శివం.. సుందరం..
- DV RAMANA

- 3 days ago
- 1 min read
ఇటలీ దంపతుల సనాతన సౌందర్యం
ఏటా కార్తీకంలో 108 శైవక్షేత్రాల సందర్శనం

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
వెనుక విద్యుత్ అలంకార శోభితమైన ఆలయ ప్రాకారం.. వారి నుదుట హిందూ సంప్రదాయాన్ని ప్రతిఫలించే కుంకమ బొట్టు.. కానీ వారి రూపురేఖలు, ఆహార్యం చూస్తే హిందూ ధర్మాన్ని పాటించే భారతీయుల్లా లేరు. అవును.. వారి విదేశీయులు.. ఇటలీవాసులు.. కానీ హిందూ ధర్మాన్ని ప్రత్యేకించి అనిర్వచనీయ అనుభూతినిచ్చే శివతత్వాన్ని మనసావాచా.. అనుసరిస్తున్న దంపతులు. అతని పేరు అలన్.. ఆమె పేరు మార్జియా. సనాతన ధర్మానికి జన్మస్థానంగా భారతదేశాన్ని భావిస్తారు. కానీ ఈ పుణ్యభూమిలో అదే సనాతన ధర్మాన్ని, వైదిక కర్మలను అచరించనివారు.. ఎగతాళి చేసేవారు.. చిన్నచూపు చేసేవారు కోకొల్లలుగా ఉన్నారు. కానీ ఎక్కడో క్రైస్తవాన్ని అనుసరించే ఇటలీ నుంచి వచ్చిన దంపతులు శివతత్వాన్ని ఆచరిస్తూ హిందూ ఆధ్యాత్మికతకు బ్రాండ్ అంబాసిడర్లుగా దర్శనమిచ్చారు. బుధవారం సాయంత్రం శ్రీకాకుళం నగరంలోని ఉమారుద్ర కోటేశ్వరాలయాన్ని దర్శించుకున్న ఈ జంటను ‘సత్యం’ కలిసి వారి వివరాలు ఆరా తీసింది. ప్రతి ఏటా కార్తీకమాసంలో భారత్‌కు వచ్చి 108 శివాలయాలను దర్శించుకోవడాన్ని అలవాటుగా చేసుకున్నామని, ఆ క్రమంలోనే ఈ ఏడాది ఉమారుద్ర కోటేశ్వరస్వామిని దర్శించి పూజలు చేశామని వారు చెప్పడం విశేషం. హిందూ ఆధ్యాత్మికత, శివార్చన ఎలా అబ్బిందన్న ప్రశ్నకు సమాధానమిస్తూ మూడేళ్ల క్రితం ఆధ్యాత్మిక టూరిజం (స్పిరుచ్వల్ టూరిజం)లో భాగంగా భారత్‌కు వచ్చిన తాము కాశీ క్షేత్రానికి వెళ్లామని చెప్పారు. అక్కడి ఆధ్యాత్మిక వాతావరణం, తనువెల్లా విభూతి రాసుకున్న స్వాములు, అఘోరాలు వారిని విస్మయానికి గురి చేశారు. ఎందుకిలా చేస్తున్నారని ఒక స్వామీజీని ప్రశ్నించగా ఆయన శివతత్వాన్ని, దాన్ని దివ్యత్వాన్ని వివరించారని అలెన్, మార్జియా చెప్పారు. ఆ శివతత్వమే తమను ఆకట్టుకుని ప్రతి ఏటా కార్తీక మాసంలో భారత సందర్శనకు రప్పిస్తోందని చెప్పకొచ్చారు. ఇందుకోసం ప్రత్యేక రూట్‌మ్యాప్ రూపొంచుకుని ఏటా కార్తీకంలో 108 శైవక్షేత్రాలను దర్శిస్తున్నామని వెల్లడిరచారు. కార్తీకం మొదటిరోజు కాశీ నుంచి ప్రారంభించి మళ్లీ చివరి రోజు కాశీలోనే ఈ యాత్ర పూర్తి అయ్యేలా ప్రణాళిక రూపొందించుకుంటున్నామని వివరించారు. దర్శించిన క్షేత్రాలకే మళ్లీ మళ్లీ వెళ్లకుండా.. కొత్త క్షేత్రాల వివరాలు తెలుసుకుని తమ రూట్‌మ్యాప్‌లో చేర్చుకుంటున్నామని.. ఆ విధంగా ఈసారి శ్రీకాకుళం వచ్చి ఉమారుద్ర కోటేశ్వరాలయాన్ని దర్శించామని చెప్పుకొచ్చారు. ఇక్కడి నుంచి ద్రాక్షారామం వెళ్తామని, అక్కడి నుంచి కాశీకి చేరుకోవడంతో ఈ ఏడాది యాత్ర పరిపూర్ణమవుతుందని చెప్పారు. అక్కడి నుంచి తమ దేశానికి తిరిగి వెళ్లిపోతామన్నారు. శివతత్వం తమను కేవలం శివార్చనకే పరిమితం చేయకుండా చాలా హిందూ వైదిక ధర్మాలను ఆచరించేలా ప్రేరేపించిందని చెప్పిన ఈ ఇటలీ దంపతులే అసలు సిసలైన శివభక్తులు.. సనాతన ధర్మప్రచార సారధులు.










Comments