శివాలయ ప్రాంతం.. రెండు దేశాల పంతం!
- DV RAMANA

- Jul 26, 2025
- 2 min read
థాయ్‌ల్యాండ్-కంబోడియాల సరిహద్దు వివాదం
దానికి కేంద్ర బిందువుగా అతిప్రాచీన శైవాలయం
దశాబ్దాలుగా సాగుతున్న ఘర్షణలు, ఉద్రిక్తతలు
బౌద్ధం విలసిల్లే ప్రాంతాల్లో హిందూ ఆనవాళ్లు ఉండటమే విశేషం

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
ప్రపంచంలో పలు దేశాల మధ్య ఘర్షణలు, యుద్ధాలు నిత్యకృత్యంగా మారాయి. మూడేళ్లకుపైగా రష్యా, ఉక్రెయిన్ యుద్ధం రావణ కాష్ఠంలా కొనసాగుతూనే ఉంది. అదే కోవలో పాలస్తీనా, ఇజ్రాయెల్ తలపడుతున్నాయి. ఈ రెండు దేశాల సైనిక ఘర్షణలు లెబనాన్, సిరియా, ఇరాన్, యెమెన్ వంటి దేశాలకు విస్తరించాయి. ఇక దక్షిణాసియాలో రెండు నెలల క్రితం భారత్, పాక్‌ల మధ్య స్వల్పకాలిక యుద్ధం జరిగింది. మరోవైపు చైనా భారత్, ఇతర సమీప దేశాలను నిరంతరం యుద్ధోన్మాదంతో కవ్విస్తూ ఉద్రిక్తతలను రెచ్చగొడుతోంది. ఇదే కోవలో ఆగ్నేయాసియాలోనూ యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరుగు పొరుగు దేశాలుగా ఉంటూ పర్యాటకానికి ప్రసిద్ధి చెందిన థాయ్‌ల్యాండ్, కంబోడియా మధ్య సరిహద్దు సమస్య మళ్లీ రాజుకుంది. కొద్దిరోజులుగా రెండు దేశాలు పరస్పరం కాల్పులకు డ్రోన్లు, వైమానికి దాడులకు పాల్పడుతున్నాయి. తాజా ఘర్షణలకు రెండు దేశాల సరిహద్దుల్లో ఉన్న హిందూ ఆలయ సముదాయాలే పరోక్షంగా కారణం కావడం.. అందులోనూ ఒకటి అతిప్రాచీనమైన శివాలయం ఉండటం విశేషం. సహజంగా భారతదేశంలో తప్ప మరెక్కడా హిందూమతం లేదని, హిందువులు ఉన్నా అతి తక్కువ సంఖ్యలో మైనారిటీలుగా ఉంటారని అనుకుంటాం. అది పాక్షిక వాస్తవం మాత్రమే. ప్రాచీన కాలం నుంచి దేశాంతరాల్లోనూ హిందూ మతం విలసిల్లిందని.. ఇప్పుడూ విలసిల్లుతోందని చెప్పడానికి ఇదో నిదర్శనం. అదలా ఉంటే.. థాయ్‌ల్యాండ్, కంబోడియా దేశాల మధ్య సరిహద్దు వివాదం కూడా ఇప్పటిది కాదు. దశాబ్దాల తరబడి కొనసాగుతూ సైనిక ఘర్షణలకు, ఉద్రిక్తతలకు తావిస్తోంది. ఆరు దశాబ్దాల క్రితమే దీనిపై అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు చెప్పినా.. ఉద్రిక్తతల ఉపశమనానికి అది దోహదపడలేదు. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య మరోసారి యుద్ధం వాతావరణం నెలకొంది. ఏకంగా కంబోడియాపై ఎఫ్-16 ఫైటర్ జెట్లతో థాయ్‌ల్యాండ్ ఎయిర్ స్ట్రైక్స్ చేసే వరకు వెళ్లింది. అంతకు ముందు రెండు దేశాల మధ్య వివాదాస్పదంగా ఉన్న ప్రాంతంలో కంబోడియా ఏర్పాటు చేసిన ల్యాండ్ మైన్లు పేలి థాయ్‌ల్యాండ్ సైనికులు గాయపడ్డారు. ఈ ఘర్షణలు తీవ్రరూపం దాల్చి పరస్పర కాల్పులు, గ్రనేడ్, రాకెట్ లాంఛర్ల ప్రయోగాల వరకు వెళ్లాయి. ఈ ఘటనల్లో ఇరుపక్షాలకు చెందిన తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు.
దశాబ్దాల వివాదం
