవడంతో సమీపంలో ఉన్న షరాబుతో బీరువాను తెరిపించారు. బీరువాలో దాచిన వారి ఇద్దరి కుమార్తెలకు చెందిన పద్నాలుగు తులాల బంగారు ఆభరణాలు కనిపించలేదు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆతర్వాత మరో మూడు తులాల బంగారం ఆభరణాలు పోయినట్టు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు రమణమ్మ ఇంటి పక్కనే నివాసముంటున్న ఆటోడైవర్‌ జోగిరాజును అనుమానించి అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. రెండు సార్లు దొంగతనం చేయడానికి ప్రయత్నించిన రాజు వ్యాపార నిమిత్తం ఇద్దరూ సింగుపురం జంక్షన్‌కు వెళ్లిపోయారని నిర్ధారించుకొని ఇంటికి వెనుక తలుపు తాళాలు వేయలేదని గ్రహించి చోరీకి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. రమణమ్మ ఇంట్లో దొంగతనం జరిగిందని స్థానికులందరూ అక్కడ చేరారని, అందులో నిందితుడు రాజు ఉన్నాడని, రమణమ్మ భర్త ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులకు దొరికిపోతానని భయంతో బంగారాన్ని ఇంట్లో మేడపై హోంథియేటర్‌లో దాచిపెట్టినట్టు తెలిపారు. సాంకేతిక ఆధారాలు లేనప్పటికీ చాకచక్యంగా కేసును పోలీసులు ఛేదించారని డీఎస్పీ తెలిపారు. డీఎస్పీ వివేకానంద పర్యవేక్షణలో నిందితుడిని అదుపులోకి తీసుకోవడంలోను, చోరీ అయిన బంగారు ఆభరణాలు స్వాధీనపర్చుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ పైడిపు నాయుడు, సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌, శ్రీకాకుళం సర్కిల్‌, గార ఎస్సై జనార్ధన్‌, వన్‌ టౌన్‌ ఎస్‌ఐ ఎం.హరికృష్ణ, సిబ్బంది ఏఎస్‌ఐ శ్రీనివాసరావు, పీసీలు సూరిబాబు, జగదీష్‌, రమణమూర్తి, బాలకృష్ణలను ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి అభినందించారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page