థాయ్‌ల్యాండ్, కంబోడియా దేశాలు 817 కిలోమీటర్ల మేర సరిహద్దును పంచుకుంటున్నాయి. సరిహద్దుల నిర్ణయంలో కొన్ని ప్రాంతాల విషయంలో రెండు దేశాల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం వల్ల తరచుగా వివాదాలు తలెత్తి ఘర్షణలు జరుగుతున్నాయి. ఇందులో అత్యధిక భాగాన్ని ఫ్రాన్స్ పాలన ఉన్నప్పుడే గుర్తించారు. అయితే సరిహద్దుల్లో ప్రముఖ ఆలయాలుగా ఉన్న ప్రీప్‌ా విహార్, ట మోన్ థోమ్, ట మ్యూన్ థోమ్ ఉన్న పర్వతాలు, అడవులతో కూడిన ప్రాంతాల కోసం ఇరుదేశాలు పరస్పరం పోరాడుతున్నాయి. వీటిలో డెంగ్రిక్ పర్వతంపై ఉన్న ప్రీక్ విహార్(శివాలయం) వివాదానికి కేంద్ర బిందువుగా ఉంది. డెంగ్రిక్ పర్వతం థాయ్‌ల్యాండ్‌కు అత్యంత సమీపంలో ఉంది. ఈ వివాదం హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) వరకు వెళ్లగా ఆ ఆలయం ఉన్న ప్రాంతం కంబోడియాకు చెందుతుందని 1962లో అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) ఈ ఆలయం కంబోడియాకే చెందుతుందని తీర్పు ఇచ్చింది. అయినప్పటికీ.. సరిహద్దు రేఖలు నిర్ణయించుకునే విషయంలో రెండు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఫలితంగా తరచుగా ఘర్షణలు చెలరేగుతూనే ఉన్నాయి. మొదట ఈ తీర్పును ధాయ్‌ల్యాండ్ ఆమోదించినా స్థానిక సెంటిమెంట్లు, సంప్రదాయాల కారణంగా తరచూ వివాదాలు, ఘర్షణలు తలెత్తుతున్నాయి. కంబోడియా విజ్ఞప్తి మేరకు ఈ ఆలయాన్ని 2008లో యూనెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. థాయ్‌ల్యాండ్ దీన్ని వ్యతిరేకించడమే కాకుండా గతంలో చూపిన మ్యాప్‌లో 4.6 చదరపు మైళ్లను కంబోడియా ఆక్రమించిందని ఆరోపించింది. 2008`11 మధ్య పలుమార్లు ఘర్షణలు జరిగి 12 మంది మరణించారు. సరిహద్దుల్లో నివాసం ఉంటున్న వేలాదిమంది ఇళ్లు వదిలి పారిపోయారు.
ఇదీ చరిత్ర
అటు థాయ్‌ల్యాండ్, ఇటు కంబోడియా.. రెండూ బౌద్ధ మతాన్నే. ప్రధానంగా అనుసరించే దేశాలే. సరిహద్దు వివాదంగా మారిన ‘తా మోవాన్ థమ్’ ఆలయానికి నిజానికి బౌద్ధంతో సంబంధం లేదు. ఓడ్డార్ మీన్‌చే ప్రాంతంలో ఉన్న ఒక పురాతన హిందూ ఆలయం ఇది. థాయ్‌ల్యాండ్-కంబోడియా సరిహద్దుకు సమీపంలో ఉన్న డెంగ్రిక్ పర్వత శ్రేణిలో ఉన్న ఈ ఆలయాన్ని ఖ్మెర్ సామ్రాజ్య కాలం(11వ-12వ శతాబ్దాల మధకచ) నాటి పాలకులు నిర్మించారు. ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయాల సముదాయం ‘అంగ్‌కోర్‌వాట్’ కూడా కంబోడియాలోనే ఉంది. అయితే సరిహద్దు వివాదానికి కేంద్ర బిందువుగా మారిన శివాలయం మాత్రం డాంగ్రిక్ పర్వత శిఖరంపై 400 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడ శివలింగంతో పాటు ఇతర హిందూ దేవతల విగ్రహాలు ఉన్నాయి. ఈ ఆలయ శిల్పకళ కూడా అంగ్‌కోర్‌వాట్ వంటి ఇతర ఖ్మెర్ ఆలయాల నిర్మాణ శైలిని పోలి ఉంటుంది. ఖ్మెర్ సామ్రాజ్య కాలంలో ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండేది. ఆలయం చుట్టూ ఉన్న సరిహద్దు ప్రాంతాలు వ్యూహాత్మకంగా కీలకమైనవి కావడంతో రెండు దేశాల సైనిక స్థావరాలు ఉన్నాయి. పర్యాటక ప్రాంతంగా ఒకప్పుడు విలసిల్లిన ఈ ప్రాంతానికి సైనిక కార్యకలాపాల కారణంగా పర్యాటకుల రాకపోకలు తగ్గిపోయాయి.










Comments